మనిషికి జీవితమే, అన్నింటి కంటే పెద్ద పరీక్ష.. అనుదినమూ, అనుక్షణమూ, మనం జీవితంలో ఎన్నో పరీక్షలు ఎదుర్కొంటుంటాము. ఈ జగన్నాటకంలో, జీవితమే మనకొక పరీక్ష అని తెలిసేసరికి, ఢీలాపడిపోతుంటాము. అసలు పరీక్షలు లేకపోతే, ఫలితాలు వచ్చేదెలా? ఫలితాలు రాకపోతే, మన గుణగణాలు తెలిసేదెలా? చదువు పాఠం నేర్పి, పరీక్ష పెడుతుంది. కానీ జీవితం, పరీక్ష పెట్టి పాఠం నేర్పుతుంది. జీవిత పరీక్షకు సిద్ధపడటంలోనే, మనిషి గొప్పదనం ఉంది. ఈ రోజుటి మన 'మంచిమాట'ను ఆకళింపుజేసుకోవడానికి, వీడియోను చివరిదాకా చూసి, మీ అభిప్రాయాలను తెలియజేస్తారని ఆశిస్తున్నాను..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/ANQ3s5EHkGg ]
ఈ ప్రపంచంలో, పక్షికి తుఫాను పరీక్ష, జింకకు వెంటాడుతున్న పులి పరీక్ష, పాముకు గద్ద పరీక్ష, బంగారానికి అగ్నిపరీక్ష, వజ్రానికి కోత పరీక్ష ఉన్నట్లే, మనిషి జ్ఞానం పొందాలంటే, అడుగడుగునా పరీక్షలకు సిద్ధపడాలి. కానీ, బ్రతుకులో ఈ పరీక్షల తాకిడి ఏమిటని, చాలామంది బాధ పడుతుంటారు. పరీక్షలు లేకుండానే, జీవితంలో ఉత్తీర్ణత సాధించాలనుకుంటారు. చిన్న చిన్న పరీక్షలు రాస్తూ, ఒక్కసారిగా పెద్ద పరీక్ష రాస్తాము. విజయం సాధించినప్పుడు, మన కళ్లలో సంతోషం, హృదయంలో ఆనందం, వద్దన్నా కలుగుతాయి. మళ్లీ మళ్లీ విజయాలు సాధించడానికి, పరీక్షలు ఎదుర్కొంటాము.
ఒక్కోసారి బాధలు తట్టుకోలేక, ‘నన్ను ఇక పరీక్షించకు భగవంతుడా.. నీ పరీక్షలను నేను తట్టుకోలేను..’ అని భక్తులు భగవంతుడికి మొరపెట్టుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాలలో, పరీక్షలు మనిషిని నలిపివేస్తాయి. తడిగుడ్డను పిండినట్లు, మనుషులను పిండివేస్తాయి. కొందరు తట్టుకోగలుగుతారు, మరికొందరు తట్టుకోలేరు. పరీక్షా కాలంలో, మనకు సరైన మార్గదర్శకత్వం ఉండాలి, అవగాహన చేసుకోగలిగే మంచి మేధస్సుండాలి. ముఖ్యంగా, ఓర్చుకోగలిగే హృదయం కావాలి. పరీక్షా కాలంలో, భగవంతుడు మనిషికి తప్పక సహాయం చేస్తాడు. అదేమిటి? పరీక్షలు భగవంతుడే కదా పెడతాడు? మళ్లీ ఆయనే రక్షిస్తాడా? అనే సందేహం ప్రతిఒక్కరికీ కలుగుతుంది. నిజానికి, దేవుడు ఎన్నడూ పరీక్షలు పెట్టడు. మనం చేసిన మంచో, చెడో, మన ముందుకు వచ్చి, పరీక్షల రూపంలో నిలబడతాయి. వాటిని ఎదుర్కుని తీరాలి. ఆ బరువులు మోయలేక, బాదరబందీలు తట్టుకోలేక మనం గోలపెడుతున్న సమయంలో, దైవం తప్పక సహాయం చేస్తాడు.
మహాభారతంలో, ధర్మరాజు జూదం ఆడాడు. రాజ్యాన్నీ, అందరినీ ఒడ్డి ఓడాడు. అరణ్యవాసం, అజ్ఞాతవాసానికి సిద్ధపడ్డారు పాండవులు. ఎన్నో కష్టాలూ, బాధలూ అనుభవించారు. అదంతా ఒక పరీక్షగా తీసుకున్నారు. కృష్ణ భగవానుడి సహాయంతో, గట్టెక్కారు. జీవితంలో ఎవరికైనా, కష్టాలు రాకుండా ఉండవు, పరీక్షలు లేకుండా ఉండవు. ఆ సమయంలో, సహాయం చేసే చెయ్యి మన వెనుక ఉన్నదన్న ధీమా, మనిషిని నిలబెడుతుంది, తప్పక గెలిపిస్తుంది. జీవితం ఒక పరీక్ష అని తేలిపోతే, చాలా సుఖంగా ఉంటుంది. దానిని విజయవంతంగా ఎదుర్కోవడానికి, అన్ని శక్తియుక్తులతో, మనిషి ఒక కచ్చితమైన ప్రణాళికను సిద్ధం చేసుకుంటాడు. ఆట ఆడాలి.. ఆడుతూ, ఎన్నో అవరోధాలనూ, అడ్డంకులనూ దాటుతూ, జీవితంలో విజయ పరీక్షకు నిలబడాలి. కుంతీదేవి ఎన్నో కష్టాలనుభవించింది. తనకు మరిన్ని కష్టాలిచ్చి, పరీక్ష పెట్టమంది. ఆ విధంగా, ఆ వేదనలో, దైవాన్ని నిరంతరం వేడుకుంటూ, దగ్గరగా ఉంటానని చెప్పింది.
పరీక్షలు మనిషులకే కాదు, సాక్ష్యాత్తూ భగవంతుడికి కూడా ఉంటాయి. దైవాన్ని నమ్మని మనిషే, భగవంతుడికి అతిపెద్ద పరీక్ష.. అతడిని తన వైపు తిప్పుకోవడానికి, ఎన్నో హృదయానుభవాలను కలిగిస్తాడు. నమ్మని మనిషి, అవన్నీ కాకతాళీయంగా జరిగాయని, కొట్టిపారేస్తాడు. నమ్మినవాడి గురించి దైవం పట్టించుకోకపోయినా ఫరవాలేదు. నమ్మని వాడితోనే, అసలు చిక్కు. ఒక్కోసారి దేవుడే, మనిషి రూపంలో దిగివచ్చి, కొంతమంది మనుష్యులను మార్చిన ఉదంతాలూ లేకపోలేదు. దైవానికి ఇంతకు మించిన పరీక్ష ఏముంది?
జీవిత పరీక్షవు నీవే..
ఫలితము నీవే, జీవన సార్ధకమూ నీవే..
ఆదరించి అనుగ్రహించే దైవానివి నీవు..
కృష్ణం వందే జగద్గురుం!
Link: https://www.youtube.com/post/UgkxGGCPWTGwcp6gOD6CjYh6rzSLKyl0754f
No comments: