‘ఆత్మోద్ధరణ’ - మన మనస్సే మన ప్రధాన శత్రువు!
'భగవద్గీత' షష్ఠోఽధ్యాయం - ఆత్మ సంయమ యోగం (01 - 05 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను కర్మషట్కము అంటారు. దీనిలో ఆరవ అధ్యాయం, ఆత్మ సంయమ యోగం. ఈ రోజుటి మన వీడియోలో, ఆత్మసంయమయోగంలోని 01 నుండి 05 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..
[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/7gjf_PpDYMk ]
నిజమైన సన్యాసులూ, యోగుల గురించి, శ్రీ కృష్ణుడిలా చెబుతున్నాడు..
00:44 - శ్రీ భగవానువాచ ।
అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః ।
స సన్న్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్నచాక్రియః ।। 1 ।।
భగవంతుడు ఇలా అంటున్నాడు: ఫలాపేక్ష లేకుండా కర్తవ్య కర్మలను, అంటే వారు చేయవలసిన విధులను చేసిన వారే, నిజమైన సన్యాసులూ, యోగులూ. అంతేకానీ, కేవలం అగ్ని హోత్ర యజ్ఞం వంటివి చేయటం ఆపివేసిన వారూ, లేదా శారీరక క్రియలు త్యజించిన వారూ కాదు.
మన వేదాలలో, అగ్ని హోత్ర యజ్ఞముల వంటి కర్మ కాండలు చెప్పబడ్డాయి. సన్యాసాశ్రమంలోకి ప్రవేశించిన వారు, కర్మ కాండలు చేయకూడదనే నియమాలున్నాయి. నిజానికి వారు అగ్నిని తాకకూడదు. కనీసం వంట కోసం కూడా, తాకకూడదు. భిక్ష ద్వారా పొందిన అన్నాన్ని మాత్రమే, స్వీకరించాలి. అలా అని, కేవలం అగ్నిని విడిచిపెట్టినంత మాత్రాన, ఆ వ్యక్తి సన్యాసి అయిపోడు. కేవలం బాహ్యమైన సన్యాస శకలు, ఎవరినీ సన్యాసిని కానీ, యోగిని కానీ చేయవు. ఎవరైతే తమ కర్మ ఫలములను భగవంతునికే అర్పిస్తారో, వారే నిజమైన సన్యాసులూ, యోగులు. యోగ అంటే, ఏక మవ్వటం. ఇది ‘జీవాత్మ’ పరమాత్మతో ఏకమవ్వటాన్ని సూచిస్తుంది. అలాగే, యోగి అంటే, మనస్సు పూర్తిగా భగవంతునితో ఏకమయినవాడు, అని అర్థం. అంటే, అటువంటి యోగి మనస్సు, సహజంగానే ఈ ప్రపంచం నుండి ఉపసంహరించబడి ఉంటుంది. కర్మ యోగమును పాటించే వారు, తమ అన్ని కార్యములనూ, ఫలాపేక్ష లేకుండా, భగవంతుని పట్ల, వినయ, విధేయ, సేవా దృక్పథంతోనే చేస్తారు. ఒకవేళ వారు గృహస్థులైనా, అటువంటి వ్యక్తులు, నిజమైన యోగులు, మరియు అసలైన సన్యాసులు.
02:30 - యం సన్న్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ ।
న హ్యసంన్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన ।। 2 ।।
సన్యాసము అని అందరూ అనుకునేది, యోగము కంటే వేరైనది కాదు. ఎందుకంటే, ఎవ్వరూ కూడా, ప్రాపంచిక కోరికలను త్యజించకుండా, యోగి కాలేరు.
సన్యాసి అంటే, మనో-ఇంద్రియముల సుఖాలను త్యజించిన వాడు, అని అర్థం. ఆత్మ పొందవలసిన లక్ష్యం, భగవత్-ప్రాప్తి. భగవంతుని దిశగా వెళ్ళటం, మనస్సుని ఆయన దిశగా తీసుకెళ్లటం, యోగ మార్గము. జీవిత లక్ష్యం యొక్క అసంపూర్ణ జ్ఞానం కలవారు, సన్యాసం తీసుకోవటమే, అత్యున్నత లక్ష్యంగా భావిస్తారు. నిజమైన జీవిత లక్ష్యాన్ని అర్థం చేసుకున్నవారు, భగవత్ ప్రాప్తియే తమ ఆధ్యాత్మిక ప్రయాణ అంతిమ లక్ష్యంగా తెలుసుకుంటారు. సన్యాసంలో రెండు రకాలుంటాయి. ఫాల్గు వైరాగ్యం, మరియు యుక్త వైగాగ్యం. ఫాల్గు వైరాగ్యం అంటే, ప్రాపంచిక వస్తువులను మాయకు చెందిన వస్తువులగా పరిగణించి, ఆధ్యాత్మిక పురోగతికి అవరోధంగా ఉంటాయి కాబట్టి, వాటిని త్యజించటం. యుక్త వైరాగ్యం అంటే, సర్వమూ భగవంతునికి చెందినవే అని భావించి, అవన్నీ భగవత్ సేవకి ఉపయోగించబడేవే, అని అనుకోవటం.
03:47 - ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే ।
యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే ।। 3 ।।
యోగంలో పరిపూర్ణత సాధించే యత్నంలో ఉన్న జీవాత్మకు, ఫలాపేక్ష లేకుండా పని చేయటమే, సాధనం అంటారు. యోగంలో ఉన్నత స్థాయిని చేరుకున్న మునికి, ధ్యానంలో ప్రశాంతతయే, సాధనం అంటారు.
యోగ సాధనను అకాక్షించే వారికి, కర్మ యోగమే యుక్తమైనది. అలాగే, యోగ సాధనలో ఉన్నతమైన స్థాయిని చేరుకున్న వారికి, కర్మ సన్యాసమే ఎక్కువ అనుగుణమైనది. 'యోగం' అన్న పదం, లక్ష్యాన్నీ, మరియూ ఆ లక్ష్యాన్ని చేరుకునే విధానాన్నీ, రెంటినీ సూచిస్తుంది. యోగం అంటే, భగవంతుని చేరుకోవటానికి ఎక్కే, నిచ్చెన. అన్నింటికన్నా క్రింది మెట్టులో జీవాత్మ, ప్రాపంచికత్వంలో చిక్కుకుని, లౌకిక విషయాల పట్ల నిమగ్నమై ఉంటుంది. యోగమనే నిచ్చెన, జీవాత్మను ఆ నిమ్న స్థాయి నుండి, భగవంతునిలోనే ఎప్పుడూ స్థితమై ఉండే స్థాయికి తీసుకెళ్తుంది. ఆ నిచ్చెనకుండే మెట్లకు, వేరువేరు పేర్లున్నాయి. కానీ, యోగం అన్న పదం, అన్నింటికీ వర్తిస్తుంది. 'యోగ-ఆరురుక్షు' అంటే, అప్పుడే నిచ్చెన ఎక్కటం మొదలు పెట్టిన, భగవంతునితో సంయోగానికి కృషి చేస్తున్న సాధకులు. యోగ-ఆరూఢ అంటే, నిచ్చెనపై ఉన్నతమైన స్థానంలో ఉన్నవారు, అని అర్థం.
05:11 - యదా హి నేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్జతే ।
సర్వసంకల్పసన్న్యాసీ యోగారూఢస్తదోచ్యతే ।। 4 ।।
ఎప్పుడైతే వ్యక్తి ఇంద్రియ వస్తు-విషయముల పట్లా, మరియూ కర్మల పట్లా ఆసక్తి రహితముగా ఉంటాడో, ఆ వ్యక్తి, యోగ శాస్త్రంలో ఉన్నతమైన స్థానం పొందినట్టు. ఎందుకంటే, అతడు సమస్త కర్మ ఫలములనూ అనుభవించాలనే కోరికలను, త్యజించాడు కాబట్టి.
మనస్సు భగవంతునితో యోగములో ఏకమవుతున్న కొలదీ, సహజంగానే జగత్తు నుండి దూరమైపోతుంది. కాబట్టి, మనస్సు యొక్క స్థితిని బేరీజు వేయటానికి ఒక సులువైన మార్గం ఏమిటంటే, అది అన్ని ప్రాపంచిక కోరికల నుండీ స్వేచ్చను పొందిందో లేదో, చూసుకోవడం. ఎప్పుడైతే ఒక వ్యక్తి, ఇంద్రియ విషయముల కోసం ప్రాకులాడడో, మరియూ వాటిని పొందటం కోసం ఏ పనీ చేయడో, అప్పుడా వ్యక్తి, ప్రాపంచికత నుండి దూరమయినట్టు. ఇటువంటి వ్యక్తి, ఇంద్రియ భోగాలను అనుభవించటం కోసం, పరిస్థితులను సృష్టించే అవకాశాలను చూడటం, మానేస్తాడు. అంతిమంగా, ఇంద్రియ భోగాలను అనుభవించాలనే అన్ని కోరికలనూ భస్మం చేస్తాడు. పూర్వపు ఇంద్రియ భోగ స్మృతులను నిర్మూలిస్తాడు. మనస్సు ఇక ఇంద్రియ ఉద్వేగాల వలన జనించే స్వార్ధ పూరిత క్రియల కోసం, పరుగులు తీయదు. మన మనస్సుపై ఈ స్థాయి నియంత్రణ సాధించినప్పుడు, యోగములో ఉన్నతమైన స్థాయిని చేరుకున్నట్టు, పరిగణించబడతాం.
06:41 - ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ।
ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః ।। 5 ।।
నీ మనస్సు యొక్క శక్తిచే, నిన్ను నీవు ఉద్ధరించుకొనుము. అంతేకానీ, పతనమైపోవద్దు. ఎందుకంటే, మనస్సే మన మిత్రుడూ, మరియూ ఆ మనస్సే మన శత్రువూ అవ్వవచ్చు.
మన ఉన్నతికీ, లేదా పతనానికీ, మనమే కారణం. చిత్తశుద్ధిగల సాధకులకు దిశానిర్దేశం చేయటానికీ, మానవ జాతికి స్ఫూర్తినివ్వటానికీ, భగవత్-ప్రాప్తి నొందిన మహాత్ములు, ప్రతి కాలంలో ఉండేటట్టుగా చూసుకుంటాడు, దేవుడు. కాబట్టి, అనంతమైన పూర్వ జన్మలలో, చాలా సార్లు భగవత్ ప్రాప్తి నొందిన మహాత్ములను మనం కలిసే ఉంటాం. అయినా, భగవత్ ప్రాప్తిని పొందలేక పోయాము అంటే, సరైన మార్గ దర్శకత్వం లేకపోవటం సమస్య కాదు. దానిని స్వీకరించక పోవటం, లేదా సరిగా ఆచరించక పోవటమే ప్రధాన సమస్య. మన మనస్సే, మన ప్రధాన శత్రువు. పరిపూర్ణ సిద్ధి కోసం, మనం చేసే ప్రయత్నాలకు అవరోధం కల్పించే వినాశకారి, అదే. ఒక పక్క, జీవాత్మ యొక్క గొప్ప శ్రేయిభిలాషి లాగా, మనకు అత్యంత శ్రేయస్సుని కలుగ చేసే శక్తి, మనస్సుకి ఉంది. మరో పక్క, మన ప్రగాఢ శత్రువుగా, మనకు తీవ్ర హాని చేసే శక్తి కూడా దానికి ఉంది. నియంత్రించబడిన మనస్సు, ఏంతో మేలు కలుగజేస్తుంది. నిగ్రహింపబడని మనస్సు, తుచ్ఛమైన తలంపులతో, జీవాత్మను పతనానికి గురి చేస్తుంది. మన మనస్సు నాలుగు స్థాయిలలో పని చేస్తుంది.
1: ఆలోచనలు సృష్టించినప్పుడు, దానిని 'మనస్సు' అంటాము.
2: ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నప్పుడు, దానిని 'బుద్ధి' అంటాము.
3: ఏదేని ఒక వస్తువు, లేదా వ్యక్తితో అనుబంధం ఏర్పరచుకున్నప్పుడు, దానిని ‘చిత్తము’ అంటాము.
4: ఎప్పుడైతే అది శరీరానికి సంబంధించిన వాటితో అనుసంధానమై - సంపద, హోదా, అందమూ, చదువూ వంటి వాటి పట్ల గర్వం పెంచుకుంటుందో, దానిని ‘అహంకారము’ అంటాము.
ఇవన్నీ, నాలుగు వేరువేరు అస్థిత్వాలు కావు. ఇవి ఒకే మనస్సు యొక్క నాలుగు నిర్వహణ స్థాయిలు. కాబట్టి, వీటన్నింటినీ కలిపి ‘మనస్సు’ అని చెప్పవచ్చు. అందుకే, మన మనస్సుని ఉపయోగించుకుని, ‘ఆత్మోద్ధరణ’ చేసుకోవాలి.
ఇక మన తదుపరి వీడియోలో, ఇంద్రియములను జయించిన వారై, ప్రశాంతముగా ఎలా జీవించాలో తెలుసుకుందాము..
కృష్ణం వందే జగద్గురుం!
No comments: