Saturday, 19 March 2022

తిరుమల ఆలయంలో గుడ్డి ‘చిలుక’ చెప్పిన దివ్య గాధ! Divine Story of a Blind Parrot in Tirumala

  

విష్ణుపాదుని కథ! తిరుమల ఆలయంలో గుడ్డి ‘చిలుక’ చెప్పిన దివ్య గాధ!

గోవింద అంటే, స్తుతింపబడిన వాడని అర్ధం. ఈ సృష్టి మొత్తంలో,  శ్రీమన్నారాయణుల వారి కంటే స్తుతించ దగిన వారెవరుంటారు? అందుకే, సమస్త ప్రాణికోటీ, నిత్యం ఆ స్వామినే కీర్తిస్తుంటారు. వేదాలూ, ఉపనిషత్తులూ, పురాణాలూ, అన్నీ ఆ పరబ్రహ్మ మూర్తిని స్తుతిస్తే కలిగే దివ్యానుభూతులనూ, దివ్య భోగ భాగ్యాలనూ వివరిస్తాయి. తిరుమల కొండలలో, ఈ గోవింద నామమే, నిత్యం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. స్వామి దర్శనార్థం వచ్చే భక్తులందరి  గోవింద నామ స్మరణతో, ఈ కొండలన్నీ ప్రతిధ్వనిస్తుంటాయి.

వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మండే నాస్తి కించన ।
వేంకటేశ నమోదేవో న భూతో న భవిష్యతి ।।

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/JY_LGncTdd4 ]

పూర్వకాలంలో ఒకనాడు, శ్రీనివాసుని ఆనంద నిలయంలో ఉన్న హుండీ  ప్రక్కనే ఉన్న ఇనుప కడ్డీలపై, ఒక చిలుక వచ్చి వాలింది. అది ఎటూ కదలక, భక్తులను చూస్తున్నట్లుగా అక్కడే ఉండిపోయింది. ఆ భక్తులు స్వామి దర్శనం చేసుకుని, హుండీలో కానుకలను సమర్పించుకుని, అటు తరువాత, ప్రక్కనే ఉన్న ఆ చిలుకను చేతితో నెమ్మదిగా నిమరసాగారు. అలా ప్రతి భక్తుడూ, ఒక్క క్షణం చిలుక వద్దనే నిల్చుని, ఆప్యాయంగా ఆ చిలుకను నిమురుతున్నాడు. ఆ చిలుకకు ఒకే కన్ను ఉండటం,  భక్తులలో కొందరు గమనించారు. రెండవ వైపు కన్ను  మూసుకునే వుంది. ఆ ఒంటికన్ను చిలుకను చూసి జాలిపడి ఒక భక్తుడు, నెమ్మదిగా దానిని నిమరగా, బహుశా అలా చేస్తే మంచిది కాబోలనుకుని, ప్రతి భక్తుడూ అదే పని చేయసాగాడు.

ఆలయంలోని అర్చకులకు ఈ విషయం తెలిసింది. వారు ఆ చిలుకను చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. ఇంత మంది భక్తులు దానిని ముట్టుకుంటున్నా, అది అసలు ఎటూ ఎగరటం లేదెందుకన్న విషయం, వారెవరికీ అర్ధం కాలేదు.

అలా వారం రోజులు గడిచాయి. ఆ చిలుక మాత్రం, అక్కడినుండి కదలలేదు. రాత్రి చీకటి పడిన తరువాత, బహుశా ఏ పండో తినడానికి, ఎగిరి వెళుతోంది. తిరిగి ఉదయానికల్లా, మళ్ళీ అక్కడికే వచ్చి, అదేచోట నిలుస్తోంది.

ఒకనాడు తిరుమలకు స్వామి దర్శనార్ధమై, ఒక సాధువు వచ్చాడు. ఆ సాధువు ఎంతో మహిమ గలవాడనీ, అతనికి పక్షుల భాషలు కూడా తెలుసుననీ, భక్తులు చెప్పుకున్నారు. ఇది విన్న అర్చకులు, ఆలయంలోని చిలుక గురించి చెప్పారు.

అప్పుడా సాధువు స్వామిని దర్శించుకున్న తరువాత హుండీ దగ్గరకు వచ్చి, ప్రక్కనే ఉన్న ఆ చిలుకను, అందరిలానే, తాను కూడా చేతితో నెమ్మదిగా నిమిరాడు. వెంటనే ఆ చిలుక రెండవ కన్ను తెరుచు కున్నది..

అప్పుడా చిలుక సాధువుతో ఇలా అన్నది. 'స్వామీ! తమరు మహానుభావులలాగా ఉన్నారు. నేనిక్కడ ఇలా ఎందుకు వాలానో చెబుతాను వినండి..

క్రిందటి జన్మలో నేను విష్ణుపాదుడనే బ్రాహ్మణుడను. ఎన్నో పాపకార్యాలు చేయడం వలన, ఈ జన్మలో ఇలా పక్షి రూపం ధరించాను. అది కూడా, పుట్టు గుడ్డిగా జన్మించాను. కంటికి ఏమీ కనపడక, ఆ చెట్టుపై, ఈ చెట్టుపై వాలుతూ, దొరికిన ఫలాలను తింటూ, కాలం గడిపాను. అలా ఎక్కడెక్కడో ఎగురుతూ, ఈ కొండపైకి చేరాను. వారం రోజుల క్రితం, ఈ ఆలయ సమీపంలోనికి వచ్చాను.

ఇది ఆలయం అని నాకు తెలియదు. ఏదో అలా ఎగురుతూ వచ్చి, ఇక్కడ వాలాను. అప్పుడు ఒక భక్తుడు నాపై చెయ్యివేసి, నెమ్మదిగా నిమిరి వెళ్లిపోయాడు. అంతే! ఆ క్షణంలో నాకు ఆ భక్తుడు నిమిరినవైపు కంటి చూపు వచ్చింది. నేనున్న ప్రదేశం, సాక్షాత్తూ ఆ శ్రీమన్నారాయణుని ఆలయంగా గ్రహించాను. నన్ను ఆవిధంగా నిమిరిన ఆ భక్తుడు, ఏ అహంకారం లేక, స్వామినే సర్వంగా భావించి, ఆరాధించేవాడు. సర్వకాల సర్వావస్థలయందూ, ఆ స్వామినే స్మరిస్తూ, ఏ పని చేసినా, అది శ్రీ వేంకటేశ్వర ప్రీత్యర్థంగా భావించి, చేసేవాడు.

రోజూ ఉదయాన లేవగానే, తిరిగి రాత్రి పడుకునేటప్పుడూ, ఆ స్వామి పాదాలనే స్మరించే వాడు. ఎవ్వరినీ తన మాటలతో నిందింపడు, ఎటువంటి చెడు ఆలోచనలూ చేయడు, దేనికీ తొణకడు. అంతటి అసమాన్య భక్తుని స్పర్శ తగలడంతో, నాకు ఒక కంటిచూపు వచ్చింది. నా రెండవ వైపు కూడా నిమిరితే, రెండవ కన్ను కూడా వస్తుందని ఎంతో ఆశతో, అతనికొరకు ఎదురు చూశాను. కానీ, ఆ భక్తుడు మళ్ళీ కనపడలేదు.

ఈ ఆలయంలో రోజూ ఎందరో భక్తులు, స్వామి దర్శనార్ధమై రావటం గమనిస్తున్నాను. వీరిలో ఒక్కరైనా, అంతటి పుణ్యాత్ములు ఉండకపోతారా! అని చూస్తున్నాను. అందుకే ఎటూ ఎగరకుండా, రోజంతా ఇక్కడే ఉంటున్నాను. అంతటి నిస్వార్థ భక్తుడి కోసం, వారం రోజులుగా ఎదురు చూస్తున్నాను. ఎన్నో వేలమంది, ఇప్పటిదాకా నన్ను స్పృశించి వెళ్లారు. కానీ, నా రెండవ కంటి చూపు రాలేదు. ఇంకా ఎన్నాళ్ళిలా వేచి ఉండాలా? ఎప్పటికి అంతటి భక్తుడు వస్తాడా? అని అనుకుంటున్నాను.. ఇన్నాళ్ళకి నా భాగ్యం కొద్దీ, మీరు వచ్చారు..' అని చెప్పింది.

ఆ చిలుక చెప్పినదంతా విని, ఆ సాధువు ఆశ్చర్యపడి, అక్కడున్న అర్చకులందరికీ, చిలుక చెప్పిన విషయం తెలియజేశాడు.

తిరుమలకు వచ్చే వారిలో చాలా మంది, విహారానికి వచ్చినట్లు వస్తారు. వచ్చిన వారిలో కూడా చాలా మంది, అహంకారాన్ని పూర్తిగా వదిలి పెట్టరు. రెండు సార్లు దర్శించుకున్నాననీ, మూడు సార్లు దర్శించుకున్నాననీ, గొప్పగా చెప్పుకుంటారు. తోటి భక్తులతో సౌమ్యంగా ఉండరు.

ఆ స్వామికి కావలసినది, అచంచల భక్తి. అంతే కానీ, హంగూ, ఆర్భాటాలూ కావు. ఎవరైతే ఆ స్వామిని సర్వస్వంగా భావిస్తారో, ఎవరైతే నిత్యం ప్రసన్న వదనంతో ఉంటూ, తోటి వారిలో ఆ స్వామినే చూస్తూ గడుపుతారో, వారికి ఆ శ్రీనివాసుడు సులభంగా ప్రసన్నమవుతాడు. ఎవరైతే ధర్మ బద్ధ జీవితం సాగిస్తూ ఉంటారో, వారి బాధ్యతను తానే వహిస్తానంటాడు, ఆ స్వామి.

కర్మలు సంచిత, ఆగామి, ప్రారబ్ధం అని, మూడు రకాలుగా ఉంటాయి. శ్రీనివాసుని అనుగ్రహం కలిగితే, మనం పూర్వ జన్మలలో చేసిన సంచిత కర్మలన్నీ, పూర్తిగా దహించివేయ బడతాయి. వచ్చే జన్మలో అనుభవానికి వచ్చే ఆగామి కర్మ ఫలాలనూ, మనకు ఏమాత్రం అంటకుండా, దూది పింజల కంటే తేలికగా ఉండేలా, అనుగ్రహిస్తాడు.

అంతే కాదు, మనం ప్రస్తుతం అనుభవిస్తున్న ఘోర  ప్రారబ్ధ కర్మ ఫలాలను కూడా, దివ్య సుఖ ప్రారబద్ధాలుగా మార్చేది, ఆ అమృత మూర్తి ఒక్కడే.

ఓ శ్రీ వేంకటేశ్వరా! నీవే మా కల్ప తరువూ, నీవే మా ఆప్తుడవూ, నీవే మా సర్వస్వమూ.. నీకివే మా నమస్కారములు..

ఓ జగన్నాథా! నీకివే మా ప్రణామములు..

ఓ జగద్రక్షకా, నీకివే మా నమస్కారములు..

ఓం నమో వేఙ్కటేశాయ!

No comments: