Saturday 15 January 2022

సంక్రాంతి పండుగ విశిష్ఠత! Makara Sankranthi Festival

Written by


సంక్రాంతి పండుగ విశిష్ఠత!

అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.. పచ్చని పందిళ్లూ, రంగు రంగుల ముగ్గులూ, వాటి మధ్య అందంగా అలంకరించిన గొబ్బెమ్మలూ, బంధుమిత్ర సపరివారంతో కళకళలాడే తెలుగువారి లోగిళ్లు.., ఈ రమ్యమైన దృశ్యాన్ని చూడాలంటే, సంక్రాంతి పండుగ రావలసిందే. అనాదిగా, ధాన్య సిరులు ఇంటికి చేరే ఈ మాసంలో, చిన్నా పెద్దా అంతా కలిసి చేసుకునే పండుగ, సంక్రాంతి. ఈ సంక్రాంతి పర్వదినాలలో, రెండవ రోజు వచ్చే పండుగే మకర సంక్రాంతి. దీనినే మన తెలుగు వారు, పెద్ద పండుగ అని కూడా అంటారు. మకర సంక్రాంతిని పెద్ద పండుగగా, సంక్రాంతి పర్వదినాలలో అతి ముఖ్యమైన రోజుగా, ఎందుకు చూస్తున్నారు? ఈ పండుగ వెనుక ఉన్న అసలు విశిష్ఠత ఏంటి? అనే విషయాలు, ఈ రోజుటి వీడియోలో తెలుసుకుందాం..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/itjUnux5PEE ]

తత్ర మేషాదిషు ద్వాదశ రాశిషుక్రమేణ సంచరితాః
సూర్యస్య పూర్వ స్మాద్రాశే, ఉత్తరరాశే సంక్రమణ ప్రవేశః సంక్రాంతిః

సూర్యుడు మేషాది ద్వాదశ రాశుల యందు సంచరిస్తూ, క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరాభిముఖంగా ప్రవేశించినప్పుడు, సంక్రాంతి అవుతుందని, ఈ శ్లోకం యొక్క అర్థం. సంక్రాంతి అంటే, చేరుట అని అర్థం. సూర్యుడు నెలకొకసారి, ఒక్కో రాశిని చేరుతుంటాడు. దీనినే సంక్రమణం అంటారు. ఈ సంక్రమణంలో భాగంగా, పుష్య మాసంలో, ధనురాశి నుంచి మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ పర్వకాలమే, మకర సంక్రాంతిగా పేరుగాంచింది. మనిషి నాగరికత నేర్చుకుని, పంటలు పండించడం మొదలుపెట్టినప్పటి నుండి, ఈ సంక్రాంతి పర్వదినాల సమయానికి, పంట చేతికి వచ్చి, ఇల్లంతా ధన ధాన్యాలతో నిండడం వల్ల, రైతులందరూ ఈ సంక్రాంతి పండుగను, విశేషంగా జరుపుకుంటున్నారు. అంతేకాదు, మన హైందవ ధర్మంలో, ఉత్తరాయణ పుణ్యకాలం, ఈ పుష్య మాసంలోనే మొదలవ్వడం, ఇదే మాసంలో పంటలు చేతికి రావడం, సూర్యుడు మకరరాశిలో అడుగుపెట్టిన రోజు నుంచి, ఉత్తరాయణ ఘడియలు మొదలవ్వడంతో, ఈ మకర సంక్రాంతికి అంతటి విశిష్ఠత ఏర్పడింది.

మన పురాణాల ప్రకారం, దేవతలకు దక్షిణాయన కాలం ఒక రాత్రి అయితే, ఉత్తరాయణ కాలం, ఒక పగలుగా చెప్పబడింది. ఈ ఉత్తరాయణ కాలంలో, దైవ సంచారం ఎక్కువగా ఉండడం వలన, ఈ కాలం అతి పవిత్రమైనదిగా చెబుతారు. అందుకే, ఈ కాలంలోనే ఎక్కువ శుభకార్యాలు చేసుకుంటారు. అటువంటి పుణ్యకాలం మొదలులోనే, రైతుల ఇళ్లకు ధాన్య సిరులు చేరడంతో, ఈ మకర సంక్రాంతికి అంతటి విశిష్టత ఉంది. ఈ మకర సంక్రాంతి నాడు ఉదయాన్నే నదీ స్నానం చేసి, కొత్తబట్టలు ధరించి, పాలు పొంగించి, పాలతో చేసిన పరమాన్నం విష్ణుమూర్తికి నైవేద్యంగా పెట్టాలి. అంతేకాదు, ఆ రోజు పితృదేవతలకు తర్పణాలు వదిలి, పాయసం, పులిహోర వంటి వంటలు వారికి సమర్పిస్తే, వంశ వృద్ధి జరుగుతుందని, పెద్దల నమ్మకం. మకర సంక్రాంతి నాడు, రాముడిని పూజించి ఉపవాసముంటే, సకల సౌఖ్యాలూ కలుగుతాయని, "చతుర్వర్గ చింతామణి" అనే గ్రంథం చెబుతోంది. మకర సంక్రాంతి నాడు చేసే దానాలకు, చాలా విశిష్ఠత ఉంది. ఈ రోజు పేదవారికి ఆవు నెయ్యి, తైలం, కంబళ్లూ దానం ఇవ్వడం వల్ల, చాలా పుణ్యం చేకూరుతుంది. ఈ దానాలపై, మన పురాణాలలో, ఒక కథ విశేషంగా చెప్పబడుతుంది.

ద్వాపర యుగంలో కురుపాండవుల గురువుగా ప్రసిద్దిచెందిన ద్రోణాచార్యుడూ, ఆయన పత్ని కృపీ, పిల్లలు కలుగక, కడు బాధతో, ఒక చిన్న ఆశ్రమంలో నివసిస్తుండేవారు. ఒకనాడు ద్రోణాచార్యుల వారు బయటకు వెళ్లగా, ఆయన భార్య కృపి ఒంటరిగా ఆశ్రమంలో ఉంది. ఆ సమయంలో, దూర్వాసమహాముని సమిధల కోసం అన్వేషిస్తూ, వారి ఆశ్రమానికి వచ్చాడు. అంతటి పురుషోత్తముడు తమ ఆశ్రమానికి రావడంతో, మిక్కిలి సంతోషపడిన కృపి, ఆయనకు పరిచర్యలు చేసి, తమ పేదరికం గురించీ, పిల్లలు కలగకపోవడం గురించీ, ఆయనకు విన్నవించుకుంది. తామెదుర్కొంటున్న ఆ దీన స్థితి నుంచి బయటకు వచ్చే మార్గాన్ని చెప్పమని కోరుకుంది. దానికి దూర్వాస మహాముని, సంక్రాంతి పర్వాన్ని జరపమనీ, దానికి గంగా నదిలో స్నానమాచరించి, బ్రాహ్మణుడికి ఒక గుండం నిండా పెరుగు దానం చెయ్యమనీ, చెప్పాడట. నందుని భార్య యశోద కూడా, మకర సంక్రాంతి నాడు నదీ స్నానం చేసి, బ్రాహ్మణునికి పెరుగు దానం ఇవ్వడం వలన, శ్రీ కృష్ణుడు కొడుకుగా లభించాడనీ, ఆయన నందుడిని యదు కులానికి రాజును చేసి, వారి దారిద్ర్యాన్ని పొగొట్టాడనీ చెప్పాడు. ఆ రోజే మకర సంక్రాంతి కావున, ఆమెను నదీ స్నానం చేసి, తనకు పెరుగు దానమివ్వమని చెప్పాడు. ఆ సాధ్వి, దూర్వాస ముని చెప్పినది చెయ్యడం వలన, కాలక్రమంలో, సప్త చిరంజీవులలో ఒకరైన అశ్వత్థామను పుత్రుడిగా పొందడమే కాకుండా, తన భర్త ద్రోణుడు, కురు పాండవులకు గురువైనాడు.

అందువల్ల, మకర సంక్రాంతి రోజున, దంపతులు ఒక కుండడు పెరుగు బ్రాహ్మణుడికి దానమివ్వడం వల్ల, దారిద్ర్యం తొలగి, తమ వంశానికి కీర్తి తెచ్చే పుత్రుడ్ని పొందుతారు. ఇక మన పురాణాల ప్రకారం, మకర సంక్రాంతి నాడు, సూర్యుడు సంక్రాంతి పురుషుడిగా వస్తాడని అంటారు. ఆయన ఒక్కో సంవత్సరం, ఒక్కో పేరుతో, ఒక్కో వాహనంపై, ఒక్కో వస్త్రధారణతో వస్తాడు. ఆ ఏడు ఆయన వచ్చే రూపునుబట్టి, పాడిపంటల శుభాశుభ ఫలితాలను ముందుగా అంచనా వేస్తారు మనవారు. అందుకు అనుగుణంగా, ఆ సంవత్సరం సంక్రాంతి పురుషుడు ఏ రూపులో వస్తాడో, ఆ ఆకారంలో సంక్రాంతి పురుషుడి బొమ్మను చేసి, దానికి పూజలు చేసి, ఆ బొమ్మను దగ్గరలోని పారే నీటిలో నిమజ్జనం చెయ్యడం గానీ, పొలాల్లో పెట్టడం కానీ చేస్తారు. ఈ విధంగా చెయ్యడం వలన, సంక్రాంతి పురుషుడు తమకి మేలు చేస్తాడనేది, అనాదిగా వస్తోన్న సంప్రదాయం.

తెలుగు సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకైన ఈ సంక్రాంతి పండుగ, మీ ఇంట సుఖ సంతోషాలూ, సిరి సంపదలూ నింపాలని కోరుకుంటూ, మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..

No comments: