Sunday, 10 April 2022

శ్రీ రామ నవమి రాముడు పుట్టిన రోజా, పెళ్లి రోజా? Sri Rama Navami


అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు 🙏 శ్రీ రామ నవమి రాముడు పుట్టిన రోజా, పెళ్లి రోజా?

వేదవేద్య పరేపుంసీ -  జాతే దశరధాత్మజే।
వేదః ప్రాచేత సాదా సీత్  - సాక్షాత్ రామాయణాత్మనాః।।

వేదములచే తెలుపబడిన వాడూ, పరమ పురుషుడూ అయినటువంటి సాక్ష్యాత్ ఆ శ్రీ మహావిష్ణువే, దశరథుని కుమారునిగా పుట్టగా, వేదం వాల్మీకి నోట రామాయణంగా వెలువడింది. రామాయణం అంటే, సాక్ష్యాత్తూ వేదమే అని, పై శ్లోకం యొక్క అర్థం.

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/VDcEZ1quBg8 ]

ప్రతి మనిషీ, ధర్మాన్ని ఏ విధంగా పాటించాలి? అనే విషయాన్ని, తాను ఆచరించి చూపిన పురుషోత్తముడు, శ్రీరామచంద్రమూర్తి. ఆ ఇక్ష్వాకు కుల తిలకుడికి, సమస్త భక్త జనం చేసే మహత్తర వేడుక, సీతారామల వారి కళ్యాణం. ప్రతీ సంవత్సరం, ప్రపంచ వ్యాప్తంగా శ్రీరామ నవమి రోజు, ఆ సీతారాముల కళ్యాణం, అంగరంగ వైభవంగా చేస్తారు. అయితే, శ్రీరామ నవమి రోజు, రాముల వారి పెళ్ళిరోజా? లేక పుట్టిన రోజా? ఆరోజు కళ్యాణం ఎందుకు చేస్తారు? శ్రీరామనవమి యొక్క విశిష్ఠతా, దాని వెనుకనున్న అసలుచరిత్ర ఏమిటి? అనే విషయాలను, ఈ రోజుటి వీడియోలో తెలుసుకుందాం..

ఈ సమస్తలోకాలకూ ఆదిదేవుళ్ళయిన త్రిమూర్తులలో ఒకరైన ఆ శ్రీ మహావిష్ణువే, మానవునిగా జన్మించి, లోక ధర్మాన్ని సంపూర్ణంగా పాటించాడు. “సుఖ దు:ఖే సమీకృత్వా, లాభా లాభే జయాజయా” అన్న సూక్తిని ఆచరాణాత్మకంగా నిరూపించిన లోకొత్తర పురుషుడు, దుష్ట శిక్షణా, శిష్ట రక్షణా చేయడానికే కాక, తన జీవితాన్నే భావితరాలకు ఆదర్మప్రాయంగా చూపిన యుగ పురుషుడు, ఆ రఘురాముడు. అఖండ రాజ్యానికి రాజుగా పట్టాభిషేకానికి సిద్ధమైన సమయంలో ఎంత ఆనందంగా ఉన్నాడో, అదే ముహుర్తంలో, అరణ్యాలకు వెళ్ళాల్సి వచ్చినా, అంతే ఆనందంతో ఉన్నాడు ఆ శ్రీరాముడు. తన ధర్మపత్ని అయిన సీతా దేవిని ఎత్తుకెళ్ళిన దశకంఠుడితో ధర్మబద్ధమైన యుద్ధం చేసి, తన సతిని తిరిగి తెచ్చుకుని, లోక కళ్యాణం చేశాడు. జయించిన సువర్ణ లంక ముందున్నా, తన మాతృభూమే మిక్కిలి ప్రధానమని, దానిని తృణప్రాయంగా వదిలి వచ్చేసిన దేశ భక్తుడు రాముడు. వ్యక్తిగత, కుటుంబ, సామాజిక ధర్మాలలో, సామాజిక ధర్మానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చిన ఆ రామచంద్రుడు, జనులందరూ రాజును అనుసరిస్తారని, జనవాక్యానికి ప్రాధాన్యతనిచ్చి, నిర్దోషి అని తెలిసినా, తన ప్రాణేశ్వరుని, జనవాక్యం, కర్తవ్యం అని అరణ్యాలకు పంపాడు.

నా శ్రీరాముడు ఏకపత్నీ వ్రతుడూ, నా రాముడు పితృవాక్య పరిపాలకుడూ, నా రాముడు ఆదర్శ సోదరుడూ, నా రాముడు సువర్ణ యుగాన్ని స్థాపించిన మచ్చలేని మహారాజూ, నా రాముడు ధర్మానికి తప్ప మరే శక్తికీ కట్టుబడని ధర్మప్రభువూ, నా రాముడు ఎదురులేని పరాక్రమవంతుడు. అందుకే, ఆయన వ్యక్తిత్వం, స్వభావం, మానవాళికి ఆదర్శప్రాయాలు. ఆయన జీవితం, సకల మానవులకూ ఆచరణాత్మకం. ధర్మాన్ని తప్ప, అధర్మాన్ని దరిచేరనివ్వలేదు కాబట్టే, ఆయన ఎన్నో కష్టాలనుభవించాడు. వాటిని ఎదిరించి, పోరాడి, యుగ పురుషుడై, నేటికీ భక్త కోటిచే, పూజలందుకుంటున్నాడు. సమస్త లోకాలనూ రక్షించే ఆ శ్రీ హరికి, ఒక నరుడిగా జన్మించి, ఇన్ని కష్టనష్టాలూ, సుఖదు:ఖాలూ అనుభవించడం అవసరమా? అయినా గాడితప్పే చంచల స్వభావం గల మానవుడు, ధర్మంతో మెలిగితే, అతడే దేవుడవుతాడు, సమస్త జనులకూ పూజ్యుడవుతాడనే సత్యాన్ని మనకు తెలియజెప్పడానికి, ధర్మ మార్గాన తాను నడచి చూపించినవాడు, జగదభి రాముడు.

అటువంటి ఆ శ్రీ రామచంద్ర ప్రభువు పుట్టిన రోజే, శ్రీరామ నవమి. 24వ మహాయుగంలో, త్రేతాయుగమునందు, విళంబి నామ సంవత్సరం, చైత్ర మాసంలో వచ్చిన చైత్ర శుక్ల నవమి నాడు, సరిగ్గా అభిజిత్ ముహుర్తంలో, అంటే, మధ్యాహ్నం, పునర్వసు నక్షత్రంలో, రామ చంద్రుడు, ఈ పుణ్య పుడమి నందు జన్మించాడు. ఆ నవమి రోజునే, శ్రీరామ నవమిగా, శ్రీరామ అవతరణ పుణ్యదినంగా జరుపుకుంటారు. ఇప్పుడు 28వ మహా యుగంలో, కలియుగం జరుగుతొంది. అంటే, ఇప్పటికి సుమారు, కోటి 81 లక్షల, 47 వేల సంవత్సరాలకు పూర్వం, శ్రీరామ అవతరణం జరిగిందని ఒక అంచనా. ఇది అటుంచి, శ్రీరామ నవమి, రాముడు పుట్టిన రోజైతే, ఆ రోజు సీతారాముల కళ్యాణం ఎందుకు చేస్తారు? వాల్మీకి రామాయణంలో, చైత్ర శుక్ల నవమి నాడు రాముడు జన్మించాడని చెప్పారే తప్ప, ఆరోజు కళ్యాణం జరిగిందని చెప్పలేదు. ఉత్తర ఫాల్గుణీ నక్షత్రంలో, సీతారాముల కళ్యాణం జరిగినట్లు, వాల్మీకి పేర్కోన్నారు. అయితే, శ్రీరామ నవమి రోజున, సీతారాముల వారి కళ్యాణం చేయడానికి ఒక కారణం ఉంది. సీతాదేవి సాక్ష్యాత్తూ, ఆ లక్ష్మీ దేవి అవతారం.

నారాయణుడితోనే లక్ష్మి అని, ఆయనతో పాటే ఆ తల్లి కూడా, భూమి యందు సీతా దేవిగా జన్మించి, ఆ రఘుకుల నందునుడిని పెళ్ళి చేసుకున్నది మొదలు, ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా, పతిభక్తే పరమావధిగా, ఆయన వెంట అడవులకు నడిచింది. రావణుడి చెరలో కూడా, మలినం అంటని జ్వాలాగ్నిలా వెలిగి, అపర పతి వ్రతగా కీర్తి గడించింది. తన స్వామి పేరుకోసం, నిండు గర్భిణి అయికూడా, మళ్ళీ అరణ్యవాసం చేసిన మహా సాధ్వి, ఆ సీతమ్మతల్లి. అందుకే, ఈ లోకంలో రాముణ్ణి మించిన రాజులేడు, సీతమ్మ తల్లిని మించిన సాధ్వీ లేదు. అందువల్లే, కలలో కూడా, వారివురినీ వేరువేరుగా పిలవాలనే తలంపు, ఎవరికీ రాదు. ఆ కారణం వల్లనే, నేటికీ, ఆ దశరథ తనయుడిని సీతా రామునిగా, జానకి రామునిగానే పిలుస్తారు, వారివురినీ కలిపే కొలుస్తారు. ఈ ప్రపంచంలో, అందరు దేవుళ్లూ, ఒంటరిగా కూడా పూజలందుకుంటున్నారు. కానీ, ఆ సీతారాములు మాత్రం, ఏ ఆలయంలోనైనా, ఏ ఇంట్లోనైనా, వేరువేరుగా పూజలందుకోలేదు. అంతటి ఆదర్శదంపతులను వేరు వేరుగా చూడకూడదు. అందుకే, శ్రీరామ నవమి, రాముని పుట్టన రోజైనా, ఆ రోజు సీతారాములను కలిపే పూజించాలి. ఈ కారణం వల్లనే, ఆ రోజు వారి కళ్యాణం, అంగరంగ వైభవంగా, తరాలు మారినా, యుగాలే మారినా, నేటికీ చేస్తున్నాం. ఇంతటి విశిష్ఠత కలిగిన శ్రీరామ నవమిని, అందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకొని, ఆ సీతారాముల కళ్యాణాన్ని వీక్షించి, చరితార్థులమవుదాం.

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే।
సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే।।

జై శ్రీరామ్!

No comments: