Wednesday, 27 July 2022

నాస్తిక భావాలు! క్షణభంగురమైన భౌతిక శక్తి యొక్క ఆకర్షణలచే భ్రమకు లోనయితే ఏమవుతుంది? Bhagavad Geeta

   

నాస్తిక భావాలు! క్షణభంగురమైన భౌతిక శక్తి యొక్క ఆకర్షణలచే భ్రమకు లోనయితే ఏమవుతుంది?

'భగవద్గీత' నవమోధ్యాయం – రాజవిద్యా రాజగుహ్య యోగం (12 – 17 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 7 నుండి 12 వరకూ ఉన్న అధ్యాయాలను భక్తి షట్కము అంటారు. దీనిలో తొమ్మిదవ అధ్యాయం, రాజవిద్యా రాజగుహ్య యోగము. ఈ రోజుటి మన వీడియోలో, రాజవిద్యా రాజగుహ్య యోగములోని 12 నుండి 17 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/kyuLkjkLUWI ]

మనుషుల్లో నాస్తిక భావాలు ప్రబలడానికి కారణం ఏంటో, శ్రీ కృష్ణుడిలా చెబుతున్నాడు..

00:49 - మోఘాశా మోఘకర్మాణో మోఘజ్ఞానా విచేతసః ।
రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః ।। 12 ।।

భౌతిక మాయా శక్తిచే భ్రమకు లోనైనటువంటి జనులు, ఆసురీ మరియు నాస్తిక భావాలను పెంపొందించుకుంటారు. ఆ అయోమయ స్థితిలో, అభ్యుదయం / సంక్షేమం కోసం వారి ఆశలు వ్యర్థమవుతాయి. వారు ఫలాసక్తితో చేసే కర్మలు అన్నీ నిష్ఫలమే, మరియు వారి జ్ఞానము, అయోమయ స్థితిలో ఉంటుంది.

భగవంతుని సాకార రూపం గురించి, ఎన్నో రకాల నాస్తిక ప్రతిపాదనలు ప్రాచుర్యంలో ఉన్నాయి. భగవంతుడు మానవ రూపంలో దిగి రాలేడని, కొందరు విశ్వసిస్తారు. అందుకే, శ్రీ కృష్ణుడు దేవుడు కాదనీ, కేవలం ఒక యోగి మాత్రమే అనీ అంటారు. మరి కొందరు, శ్రీ కృష్ణుడు 'మాయా-విశిష్ట' బ్రహ్మ అంటారు.. అంటే, భౌతిక శక్తి సంపర్కం వలన వచ్చే ఒక తక్కువ స్థాయి దివ్య వ్యక్తిత్వము అని అర్థం. ఇంకొందరు, శ్రీ కృష్ణుడు, బృందావన గోపికలతో తిరిగిన ఒక సత్ప్రవర్తన లేని వ్యక్తిగా జమ కడతారు. శ్రీ కృష్ణుడు తెలిపిన ఈ శ్లోకం ప్రకారం, ఈ అన్ని సిద్ధాంతాలూ తప్పే, మరియు వీటిని నమ్మే వారి బుద్ధి, భౌతిక మాయా శక్తిచే భ్రమకు లోనయ్యి ఉంది. ఇటువంటి అవైదికమైన సిద్ధాంతాలను నమ్మేవారు, ఆసురీ స్వభావం కలిగినవారుగా పరిగణించ బడతారు. పరమేశ్వరుని సాకార స్వరూపంపై దైవీ భావన లేనందున, వారు ఆయన పట్ల భక్తిలో నిమగ్నమవ్వలేరు. అలాగే, నిరాకార బ్రహ్మం పట్ల భక్తి అత్యంత క్లిష్టమైనది కావటం వలన, అదికూడా చేయలేరు. ఆ ఫలితంగా శాశ్వతమైన సంక్షేమ మార్గాన్ని వారు కోల్పోతారు. క్షణభంగురమైన భౌతిక శక్తి యొక్క ఆకర్షణలచే భ్రమకు లోనయ్యి, వారి యొక్క శాశ్వత సంక్షేమం పట్ల ఆశలు నిష్ఫలమైపోతాయి.

02:47 - మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః ।
భజంత్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయమ్ ।। 13 ।।

ఓ పార్థ, నా యొక్క దివ్యమైన శక్తిని ఆశ్రయించిన మహాత్ములు, ‘నేనే’ సమస్త సృష్టికీ ఆది మూలమని తెలుసుకుంటారు. అనన్య చిత్తముతో, కేవలం నాయందే మనస్సు లగ్నం చేసి, వారు నా భక్తిలో నిమగ్నమౌతారు.

భౌతిక, ప్రాపంచిక జీవితం అనేది, మాయా మోహితులై నిద్ర పోయేవారు అనుభూతి చెందే ఒక దీర్ఘమైన కల. వీరితో పోల్చితే, తమ అజ్ఞానం నుండి మేల్కొని, భౌతిక దృక్పథాన్ని ఒక పీడ కల లాగా, ప్రక్కకి తోసి వేసిన వారే మహాత్ములు. భౌతిక శక్తి మాయ పట్టు వీడిపోయి, వారు ఇప్పుడిక దివ్య యోగమాయ శక్తి ఆశ్రయంలో ఉన్నట్టు అర్థం. ఇటువంటి జ్ఞానోదయమైన మహాత్ములు, భగవంతునితో తమకున్న నిత్య సంబంధము యొక్క ఆధ్యాత్మిక యదార్థాన్ని గుర్తించినవారు. ఎలాగైతే భగవంతునికి, నిరాకార తత్వము, మరియు సాకార రూపమనే రెండు రకాల అస్థిత్వమున్నదో, ఆయన యోగమాయ శక్తికి కూడా, రెండు అస్థిత్వములుంటాయి. అదొక నిరాకార శక్తి. కానీ, అది కూడా ఒక సాకార స్వరూపంలో, రాధా, సీతా, దుర్గా, లక్ష్మీ, కాళీ, పార్వతీ మొదలగు రూపాలలో వ్యక్తమవుతుంది. ఎలాగైతే కృష్ణుడూ, రాముడూ, శివుడూ, నారాయణుడూ మొదలైనవారంతా, ఒకే భగవంతునియొక్క అబేధ స్వరూపాలో, ఈ దివ్య శక్తి స్వరూపాలు కూడా, భగవంతుని దైవీ శక్తి యొక్క నిజరూపాలే. ఒకదాని నుండి ఒకటి, అబేధములే. మహాత్ములు భగవంతుని యొక్క దివ్య శక్తి యొక్క శరణు పొంది ఉంటారు. యోగమాయ కృపవలన, మనకు భగవంతుని యొక్క దివ్య ప్రేమా, జ్ఞానము, మరియు కృప లభిస్తుంది. భగవత్ కృప లభించిన మహాత్ములు, దివ్య ప్రేమ ప్రసాదించబడి ఉంటారు, మరియు అవిచ్ఛిన్నంగా, నిరంతరం భగవత్ భక్తిలోనే నిమగ్నమై ఉంటారు.

04:54 - సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః ।
నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే ।। 14 ।।

ఎల్లప్పుడూ నా దివ్య లీలలను గానం చేస్తూ, దృఢ సంకల్పముతో పరిశ్రమిస్తూ, వినయముతో నా ముందు ప్రణమిల్లుతూ, నిరంతరం వారు నన్ను ప్రేమ యుక్త భక్తితో ఆరాధిస్తుంటారు.

భక్తులు తమ భక్తి సాధన కోసం, దానిని పెంపొందించుకోవటం కోసం, కీర్తనల పట్ల ఎంతో ఆసక్తితో ఉంటారు. భగవంతుని కీర్తిని గానం చేయటమే కీర్తన. ఈ కీర్తన అనేది, భక్తిని సాధన చేయటానికి ఉన్న అత్యంత ప్రభావమైన పనిముట్టు. అది మూడు రకాల భక్తి విధానాలను కలిగి ఉంటుంది. శ్రవణం, కీర్తనం, మరియు స్మరణం. మన లక్ష్యం భగవంతునిపై మనస్సుని లగ్నం చేయటమే. అది కీర్తనం, మరియు శ్రవణంతో పాటుగా చేస్తే, ఇంకా సులువవుతుంది. మనస్సనేది, గాలి వలె చంచలమైనది, మరియు సహజంగానే ఒక ఆలోచన తరువాత, ఇంకో ఆలోచనకి తిరుగుతూనే ఉంటుంది. శ్రవణము, మరియు కీర్తనము, జ్ఞానేంద్రియాలను భగవత్ దృక్పథంలో నిమగ్నం చేస్తాయి. మనస్సును పదేపదే దాని తిరుగుడు నుండి వెనక్కు తీసుకురావటానికి, అవి సహాయం చేస్తాయి. కీర్తన ప్రక్రియ వలన, మరిన్ని ప్రయోజనాలున్నాయి. తరచుగా జనులు జపము, లేదా ధ్యానము ద్వారా, భక్తిని ఆచరిస్తుంటారు. కానీ, వారు జపములో నిమగ్నమయ్యే సదర్భంలో, నిద్రను ఆపుకోలేరు. అయినా, కీర్తన అనేది ఎంతో నిమగ్నమై చేసే పని కాబట్టి, అది సహజంగానే నిద్రను తరిమివేస్తుంది. అంతేకాక, కీర్తన అనేది ధ్యాసను మరల్చే అన్యమైన శబ్దాలను దరిచేరనివ్వదు. కీర్తన అనేది, భారతీయ యోగులలో అత్యంత ప్రజాదరణ పొందిన భక్తి మార్గము. సూరదాసూ, తులసీదాసూ, మీరాబాయి, గురు నానక్, కబీర్, తుకారం, ఏకనాథ్, నార్సి మెహతా, జయదేవుడూ, త్యాగరాజు మరియు ఇతరులవంటి ప్రఖ్యాతిగల భక్తి మహాత్ములందరూ గొప్ప కవులు. వారు ఎనెన్నో భక్తి గీతాలను రచించారు, మరియు వాటి ద్వారా, కీర్తనం, శ్రవణం మరియు స్మరణంలో నిమగ్నమైనారు. ఈ కలి యుగంలో, మోక్షానికి ఒక ఉపాయం ఉంది. భగవంతుని కీర్తిని గానం చేస్తూ, మనము భవ సాగరాన్ని దాటివేయవచ్చు.

07:23 - జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ।
ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతోముఖమ్ ।। 15 ।।

మరికొందరు, జ్ఞాన సముపార్జనా యజ్ఞములో నిమగ్నమై, నన్ను చాలా రకాలుగా ఆరాధిస్తారు. కొందరు నన్ను తమతో అబేధమైన ఏకత్వముగా చూస్తారు. మరికొందరు, నన్ను తమకంటే వేరుగా పరిగణిస్తారు. ఇంకా కొందరు, నా యొక్క విశ్వ రూపము యొక్క అనంతమైన ఆవిర్భావములలో ఆరాధిస్తారు.

సాధకులు, పరమ సత్యాన్ని చేరుకోవటానికి, భిన్నభిన్న పద్ధతులను అనుసరిస్తుంటారు. వారు ఆయన నిత్య అంశలుగా, సేవకులగా, భగవంతుని చరణారవిందముల వద్ద భక్తితో శరణాగతి చేస్తారు. జ్ఞాన యోగమును అనుసరించేవారు, తమను తాము బ్రహ్మమే అని పరిగణించుకుంటారు. వారు "సోహం (అది నేను), "శివోహం" (నేను శివుడను), మొదలైన సూత్రాలపై లోతుగా ధ్యానం చేస్తుంటారు. అద్వైత బ్రహ్మముగా, ఆ సర్వోత్కృష్ట అస్థిత్వము యొక్క ప్రాప్తి యే, వారి యొక్క నర్వోన్నత లక్ష్యం. దానికి శాశ్వతత్వమూ, జ్ఞానమూ మరియు ఆనందము వంటి గుణములున్నా, రూపములూ, గుణములూ, స్వభావములూ, మరియు లీలలూ ఉండవు. జ్ఞాన యోగులు కూడా, ఆయనను నిరాకార, సర్వవ్యాప్త తత్వంలో ఆరాధిస్తారు. వీరితో పాటుగా, పలు రకాల అష్టాంగ యోగులూ మొదలైనవారు ఉన్నారు. వారు తమను తాము భగవంతుని కంటే వేరుగా పరిగణించుకుంటారు. అదే ప్రకారంగా, ఆయనతో అనుసంధానం అవుతారు. ఇంకా కొందరు, ఈ కంటికి కన్పించే వ్యక్తమైన విశ్వాన్ని, భగవంతునిగా ఆరాధిస్తారు. వైదిక తత్వములో దీనిని, 'విశ్వ రూప ఉపాసన' అంటారు. ఈ జగత్తు భగవంతునిలో భాగమే కాబట్టి, దాని పట్ల దైవీ భావము తప్పేమీ కాదు. కానీ, అది అసంపూర్ణము. అటువంటి భక్తులకు, పరమేశ్వరుని యొక్క ఇతర విభూతుల పట్ల జ్ఞానం ఉండదు.

09:27 - అహం క్రతురహం యజ్ఞః స్వధాహమహమౌషధమ్ ।
మంత్రోఽహమహమేవాజ్యమ్ అహమగ్నిరహం హుతమ్ ।। 16 ।।

09:37 - పితాహమస్య జగతో మాతా ధాతా పితామహః ।
వేద్యం పవిత్రమోంకార ఋక్సామ యజురేవ చ ।। 17 ।।

నేనే వైదిక క్రతువునూ, నేనే యజ్ఞమునూ, మరియు పితృదేవతలకు సమర్పించే నైవేద్యమును. నేనే ఔషధము, నేనే వేద మంత్రమును, నేనే ఆజ్యము, నేనే అగ్నీ, నేనే సమర్పించే కార్యమును. ఈ జగత్తుకు నేనే తండ్రినీ, నేనే తల్లిని. సంరక్షకుడను నేనే; పితామహుడను నేనే; నేనే పవిత్రం చేసేవాడిని. జ్ఞానం యొక్క లక్ష్యమును నేనే, పవిత్ర శబ్దము ఓం కారమును నేనే, ఋగ్వేదమును, సామవేదమును మరియు యజుర్వేదమును నేనే.

ఈ శ్లోకాలలో, శ్రీ కృష్ణుడు తన యొక్క అనంతమైన వ్యక్తిత్వానికి గల వేరువేరు స్వరూపములను చెబుతున్నాడు. క్రతువు, యజ్ఞము, అంటే, వేదములలో చెప్పబడిన అగ్నిహోత్ర యజ్ఞము వంటివి. ఇది స్మృతులలో చెప్పబడిన ‘వైశ్వ’ దేవ యజ్ఞముల వంటివి. ఔషదము అంటే, వైద్య శాస్త్రంలో ఉపయోగించే మొక్కలలోని, వ్యాధిని నయం చేయగలిగే సామర్ధ్యము, అని అర్థం. సృష్టి అనేది భగవంతుని నుండి ఉద్భవిస్తుంది. అందుకే, ఆయన దాని తండ్రి. సృష్టికి ముందు ఆయన, అవ్యక్తమైన భౌతిక శక్తిని తన ఉదరము యందు ఉంచుకుంటాడు. కాబట్టి, ఆయన ఆ జగత్ సృష్టికి అమ్మ. ఆయనే ఈ విశ్వ సృష్టిని నిర్వహించేవాడూ, పోషించేవాడూ.. అందుకే ఆయన దాని సంరక్షకుడు. ఆయనే, సృష్టికర్త బ్రహ్మ దేవుని తండ్రి.. అందుకే ఆయన సమస్త విశ్వమునకూ పితామహుడు. వేదములు భగవంతుని నుండి ఉద్భవించాయి. రామాయణంలో ఒక శ్లోకం, దీనిని పునరుద్ఘటించింది. పరమాత్ముడే వేదం, వేదమే పరమాత్మ.

11:30 - ఇక మన తదుపరి వీడియోలో, భోగ వస్తు ప్రాప్తికై, వైదిక కర్మ కాండలను ఆచరించే వారిని గురించి తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

No comments: