‘యోగి’ - పరిపూర్ణమైన సిద్ధిని పొందటం!
'భగవద్గీత' షష్ఠోఽధ్యాయం - ఆత్మ సంయమ యోగం (44 – 47 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను కర్మషట్కము అంటారు. దీనిలో ఆరవ అధ్యాయం, ఆత్మ సంయమ యోగం. ఈ రోజుటి మన వీడియోలో, ఆత్మసంయమయోగంలోని 44 నుండి 47 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..
[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/A8wJC1v5HXw ]
ఎటువంటి యోగిని అత్యున్నతమైన వారిగా పరిగణిస్తాడో, శ్రీ కృష్ణడిలా చెబుతున్నాడు..
00:46 - పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోఽపి సః ।
జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మాతివర్తతే ।। 44 ।।
వారు తమ ఇష్టానుసారం కాకపోయినా, పూర్వ జన్మల సాధనా బలంచే, కచ్చితంగా భగవంతుని వైపు ఆకర్షించబడతారు. ఇటువంటి సాధకులు, వేదములలో చెప్పబడిన కర్మ కాండల సూత్రాలకు, సహజంగానే అతీతంగా ఎదుగుతారు.
ఒకసారి ఆధ్యాత్మిక భావనలు చిగురించిన తరువాత, వాటిని నిర్మూలించలేము. భక్తి యుక్తమైన పూర్వ, ప్రస్తుత జన్మ సంస్కారములు కలిగి ఉన్న జీవాత్మ, సహజంగానే, ఆధ్యాత్మికత వైపు ప్రేరేపింపబడుతుంది. అటువంటి వ్యక్తి, భగవంతుని దిశగా ఆకర్షించబడతాడు. ఈ ఆకర్షణనే, "భగవంతుని పిలుపు" అని కూడా అంటారు. పూర్వ సంస్కారముల ఆధారంగా వచ్చే ఈ భగవంతుని పిలుపు, ఎంతో బలంగా ఉంటుంది. తమ మనస్సు చెప్పిన మార్గంలోనే ప్రయాణించటానికి, సమస్త ప్రపంచాన్నీ, మరియు తమ స్నేహితుల, బంధువుల సలహాలనూ విడిచిపెడతారు. ఈ విధంగానే, చరిత్రలో గొప్ప రాకుమారులూ, ఉన్నతమైన హోదాలో ఉన్నవారూ, ధనవంతులైన వ్యాపార వేత్తల వంటి వారు, తమ ప్రాపంచిక సుఖాలను త్యజించి, యోగులూ, మునులూ, సన్యాసులూ, స్వామీజీలూ అయ్యారు. వారికున్న తృష్ణ, భగవంతుని కోసం మాత్రమే కావున, వారు సహజంగానే, భౌతిక పురోగతి కొరకు, వేదములలో చెప్పబడిన సకామ కర్మ కాండలకు అతీతంగా ఎదుగుతారు.
02:15 - ప్రయత్నాద్యతమానస్తు యోగీ సంశుద్ధకిల్బిశః ।
అనేకజన్మసంసిద్ధః తతో యాతి పరాం గతిమ్ ।। 45 ।।
అనేక పూర్వ జన్మల నుండి సంపాదించుకుంటూ వచ్చిన యోగ్యతలతో, ఎప్పుడైతే ఈ యోగులు మనఃపూర్వకంగా మరింత పురోగతి కోసం శ్రమిస్తారో, అప్పుడు వారు ప్రాపంచిక కోరికల నుండి పవిత్రమైన స్వేచ్ఛను పొంది, ఈ జన్మ లోనే, పరిపూర్ణమైన సిద్ధిని పొందుతారు.
ఎన్నో పూర్వ జన్మలలో ఆర్జించిన అభ్యాసం, ఆధ్యాత్మిక పురోగతి కొరకు, చక్కటి వీచేగాలిలా సహకరిస్తుంది. పూర్వ జన్మ నుండి కొనసాగిస్తూ, ఈ జన్మలో యోగులు, ఈ వీచేగాలిలో, తమ పరిశ్రమ రూపంలోని తెరచాపను ఎగురవేస్తారు. శ్రీ కృష్ణుడు, "ప్రయత్నాద్ యతమానస్తు" అంటున్నాడు. అంటే, ఇంతకు పూర్వం కంటే ఎక్కువ పరిశ్రమ చేయటం. వారి ప్రస్తుత పరిశ్రమ, ఇంతకు క్రితం వారు ప్రయాణాన్ని పూర్తి చేయలేకపోయిన జన్మల పరిశ్రమ కంటే, తీవ్రంగా ఉంటుంది. ఈ విధంగా, వారు పూర్వ జన్మల నుండి వచ్చిన ఉరవడిని సహాయంగా తీసుకుంటూ, ఈ అనుకూల పవనాలతో, లక్ష్యం వైపుగా తీసుకు వెళ్ళబడతారు. చూసేవారికి, మెత్తం ప్రయాణాన్ని వీరు ఈ జన్మ లోనే పూర్తి చేసినట్టు ఉంటుంది. కానీ, 'అనేకజన్మసంసిద్ధః' , అంటే, "యోగములో పరిపూర్ణ సిద్ధి అనేది, అనేక జన్మల అభ్యాసంతో ఆర్జించిన ఫలితము."
03:39 - తపస్విభ్యోఽధికో యోగీ జ్ఞానిభ్యోఽపి మతోఽధికః ।
కర్మిభ్యశ్చాధికో యోగీ తస్మాద్యోగీ భవార్జున ।। 46 ।।
ఒక యోగి తపస్వి కంటే ఉన్నతమైన వాడు, జ్ఞాని కంటే ఉన్నతమైనవాడు, ఇంకా కర్మి కంటే కూడా ఉన్నతమైనవాడు. కాబట్టి ఓ అర్జునా, నీవు యోగి అవ్వటానికి ప్రయత్నించుము.
తపస్వి అంటే, మోక్ష ప్రాప్తి సాధనకి సహాయంగా, తనకు తానే శారీరక నిష్ఠలు విధించుకుని, తీవ్ర కఠిన జీవన విధానాన్ని అవలంభిస్తూ, ఇంద్రియ సుఖాలకు దూరంగా, భౌతిక సంపత్తి ఏమీ కూడబెట్టక ఉండే వాడు. జ్ఞాని అంటే, చురుకుగా, ప్రయత్న పూర్వకంగా జ్ఞాన సముపార్జన చేసే ఒక చదువుకున్న వ్యక్తి. కర్మి అంటే, భౌతిక సంపత్తి కోసం, స్వర్గాది లోక ప్రాప్తి కోసం, వైదిక కర్మకాండలు ఆచరించే వాడు. వీరందరి కన్నా యోగియే శ్రేష్ఠుడని, శ్రీ కృష్ణుడు చెబుతున్నాడు. దీనికి కారణం, చాలా సరళమైనది. కర్మీ, జ్ఞాని, మరియు తపస్వుల యొక్క లక్ష్యం, ప్రాపంచిక సంపాదన. వారు ఇప్పటికీ శారీరక దృక్పథంలోనే ఉన్నట్టు. యోగి భౌతిక పురోగతి కోసం పాటు పడట్లేదు. భగవత్ ప్రాప్తి కోసం శ్రమిస్తున్నాడు. అందుకే, యోగి సాధించేది ఆధ్యాత్మికమైనది. అందుకే యోగి, వీరందరి కన్నా ఉన్నతమైనవాడు.
05:03 - యోగినామపి సర్వేషాంమద్గతేనాంతరాత్మనా ।
శ్రద్ధావాన్ భజతే యో మాం స మే యుక్తతమో మతః ।। 47 ।।
అందరు యోగులలో కెల్లా, ఎవరి మనస్సు ఎల్లప్పుడూ నాయందే నిమగ్నమై ఉంటుందో, ఎవరు నా యందు దృఢ విశ్వాసంతో, భక్తితో ఉంటారో, వారిని అత్యున్నతమైన వారిగా పరిగణిస్తాను.
యోగులలో కూడా, కర్మ యోగులు, భక్తి యోగులు, జ్ఞాన యోగులు, అష్టాంగ యోగులు మొదలైన వారు ఉంటారు. ఏ రకమైన యోగులు శ్రేష్ఠమైన వారు అన్న వివాదానికి, ఈ శ్లోకం ముగింపునిస్తుంది. 'భక్తి యోగి' యే పరమ శ్రేష్ఠుడు. సర్వోత్తమమైన అష్టాంగ యోగీ, మరియు హఠ యోగుల కన్నా ఉన్నతమైన వాడని, శ్రీ కృష్ణుడు ప్రకటిస్తున్నాడు. ఎందుకంటే, భక్తి అనేది భగవంతుని యొక్క అత్యున్నత శక్తి. అది ఎంత బలీయమైనదంటే, అది భగవంతుణ్ణి కట్టి పడేసి, ఆయనను భక్తునికి బానిసగా చేస్తుంది. అందుకే, భాగవతంలో ఆయన ఇలా చెప్పాడు: "నేను సర్వ-స్వతంత్రుడను.. అయినా, నేను నా భక్తులకు బానిసై పోతాను. వారు నా హృదయాన్ని జయిస్తారు. నా భక్తులే కాదు, నా భక్తుల భక్తులు కూడా నాకు చాలా ప్రియమైనవారు." భక్తియోగి, దివ్య ప్రేమ శక్తి కలిగి ఉంటాడు. అందుకే, భగవంతునికి అత్యంత ప్రియమైన వాడు, అందరి కంటే అత్యున్నతంగా పరిగణించబడేవాడు. ఈ భక్తులు, తమ ఆత్మ సహజ స్థితి అయిన భగవంతుని సేవకులుగా ఉంటారు. అదే సమయంలో, ఇతర రకాల యోగులు, తమ విజ్ఞానంలో అసంపూర్ణంగా ఉంటారు. వారు తమని తాము భగవంతునితో అనుసంధానం చేసుకున్నారు కానీ, వారు భగవంతుని నిత్య సేవకులమని ఇంకా అర్థం చేసుకోలేదు. కోట్ల మంది పరిపూర్ణ సిద్ధిని సాధించి విముక్తి పొందిన మహాత్ములలో కూడా, సర్వోన్నత భగవానుడయిన శ్రీమన్నారాయణుడి పట్ల, భక్తిగల ప్రశాంత చిత్తులు, చాలా అరుదు. భక్తి యోగం, పరిపూర్ణ భగవదనుభూతినీ, విజ్ఞానాన్నీ అందిస్తుంది. కేవలం భక్తి యోగి మాత్రమే, యదార్థమైన భగవత్ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకుంటాడు.
ఓం తత్సదితి శ్రీ మద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం, యోగ శాస్త్రే, శ్రీ కృష్ణార్జున సంవాదే, ఆత్మ సంయమయోగో నామ షష్ఠోధ్యాయః
శ్రీ మద్భగవద్గీతలోని కర్మషట్కం, ఆరవ అధ్యాయంలోని ఆత్మసంయమయోగంలోని 47 శ్లోకాలూ సంపూర్ణం.
07:34 - ఇక మన తదుపరి వీడియోలో, భక్తి షట్కంలోని మొదటి అధ్యాయం, జ్ఞాన విజ్ఞాన యోగంలో, శ్రీ కృష్ణుడు వివరించిన నిగూఢార్థాలను తెలుసుకుందాము..
కృష్ణం వందే జగద్గురుం!
No comments: