Tuesday 8 February 2022

ఈ రోజు భీష్మాష్టమి మరియు రథ సప్తమి (సూర్య జయంతి)! Bhishma Ashtami - Ratha Saptami

 

ఈ రోజు భీష్మాష్టమి మరియు రథ సప్తమి (సూర్య జయంతి)!

మహాభారతంలో శంతన మహారాజు పుత్రుడు భీష్ముడు. భారతంలో ఒక ప్రధానమైన, శక్తివంతమైన పాత్ర భీష్ముడిది. సత్యవర్తనుడిగా, పరాక్రముడిగా భీష్ముని పాత్ర అనిర్వచనీయమైనది. ఆయన అసలు పేరు దేవవ్రతుడు. ఆయన కారణ జన్ముడు. అష్ట వసువులలో ఒకడు. అష్ట వసువులు అంటే, దేవలోకంలో ఇంద్రునికీ, విష్ణువుకూ సహాయంగా ఉండే శక్తివంతమైన దేవతలు. మహాభారతం ప్రకారం, సాక్షాత్తూ బ్రహ్మ ప్రజాపతి పుత్రులు. ప్రకృతి తత్వానికి ప్రతీకలు. ధర, అనిల, అనల, అహ, ప్రత్యూష, ప్రభాస, సోమ, ధృవులు.

[ రథ సప్తమి రోజు ఇలా చేస్తే ధనవంతులే! = https://youtu.be/RcSzefZE3ow ]

ఒక సారి వారు తమ భార్యలతో కలసి వనవిహారం చేస్తుండగా, అరణ్యంలో ఒక దివ్య తేజస్సు గల ఆవు కనిపించింది. అది వశిష్టుని ఆశ్రమంలో ఉండే కామధేనువు. దానిని వారు దొంగతనంగా తీసుకుని వెళ్లారు. వశిష్ఠుడు తన దివ్యదృష్టి ద్వారా జరిగింది గ్రహించి, వారిని భూమిపై మానవులుగా జన్మించమని శపించాడు. వారు వశిష్టుని క్షమించమని వేడుకోగా, కామధేనువును దొంగిలించడంలో సహాయం చేసిన ఏడుమంది వసువులు, భూమిపై కొద్ది రోజులు మాత్రమే జీవిస్తారనీ, కానీ, కామధేవును తీసుకుని వెళ్ళిన అష్టమ వసువు మాత్రం, భూమిపై దీర్ఘకాలం ఉండక తప్పదనీ చెప్పాడు.

వారు ఆ శాపం గురించి ఆలోచిస్తుండగా, గంగా దేవి వారి వద్దకు వచ్చింది. వారు ఆమెను మానవ రూపం ధరించి, ఎవరైనా రాజును వివాహమాడి, తమకు జన్మనిచ్చి, పుట్టిన వెంటనే నదిలో పారవేయ వలసిందిగా కోరారు. గంగాదేవి అందుకు అంగీకరించింది.

ఒకనాడు చంద్రవంశానికి చెందిన ప్రతీపుడు అనే మహారాజు, గంగానదీలో సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తుండగా, గంగాదేవి అందమైన మానవకాంత రూపం ధరించి వచ్చి, ఆయన కుడి తొడమీద కూర్చుంది. ఆమె తనను మోహిస్తుందేమోనని ఆయన బాధ పడి, ఆమె ఎందుకు అలా కూర్చుందో అడిగాడు.

సాధారణంగా కూతుళ్ళు, కోడళ్ళు మాత్రమే అలా కూర్చుంటారు. తనకు కుమారుడు కలిగితే, అతన్ని పెళ్ళాడవచ్చునని సూచించాడు. అది విని ఆమె అంతర్ధానమైపోయింది. కొద్ది కాలానికి ప్రతీపునికి శంతనుడనే పుత్రుడు జన్మించాడు. ఆయన ఒకసారి గంగాతీరంలో విహరిస్తుండగా, మానవ రూపంలో ఉన్న ఆమెను చూసి, మోహించాడు. 

శంతనుడు ఆమెను పెళ్ళి చేసుకోవాలంటే, కొన్ని షరతులు విధించింది. దాని ప్రకారం, పెళ్ళి తర్వాత ఆమె ఏం చేసినా శంతనుడు అందుకు అడ్డు చెప్పకూడదు, ఆక్షేపించ కూడదు. అలా చేసిన పక్షంలో, ఆమె అంతర్ధానమైపోతుంది. శంతనుడు అందుకు అంగీకరించి, ఆమెను పెళ్ళి చేసుకున్నాడు.

కొద్ది కాలానికి వారికి ఒకరి తర్వాత ఒకరు, ఏడుగురు మగ సంతానం కలిగారు. అయితే, ఆమె ఒక్కో బిడ్డ పుట్టిన వెంటనే, నదిలో పారవేస్తూ ఉంది. ఆ ఏడుగురి విషయంలోనూ ఎలాగోలా ఊరుకున్న శంతనుడు, ఎనిమిదవ బిడ్డ విషయంలో మాత్రం, ఆమెను వారించాడు.

ఆమె ఆ శిశువును శంతనుడికిచ్చి, అంతర్ధానమైపోయింది. ఆ శిశువే, దేవవ్రతుడు. జీవిత కాలం భూమి మీద జీవించాలన్న శాపానికి గురైన అష్టమ వసువు. గంగాదేవి జన్మనిచ్చింది కాబట్టి, గాంగేయుడు అని పిలవబడ్డాడు. వారే భీష్మాచార్యులు.

సూర్య జయంతి

పుణ్యప్రదమైన మాఘమాస సప్తమిని, సూర్య జయంతిగా జరుపుకోవడం ఆచారం. సూర్య జయంతి నాడు, అర్కపత్రాలు (జిల్లేడు ఆకులు), రేగు ఆకులు శరీరంపై పలుచోట్ల ఉంచుకుని స్నానం చేయడం వల్ల, సప్త విధ పాపాలు హరించుకు పోతాయని, శాస్త్ర కథనం. రథసప్తమినాడు, ప్రత్యక్ష నారాయణుడైన సూర్యుడి జీవిత విశేషాలు విన్నా, చదివినా, మంగళకరమని పెద్దలు చెబుతారు.

పుట్టిన తరువాత గొప్ప పనుల్ని చేసి, కొంతమంది ప్రసిద్ధికెక్కుతారు. అద్భుతాల్ని ఆవిష్కరించడానికే, కొంతమంది జన్మిస్తారు. సూర్యభగవానుడి జననం అలాంటిదే. కశ్యప మహర్షికి పదముగ్గురు భార్యలు. వారిలో దితి, అదితి, దనువు అనే ముగ్గురు భార్యలు, ప్రధానమైనవారు. దితికి దైత్యులు, దనువుకు దానవులు, (దైత్యులు దానవులు ఇద్దరూ రాక్షసులే అయినప్పటికీ, స్వభావం పరంగా దైత్యుల కన్నా, దానవులకు కోపం ఎక్కువ) జన్మించారు. అదితికి సత్వగుణ ప్రధానులైన దేవతలు పుట్టారు.యజ్ఞంలో అర్పించే హవిస్సును స్వీకరించే బాధ్యతను, బ్రహ్మదేవుడు దేవతలకు మాత్రమే అప్పజెప్పాడు.

చెడు ప్రవర్తన కలిగిన రాక్షసులు హవిర్భాగాలను బలవంతంగా గ్రహించడం మొదలుపెట్టారు. ప్రశ్నించిన దేవతలపై, రాక్షసులు ఎదురు దాడి చేసేవారు.తన బిడ్డలకు జరుగుతున్న అవమానాలకు అదితి బాధపడింది. ఒకరోజు ఆకాశంలో ప్రకాశిస్తున్న రవి బింబాన్ని చూస్తూ, అనేకరకాలుగా ప్రస్తుతించింది. ఆమె ప్రార్థనలకు సంతోషించిన దివాకరుడు ప్రత్యక్షమయ్యాడు. అదితి ఆనందించి, దేవతలకు జరుగుతున్న అన్యాయాన్ని ఆయనకు చెప్పింది. భాస్కరుణ్ని తనకు పుత్రుడిగా జన్మించి, శత్రునాశనం చేయమని వేడుకుంది. ప్రభాకరుడు ప్రశాంతచిత్తుడై వరమిచ్చాడు. సూర్యుడి అనుగ్రహం పొందిన సంతోషంతో, అదితి అనేక విధాలైన వ్రతాల్ని చేస్తూ, ఉపవాసాలు ఆచరించింది.

గర్భవతి అయిన అదితి శరీరం ఉపవాసాల కారణంగా క్షీణించింది. కశ్యప మహర్షి తన భార్య పరిస్థితికి కలత చెందాడు. అదితి దగ్గరికొచ్చి కోపంగా, ఇలా ఉపవాసాలుంటూ అండాన్ని చంపేస్తావా ఏమిటి? అని ప్రశ్నించాడు. రాక్షసుల్ని సంహరించే సంతానాన్ని పొందడానికి ఈవిధంగా చేస్తున్నానని, అదితి ఉద్రేకంతో సమాధానమిచ్చింది. కశ్యపుడికీ అదితికీ మధ్య వివాదం జరగగా, ఆవేదనతో అదితి పిండాన్ని విడిచి పెట్టింది. అందులో నుంచి గొప్ప కాంతి కలిగిన శిశువు బయటికొచ్చాడు. ఆ సమయంలో ఆకాశవాణి, ఈ పిల్లవాడు మార్తాండుడుగా ప్రసిద్ధుడవుతాడని పలికింది. కొంతకాలం తర్వాత, మార్తాండుడు దేవతలతో కలిసి రాక్షస సంహారం చేసి, ప్రాణులన్నిటికీ సంతోషం కలిగించాడు. లోకకల్యాణ కారకమైన ఆ రోజు, సూర్య జయంతిగా ప్రశస్తికెక్కింది.

No comments: