Wednesday, 26 January 2022

జన్మ, మృత్యు, సంసార చక్రం! Bhagavad Geetha

Written by

  

జన్మ, మృత్యు, సంసార చక్రం!

'భగవద్గీత' పంచమోధ్యాయం - కర్మ సన్న్యాస యోగం (07 – 12 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను, కర్మషట్కము అంటారు. దీనిలో ఐదవ అధ్యాయం, కర్మ సన్న్యాస యోగం. ఈ రోజుటి మన వీడియోలో, కర్మ సన్న్యాస యోగంలోని 07 నుండి 12 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/ncVFV_BFNzs ]

యోగులు మమకారాసక్తిని విడిచిపెట్టి, ఆత్మ శుద్ధి కోసం ఆచరించే కర్మల గురించి, శ్రీ కృష్ణుడు చెప్పబోతున్నాడు..

00:46 - యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః ।
సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే ।। 7 ।।

పరిశుద్ధమైన అంతఃకరణ కలిగి, ఇంద్రియ-మనస్సులను నియంత్రణ చేసే కర్మ యోగులు, ప్రతి ప్రాణిలోని ఆత్మలో, పరమాత్మను  దర్శిస్తారు. అన్ని రకాల పనులూ చేస్తూనే ఉన్నా, వారు కర్మబంధాలలో చిక్కుకోరు.

కర్మయోగులలో వివిధ రకాల వారు ఉన్నారు. 
విశుద్ధాత్మ - పవిత్రమైన బుద్ధి ఉన్నవాడు, 
విజితాత్మా - మనస్సుని జయించినవాడు, 
జితేంద్రియ - ఇంద్రియములను నియంత్రించినవాడు.

ఇటువంటి కర్మ యోగులు, పరిశుద్ధమైన బుద్ధితో, సమస్త ప్రాణుల యందూ భగవంతుడినే దర్శిస్తారు. అందరితో  గౌరవప్రదంగా మెలుగుతూ ఉంటారు. వారు చేసే కార్యకలాపాలు, స్వార్థ ప్రయోజనం కోసం కాదు కాబట్టి, వారి జ్ఞానం, క్రమక్రమంగా వృద్ధిచెందుతుంది. వారి కోరికలు నిర్మూలించబడినవి కాబట్టి, ఇంతకు పూర్వం భౌతిక  భోగములకోసం తాపత్రయ పడ్డ ఇంద్రియములూ, మనస్సూ, బుద్ధీ, ఇప్పుడు నియంత్రణలోకి వస్తాయి. అవి ఇక భగవత్ సేవకు అందుబాటులో ఉంటాయి. భక్తి యుక్త సేవ, అంతర్గత విజ్ఞానం వైపు దారి తీస్తుంది. ఈ విధంగా, కర్మ యోగము సహజ పద్ధతిలో, జ్ఞానోదయ దిశగా, ఒక్కొక్క మెట్టూ పైకి తీసుకువెళుతుంది. కాబట్టి, ఇది కర్మ సన్యాసము కంటే భిన్నమైనది కాదు.

02:08 - నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్త్వవిత్
పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్ఛన్ స్వపన్ శ్వసన్ ।। 8 ।।

02:18 - ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ।
ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్ ।। 9 ।।

కర్మ యోగములో ధృఢ సంకల్పంతో స్థితులై ఉన్న వారు, చూస్తున్నప్పుడూ, వింటున్నప్పుడూ, స్పృశిస్తున్నప్పుడూ, వాసన చూస్తున్నప్పుడూ, భుజిస్తున్నప్పుడూ, కదులుతున్నప్పుడూ, నిద్రిస్తున్నప్పుడూ, శ్వాస క్రియలప్పుడూ, మాట్లాడుతున్నప్పుడూ, త్యజించేటప్పుడూ, గ్రహించేటప్పుడూ, కన్నులు తెరుస్తున్నప్పుడూ, మూస్తున్నప్పుడూ, "చేసేది నేను కాదు" అన్ని ఎల్లప్పుడూ భావిస్తారు. ప్రాకృతిక ఇంద్రియములే, వాటి వాటి విషయములలో కదులుతున్నట్లు, దివ్య ఆధ్యాత్మిక జ్ఞానంతో గ్రహిస్తారు.

మనం ఎప్పుడైనా గొప్ప విషయం సాధిస్తే, మనమే ఏదో గొప్ప పని చేసినట్టు గర్వపడుతుంటాము. ఈ కర్తుత్వ భావనతో వచ్చే  గర్వం, ప్రాపంచిక దృక్పథాన్ని దాటి పోవటానికి, పెద్ద అడ్డంకిగా మారుతుంది. కానీ, భగవత్ దృక్పథంలో ఉన్న కర్మ యోగులు, ఈ అడ్డంకిని సునాయాసంగా అధిగమిస్తారు. పరిశుద్ధమొనర్చుకున్న బుద్ధితో, వారు తమని తాము శరీరం కంటే వేరుగా చూస్తారు కాబట్టి, తమ శారీరిక క్రియలను, తమకు ఆపాదించుకోరు. శరీరము, భగవంతుని యొక్క ప్రాకృతిక శక్తితో  తయారు చేయబడినది. కాబట్టి, వారు చేసే అన్ని పనులూ, భగవత్ శక్తి ద్వారా చేయబడినట్లు భావిస్తారు. వారు ఈశ్వర  సంకల్పానికి శరణాగతి చేశారు కాబట్టి, తమ మనోబుద్ధులకు, ఆయన దివ్య సంకల్పం అనుగుణంగా ప్రేరణ పొందటానికి, కృషి చేస్తారు. ఈ విధంగా, భగవంతుడే అన్ని పనులూ చేస్తున్నాడనే భావనలో, దృఢంగా స్థితులై ఉంటారు.

03:54 - బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః ।
లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా ।। 10 ।।

సమస్త మమకారాసక్తులనూ త్యజించి, భగవంతునికే తమ అన్ని కర్మలనూ అంకితం చేసేవారు, తామరాకు, నీటిచే తడపబడనట్లు,  వారు పాపముచే తాకబడరు.

తామర పువ్వును, భగవంతుని దివ్య శరీర భాగాలని వర్ణించేటప్పుడు, ఒక గౌరవ ప్రదమైన ఉపమానంగా వాడతారు. తామర పూవుకు మరోక పేరు, 'పంకజము'.. అంటే, "బురద నుండి జన్మించినది". కొలను అడుగున ఉండే బురద నుండి, తామర పూవు జనిస్తుంది. నీటి ఉపరితలం పైకి పెరిగి, సూర్యుని వైపు పుష్పిస్తుంది. బురదలో పుట్టినా, తన  అందాన్నీ, స్వచ్ఛతనూ కాపాడుకుంటుంది. కొలను నీటి ఉపరితలంపై తేలియాడే తామరాకులు, నీటిని అంటుకోనివ్వవు. తామరాకుకున్న అద్భుతమైన గుణం ఏమిటంటే, అది నీటిలోనే పుట్టి పెరిగినా, నీటిని తాకనివ్వదు. అదే విధంగా, కర్మ యోగులు, అన్ని పనులూ చేస్తున్నా, వారు భగవత్ దృక్పథంలో పని చేయటం వలన, వారికి పాపము అంటదు.

04:58 - కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి ।
యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే ।। 11 ।।

యోగులు మమకారాసక్తిని విడిచిపెట్టి, కేవలం ఆత్మ శుద్ధి కోసం మాత్రమే, శరీరమూ, మనస్సూ, ఇంద్రియములతో కర్మలను ఆచరిస్తూ ఉంటారు.

ఆనందాన్ని అన్వేషిస్తూ, భౌతిక, ప్రాపంచిక కోరికల వెంటపడటం అనేది, ఎడారిలో ఎండమావి వెంట పడటం లాంటి వృధా ప్రయాసే అని, యోగులు అర్థం చేసుకుంటారు. వాస్తవాన్ని తెలుసుకుని, వారి స్వార్ధ కోరికలను త్యజించి, అన్ని కర్మలూ భగవత్ ప్రీతి కోసమే చేస్తారు. కేవలం ఆయనే, అన్ని కర్మల యొక్క సర్వోన్నత భోక్త అని విశ్వసిస్తారు. అయితే, అంత:కరణ శుద్ధి అనేది, మన చేతిలోనే ఉంటుంది. మన హృదయాన్ని శుద్ధి చేసుకుని, దానిని భక్తిలో నిమగ్నం చేస్తే, అదే భగవంతునికి అమితానందాన్నిస్తుంది. దీనిని అర్థం చేసుకున్న గొప్ప యోగులు, తమ అంతఃకరణ శుద్ధిని, అతిముఖ్యమైన లక్ష్యంగా చేసుకుంటారు. దానిని స్వార్థం కోసం కాకుండా, భగవత్ ప్రీతి కోసమే చేస్తారు.

06:03 - యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీమ్ ।
అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే ।। 12 ।।

అన్ని క్రియాకలాపముల ఫలాలను భగవంతునికే అర్పితము చేసి, కర్మ యోగులు శాశ్వతమైన శాంతిని పొందుతారు. అదే  సమయంలో, తమ కోరికలచే ప్రేరేపింపబడి, స్వార్థ ప్రయోజనాల కోసం పని చేసే వారు, కర్మ బంధములలో  చిక్కుకుంటారు. ఎందుకంటే, వారు కర్మ ఫలములపై ఆసక్తి కలిగి ఉంటారు.

చేసే పని ఒక్కటే అయినా, కొందరు భౌతిక బంధాలలో చిక్కుకుంటారు. అదే సమయంలో మరి కొందరు, భౌతిక  బంధాలనుండి విముక్తిని పొందుతారు. భౌతిక ఫలాలపై ఆసక్తి లేకుండా, వాటిచే ప్రేరేపింపబడకుండా ఉన్న వారు, కర్మ బంధాలలో చిక్కుకోరు. కానీ, ప్రతిఫలం కోసం ప్రాకులాడుతూ, భౌతిక సుఖాలనుభవించాలనే కామానికి వశమై పోయిన వారు, కర్మబంధ ప్రతి క్రియలలో చిక్కుకుంటారు. భగవంతునితో మానసికంగా ఏకమైపోయిన యుక్త పురుషులు, తమ కర్మలకు ప్రతిఫలాన్ని ఆశించకుండా, ప్రతిగా, అంతఃకరణ శుద్ధి కోసం మాత్రమే, కర్మలు చేస్తుంటారు. కాబట్టి, వారు త్వరలోనే దివ్య జ్ఞానాన్నీ, మరియు శాశ్వతమైన ముక్తినీ పొందుతారు. భగవంతునితో ఏకమవ్వని అయుక్త పురుషులు, అత్యాశచే ఉసికొల్పబడి, వ్యామోహంతో, కర్మ ఫలములను ఆశిస్తారు. ఇటువంటి దృక్పథంతో చేయబడిన పనులు, జన్మ-మృత్యు సంసార చక్రం లో బంధించివేస్తాయి.

ఇక మన తదుపరి వీడియోలో, నిజమైన సంతోషాలు పొందాలంటే ఏంచేయాలో, తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

No comments: