Saturday, 12 March 2022

'దానం' – విక్రమార్కుడి కథ! Donation - Doubt of King Vikramadithya

Written by

  

'దానం' – విక్రమార్కుడి కథ! 'దానం' సంపద వంటిది.. ‘చెడ్డ మాట’ అప్పులాంటిది..

విక్రమార్క మహారాజు ఒకనాటి రాత్రి, తన జాతకం వ్రాయబడిన పత్రాన్ని చదువుతున్నప్పుడు, ఆయనకు ఒక సందేహం కలిగింది. 'నేను జన్మించిన రోజే, ఈ ప్రపంచంలో అనేకమంది జన్మించి వుంటారు. కానీ, వాళ్ళంతా రాజులు కాలేదు. నేనే ఎందుకయ్యాను? ఉన్నతమైన ఈ స్థానం నాకే ఎందుకు దక్కింది?’ అని..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/NwNoHbDpfwM ]

ఆ విషయమై, మరునాడు పండితులతో చర్చించినప్పుడు వారు చెప్పిన సమాధానం, రాజుకు సంతృప్తినివ్వలేదు. అప్పుడొక వృద్ధ పండితుడు, 'విక్రమార్క మహారాజా! మన నగరానికి తూర్పున వున్న అడవిలో, ఒక సన్యాసి వున్నాడు. ఆయనను కలవండి. మీ సందేహానికి సమాధానం దొరుకుతుంది' అని చెప్పాడు.

విక్రమార్కుడు వెంటనే బయలుదేరి వెళ్ళాడు. అపుడా సన్యాసి, బొగ్గు తింటున్నాడు. అది చూసి రాజుకు ఆశ్చర్యం కలిగినా, తన సందేహాన్ని ఆయన ముందు వ్యక్తపరిచాడు..

అప్పుడాయన, 'ఇక్కడికి నాలుగు మైళ్ళ దూరంలో, ఇలాంటిదే మరొక కుటీరం వుంది. అందులో మరొక సన్యాసి వున్నాడు, ఆయనను కలవండి.' అని చెప్పాడు..

కొంత నిరాశచెందినా, విక్రమార్కుడు రెండవ సన్యాసి కోసం బయలుదేరాడు. విక్రమార్కుడక్కడికి చేరుకునేసరికి, ఆ సన్యాసి మట్టి తింటున్నాడు. అది చూసి విక్రమార్కుడు కాస్త ఇబ్బందిపడ్డాడు. కానీ తమాయించుకుని, తనకు కలిగిన సందేహాన్ని బయటపెట్టాడు. అప్పుడా సన్యాసి, రాజు మీద కోపంతో గట్టిగా అరచి, ఇక్కడినుండి తక్షణమే వెళ్ళిపో.. అని కసురుకున్నాడు.

రాజుకూ కోపం వచ్చినా, సన్యాసి కాబట్టి, ఆయనను ఏమీ అనలేదు. నిరాశగా వెనుదిరిగి వెళ్ళి పోతున్న సమయంలో, సన్యాసి రాజుతో ఇలా అన్నాడు, 'ఇదే దారిలో వెళితే, ఒక గ్రామం వస్తుంది. అక్కడ ఒక బాలుడు చనిపోవడానికి సిద్ధంగా వున్నాడు. వెంటనే అతడిని కలవండి.' అన్న సన్యాసి మాటలకు, రాజు అయోమయంలో పడ్డాడు.

రాజుకు అంతా గందరగోళంగా వుంది. అయినా, రెండవ సన్యాసి చెప్పిన ప్రకారం, ఆ గ్రామానికి వెళ్ళాడు. అక్కడ చనిపోవడానికి సిద్ధంగా వున్న బాలుడిని కలిసి, మరోసారి తనకు కలిగిన సందేహాన్ని బయటపెట్టాడు.

అప్పుడా బాలుడు నీరసంగా నవ్వి, ఇలా చెప్పనారంభించాడు. 'పూర్వం నలుగురు వ్యక్తులు ఒక రాత్రి, అడవిలో దారి తప్పారు. తిరిగితిరిగి అలసిపోయి, విపరీతంగా ఆకలి వేసేటప్పటికి, వాళ్ళ దగ్గరున్న రొట్టెలు తిందామని, చెట్టు క్రింద కూర్చున్నారు. ఉన్న నాలుగు రొట్టెలనూ నలుగురూ తీసుకుని, ఆబగా తినబోతుండగా, అక్కడికి బాగా ఆకలితో, నీరసంగా వున్న ఒక ముసలి వ్యక్తి వచ్చి, తనకూ కొంచెం ఆహారమివ్వమని అడిగాడు.

దానికి ఆ నలుగురిలో మొదటివాడు కోపంతో, 'ఉన్నది నీకిస్తే, నేను బొగ్గు తినాలా?' అని కసురుకున్నాడు..

రెండవ వ్యక్తి, 'నీకు ఈ రొట్టె ఇచ్చేస్తే, నేను మట్టి తినాల్సిందే' అని వెటకారంగా అన్నాడు..

మూడవ వాడు, 'రొట్టె తినకపోతే ఈ రాత్రికే చస్తావా ఏం?' అని నీచంగా మాట్లాడాడు..

కానీ నాలుగవ వ్యక్తి మాత్రం, 'తాతా! నీవు చాలా నీరసంగా వున్నావు. ఈ రొట్టె నాకంటే నీకే ఎక్కువ అవసరము. ఇది నువ్వే తిను.' అని, తాను తినబోతున్న రొట్టెను, ముసలి వ్యక్తికిచ్చేశాడు..

రాజా, ఆ జన్మలో నాలుగవ వ్యక్తివి నువ్వే.. అని అన్నాడు. ఆ మాటలు విన్న రాజు దిగ్భ్రాంతికి లోనయ్యాడు..

రాజా, నువ్వు చేసుకున్న పుణ్యం వల్ల, నువ్వు రాజుగా జన్మించావు. అనవసరమయిన మీమాంసలతో కాలం వృథా చేయక, ప్రజలను కన్న తండ్రి వలె పాలించు.. అని చెప్పి, కనులు మూశాడు.

'దానం' సంపద వంటిది. అవసరంలో ఉన్నవారికి పంచి, ప్రతిఫలంగా పుణ్యాన్ని కూడబెట్టుకోవాలి. చెడ్డ మాట, అప్పులాంటిది. ప్రతిగా, వడ్డీతో కలిపి చెల్లించాల్సి వుంటుంది..

సర్వేజనాః సుఖినోభవంతు!

No comments: