Thursday 13 January 2022

ముక్కోటి ఏకాదశి అంటే ఏమిటి? Mukkoti Ekadashi

 

ముక్కోటి ఏకాదశి అంటే ఏమిటి?

అగ్రణీ గ్రామణీ శ్రీమాన్ న్యాయో నేత సమీరణః |
సహస్రమూర్థా విశ్వాత్మ సహస్రాక్ష స్సహస్రపాత్ ||

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/Lcy2ZkxYfYY ]

భక్తులకు దారిచూపువాడూ, సకల భూతములకూ నాయకుడూ, ఉత్కృష్టమైన కాంతిగలవాడూ, సత్య జ్ఞానమును పొందుటకు అవసరమైన తర్కమూ, యుక్తీ తానే అయినవాడూ శ్రీ మహావిష్ణువుని, విష్ణు సహస్రనామ స్తోత్రాలలోని ఈ శ్లోకం అర్థం. ఈ సకల చరాచర సృష్టికి రక్షకుడిగా, సర్వకాలాలయందూ భక్తకోటిచే పూజలందుకుంటున్నవాడు, ఆ శ్రీమహావిష్ణువు. ఆ వేయి నామాల వాడి చరితం, మధురాతి మధురం. ఆయన నామ స్మరణతో, కోటి జన్మల పాపాలు దహించుకుపోతాయని, సకల భక్త జనం యొక్క విశ్వాసం. అటువంటి లక్ష్మీనాథుడికీ, వైకుంఠ ఏకాదశికీ ఉన్న సంబంధమేమిటి? ఆ రోజున ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేయాలి? ఈ వైకుంఠ ఏకాదశిని, తొలి ఏకాదశీ, ముక్కోటి ఏకాదశీ, పుత్రద ఏకాదశి, అనే నామాలతో ఎందుకు పిలుస్తారు? ఈ పుణ్యదినము వెనుక ఉన్న అసలు చరిత్ర ఏమిటి? అనే విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాం..

మన సనాతన ధర్మంలో సంవత్సర కాలాన్ని ఉత్తరాయణం, దక్షిణాయనం, అని రెండు భాగాలుగా విభజించడం జరిగింది. ఆ రెండు కాలాలూ, దేవతలకు ఒక రోజుతో సమానమనీ, దక్షిణాయన కాలంలో సకల దేవతలకూ రాత్రి అవడం చేత, ఆ శ్రీ మహా విష్ణువు యోగ నిద్రలోకి వెళతారనీ, ఉత్తరాయణ కాలం ఆసన్నమవగానే, యోగ నిద్ర లోంచి లేచి, సకల దేవతలతో పాటు, భక్త కోటిని నారయణుడు స్వయంగా అనుగ్రహిస్తాడనీ, విష్ణు పురాణం చెబుతోంది. అందుకే, ఈ ఉత్తరాయణ కాలాన్ని పుణ్యకాలంగా, ఈ కాలంలో చేసే ఆరాధనలకూ, పూజాది కార్యక్రమాలకూ, చాలా విశిష్ఠత చేకూరుతుందని, భక్తుల ప్రగాఢ విశ్వాసం. అటువంటి ఉత్తరాయణంలో వచ్చే మొదటిరోజే, తొలి ఏకాదశిగా పేరు పొందింది. ఆరోజునే, ఆ బ్రహ్మండ నాయకుడు, యోగ నిద్రలోంచి లేచి, సకల లోకాలనూ స్వయంగా పరిశీలిస్తాడు. అయితే, తొలి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలి? ఆ రోజున చేసే వ్రతాలకూ, పూజలకూ, ఎందుకంత విశిష్ఠత చేకూరింది? ఈ తొలి ఏకాదశికి ఎందుకు వివిధ పేర్లు వచ్చాయి? అనే ప్రశ్నలకు, వివిధ గాధలు ప్రాచుర్యంలో ఉన్నాయి.

పూర్వం దక్షిణాయన కాలంలో, అసుర శక్తి బలపడి, ముల్లోకములందలి సకల దేవతలనూ, రుషులనూ, మానవులనూ, పీడించసాగింది. ఈ అసుర శక్తికి రాజుగా, మురుడనే అసురుడుండేవాడు. అతను పెట్టే బాధలు తట్టుకోలేక, సకల దేవతలూ, రుషులూ, మహర్షులూ వైకుంఠం చేరుకుని, ఉత్తర ద్వారం గుండా వెళ్ళి, శ్రీ మహా విష్ణువుని దర్శించుకుని, తమ బాధలను మొరపెట్టుకున్నారు. దాంతో ఆ నారాయణుడు, భూలోకం చేరి, మురుడితో చాలా కాలం ఘోర యుద్ధం చేశాడు. కొంతకాలానికి స్వామికి బడలిక వచ్చి, విశ్రాంతికై, బదరికాశ్రమంలో హైమావతి అనే గుహలోకి వెళ్ళి, కొంతసేపు నిద్రించాడు. ఆయన్ని నిద్రలో ఉన్నప్పుడే చంపాలనే తలంపుతో, మురుడు స్వామి వద్దకు చేరుకోగా, ఆ శ్రీహరి శరీరం నుండి దివ్య తేజస్సుతో, ఒక కన్య ఉద్భవించి, దివ్యాస్త్రములు చేతబూని, మురుణ్ణి సంహరించింది. కొంత సమయానికి నారాయణుడు నిద్ర నుండి మేల్కొని, జరిగిన వృత్తాంతాన్ని గ్రహించి, ఆ కన్యకు ఏకాదశి, అని పేరుపెట్టి, ఏం వరం కావాలో కోరుకొమన్నాడు. ఆమె సంతోషంతో, ''దేవా, మీ దేహం నుండి ఉద్భవించిన నాకు, ఏకాదశి అని పేరు పెట్టి, నన్ను ధన్యురాలిని చేశారు. నేను పుట్టిన ఈ రోజు, నా నామంతో పిలువబడి, ఈ రోజు నా వ్రతం చేసుకుని, ఉపవాసం, జాగారం చేసిన వారికి, సకల పాపాలూ తొలగి, వైకుంఠ ప్రాప్తి కలిగేలా, ఆశీర్వదించండి.'' అని అడిగింది. ఆమె కోరికను మన్నించిన శ్రీహరి, ‘తథాస్తు’ అని పలికి అదృశ్యమయ్యాడని, ఒక గాధ ప్రముఖంగా ప్రచారంలో ఉంది.

మరొక గాధ ప్రకారం, పూర్వం మధుకైటభులనే రాక్షసులను, ఆ స్వామి ఈ తొలి ఏకాదశి రోజునే సంహరించాడు. ఆ అసురులు మరణిస్తున్న సమయంలో, దివ్య జ్ఞానాన్ని పొంది, ఒక వరం అడిగారు. అదేమిటంటే, తాము సంహరించబడిన ఆ రోజు, నీ ఆలయానికి వచ్చి, ఉత్తర ద్వారం గుండా నిన్ను దర్శించుకుని, ఏకాదశీ వ్రతం చేసుకున్నవారికి, వైకుంఠప్రాప్తి కలిగేలా ఆశీర్వదించమని అడిగారు. దానికి ఆ స్వామి అలాగేనని వరమొసగి, వైకుంఠానికి చేరుకున్నాడు. అందుకే, ఆ రోజున మోక్షోత్సవ దినంగా కూడా పేర్కొంటున్నారు. మరో గాధ ప్రకారం, విష్ణు మూర్తి బొడ్డులోంచి ఒక తామర పువ్వు ఉద్భవించగా, అందులో సృష్టి కర్త బ్రహ్మ జన్మించాడు. ఆయన అలా జన్మించిన మరుక్షణం నుంచి, సకల శాస్త్రాలనూ అవపోసన పట్టడం మొదలుపెట్టాడు. అలా కొంతకాలానికి, ఆయనకు కొన్ని సందేహాలు కలగడంతో, వాటిని నివృత్తి చేయమని శ్రీమహా విష్ణువుని కోరాడు. అప్పుడు స్వామి శ్రీ రంగనాథుని రూపంలో, తన దేవేరులతో, గరుడ వాహనంపై వచ్చి, బ్రహ్మకు కలిగిన సకల సందేహాలనూ నివృత్తి చేసి, తిరిగి వైకుంఠానికి వెళ్ళేందుకు నిర్ణయించుకున్న సమయంలో, బ్రహ్మ దేవుడు, సకల దేవ, దానవ, మహర్షులతో పాటు, మానవులు కూడా నిన్ను కొలుచుకునేలా, భూలోకంలో కొలువుదీరమని కోరాడు. దాంతో, స్వామి విగ్రహరూపం దాల్చి, అక్కడే కొలువైనాడు. కొంతకాలం తరువాత, ఆ విగ్రహాలను బ్రహ్మ, సూర్య వంశపు రాజైన ఇక్ష్వాకునికి బహుమతిగా ఇచ్చాడు. ఆ తరువాత కాల క్రమంలో, ఆ విగ్రహాలు శ్రీరామచంద్రునిచే పూజలందుకున్నాయి. ఆయన తన అవతారాన్ని చాలించే ముందు, ఆ విగ్రహాలను తన భక్తులలో ఒకరైన విభీషణుడికి బహుమానంగా ఇచ్చాడు.

విగ్రహాలను లంకలో ప్రతిష్ఠించుకుని, తన రాజ్యాన్ని పుణ్యభూమిగా తీర్చిదిద్దుకొమ్మని పలికాడు. అయితే, లంక చేరేంత వరకూ, వీటిని భూమిపై పెట్టరాదని షరతు విధించాడు. చెప్పలేనంత ఆనందంతో విభీషణుడు లంకానగరానికి పయనమైన కొంత సమయానికి, కావేరీ నదీతీరాన్ని సమీపించాడు. అప్పుడు సంధ్యా వందనం చేయాల్సిన సమయం కావడంతో, ఆ విగ్రహాలను నేలపై పెట్టకూడదు గనుక, వాటిని పట్టుకుని ఉండేవారికోసం చూస్తున్నప్పుడు, ఒక బాలుడు కనిపించాడు. అప్పుడు విభీషణుడు ఆ బాలుణ్ణి పిలిచి, తాను సంధ్యావందనం చేసుకుని వచ్చేంత వరకూ, ఆ విగ్రహాలను పట్టుకుని ఉండమని కోరగా, దానికా బాలుడు, కొన్ని ఘడియలు మాత్రమే తాను ఆ విగ్రహాలను మోయగలననీ, సమయం మించితే, వాటిని క్రింద పెట్టేస్తాననీ చెప్పాడు. అతని షరతుకు ఒప్పుకుని విభీషణుడు, సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్ళాడు. అయితే, సమయం మించిపోవడంతో, ఆ బాలుడు వాటిని భూమిపై పెట్టేశాడు. అది చూసిన విభీషణుడు, ఆ బాలుని వైపుకి పరిగెత్తుకుని రావడంతో, ఆ పిల్లవాడు భయంతో, ఆ ప్రక్కనే ఉన్న కొండపై గల వినాయకుడి గుడిలోకి వెళ్ళి దాక్కొనగా, విభీషణుడు ఆ ఆలయం లోకి వెళ్ళి, బాలుని తలపై ఒక మొట్టికాయ వేశాడు. దాంతో, అతడి తలపై సొట్టపడింది. ఆ వెంటనే పిల్లవాడు, అక్కడి వినాయక విగ్రహంలో ఐక్యమై పోయాడు. వచ్చింది సాక్ష్యాత్తూ, ఆ గణనాథుడే అని గ్రహించిన విభీషణుడు, తాను చేసిన తప్పును మన్నించమని వేడుకుని, రంగనాథ దేవేరుల విగ్రహాలను కదల్చడానికి ప్రయత్నించి, విఫలమయ్యాడు. దాంతో విభీషణుడు, ఆ రంగనాథుని లంకకు రమ్మని వేడుకోగా, దానికి స్వామి, తాను ఇక అక్కడే కొలువై ఉంటాననీ, ప్రతి సంవత్సరం వచ్చే తొలి ఏకాదశి రోజున, ఉత్తర ద్వారం గుండా, తనని దర్శించుకొమనీ సెలవిచ్చాడు.

ఆ క్షేత్రమే, తమిళనాట శ్రీరంగంగా ప్రసిద్ధి చెందింది. ఆ తంతుకు కారణమైన బాలుడు దాక్కున్న గుడి, తిరుచ్చిలోని ఉచ్చిపిళ్ళయార్ ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఇప్పటకీ, ఆ ఆలయంలోని వినాయకుడి విగ్రహం తలపై సొట్టని గమనించవచ్చు. అంతేకాదు, దేవ దానవులు చేసిన క్షీరసాగరమథనంలో, లక్ష్మీదేవి పాల సముద్రం నుండి ఉద్భవించింది కూడా, ఈ ఏకాదశి రోజునే అని, విష్ణు పురాణం, శివపురాణం తెలియపరుస్తున్నాయి. తొలి ఏకాదశికి అంతటి ప్రాశస్త్యం ఉండడం, శ్రీ మహా విష్ణువు, ఆరోజే యోగ నిద్రలోంచి లేచి, కళ్ళు తెరచి, ఉత్తర ద్వారం వైపుగా చూస్తాడని, మన పురాణ గాథలు చెప్పడంతో, సకల జనులతో పాటు, ముక్కొటి దేవతలూ, స్వామి దర్శనార్థం, భూలోకంలోని వైష్ణవాలయాలకు వస్తారుగనుకనే, ఆ రోజుకి ముక్కోటి ఏకాదశి, అనే పేరు కూడా వచ్చిందంటారు. మహత్తర పుణ్యఫలాన్నిచ్చే ముక్కోటి ఏకాదశి నాడు, అందరూ భక్తి శ్రద్ధలతో, ఏకాదశీ వ్రతం చేసుకుని, ఆ నారాయణుడిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుని, చరితార్థులు కావాలని ఆశిస్తున్నాను.

No comments: