Wednesday, 2 February 2022

ఏది అగ్ర కులం?! బ్రాహ్మణులు ఉన్నత జాతి వారు, శూద్రులు నిమ్న శ్రేణి వారా? Bhagavad Geetha

Written by

  

ఏది అగ్ర కులం?! బ్రాహ్మణులు ఉన్నత జాతి వారు, శూద్రులు నిమ్న శ్రేణి వారా?

'భగవద్గీత' పంచమోధ్యాయం - కర్మ సన్న్యాస యోగం (13 – 18 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను, కర్మషట్కము అంటారు. దీనిలో ఐదవ అధ్యాయం, కర్మ సన్న్యాస యోగం. ఈ రోజుటి మన వీడియోలో, కర్మ సన్న్యాస యోగంలోని 13 నుండి 18 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/kC8wy0dBDsY ]

నిజమైన సంతోషాలు పొందాలంటే ఏంచేయాలో శ్రీ కృష్ణుడు చెప్పబోతున్నాడు..

సర్వకర్మాణి మనసా సన్న్యస్యాస్తే సుఖం వశీ ।
నవద్వారే పురే దేహీ నైవ కుర్వన్న కారయన్ ।। 13 ।।

ఆత్మ నిగ్రహమూ, వైరాగ్యమూ ఉన్న జీవాత్మలు, తాము దేనికీ కర్త కాదనీ, దేనికీ కారణమూ కాదని తెలుసుకుని, ఈ యొక్క తొమ్మిది ద్వారములుగల నగరములో, సంతోషంగా ఉంటారు.

ఈ శ్లోకంలో, నవ రంధ్రాలు గల శరీరమును, తొమ్మిది ద్వారాలు గల పట్టణంతో పోల్చుతున్నాడు శ్రీ కృష్ణుడు. శరీరము తొమ్మిది ద్వారాలను కలిగి ఉంటుంది. రెండు చెవులూ, ఒక నోరూ, రెండు నాసికారంధ్రాలూ, రెండు కళ్ళూ, అపానమూ, జననేంద్రియము.. భౌతిక దృక్పథంలో, ఈ దేహంలో ఉండే జీవాత్మ తనను తాను, ఈ నవ ద్వార పట్టణంతో అనుసంధానం చేసుకుంటుంది. జీవాత్మ ఆ పట్టణానికి రాజు. దాని పరిపాలనంతా, అహంకారమూ, బుద్ధీ, మనస్సూ, ఇంద్రియములూ, జీవ-శక్తీ అనే మంత్రిత్వ శాఖల ద్వారా, నడిపించబడతాయి. కాలము, మృత్యు రూపంలో శరీరాన్ని తీసివేసే వరకే, ఈ శరీరంపై రాజ్యపాలన కొనసాగుతుంది. కానీ, పాలన కొనసాగుతున్నప్పుడు కూడా, జ్ఞానోదయమైన యోగులు, తమను తాము శరీరంగా భావించరు. అంతేకాక, తమను తాము ఈ శరీరానికి అధిపతులం అనుకోరు సరికదా, శరీరమునూ, దానిచే చేయబడిన అన్ని క్రియలనూ, భగవంతునికి చెందినవేనని భావిస్తారు. అన్ని కర్మలనూ మానసికంగా త్యజించి, ఇటువంటి జ్ఞానోదయమైన యోగులు, సంతోషంగా ఈ శరీరంలో స్థితులై ఉంటారు. దీనినే, 'సాక్షీ భావము' అంటారు. అంటే, తన చుట్టూ జరిగే అన్ని విషయములకూ, ఆసక్తిరహిత సాక్షిగా నిలిచిపోవటం. లోకంలోని సమస్త భూతములనూ నియంత్రించే పరమేశ్వరుడు కూడా, ఈ దేహములో స్థితమై ఉంటాడు. ఎప్పుడైతే జీవాత్మ భగవంతునితో అనుసంధానమవుతుందో, ఈ శరీరంలో వసిస్తున్నా, అది ఆయన లాగే, స్వేచ్ఛను పొందుతుంది.

న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః ।
న కర్మఫలసంయోగం స్వభావస్తు ప్రవర్తతే ।। 14 ।।

కర్తృత్వ భావన కానీ, కర్మల స్వభావం కానీ, భగవంతునిచే సృష్టించబడవు. కర్మ ఫలములను సృష్టించేది కూడా, ఆయన కాదు. భౌతిక ప్రకృతి గుణములే, వీటన్నింటినీ ప్రవర్తిల్లచేయును.

భగవంతుడు సర్వశక్తిమంతుడూ, సమస్త విశ్వమునూ నియంత్రణ చేసేవాడు. ఈ విశ్వం యొక్క కార్యకలాపాలు ఆయనే నిర్వహించినా, ఆయన అకర్తగా ఉంటాడు. మన క్రియలను నిర్దేశించడు, మనలను శాసించడు. మనం కర్తృత్వ భావనలో ఇరుక్కుపోవటానికి, భగవంతుడు కారణం కాదు. ఆయనే, కావాలని మనలో గర్వాన్ని కలుగ చేసి ఉంటే, మన తప్పుడు చేష్టలకు ఆయనే దోషిగా నిలబడతాడు. నిజానికి, జీవాత్మే తన అజ్ఞానంచే, ఆ కర్తృత్వ భావనని తనకు కలుగచేసుకుంటుంది. ఒకవేళ జీవాత్మ ఆ అజ్ఞానాన్ని వదిలించుకోవాలని చూస్తే, అప్పుడు భగవంతుడు, తన కృపతో దానిని నిర్మూలించటానికి సహాయపడతాడు. ఈ విధంగా, కర్తృత్వ భావనను త్యజించటం అనేది, జీవాత్మ యొక్క బాధ్యత. ఈ శరీరము, ప్రకృతి యొక్క త్రిగుణములచే కూడుకున్నది. అన్ని కర్మలు కూడా, ఆ త్రిగుణములచే చేయబడతాయి. కానీ, అజ్ఞానంలో ఉన్న జీవాత్మ, తాను ఈ శరీరమే అనుకుని, కర్మల యొక్క కర్తగా ఇరుక్కుపోతుంది. నిజానికి అవి ప్రకృతి గుణములచే చేయబడతాయి.

నాదత్తే కస్యచిత్పాపం న చైవ సుకృతం విభుః ।
అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః ।। 15 ।।

సర్వాంతర్యామి అయిన భగవంతుడు, ఏ ఒక్కరి పుణ్య, పాపపు కర్మల యందు కూడా పాలు పంచుకోడు. జీవుల వివేకము, అజ్ఞానముచే కప్పబడిపోవటం వలన, వారు భ్రమకు లోనవుతున్నారు.

భగవంతుడు, ఏ ఒక్కరి పుణ్య, పాప పనులకూ, బాధ్యుడు కాడు. ఈ విషయంలో భగవానుని యొక్క పని, మూడు అంచెలుగా ఉంటుంది. 
1) ఆయన జీవాత్మకు కర్మలు చేసే శక్తినిస్తాడు.. 
2) మనకు ఇవ్వబడిన శక్తితో మనం పనులు చేయగానే, మనం చేసినదానిని గుర్తిస్తాడు..
3) మన కర్మ ఫలితములను అందజేస్తాడు..

ప్రతి జీవాత్మకూ, తన స్వంత నిర్ణయం ద్వారా, మంచి లేదా చెడు పనులు చేయటానికి, పూర్తి స్వేచ్ఛ ఉంది. ఆ స్వతంత్ర చిత్తమే, సృష్టికి మూలాధారము, ఎన్నో జీవాత్మల మధ్య ఉన్న వైవిధ్యానికి, మూల కారణము. జీవాత్మ తన ఇంద్రియమనోబుద్ధులను, తన ఇష్టానుకూలంగా ఉపయోగించుకోవటంలో, అణుమాత్ర స్వతంత్రత కలిగి ఉంటుంది. అంతేకాక, స్వతంత్ర చిత్తము లేకుండా, ప్రేమ ఉండదు. ఒక యంత్రము ప్రేమించలేదు. ఎందుకంటే, దానికి నిర్ణయించుకునే స్వతంత్రత ఉండదు. స్వతంత్రంగా నిర్ణయించుకునే వ్యక్తిత్వానికే, ప్రేమించగలిగే అవకాశం ఉంటుంది. ఆయనను మనం ప్రేమించాలనే ఉద్దేశంతోనే, మనలను ఆ భగవంతుడు సృష్టించాడు కాబట్టి, మనకు స్వతంత్ర చిత్తమును ప్రసాదించాడు. అజ్ఞానంతో కొందరు జీవులు, వారికి తమ కార్యకలాపములు చేసుకునే స్వేచ్ఛ ఉందని తెలుసుకోక, తమ తప్పులకు భగవంతుడిని బాధ్యుడిని చేస్తారు. మరికొందరు, స్వేచ్ఛా చిత్తము ఉందని తెలుసుకుంటారు. కానీ, శారీరిక అహంకారంలో, కర్తృత్వ భావన కలిగి ఉంటారు. ఇది కూడా అజ్ఞానానికి చిహ్నమే.

జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః ।
తేషామాదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరమ్ ।। 16 ।।

కానీ, ఎవరికైతే దివ్య ఆధ్యాత్మిక జ్ఞానముచే, ఆత్మ పట్ల అజ్ఞానం నాశనం చేయబడునో, సూర్యుడు పగటి పూట అన్నింటినీ ప్రకాశింపచేసినట్లు, ఆ జ్ఞానము, వారికి పరమాత్మను ప్రకాశింపచేయును.

రాత్రి యొక్క చీకటిని తొలగించటంలో సూర్యునికి ఉన్న శక్తి, సాటిలేనిది. సూర్యుని వెలుగు ఎంత మహోన్నతమైనదంటే, చీకటి దాని ముందు నిలబడలేదు. భగవంతుని జ్ఞానం యొక్క వెలుగు కూడా, అజ్ఞానపు చీకటిని తొలగించటానికి, అదే మాదిరి ప్రభావం కలిగి ఉంటుంది. చీకటి అనేది, భ్రమలను కలుగచేస్తుంది. అజ్ఞానమనే చీకటిలో, మనం ఈ శరీరమే అని భావించి, మనమే కర్తలమనీ, మనమే మన కర్మ ఫలముల భోక్తలమనీ, అనుకుంటాం. భగవంతుని దివ్య ఆధ్యాత్మిక జ్ఞాన వెలుగు, ఎప్పుడైతే ప్రకాశించటం ప్రారంభమవుతుందో, మన భ్రమ, త్వరితగతిన పారిపోతుంది. భగవంతుని భౌతిక శక్తి, జీవాత్మను చీకటితో ఆవరించడం చేత, అది మాయలో పడిపోతుంది. భగవంతుని దివ్య ఆధ్యాత్మిక శక్తి, జ్ఞాన వెలుగును ప్రసరించినప్పుడు, ఈ మాయ నిర్మూలించ బడుతుంది.

తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్ఠాస్తత్పరాయణాః ।
గచ్ఛంత్యపునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః ।। 17 ।।

తమ బుద్ధి భగవంతుని యందే స్థితులైనవారూ, సంపూర్ణముగా భగవంతుని యందే నిమగ్నమైన వారూ, ఆయనే పరమ లక్ష్యమనే ధృఢ విశ్వాసం కలవా రూ, వారి పాపములు, జ్ఞాన కిరణములచే నిర్మూలింపబడి, త్వరితగతిన, మరలా తిరిగిరాని స్థితిని పొందుతారు.

ఎలాగైతే అజ్ఞానము, వ్యక్తిని నిరంతర జనన-మరణ చక్రంలో బాధకు గురిచేయునో, అలాగే జ్ఞానమునకు, వ్యక్తిని భౌతిక బంధము నుండి విడిపించే శక్తి ఉంది. ఇటువంటి జ్ఞానము ఎప్పుడూ కూడా, భగవంతునిపై భక్తితో కూడి ఉంటుంది.

ఈ శ్లోకంలో చెప్పబడినట్లు, తత్-బుద్ధయః అంటే, బుద్ధి భగవంతుని దిశగా నిర్దేశించబడి, తదాత్మనః అంటే, మనస్సూ, బుద్ధీ, కేవలం భగవంతుని యందే నిమగ్నమై, తన్నిష్ఠా అంటే, భగవంతుని యందు సంపూర్ణ విశ్వాసముంచి, తత్పరాయణాః అంటే, భగవంతుడే పరమ లక్ష్యమూ, ఆశ్రయమూ అని శ్రమిస్తూ ఉంటే, అది భగవంతునిపై ప్రేమకు దారి తీస్తుంది. ఈ విధమైన ప్రేమచే, భక్తులు సర్వత్రా ఆయననే దర్శిస్తారు.

విద్యావినయసంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని ।
శుని చైవ శ్వపాకే చ పండితాః సమదర్శినః ।। 18 ।।

నిజమైన పండితులు దివ్య జ్ఞాన చక్షువులతో, ఓ బ్రాహ్మణుడినీ, ఓ ఆవునీ, ఓ ఏనుగునీ, ఓ కుక్కనీ, ఓ ఛండాలుడినీ, సమ దృష్టితో చూస్తారు.

మనం జ్ఞాన దృక్పథంతో చూసినప్పుడు, దానిని 'ప్రజ్ఞా చక్షు' అంటారు. అంటే, 'జ్ఞానమనే కళ్ళతో చూడటం'. దివ్య ఆధ్యాత్మిక జ్ఞానము యొక్క సంకేతం ఏమిటంటే, అది వినయ విధేయతలతో కూడి ఉంటుంది. పుస్తక జ్ఞానం అనేది, చదువుకున్నామనే గర్వంతో కూడి ఉంటుంది. భౌతిక దృష్టి కన్నా, దివ్య ఆధ్యాత్మిక జ్ఞానం ప్రసాదించే దృష్టి, విభిన్నమైనది. జ్ఞాన సంపన్నులైన భక్తులు, అన్ని ప్రాణులనూ భగవదంశ అయిన ఆత్మలుగా, దివ్యమైనవిగా చూస్తారు. బ్రాహ్మణుడూ-ఛండాలుడూ, ఆవు-కుక్క ఈ జీవ జాతులన్నీ, వారికి సమానమే. నిజమైన జ్ఞానం కలిగి, ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నుడైనవాడు, వీటన్నింటినీ నిత్యమైన ఆత్మలుగా దర్శిస్తాడు కాబట్టి, సమ దృష్టితో చూస్తాడు. బ్రాహ్మణులు ఉన్నత జాతి వారు, శూద్రులు నిమ్న శ్రేణి వారు అన్న దృక్పథాన్ని, వేదములు అంగీకరించవు. జ్ఞాన దృక్పథం ఏమిటంటే, బ్రాహ్మణులు పూజలు చేసినా, క్షత్రియులు పరిపాలన చేసినా, శూద్రులు శ్రమ చేసినా, వీరంతా, భగవంతుని అణు అంశలైన నిత్య జీవాత్మలే.. అందుకే, అందరూ సమానమే.

ఇక మన తదుపరి వీడియోలో, ఆత్మ యందు అంతులేని ఆనందాన్ని అనుభవించాలంటే, శ్రీ కృష్ణుడు ఏం చెప్పాడో తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

No comments: