Monday, 20 June 2022

భార్య మాటతో జ్ఞానోదయమై Goswamy Tulsidas

 

భార్య మాటతో జ్ఞానోదయమై శ్రీరాముని పాదాలను చేరాడు!
పరమత దాడులనుంచి రక్షించడానికి ఆయన స్థాపించిన అఖాడాలు ఇంకా ఉన్నాయా?

ప్రతి మనిషి జీవితంలో, మలుపు తిప్పే సంఘటన ఏదో ఒకటి ఉంటుంది. ఆ సంఘటన తర్వాత, ఆ వ్యక్తి జీవితంలో అద్భుతమైన మార్పులు సంభవిస్తాయి. అలాంటి ఒకానోక సంఘటన, గోస్వామి తులసీదాసు జీవితంలో ఎదురయ్యింది. తను అందించిన హనుమాన్ చాలీసా, ఎంతో మహిమాన్విత ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది. తులసీదాసు, రాముడి భక్తుడిగా ఎలా మారాడు? ఆయన జీవితాన్ని మలుపు తిప్పిన ఆ సంఘటన ఏంటి? తులసీ దాసు జీవితంలో జరిగిన కొన్ని అద్భుత విషయాల గురించీ, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/jUk27kUoa5w ]

రామయాణాన్ని రచించింది ఎవరంటే, మనమంతా ఠక్కున చెప్పే సమాధానం, వాల్మీకి మహర్షి. అయితే, తులసీదాసు తన రామచరిత మానస్ లో, శ్రీరాముని కథను మరోసారి పునరావృతం చేశారు. గోస్వామి తులసీదాసుగా ప్రసిద్ధి చెందిన ఈయన, గొప్ప సాధువు, కవి, మరియు రచయిత. తులసీదాసు శ్రావణ మాసంలోని శుక్ల పక్షం, ఏడవ రోజున జన్మించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కస్గంజ్ జిల్లా, సుకర్ క్షేత్ర గ్రామంలో, ఆత్మారాం దుబే, హులసీ దేవి దంపతులకు ఆయన జన్మించారు. తులసీదాసు అసలు పేరు, రాంభోలా. హులసీ దేవి తన గర్భంలో రాంభోలాని, పన్నెండు నెలలు పూర్తిగా మోసిన తరువాత, జన్మనిచ్చింది. సాధారణంగా ఎవరైనా, పుట్టిన తర్వాత ఏడుస్తారు. కానీ, తులసీ దాసు మాత్రం, పుట్టినప్పుడు అస్సలు ఏడవలేదు. అంతేకాదు, తను పుట్టిన వెంటనే, ఐదు నెలల బాలుడిలా కనిపించాడు. దంతాలతో, అభూక్త మూలా నక్షత్రంలో జన్మించాడు రాంభోలా. అది అపశకునం కాబట్టి, ఆయన పుట్టిన నాలుగు రోజులకే, ఆ దంపతులు ఆయనను మునియా అనే దాసీకి అప్పగించారు. మునియా, రాంభోలాకు ఐదేళ్ల వయసున్నప్పుడు, మరణించింది.

ఆ తర్వాత రాంభోలా, యాచిస్తూ జీవించేవాడు. అప్పుడు బాబా నరహరిదాసనే సాధువు, ఆ అనాథ బాలుడిని పెంచి, విద్యనేర్పారు. ఆయన రాంభోలా పేరును, తులసీ దాసుగా మార్చారు. తరువాత, శేషసనాతనుడనే శ్రేష్ఠుని దగ్గర తులసీదాసు, వేద వేదంగాలు అభ్యసించాడు. అనాథబాలుడైన తులసీదాసు రూప, గుణ, శీల, స్వభావ, విద్వత్తులకు ముగ్ధుడైన ఒక కులీన బ్రాహ్మణుడు, తన కూతురు రత్నావళినిచ్చి వివాహం చేశాడు. తులసీదాసుకు తన భార్య రత్నావళి అంటే, ఎంతో ప్రేమ. ఒక రోజు తులసీదాసు, రామాయణ ప్రవచనం చేస్తున్నాడు. కానీ, ఎంత ప్రయత్నించినా కూడా, మనస్ఫూర్తిగా చేయలేకపోయాడు. ఎందుకంటే, తులసీదాసు ప్రతీ క్షణం, తన అందాల రాశియైన భార్య రత్నావళి పైనే ద్యాస పెట్టేవాడు. అలా అన్యమనస్కంగానే ప్రవచనం పూర్తి చేశాడు. ఇంటికివెళ్ళిన తరువాత, తన భార్య అత్యవసర పరిస్థితుల్లో పుట్టింటికి వెళ్ళిందని, తెలుసుకున్నాడు. వెంటనే ఆమెను కలవాలని, పది మైళ్ళ దూరంలో ఉన్న ఊరికి బయలుదేరాడు. చిమ్మచీకటి, దానికి తోడు కుంభవృష్టిగా వర్షం కురుస్తోంది. అలాంటి సమయంలో గంగానదిని దాటి, భార్య ఇంటికి చేరుకున్నాడు, తులసీదాసు. అప్పుడతని భార్య రత్నావళి చేసిన హెచ్చరిక, అతని జీవితాన్నే మార్చేసింది.

అస్థిచర్మమయ దేహ మను తామేజైసీప్రీతి తైసి జో శ్రీరామమహ హోత వతౌభవతి!

నాథా! ఎముకలూ, చర్మంతో కూడిన ఈ దేహంపై ఉన్నంత ప్రేమ, ఆ శ్రీరాముని మీద ఉంటే, భవభీతియే యుండదు గదా! అని రత్నావళి చెప్పిన మాటలే, తులసీదాసుకు తారకమంత్రమయ్యాయి. అప్పటి నుండి తులసీ దాసు విరాగియై, శ్రీరామ చంద్రుని భక్తిలో నిమగ్నుడయ్యాడు. శ్రీ రాముని అనుగ్రహం వల్ల లభించిన తన జీవితాన్ని, ఆ రాముని సేవకే అంకితం చేయాలని నిర్ణయించుకుని, కాశీ చేరుకున్నాడు. నిరంతరం రామ భక్తిలో మునిగి ఉండే తులసీ దాసు జీవితంలో, కొన్ని అద్భుత సంఘటనలు జరిగాయి. ఒకనాడు రాత్రి తులసిదాసు కుటీరంలోకి ఇద్దరు దొంగలు చొరబడి, పూజాగృహంలోని బంగారం, వెండి పాత్రలు దొంగిలించి మూటగట్టి, తిరిగి వెళ్లడానికి ద్వారం వద్దకు వచ్చారు. అక్కడ ఇద్దరు భటులు కత్తులు పట్టుకుని నిలబడ్డారు. వారిని చూసి, దొంగలు రాత్రంతా కుటీరంలోనే ఉన్నారు. ఉదయం తులసీదాసు లేవగానే, దొంగలు అతని కాళ్ల  మీద పడి, క్షమించమన్నారు. ద్వారం వద్ద ఉన్న సేవకులకు భయపడి, ఇక్కడే దాక్కున్నామని, వారు బదులిచ్చారు. దాంతో తులసీదాసు ఆశ్చర్యంతో బయటకు వచ్చి చూడగా, అక్కడ ఎవరూ లేరు. వెంటనే ఆయన దివ్య దృష్టితో విషయాన్ని గ్రహించి, రాత్రి దొంగలకు కనిపించింది సాక్షాత్తూ రామ లక్ష్మణులే అని అర్థంచేసుకున్నారు.

తులసిదాసు రోజూ అన్నదానం చేస్తుంటారు. ఓ రోజు అన్నదాన సమయంలో, పండిత బ్రాహ్మణులందరూ భోజనం చేసే సమయానికి, ఓ నూతన వ్యక్తి వచ్చి వరుసలో కూర్చుని, 'జై శ్రీ రామ్' అంటూ, రామ నామాన్ని ఉచ్ఛరించసాగాడు. అప్పుడా బ్రాహ్మణులు భోజనం చేయడానికి, నిరాకరించారు. బయటి వ్యక్తి రావడంతో, ఆ ప్రదేశం అపవిత్రమైందని, తులసీదాసును నిందించారు. అప్పుడు తులసీ దాసు, రామ నామం ఎక్కడైతే ఉచ్ఛరింపబడుతుందో, అక్కడ పవిత్రత ఉంటుందని వివరించాడు. దానికి వారు, అయితే ఈ భోజనం పవిత్రమైనదని నిరూపించమని తులసీదాసునడుగగా, అతను ఆ భోజనాన్ని శివాలయంలోని నందీశ్వరుని ఎదురుగా పెట్టి, ఆహారాన్ని స్వీకరించమని ప్రార్ధించాడు. అప్పుడు సాక్షాత్తూ నందీశ్వరుడే వచ్చి, తృప్తిగా భోజనం చేసి వెళ్ళాడు. ఈ సంఘటన, తులసీదాసుకు భగవంతునిపై ఉన్న విశ్వాసానికి మచ్చతునక. అయితే, మరొక సంఘటనలో, ఒక మహిళ ఏడుస్తూ, పరుగెత్తుకుంటూ వచ్చి, తులసీదాసు కాళ్ళపై పడింది. తులసీదాసు వెంటనే, "దీర్ఘ సుమంగళీ భవ" అని దీవించారు. ‘అయ్యో! మహాత్మా! ఏమని చెప్పను? నా భర్త ఇప్పుడే మరణించాడు. నేనెలా సుమంగళిని?’ అని ఏడుస్తూ ప్రశ్నించింది. ‘నన్ను ఆశీర్వదించిన మీరే నా భర్తను కాపాడాలి’ అని రోదించింది. అప్పుడు తులసీ దాసు, ‘నా వద్ద ఎటువంటి మహిమలూ లేవు. కేవలం రామ నామం మాత్రమే, నీ భర్తను బ్రతికించగలుగుతుంది. నీవు తక్షణమే వెళ్లి, నీ భర్త చెవిలో రామ నామాన్ని ఉచ్ఛరించు’ అని చెప్పి పంపించాడు. ఆ విధంగానే ఆ మహిళ, తన భర్త చెవిలో రామ నామాన్ని పలుకగా, ఆశ్చర్యకరంగా, నిద్రలో నుండి మేల్కొన్నట్లుగా, ఆమె భర్త లేచి కూర్చున్నాడు.

అయితే, మరణించిన వ్యక్తి మళ్ళీ బ్రతికాడనే విషయం, ఆనోటా ఈ నోటా పడి, రాజుగారి చెవికి చేరింది. వెంటనే రాజు తులసీదాసును పిలిపించి, తన సభలో అందరి ముందూ కొన్ని మహిమలు చేసి చూపించమన్నాడు. దానికి తులసీ దాసు, ‘నా వద్ద ఎటువంటి మహిమలూ, మంత్రాలూ లేవు. అంతా ఆ రాముని చలువే. నేను నిమిత్త మాత్రుడిని’ అని బదులిచ్చాడు. దాంతో రాజు, ‘రాజాజ్ఞనే  ధిక్కరిస్తావా? ఇతడిని కొరడా దెబ్బలతో శిక్షించండి.’ అని ఆజ్ఞ జారిచేశాడు. అందుకు రాజ భటులు సిద్ధమవుతుండగా, విచిత్రంగా వందలాది కోతులు హఠాత్తుగా అక్కడకు చేరి, తులసీదాసు చుట్టూ రక్షణ వలయంలా నిలిచాయి. తన భక్తుడిని రక్షించడానికి, ఆంజనేయుడే దిగివచ్చాడు. ఈ దృశ్యం చూసిన రాజు ఒకింత ఆశ్చర్యానికీ, మరోకింత భయానికీ గురయ్యాడు. తులసీదాసు పాదాలకు నమస్కరించి, క్షమించమని వేడుకున్నాడు. వెంటనే తులసీదాసు, కళ్ళు మూసుకుని అప్రయత్నంగా, తనను రక్షించిన అంజనేయుణ్ణి స్తుతిస్తూ, "జయహనుమాన జ్ఞానగుణసాగర, జయకపీశ తిహులోక ఉజాగర" అంటూ నలభై శ్లోకాలతో గానం చేశాడు.

ఆ సమయంలో ఆయన పాడిన "హనుమాన్ చాలీసా" లోక ప్రఖ్యాతి గాంచింది. గోస్వామి తులసీదాసు వాల్మీకి అవతారమని, ప్రజల విశ్వాసం. ఆయన భక్తి భావం, కావ్య రచన, భాష, వీటిని చూస్తే, ఆయన అపర వాల్మీకి అనడంలో, ఏ సందేహమూ లేదు. తులసీదాసు తన జీవిత కాలంలో, సంస్కృతంతో పాటుగా, హిందీలోనూ 22 రచనలు చేశారు. ఆయన కాశీలో ఉండగా, ‘రామచరితమానస్’ అనే మహాకావ్యాన్ని, రెండున్నర సంవత్సరాలలో పూర్తి చేశారు. రామాయణ గాధను, అయోధ్య ప్రాంత భాషయైన అవధీలో వ్రాశారు. దేశీయ ఛందస్సులైన దోహా, చౌపాయి, కవిత్త మొదలైన ఛందస్సులలో వ్రాయడం, సరళమైన సంస్కృత, తత్త్సమ శబ్దాలతో కూడా, అవధి భాషలో రామాయణాన్ని వ్రాయడం చేత, తులసీ రామాయణం, లోక ప్రసిద్ధి చెందింది. ఈయన కేవలం రచయితగానే ప్రసిద్ధుడు కాదు. కొడి గడుతున్న హిందూ జ్వాలను, భక్తి ఉద్యమం ద్వారా, మళ్లీ ప్రజ్వరిల్లేటట్లుచేసిన మహా భక్తుడు. ఈయన ఉత్తర భారతదేశమంతా పర్యటించి, "అఖాడా"ల స్థాపన ద్వారా, యువతలో పోరాట పటిమను పెంపొందించారు. క్రూర ముస్లిం దండయాత్రలూ, మతమార్పిడి మౌఢ్యం నుంచి, హిందూ సమాజం తనను తాను కాపాడుకోవడంలో, ఈ మహాత్ముడు పోషించిన పాత్ర, అనిర్వచనీయమైనది. ఈయన స్థాపించిన అఖాడాలు, కూలాలకతీతంగా నిర్వహించ బడేవి. ఇప్పటికీ ఈ అఖాడాలు కొనసాగుతూ ఉండడం, గమనార్హం. ఎన్నో ఆంజనేయ స్వామి ఆలయాలను స్థాపింపజేశారు, తులసీ దాసు. వారణాసిలోని సంకట మోచన దేవాలయాన్ని, రాముని దర్శన భాగ్యం కల్పించిన హనుమంతునికి కృతజ్ఞతగా కట్టించారని ప్రతీతి. మన సంస్కృతినీ, ఆధ్యాత్మిక జీవన విధానాన్నీ కొనసాగించాలంటే, ఇలాంటి మహానీయుల జీవిత చరిత్రలను, తప్పక తెలుసుకోవాలి, తదనుగుణంగా మసలుకోవాలి..

జై శ్రీరామ్!

No comments: