‘శ్రద్ధ’ - యోగ లక్ష్యము యొక్క అంతిమ విజయం..!
'భగవద్గీత' షష్ఠోఽధ్యాయం - ఆత్మ సంయమ యోగం (34 – 38 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను కర్మషట్కము అంటారు. దీనిలో ఆరవ అధ్యాయం, ఆత్మ సంయమ యోగం. ఈ రోజుటి మన వీడియోలో, ఆత్మసంయమయోగంలోని 34 నుండి 38 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..
[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/psCpVYUtyiM ]
అర్జునుడి ప్రశ్నకు, మనస్సును ఎలా నియత్రించాలో, శ్రీకృష్ణుడిలా చెబుతున్నాడు..
00:44 - చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవద్ధృడమ్ ।
తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరమ్ ।। 34 ।।
ఈ మనస్సు చాలా చంచలమైనది, అల్లకల్లోలమైనది, బలమైనది, మరియు మూర్ఖపు పట్టుగలది. దీనిని నిగ్రహించటం, వీచేగాలిని నియంత్రించటం కన్నా ఎక్కువ కష్టంగా అనిపిస్తున్నది కృష్ణా.
చికాకు పెట్టే మనస్సు గురించి వివరించేటప్పుడు, అర్జునుడు మన అందరి తరపున మాట్లాడుతున్నాడు. మనస్సు చంచలమైనది.. ఎందుకంటే, అది ఒక విషయం నుండి మరో విషయానికి ఎన్నో దిశలలో పరిభ్రమిస్తూనే ఉంటుంది. అది అల్లకల్లోలమైనది.. ఎందుకంటే, ద్వేషం, కోపం, కామం, లోభం, ఈర్ష, ఆందోళన, భయం, అనుబంధం వంటి వాటితో, ఒక వ్యక్తి అంతఃకరణలో, ఉపద్రవాలను సృష్టిస్తుంది. అది బలమైనది.. ఎందుకంటే, తన శక్తివంతమైన అలలచే బుద్ధిని వశపరుచుకుని, విచక్షణా శక్తిని నాశనం చేస్తుంది. మనస్సు అనేది మొండిది, మూర్ఖమైనది కూడా.. ఎందుకంటే, బుద్ధికే వ్యాకులత కలిగేటట్టు, అది ఒకసారి హానికర ఆలోచనను పట్టుకుంటే, దానిని వదిలి వేయటానికి ఒప్పుకోదు. దాని గురించి పదే పదే చింతిస్తూనే ఉంటుంది. ఈ విధంగా దాని యొక్క హానికరమైన లక్షణాలను వివరిస్తూ, అర్జునుడు, మనస్సును నిగ్రహించటం అనేది వీచేగాలిని నిగ్రహించటం కన్నా కష్టమైనదని ప్రకటిస్తున్నాడు. ఇదొక బలమైన ఉపమానం.. ఎందుకంటే, ఎవరూ కూడా ఆకాశంలోని బ్రహ్మాండమైన గాలిని నిగ్రహించటం, అసాధ్యం.
02:17 - శ్రీ భగవానువాచ ।
అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్ ।
అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే ।। 35 ।।
శ్రీ కృష్ణ పరమాత్మ ఇలా అంటున్నాడు: ఓ మహా బాహువులు కల కుంతీ పుత్రుడా.. నీవు చెప్పినది నిజమే. మనస్సనేది, నిగ్రహించటానికి నిజముగా చాలా కష్టమైనది. కానీ, అభ్యాసము, మరియు వైరాగ్యములచే, దానిని నిగ్రహించవచ్చు.
కృష్ణుడు అర్జునుడి మాటలకు జవాబు చెబుతూ, అతడిని 'మహాబాహో'.. అంటే, "గొప్ప బాహువులు గలవాడా" అని సంబోధిస్తున్నాడు. దాని అర్థం, ‘ఓ అర్జునా, నీవు యుద్ధములో అత్యంత సాహసోపేత వీరులను ఓడించావు. ఈ మనస్సుని ఓడించలేవా?’ అని శ్రీకృష్ణుడు, మనస్సును నియంత్రించడం ఎంతో క్లిష్టతరమైనదని, అర్జునుడి మాటలతో ఏకీభవించాడు. ప్రపంచంలో కష్టతరమైన పనులెన్నో ఉన్నాయి. అయినా, మనం అధైర్య పడకుండా ముందుకు సాగుతాం. ఉదాహరణకి, సముద్రం ప్రమాదకరమైనది, మరియు భయంకర తుఫానులు వచ్చే అవకాశం ఉంటుందని, నావికులకు తెలుసు. అయినా, వారు సముద్రానికి దూరం కారు. కాబట్టి, శ్రీ కృష్ణుడు, అర్జునుడికి వైరాగ్యం, మరియు అభ్యాసం ద్వారా మనస్సుని నియంత్రించవచ్చని, హామీ ఇస్తున్నాడు. మనస్సు, ఇంతకు క్రితం పరుగు పెట్టే అలవాటున్న దిశగా, దాని యొక్క అనుబంధ విషయముల కొరకు పరుగు పెడుతుంది. ఈ మమకార-ఆసక్తిని తీసివేయటమనేది, మనస్సు యొక్క అనవసరమైన పరిభ్రమణాన్ని నిర్మూలిస్తుంది. పాత అలవాట్లను మార్చి, కొత్త వాటిని పెంపొందించుకునే ఏకాగ్రతతో కూడిన పరిశ్రమ, అభ్యాసం. ఇది సాధకులకు ఒక ముఖ్యమైన విషయం. సమస్త మానవ పరిశ్రమలలో, నైపుణ్యానికీ, ప్రావీణ్యతకీ, శ్రేష్ఠతకీ దారి తీసే ప్రముఖ విషయం, అభ్యాసమే. నైపుణ్యం, కేవలం అభ్యాసం ద్వారానే సాధ్యపడుతుంది. అదే విధంగా, మూర్ఖమైన, మరియు అల్లకల్లోలమైన మనస్సుని, అభ్యాసం ద్వారా, ఆ భగవంతుని చరణారవిందముల పైనే నిలపాలి. మనస్సుని ఈ ప్రపంచం నుండి దూరంగా తీయడమే, వైరాగ్యం.. మనస్సుని భగవంతుని మీద నిలపడమే, అభ్యాసం..
04:24 - అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః ।
వశ్యాత్మనా తు యతతా శక్యోఽవాప్తుముపాయతః ।। 36 ।।
మనస్సు అదుపులో లేనివానికి, యోగము కష్టతరమైనది. కానీ, మనస్సుని నిగ్రహించటం నేర్చుకున్నవారూ, మరియు సరియైన పద్ధతిలో పరిశ్రమ చేసేవారూ, యోగములో పరిపూర్ణతను సాధించవచ్చు. ఇది నా అభిప్రాయము.
శ్రీ కృష్ణ పరమాత్మ, ఇప్పుడు మనోనిగ్రహానికీ, మరియు యోగంలో సాఫల్యానికీ ఉన్న సంబంధాన్ని, తెలియ చెబుతున్నాడు. అభ్యాసము, మరియు వైరాగ్యము ద్వారా, మనస్సుకి కళ్ళెం వేయటం నేర్చుకోనివారు, యోగాభ్యాసములో చాలా కష్టాలను ఎదుర్కుంటారని అంటున్నాడు. కానీ, మనస్సుని నిరంతర ప్రయత్నం ద్వారా, తమ నియంత్రణలోకి తెచ్చుకున్న వారు, సరియైన పద్ధతిని అవలంభించటం ద్వారా, విజయాన్ని సాధించవచ్చు. ఈ నిర్దిష్ట పద్ధతి ఆయనచే, 6.10 శ్లోకం నుండి 6.32వ శ్లోకం వరకు, విశదీకరించబడింది. ఇంద్రియములను నిగ్రహించటం, కోరికలను త్యజించటం, మనస్సుని భగవంతుని పైన మాత్రమే కేంద్రీకరించటం, అచంచలమైన మనస్సుతో ఆయన గురించే తలంచటం, అందరినీ సమ దృష్టితో చూడటమనేవి, దీనిలో భాగము. ఈ విషయం, మనస్సుని అదుపు చేయలేని సాధకుని గురించి, ఒక సందేహాన్ని అర్జునుడి మనస్సులో సృష్టించింది; ఇప్పుడు శ్రీ కృష్ణుడిని ఈ విషయం గురించి అడుగుతున్నాడు.
05:51 - అర్జున ఉవాచ ।
అయతిః శ్రద్ధయోపేతో యోగాచ్చలితమానసః ।
అప్రాప్య యోగసంసిద్ధిం కాం గతి కృష్ణ గచ్ఛతి ।। 37 ।।
అర్జునుడు ఇలా పలుకుతున్నాడు : ఈ మార్గంలో శ్రద్ధతో ప్రయాణం ప్రారంభించి కూడా, చంచలమైన మనస్సు కారణంచే, తగినంతగా పరిశ్రమించక, యోగ లక్ష్యము యొక్క అంతిమ విజయాన్ని, ఈ జన్మ లోనే సాధించలేక పోయిన యోగి యొక్క గతి ఏమిటి?
భగవత్ ప్రాప్తి దిశగా ప్రయాణం, 'శ్రద్ధ' తోనే మొదలవుతుంది. చాలా మంది విశ్వాసం గల జీవాత్మలు, పూర్వ జన్మ సంస్కారాల వలనా, లేదా, సాధు పురుషుల సాంగత్యం వలనా, లేదా, ప్రపంచంలోని ప్రతికూలతల వంటి వాటి చేతా, వేద శాస్త్రాల ఆధ్యాత్మిక జ్ఞానంపై విశ్వాసం పెంపొందించుకుంటారు. ఈ ప్రయాణం ప్రారంభించటానికి కావలసిన శ్రద్ధని కలిగించేవి, ఎన్నో కారణాలుండవచ్చు. కానీ ఈ సాధకులు, ఆ తరువాత తగినంత పరిశ్రమ చేయక నిర్లక్షం చేస్తే, మనస్సు చంచలంగానే ఉంటుంది. ఇటువంటి సాధకులు తమ ప్రయాణాన్ని, ఈ జన్మ లో పూర్తి చేయలేరు. ఇటువంటి సాధకుల గతి ఏమిటి? అని అర్జునుడు శ్రీ కృష్ణుడిని అడుగుతున్నాడు.
07:01 - కచ్చిన్నోభయవిభ్రష్టః ఛిన్నాభ్రమివ నశ్యతి ।
అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణః పథి ।। 38 ।।
ఓ మహా బాహువులు గల కృష్ణా.. యోగ మార్గం నుండి దారి తప్పిపోయిన వ్యక్తి, భౌతిక, మరియు ఆధ్యాత్మిక విజయాలు రెండింటి నుండీ, భ్రష్టుడై పోడా? అతడు విడిపోయి, చెదిరిన మేఘం వలె, ఉభయభ్రష్టుడై, ఎటూకాకుండా పోడా?
విజయం సాధించాలనే కోరిక జీవులకు సహజమైనది. భగవంతుని అంశలే కాబట్టి, దానికది సహజం. భగవంతుడు సర్వ-పరిపూర్ణుడు కాబట్టి, ఆత్మ కూడా, తన మూలము లాగే పరిపూర్ణంగా, విజేతగా ఉండాలనే కోరికతో ఉంటుంది. విజయం, కార్య సిద్ధి, రెండు రంగాలలో ఉంటుంది. అవి, భౌతిక మైనది, మరియు ఆధ్యాత్మికమైనది. ఈ భౌతిక ప్రపంచంలో సుఖాలు లభిస్తాయని అనుకునేవారు, భౌతిక అభ్యున్నతి కోసం పాటు పడతారు. ఆధ్యాత్మిక సంపదయే నిజంగా ఉండవలసిన నిధి అనుకునేవారు, భౌతిక ప్రయాసలని విడిచి, ఆధ్యాత్మిక పురోగతి కోసమే పాటుపడతారు. కానీ, ఇంటువంటి ఆధ్యాత్మిక వాదులు, తమ ప్రయత్నంలో విఫలమయితే, వారు అటు భౌతిక సంపదా, ఇటు ఆధ్యాత్మిక సంపదా లేకుండా అయిపోవటం, స్పష్టంగా మనకు తెలిసిపోతుంది. ఈ విధంగా ఆలోచించే వారి స్థితి, ఒక విడిపోయి, చెదిరిపోయిన మేఘము మాదిరి అయిపోతుందా? అని అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. ఒక మేఘము, తన గుంపు నుండి విడిపోతే, అది నిరర్థకమైపోతుంది. అది తగినంత నీడను ఇవ్వలేదు.. దాని బరువును పెంచుకుని, వర్షం కురిపించేదిగా అవ్వలేదు. అది కేవలం గాలిలో తేలుతూ, ఆకాశంలో హరించుకుపోతుంది. సాఫల్యం పొందలేని యోగి పరిస్థితి కూడా ఈ విధంగానే, ఏ రంగంలో కూడా విలువ లేకుండా ఉంటుందా? అని అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు.
ఇక మన తదుపరి వీడియోలో, యోగ మార్గం నుండి తప్పిపోయిన వ్యక్తి గురించి అర్జునుడడిగిన ప్రశ్నకు, శ్రీ కృష్ణుడి సమాధానం తెలుసుకుందాము..
కృష్ణం వందే జగద్గురుం!
No comments: