దివ్య జ్ఞానం! ఆత్మ పూర్వ మరియు ప్రస్తుత కర్మబంధాల నుండి ఎప్పుడు విడుదల చేయబడుతుంది?
'భగవద్గీత' దశమోధ్యాయం - విభూతి యోగం (01 – 05 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 7 నుండి 12 వరకూ ఉన్న అధ్యాయాలను భక్తి షట్కము అంటారు. దీనిలో పదవ అధ్యాయం, విభూతి యోగము. ఈ రోజుటి మన వీడియోలో, విభూతి యోగములోని 01 నుండి 05 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..
[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/qIKOgBKXbEk ]
భగవంతుని యొక్క వైభవోపేతమైన, మరియు దేదీప్యమానమైన మహిమలను గుర్తుచేసుకుంటూ, ఆయనపై ధ్యానం చేయటానికి సహాయముగా, అర్జునుడికి ఈ అధ్యాయము, శ్రీ కృష్ణుడిచే చెప్పబడినది. అర్జునుడి భక్తిని మరింత ఇనుమడింపచేయాలని, తన అనంతమైన మహిమలను మరింత వివరిస్తున్నాడు, శ్రీ కృష్ణుడు. భగవంతుడి ఉపదేశం విన్న తరువాత అర్జునుడు, శ్రీ కృష్ణుని యొక్క సర్వోన్నత స్థాయిని గురించి, తాను సంపూర్ణముగా విశ్వసిస్తున్నానని ప్రకటిస్తున్నాడు, మరియు శ్రీ కృష్ణుడే సర్వోత్కృష్ట పరమేశ్వరుడని, చాటిచెబుతున్నాడు. వినటానికి అమృతములా ఉండే ఆయన యొక్క కీర్తి విశేషాలను మరింత చెప్పమని, భగవంతుడిని ప్రార్ధిస్తున్నాడు. సమస్త పదార్ధములకూ కృష్ణుడే ఆది, మధ్య, అంతమూ కావున, ఉన్నదంతా ఆయన యొక్క శక్తి స్వరూపమే అని, శ్రీ కృష్ణుడు తెలియచేస్తున్నాడు.
01:35 - శ్రీ భగవానువాచ ।
భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః ।
యత్తేఽహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా ।। 1 ।।
శ్రీ భగవానుడు ఇలా పలుకుతున్నాడు: ఓ గొప్ప బాహువులు కలవాడా, నా దివ్య ఉపదేశాన్ని మళ్లీ వినుము. నీవు నా ప్రియ సఖుడవు కావున, నీ హితము కోరి, నేను నీకు వాటిని తెలియపరుస్తాను.
తన మహిమలను వినటంలో అర్జునుడి గాఢమైన ఆసక్తిని చూసి, శ్రీ కృష్ణుడు సంతోషపడుతున్నాడు. ఇప్పుడతని ఆనందాన్ని మరింత పెంచటానికీ, మరియు ప్రేమయుక్త భక్తి పట్ల ఉత్సాహాన్ని ఇనుమడింపచేయటానికీ, తన యొక్క అధ్బుతమైన వైభవాలనూ, మరియు అనన్యమైన గుణములనూ ప్రకటిస్తానని, శ్రీ కృష్ణుడు చెబుతున్నాడు. ఇక్కడ ఆయన "ప్రీయమాణాయ" అన్న పదాలు వాడుతున్నాడు. కృష్ణుడు అర్జునుడిని ప్రియమైన సఖుడని పిలుస్తున్నాడు. అందుకే ఈ అత్యంత విశేషమైన జ్ఞానాన్ని, అర్జునుడికి తెలియపరుస్తున్నానని, చెబుతున్నాడు.
02:38 - న మే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః ।
అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః ।। 2 ।।
దేవతలకు గానీ, మహర్షులకు గానీ, నా మూల స్థానము తెలియదు. దేవతలకూ, మరియు మహర్షులకూ, మూల ఉత్పత్తి స్థానమును నేనే.
ఒక తండ్రికి తన కుమారుల పుట్టుక, మరియు జీవితం తెలుస్తుంది. ఎందుకంటే, ఆయన ప్రత్యక్షంగా దాన్ని చూస్తాడు. కానీ, తన తండ్రి యొక్క పుట్టుక, మరియు బాల్యము, ఆయన కొడుకులకు తెలియదు. ఎందుకంటే, అవి వారి పుట్టుక కంటే ముందే జరిగి పోయినవి. అదే విధంగా, దేవతలూ మరియు ఋషులూ, భగవంతుని మూల స్థానము యొక్క నిజ స్వరూపమును అర్థం చేసుకోలేరు. ఎందుకంటే, భగవంతుడు, వీరు జన్మించటం కంటే ముందునుండే ఉన్నాడు. “ఈ జగత్తులో ఎవరికి మాత్రం స్పష్టత ఉంది? ఎవరు చెప్పగలరు ఈ విశ్వం ఎక్కడ పుట్టిందో? ఎవరు చెప్పగలరు ఈ సృష్టి ఎక్కడి నుండి వచ్చిందో? దేవతలనేవారు, సృష్టి తరువాత వచ్చారు. కాబట్టి, ఈ విశ్వం ఎక్కడినుండి ఉద్భవించిందో ఎవరికి తెలుసు?” అని వేదములు తెలియజేస్తున్నాయి. “భగవంతుడు దేవతలకు అవగతం కాడు. ఎందుకంటే, ఆయన వారి కంటే ముందు నుండే ఉన్నాడు.” అని ఈశనోపనిషత్తు పేర్కొన్నది. అయినా, తన ప్రియమిత్రుని భక్తిని పెంపొందించటానికి, ఇటువంటి నిగూఢమైన జ్ఞానాన్ని, ఇప్పుడు శ్రీ కృష్ణుడు బోధిస్తున్నాడు.
04:10 - యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరమ్ ।
అసమ్మూఢః స మర్త్యేషు సర్వపాపైః ప్రముచ్యతే ।। 3 ।।
నేను జన్మరహితుడను, మరియు ఆది లేనివాడిననీ, మరియు సర్వ లోక మహేశ్వరుడననీ తెలుసుకున్న మనుష్యులు, మోహమునకు గురికారు. వారు సమస్త పాపముల నుండీ విముక్తి చేయబడతారు.
తనను ఎవ్వరూ తెలుసుకోలేరని చెప్పిన పిదప, ఇప్పుడు కొంతమందికి తాను తెలుసని అంటున్నాడు, శ్రీ కృష్ణుడు. ఎవరూ స్వంత ప్రయత్నం ద్వారా భగవంతుడిని తెలుసుకొనజాలరు. కానీ, భగవంతుడే ఎవరి మీదయినా కృప చేస్తే, ఆ అదృష్టవంతమైన జీవాత్మ, ఆయనను తెలుసుకోగలుగుతుంది. కాబట్టి, భగవంతుడిని తెలుసుకోగలిగిన వారంతా, ఆయన దివ్య కృప ద్వారానే దానిని సాధించగలిగారు. ఇంతకుముందు శ్రీ కృష్ణుడు, "నా యందే భక్తితో లగ్నమై ఉండే మనస్సుగలవారికి, నా దివ్య జ్ఞానాన్ని ప్రసాదిస్తాను; దానితో వారు సునాయాసముగా నన్ను పొందుతారు." అని వివరించాడు. ఆయనే సర్వోన్నత దేవాది దేవుడని తెలుసుకున్న వారు, ఇక భ్రమకు లోను కారు. ఇటువంటి భాగ్యశాలి అయిన జీవాత్మలు, తమ పూర్వ, మరియు ప్రస్తుత కర్మబంధాల నుండి విడుదల చేయబడతారు, మరియు ఆయన పట్ల ప్రేమ యుక్త భక్తిని పెంపొందించుకుంటారు. జీవాత్మలకూ, మరియు తనకూ ఉన్న భేదాన్ని చెప్పటం కోసం, శ్రీ కృష్ణుడు తానే సర్వ లోక మహేశ్వరుడనని ప్రకటిస్తున్నాడు. "భగవంతుడు సమస్త ఈశ్వరులకే ఈశ్వరుడు; ఆయనే సర్వ దేవతలకూ దేవుడు. అందరు ప్రియమైన వారికీ ప్రియమైనవాడు; ఆయనే ఈ జగత్తును ఏలేవాడు, మరియు భౌతిక ప్రకృతి శక్తికి అతీతమైనవాడని, శ్వేతాశ్వర ఉపనిషత్తు పేర్కొంటుంది.
06:01 - బుద్ధిః జ్ఞానమసమ్మోహః క్షమా సత్యం దమః శమః ।
సుఖం దుఃఖం భవోఽభావో భయం చాభయమేవ చ ।। 4 ।।
06:12 - అహింసా సమతా తుష్టిస్తపో దానం యశోఽయశః ।
భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః ।। 5 ।।
బుద్ధి కుశలతా, జ్ఞానమూ, ఆలోచనలో స్పష్టతా, దయా, నిజాయితీ, మనస్సు-ఇంద్రియ నిగ్రహణా, సుఖ-దుఃఖాలూ, జనన-మరణాలూ, భయము-ధైర్యమూ, అహింసా, సమత్వం, తృప్తీ, తపస్సూ, దానమూ, కీర్తి-అపకీర్తి మొదలగు, మనుష్యులలో ఉండే గుణములలోని వైవిధ్యములు వివిధములైనవి, నా నుండే జనించాయి.
మానవ జాతిలో ఉద్భవించే వివిధ భావాలూ, ఉద్వేగాలూ, చిత్తవృత్తులన్నీ తన నుండే వస్తాయని, భగవంతుడు ప్రకటిస్తున్నాడు.
బుద్ధి అంటే సరియైన దృక్పథంలో విషయ-వస్తువులను విశ్లేషించ గల సామర్ధ్యము.
జ్ఞానము అంటే ఏది ఆధ్యాత్మికము, ఏది భౌతిక ప్రాపంచికమో వేరు చేయగల సామర్ధ్యము.
అసమ్మోహము అంటే అయోమయము, భ్రమ లేకుండుట.
క్షమా అంటే మనకు హాని చేసిన వారిని క్షమించగలిగే సామర్ధ్యము.
సత్యము అంటే సకల జనుల సంక్షేమం కోసం, నిజాన్ని ధైర్యంగా ప్రకటించడం.
దమము అంటే ఇంద్రియములను వాటి వస్తువిషయముల నుండి నిగ్రహించడం.
శమము అంటే మనస్సును నియంత్రించి, నిగ్రహించడం.
సుఖము అంటే ఆనందము, ఉల్లాసముల యొక్క అనుభూతి.
దుఃఖము అంటే కష్టము మరియు వేదన యొక్క అనుభూతి.
భవః అంటే 'నేను ఉన్నాను' అనే భావము.
అభావః అంటే మరణము యొక్క అనుభవము.
భయ అంటే రాబోయే కష్టాల మీద భయము.
అభయ అంటే భయము నుండి విముక్తి.
అహింసా అంటే మనసా, వాచా, కర్మణా ఏ ప్రాణిని కూడా బాధ పెట్టక పోవటం.
సమతా అంటే అనుకూల లేదా ప్రతికూల పరిస్థితులలో కూడా ఒక్కలాగే ఉండటం.
తుష్టి అంటే కర్మ ఫలంగా ఏది లభించినా, దానితో తృప్తి చెందటం.
తప అంటే వేద విహితముగా, ఆధ్యాత్మిక ప్రయోజనం కోసం, స్వచ్ఛందంగా చేసే నిష్ఠలు.
దానము అంటే పాత్రత, లేక అర్హత కలిగిన వారికి ఇచ్చే దానము.
యశము అంటే, మంచి గుణముల చేత వచ్చే కీర్తి.
అయశము అంటే, చెడు గుణముల వలన వచ్చే అపకీర్తి.
వ్యక్తులలో ఈ గుణములు, తాను అనుమతించిన మేర వ్యక్తమవుతుంటాయని, శ్రీ కృష్ణుడు పేర్కొంటున్నాడు. కాబట్టి, ఆయనే సర్వ ప్రాణుల యొక్క మంచి, మరియు చెడు స్వభావముల మూలము. ఇది విద్యుత్కేంద్రము ద్వారా సరఫరా చేయబడిన విద్యుత్-శక్తి, వివిధ రకాల ఉపకరణాలచే ఉపయోగించబడటం వంటిది. ఒకే విద్యుత్ శక్తి, వేరు వేరు ఉపకరణాల ద్వారా ప్రసరించినప్పుడు, వేరువేరు ఫలితములను ఇస్తుంది. ఒక దానిలో శబ్దాన్నీ, మరొక దానిలో వెలుగునూ, వేరొక దానిలో వేడిమినీ పుట్టిస్తుంది. వేర్వేరు రకాలుగా వ్యక్తీకృతమయినా, వాటి మూలాధారము ఒక్కటే. అదే, విద్యుత్కేంద్రము నుండి ఇవ్వబడిన విద్యుత్ శక్తి. అదే విధంగా, మన పూర్వ, ప్రస్తుత జన్మల పురుషార్థాన్ని బట్టి, భగవంతునిచే ఇవ్వబడిన శక్తి, మనలో మంచిగానో, లేదా చెడుగానో వ్యక్తమవుతుంది.
09:33 - ఇక మన తదుపరి వీడియోలో, సమస్త జీవులూ ఏ విధంగా అవతరించాయో, శ్రీ కృష్ణుడి వివరణలో తెలుసుకుందాము..
కృష్ణం వందే జగద్గురుం!
No comments: