Wednesday, 9 February 2022

ఆంతర వెలుగు! Bhagavad Geetha

Written by

  

ఆంతర వెలుగు!

'భగవద్గీత' పంచమోధ్యాయం - కర్మ సన్న్యాస యోగం (19 – 24 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను, కర్మషట్కము అంటారు. దీనిలో ఐదవ అధ్యాయం, కర్మ సన్న్యాస యోగం. ఈ రోజుటి మన వీడియోలో, కర్మ సన్న్యాస యోగంలోని 19 నుండి 24 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/t5lg4WDoupw ]

ఆత్మ యందు అంతులేని ఆనందాన్ని అనుభవించాలంటే ఏం చేయాలో శ్రీ కృష్ణుడిలా చెబుతున్నాడు..

00:47 - ఇహైవ తైర్జితః సర్గో యేషాం సామ్యే స్థితం మనః ।
నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్ బ్రహ్మణి తే స్థితాః ।। 19 ।।

సమదృష్టి యందు సంపూర్ణ మనస్సుతో స్థితులైనవారు, ఈ జన్మ లోనే, జనన మరణ చక్రమును జయిస్తారు. వారు భగవంతుని యొక్క దోషరహిత గుణములను కలిగి ఉంటారు కాబట్టి, పరమ సత్యము నందే స్థితులై ఉంటారు.

ఇష్టాయిష్టాలకూ, సుఖ-దుఃఖాలకూ, సంతోషము-బాధలకూ అతీతంగా ఉండగలిగిన వారు, నిరంతర జన్మ మరణ సంసారాన్ని దాటేస్తారు. మనల్ని మనం ఈ శరీరమే అనుకున్నంతవరకూ, ఈ సమత్వ దృష్టి అనేదాన్ని పొందలేము. ఎందుకంటే, శారీరక ఆహ్లాదమూ, కష్టముల పరంగా, కోరికలూ, ద్వేషాలూ అనుభవంలోనికి వస్తూనే ఉంటాయి. యోగులు శారీరక దృక్పథానికి అతీతంగా ఎదిగి, ప్రాపంచిక బంధాలని త్యజించి, మనస్సుని భగవంతుని యందే లగ్నం చేస్తారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి యొక్క మనస్సు, ఈ ఆధ్యాత్మిక దృక్పథంలో స్థితమై ఉంటుందో, శారీరక సుఖ-దుఃఖాలపై మమకారాసక్తులకు అతీతుడై, సమత్వ బుద్ధి స్థితిని చేరుకుంటాడు. స్వార్ధ పూరిత శారీరక కోరికలని త్యజించటం ద్వారా వచ్చే ఈ నిశ్చల తత్త్వం, వ్యక్తిని ప్రవర్తనలో భగవంతునిలా చేస్తుంది.

02:06 - న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియమ్ ।
స్థిరబుద్ధిరసమ్మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః ।। 20 ।।

భగవంతుని యందే స్థితులై, దివ్య ఆధ్యాత్మిక జ్ఞానము నందు దృఢమైన అవగాహన కలిగి ఉండి, భ్రమకు లోనుకాకుండా ఉన్నవారు, ప్రియమైనవి లభిస్తే పొంగిపోరు, ఏదైనా అప్రియమైనవి జరిగితే, క్రుంగిపోరు.

భక్తిలో, మన చిత్తమును శరణాగతిగా భగవదర్పితము చేసినప్పుడు, సుఖాలకు పొంగిపోకుండా, దు:ఖాలకు క్రుంగిపోకుండా ఉండే స్థితిని, చేరుకుంటాము. మన చిత్తమును భగవంతుని చిత్తముతో ఐక్యం చేసినప్పుడు, సంతోషాన్నీ, బాధనీ, భగవంతుని అనుగ్రహంగా స్వీకరిస్తాము. ఆధ్యాత్మిక జ్ఞానం కలిగించే అవగాహన ఎమిటంటే, భగవంతునికి ప్రీతి కలిగించటంలోనే, మన స్వీయ-ప్రయోజనం ఉందనే సత్యాన్ని, తెలియజేస్తుంది. ఇది ఈశ్వర శరణాగతి దిశగా తీసుకెళ్తుంది. ఎప్పుడైతే మన స్వీయ-చిత్తం, భగవంతుని చిత్తములో ఏకమైపోతుందో, అప్పుడు సంతోషాలనీ, దుఃఖాలనీ, ఈశ్వరానుగ్రహంలా, ప్రశాంతంగా స్వీకరించే సమత్వ బుద్ధి పెంపొందుతుంది. ఇదే సర్వోత్కృష్ట స్థితిలో ఉన్నవాని లక్షణం.

03:21 - బాహ్యస్పర్శేష్వసక్తాత్మా విందత్యాత్మని యత్సుఖమ్ ।
స బ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే ।। 21 ।।

బాహ్యమైన ఇంద్రియ సుఖాలపై మమకారాసక్తులు లేనివాడు, ఆత్మ యందే దివ్యానందాన్ని అనుభవిస్తాడు. యోగం ద్వారా భగవంతునితో ఐక్యమై, అంతులేని ఆనందాన్ని అనుభవిస్తాడు.

వైదిక శాస్త్రాలు అనేక పర్యాయములు, భగవంతుడిని అనంతమైన దివ్య ఆనంద సాగరంగా, అభివర్ణించాయి.

భగవంతుని స్వరూపము, స్వచ్ఛమైన ఆనందముచే తయారుచేయబడినదని భారతంలో, భగవంతుడు సంతోషానందముల మహాసాగరమని రామాయణంలో, దేవుని చేతులూ, పాదములూ, ముఖమూ, ఉదరమూ మొదలగునవన్నీ, ఆనందముచే తయారు చేయబడినవని  పద్మ పురాణంలో, వివరించబడ్డాయి. ఈ శాస్త్రాల్లో ఉన్న శ్లోకములన్నీ, దివ్య ఆనందమే భగవంతుని వ్యక్తిత్వ స్వభావమని, వక్కాణిస్తున్నాయి. తన ఇంద్రియములూ, మనస్సూ, మరియూ బుద్ధిని, భగవంతుని యందే నిమగ్నం చేసినవారు, తమలోనే ఉన్న భగవంతుని యొక్క దివ్య ఆనందాన్ని అనుభవించటం, ప్రారంభిస్తారు.

04:30 - యే హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవ తే ।
ఆద్యంతవంతః కౌంతేయ న తేషు రమతే బుధః ।। 22 ।।

ఇంద్రియ వస్తు-విషయ సంపర్కం వలన కలిగే భోగాలు, ప్రాపంచిక మనస్తత్వం ఉన్నవారికి ఆనందదాయకంగా అనిపించినా, అవి యథార్థముగా దుఃఖ హేతువులే. ఓ కుంతీ పుత్రుడా, ఇటువంటి సుఖాలకు ఒక ఆది-అంతం ఉంటాయి. కాబట్టి, జ్ఞానులు వీటి యందు రమించరు.

ఇంద్రియ వస్తు-విషయ సంపర్కంచే, ఇంద్రియములు సుఖానుభూతులను కలుగ చేస్తాయి. మనస్సు ఒక ఆరవ ఇంద్రియము లాగా, గౌరవమూ, పొగడ్తా, పరిస్థితులూ, విజయమూ మొదలైన వాటి నుండి, ఆనందాన్ని ఆస్వాదిస్తుంది. ఈ యొక్క శారీరిక, మానసిక సుఖాలన్నింటినీ, భోగాలంటారు. ఇటువంటి ప్రాపంచిక భోగాలు, ఆత్మను సంతృప్తి పరచలేవు. ప్రాపంచిక సుఖాలు తాత్కాలికమైనవీ, పరిమితమైనవి. కాబట్టి, ఏదో లోపించిన భావన వాటిలో అంతర్గతంగా ఉంటుంది. కొంత సమయం తరువాత, వ్యక్తిని మరల అసంతృప్తితో నింపివేస్తాయి. కానీ, భగవంతుని ఆనందం నిత్యమైనది. ఒకసారి పొందిన తరువాత, అది శాశ్వతంగా ఉంటుంది. ప్రాపంచిక సుఖాలు, జడమైనవి. కాబట్టి, క్రమక్రమంగా తగ్గిపోతాయి. భౌతిక వస్తువుల నుండి కలిగే సుఖం, మనం దానిని ఆనందించే కొద్దీ, తగ్గిపోతుంది. కానీ భగవంతుని ఆనందం, చైతన్యవంతమైనది. అది సత్-చిత్-ఆనందం. కాబట్టి, ఒక వ్యక్తి భగవత్ నామాన్ని నిరంతరం, రోజంతా జపిస్తూ ఉన్నా, నిత్య నూతనమైన ఆధ్యాత్మిక తృప్తిని దానిలో పొందుతాడు. ఒక వ్యక్తి దివ్య ఆధ్యాత్మిక ఆనందాన్ని అస్వాదిస్తున్నప్పుడు, మనస్సు, అన్ని భౌతిక సుఖాల యందూ రుచిని కోల్పోతుంది. విచక్షణా జ్ఞానం ప్రసాదించబడిన వారు, భౌతిక సుఖాల లోపాలను అవగతం చేసుకుని, తమ ఇంద్రియములను వాటి నుండి, నిగ్రహిస్తారు.

06:27 - శక్నోతీహైవ యః సోఢుం ప్రాక్శరీర విమోక్షణాత్ ।
కామక్రోధోద్భవం వేగం స యుక్తః స సుఖీ నరః ।। 23 ।।

ఈ శరీరమును విడిచి పెట్టక ముందే, ఎవరైతే కామ-క్రోధ శక్తులను నియంత్రణ చేయగలరో, వారు యోగులు. వారు మాత్రమే, నిజమైన సుఖసంతోషములు గలవారు.

మానవ శరీరం అనేది, ఆత్మకి, ఆత్యున్నత లక్ష్యమైన భగవత్ ప్రాప్తిని సాధించేందుకు ఉన్న ఒక అద్భుతమైన అవకాశం. ఈ శరీరంలో మనకు వివేచనాత్మక శక్తి ఉంటుంది. కానీ, జంతువులు తమ సహజ స్వభావంచే ప్రవర్తిస్తాయి. మనకున్న విచక్షణా శక్తిని వాడుకోవటం ద్వారా, కామ-క్రోధముల యొక్క ఉద్వేగాన్ని నియంత్రించాలి. తనకు కావలసిన వస్తువు ఎప్పుడైతే దొరకదో, అప్పుడు మనస్సు క్రోధంతో నిండిపోతుంది. కామ-క్రోధముల ఆవేశం, నదీ ప్రవాహంలా, చాలా ప్రబలంగా ఉంటుంది. జంతువులు కూడా ఈ ఆవేశాలకు లోనవుతాయి. కానీ, మనుష్యుల లాగా, ఆ ఆవేశాలను నియంత్రించే విచక్షణా శక్తి, వాటికి లేదు. మనుష్య బుద్ధికి వివేచనాత్మక శక్తి ప్రసాదించబడింది. కాబట్టి, జ్ఞానం వలన కలిగిన విచక్షణ చేత, మనస్సుని నిగ్రహించాలి.

07:40 - యోఽoతః సుఖోఽoతరారామః తథాంతర్జ్యోతిరేవ యః ।
స యోగీ బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతోఽధిగచ్ఛతి ।। 24 ।।

ఎవరైతే తమలో తాము ఆనందంగా ఉంటారో, లోనున్న పరమాత్మ యొక్క ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉండి, అంతర్గత జ్ఞాన వెలుగుచే ప్రకాశిస్తూ ఉంటారో, అటువంటి యోగులు, భగవంతునితో ఏకమై, భౌతిక, ప్రాపంచిక అస్తిత్వము నుండి విముక్తులవుతారు.

"ఆంతర వెలుగు" అంటే, ఈశ్వరానుగ్రహంచే, మనం ఆయనకు శరణాగతి చేసినప్పుడు, మనలో నుండి బయటకు వచ్చే దివ్య ఆధ్యాత్మిక పరిజ్ఞానం. మనకు కొన్ని బాహ్య వస్తువుల నుండి సుఖం లభిస్తుంది. మనం ఒక వస్తువు కొన్నప్పుడు, ఎంతో ఆనందిస్తాము. కానీ, ఒక సంవత్సరం వాడిన తరువాత, మరొక వస్తువు కావాలనిపిస్తుంది. పాతదానిపై మనకున్న మమకారం పోతుంది. ఇటువంటి బాహ్య వస్తువుల ద్వారా మనం పోందే ఆనందం, సుఖం, తాత్కాలికం. అదే మనం తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడో, భగవంతుడి దివ్య మూర్తిని చూసినప్పుడో కలిగే ఆనందం, మనం దానిని స్మరించినప్పుడల్లా కలుగుతుంది. ఆ సుఖం, మన మనస్సుని భగవంతుని యందే నిమగ్నం చేసినప్పుడు, అనుభవంలోకి వస్తుంది. మనకు అంతర్గతంగా ఆనందం అనుభవంలోకి రానప్పుడు, బాహ్యమైన దురాకర్షణలని శాశ్వతంగా నిరోధించలేము. కానీ, ఎప్పుడైతే భగవదానందం హృదయంలో ప్రవహించటం మొదలవుతుందో, క్షణభంగురమైన బాహ్య సుఖాలు అల్పమైనవిగా అనిపించి, త్యజించటానికి వీలుంటుంది.

ఇక మన తదుపరి వీడియోలో, భౌతిక అస్థిత్వం నుండి విముక్తి లభించాలంటే ఏం చేయాలో తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

No comments: