Tuesday, 18 January 2022

వైష్ణవాస్త్రంతో అర్జునుడిని చంపబోయిన కురువృద్ధుడు! Story of Bhagadatta in Telugu

Written by

 

వైష్ణవాస్త్రంతో అర్జునుడిని చంపబోయిన కురువృద్ధుడు!

మహాభారతంలో ఎందరో వీరులూ, మహా యోధులూ ఉన్నారు. ఇందులోని ఒక్కో పాత్ర ఒక్కో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. కురుక్షేత్రంలో కౌరవుల పక్షాన యుద్ధం చేసిన వీరుల్లో, భీముడినీ, ఘటోత్కచుడినీ ఓడించిన అతి పరాక్రమవంతుడూ, కురు వృద్ధుడూ, కురుక్షేత్ర సంగ్రామంలో, 12 రోజుల పాటు వీరోచితంగా పోరాడాడు. యుద్ధంలో పాండవులను హడలెత్తించాడు. తన దగ్గరున్న వైష్ణవాస్త్రంతో అర్జునుడిని సంహరించాలని చూసి, భంగపడ్డాడు. అసలీ వృద్ధ వీరుడు ఎవరు? మహిమాన్వితమైన వైష్ణవాస్త్రం, ఇతడికెలా సొంతమైంది? వైష్ణవాస్త్రాన్ని పొందగలిగినవాడు, యుద్ధంలో కౌరవ పక్షాన ఎందుకు చేరాడు? భారతంలో మహా వీరుడిగా పేరు గడించిన, ఇతడి మరణం వెనుక దాగిన శ్రీ కృష్ణుడి మాయేంటి - వంటి ఉత్సుకతను రేకెత్తించే విషయాలను తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను పూర్తిగా చూడండి..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/B-d7_jKLv4M ]

వరాహమూర్తికీ, భూదేవికీ జన్మించిన కుమారుడే నరకాసురుడు. అసుర సంధ్య వేళ జన్మించడం వలన, అతనిలో రాక్షస లక్షణాలు పురుడు పోసుకున్నాయి. జనక మహారాజు పర్యవేక్షణలో పెరిగిన నరకుడు, కామాఖ్యను రాజధానిగా చేసుకుని, ‘ప్రాగ్జ్యోతిష పురం’, అంటే, నేటి అస్సాంలోని గౌహతీ నగరాన్ని, పరిపాలించేవాడు. తనకున్న వరం కారణంగా, దానవ రాజైన నరకాసురుడు, తన తల్లి భూదేవి అంశ అయిన సత్యభామ చేతిలో మరణించిన విషయం, తెలిసిందే. తరువాత అతని పెద్ద కుమారుడైన భగదత్తుడు, ప్రాగ్జ్యోతిష పురానికి రాజయ్యాడు. నరకాసురుడు ఎంతో కఠోర తపస్సు చేసి సంపాదించిన వైష్ణవాస్త్రాన్ని, భగదత్తుడు సొంతం చేసుకున్నాడు. భగదత్తుడు, కౌరవుల పక్షాన పోరాడిన మహాయోధులలో ఒకడు. తన తండ్రి సంహారానికి కారకుడన్న కోపంతో, కృష్ణుడితో ఉన్న వైరం కారణంగా, కౌరవుల తరుపున యుద్ధానికి పూనుకున్నాడు. ఏనుగును అధిరోహించి యుద్ధం చేసిన మహావీరుడు, భగదత్తుడు. అతని దగ్గర ఇంద్రుని ఐరావతాన్ని పోలినటువంటి తెల్లటి, ప్రముఖ జాతి అంజనా వంశపు ఏనుగు ఉంది. దాని పేరు, సుప్రతిక.

భారతంలో భీష్ముడూ, ద్రోణాచార్యుని తరువాత, వయస్సులో అందరికంటే పెద్దవాడు, భగదత్తుడే. శరీరం ముడతలు పడి, తెల్లటి జుట్టుతో, యుద్ధ భూమిలో సింహంలా ఉండేవాడు. వయస్సు మీద పడడం వలన, తన నుదుటి ముడతలు, కళ్లకు అడ్డుపడకుండా లాగిపట్టి, నుదుటికి ఒక వస్త్రాన్ని కట్టుకుని, సుప్రతికను అధిరోహించి, కదన రంగంలో తిరుగుతుంటే, ఇంద్రుడిని తలపించేవాడు. కురుక్షేత్రంలో ఒక అక్షౌహిణి సైన్యాన్ని నడిపించిన వీరుడు, భగదత్తుడు. ద్రోణుడూ, అశ్వత్థామా, వృషసేనుడూ, కర్ణుడి వంటి మహారథులతో, సరిసమాన హోదాను పొందిన పరాక్రమవంతుడు. భగదత్తుడి ఏనుగు కూడా, యుద్ధంలో బాగా ఆరితేరింది. దానిపై, భగదత్తుడు కూర్చునే విధంగా, ఒక బంగారు సింహాసనం, విజయ కేతనం ఉండేవి. కురుక్షేత్రంలో కౌరవుల పక్షాన నిలబడి, పాండవులతో హోరా హోరీగా యుద్దం చేశాడు. అయితే, భీముడూ, హిడింబిల కుమారుడైన ఘటోత్కచుడితో భగదత్తుడి యుద్ధం, ఒక మహత్తర ఘట్టం. భారత సంగ్రామంలో నాలుగవ రోజు, దానవ వీరులైన వీరిద్దరూ, ఒకరితో ఒకరు తలపడ్డారు. భీముడు భగదత్తుడి సైన్యంపై దాడి చేయగా, భీముడిపైకి ఆయుధాన్ని విసిరాడు భగదత్తుడు. దాంతో, అది భీముడి ఛాతీకి తగిలి, రథంలో కుప్పకూలిపోయాడు.

వెంటనే భీముని కొడుకైన ఘటోత్కచుడు వచ్చి, భీభత్సం సృష్టించి, తన రాక్షస మాయతో మాయమవుతూ, ప్రత్యక్షమవుతూ, భగదత్తుడితో యుద్ధం చేశాడు. ఘటోత్కచుడు, అంజనా, వామనా, మహాపద్మా అనే దేవతా ఏనుగులను సృష్టించి, తానూ, నాలుగు తొండాల ఏనుగుపై అధిష్ఠించి, భగదత్తుడిపై ప్రతి దాడికి దిగాడు. ఈ యుద్ధంలో సుప్రతిక గాయపడింది. ఈ పరిస్థితిని గమనించిన భీష్ముడు, ముందస్తు చర్యగా, నాలుగవ రోజు యుద్ధానికి విరామం ప్రకటించాడు. అలా ఆ రోజు యుద్ధంలో, పాండవులు విజయం సాధించారు. తిరిగి మరోసారి ఏడవ రోజు, ఘటోత్కచుడు భగదత్తునితో తలపడ్డాడు. ఇద్దరూ, భీకరాయుధాలతో పోరు సాగించారు. భగదత్తుడు ఘటోత్కచుడి కాళ్ళూ, చేతులపై అస్త్రాలను వదిలాడు. ఆ సమయంలోనే, ఘటోత్కచుడు తన గదను సుప్రతికపై విసిరాడు. భగదత్తుడు ఘటోత్కచుడి ఆయుధాన్ని అడ్డుకుని, ముక్కలు చేశాడు. అలా ఘటోత్కచుడిపై, 7 వ రోజు ఆధిక్యతను సాధించాడు భగదత్తుడు. అలా కురు పాండవుల మధ్య భీకర యుద్ధం నడుస్తుండగా, కురుక్షేత్రంలో 12వ రోజున దుర్యోధనుడు, తన గజ దళాన్ని భీముడి మీదకు పంపించాడు. వాటన్నింటినీ భీముడు, తన గదతో సంహరించాడు.

ఈ వార్త తెలుసుకున్న భగదత్తుడు, తన సుప్రతికతో, భీముడి మీదకు వెళ్ళాడు. తన ఏనుగుతో భీముడి రథాన్ని త్రొక్కించాడు. సుప్రతిక తన తొండంతో భీముడ్ని పట్టుకోవాలని ప్రయత్నించగా, భీముడు తప్పించుకున్నాడు. కానీ, తొండం దెబ్బకు స్పృహ కొల్పోయాడు. దాంతో భగదత్తుడు, భీముడు మరణించాడని భావించి వదిలేసి, ధర్మ రాజుతో యుద్ధానికి వెళ్ళాడు. అభిమన్యుడూ, సాత్యకి, భగదత్తుడిని ధర్మరాజు వైపుకు రానీయకుండా, అడ్డుకున్నారు. భగదత్తుడి ఏనుగు సుప్రతిక, పాండవ సైన్యాన్ని తొక్కుకుంటూ, విధ్వంసాన్ని సృష్టించింది. పరిస్థితి చేయి దాటిపోతుండడంతో, అర్జునుడు భగదత్తుడితో యుద్ధానికి దిగాడు. వీరిరువురి యుద్ధం, చారిత్రాత్మకమైనది.

భగదత్తుడు రెండు బాణాలను అర్జునుడి మీదకు విసరగా, అవి తగిలి, అర్జునుడి కిరీటం క్రింద పడిపోయింది. తరువాత తన దగ్గరున్న మహత్తరమై వైష్ణవాస్త్రాన్ని, అర్జునుడి మీదకు ప్రయోగించాడు. వెంటనే రథ సారథిగా ఉన్న కృష్ణుడు లేచి, అర్జునుడికి అడ్డుగా నిలబడడంతో, ఆ వైష్ణవాస్త్రం ఆయనను తాకి, వైజయంతి మాలగా, ఆయన మెడను అలంకరించింది. అది చూసి ఆశ్చర్యపోయిన అర్జునుడితో శ్రీ కృష్ణుడు, 'ఇది విష్ణుమూర్తి ప్రసాదించిన అస్త్రం. దీనినుండి తప్పించుకోవడం అసాధ్యం. నేనందించిన అస్త్రం కాబట్టి, తిరిగి నన్ను చేరి, హారంగా మారింది' అని వివరించాడు.

భగదత్తుడు తన అమూల్యమైన అస్త్రాన్ని వదులుకున్నాడు కాబట్టి, అతడిని సంహరించడానికి ఒక సులభమైన మార్గం ఉందంటూ, అర్జునుడికి ఉపదేశించాడు కృష్ణుడు. అలా భగవానుడి సలహామేరకు, అర్జునుడు, భగదత్తుడు తలకు కట్టుకున్న వస్త్రాన్ని, ముందుగా ఛేదించాడు. దాంతో, ఆ వృద్ధ యోధుడి నుదుటి ముడుతలు కళ్ళకు అడ్డుపడి, భగదత్తుడికి చూపు కనిపించలేదు. అయినా, అర్జునుడితో యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. అర్జునుడు ఈ సారి, అర్థ చంద్రాకృతిలో ఉండే బాణాన్నివేయగా, అది భగదత్తుడి ఛాతీలోకి చొచ్చుకుపోయింది. తరువాత మరో అస్త్రాన్ని, సుప్రతిక కుంభ స్థలం మీదకు ప్రయోగించడంతో, అది కుప్పకూలిపోయింది. ఆ విధంగా, శ్రీ కృష్ణుడి సలహాతో, భగదత్తుడినీ, సుప్రతికనూ సంహరించాడు. గురు సమానుడైన భగదత్తుడు మరణించిన తరువాత, అతని శరీరం చుట్టూ, గౌరవ సూచకంగా ప్రదక్షిణలు చేసి, శ్రద్ధాంజలి ఘటించాడు, అర్జునుడు. కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తరువాత, ధర్మరాజు చేసిన అశ్వమేధయాగంలో భాగంగా, భగదత్తుడి కుమారుడైన వజ్రదత్తుడు, అర్జునుడితో పోరాడి, ఓడిపోయాడు.ఎంతటి వీరులైనా, అధర్మం పక్షాన నిలబడితే ఓటమి పాలు కాక తప్పదనే సత్యాన్ని, మహాభారతం మనకు తెలియజేస్తుంది.

మన పురాణాలు కల్పిత కథలు కావు. అక్షర సత్యాలు. ఎంతో విశిష్ఠమైన ధర్మాచారణను నిర్దేశించే మార్గదర్శకాలు.

🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏

No comments: