Monday, 4 April 2022

చిలుక తల ‘శుక’ మహర్షి జన్మ రహస్యం! Shuka Muni a Divine Parrot

Written by

  

చిలుక తల ‘శుక’ మహర్షి జన్మ రహస్యం!

మన భారతీయ ఋషులలో, బ్రహ్మర్షి శుక మహర్షికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. వేద వ్యాసుడి తనయుడిగా, ముల్లోకాలలోనూ గొప్ప తత్త్వజ్ఞుడిగా, యోగీశ్వరుడిగా పేరు గడించాడాయన. కలి వశాత్తూ ముని శాపానికి గురైన పరీక్షిత్తుకు, అతని కోరిక మేరకు, ఏడు రోజుల పాటు శ్రీ మహా భాగవతాన్ని వినిపించాడు, శుక మహర్షి. పుట్టుకతోనే యోగర్షిగా వ్యాసునికి జన్మించిన శుక మహర్షి, చిలుక రూపంలో ఎందుకు జన్మించాడు? శుకమహర్షి గత జన్మ రహస్యమేంటి - వంటి ఉత్సుకతను రేకెత్తించే విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/Pgh2l7--5I0 ]

వేదవ్యాసుడు ఎన్నో వందల సంవత్సరాలు తపస్సు చేయగా, శివుడు ప్రత్యక్షమై, ఏం కావాలో కోరుకోమన్నాడు. అందుకు వ్యాసుడు, తనకు పంచభూతాలను పోలిన కొడుకు కావాలని, వరం కోరుకున్నాడు. ఒకనాడు వ్యాసుడు అరణిని మథిస్తుండగా, ఘృతాచి అనే అప్సరస కనిపించింది. ఆమెను చూడగానే వ్యాసుడు, కామ ప్రేరితుడయ్యాడు. తనను బుషి శపిస్తాడేమోనని భయపడి, ఘృతాచి చిలుక రూపం ధరించింది. ఆ సమయంలో వ్యాస మహర్షి స్కలించగా, చిలుక ముఖంతో, మానవ శరీరంతో, బాలుడైన శుక మహర్షి జన్మించాడు. కాంతులు వెదజల్లుతూ పుట్టిన శుక మహర్షికి, గంగాదేవి స్నానం చేయించింది. పార్వతీ సహితుడై పరమశివుడు వచ్చి, శుకునకు ఉపనయనం చేశాడు. దేవేంద్రుడు, కమండలం ప్రసాదించాడు. దేవతలు, ఎప్పటికీ మాయని దివ్యవస్త్రాన్ని అందించారు.

శుక మహార్షి, పుట్టిన వెంటనే తండ్రి అనుమతి తీసుకుని, దేవగురువు బృహస్పతి వద్ద ధర్మశాస్త్రం, రాజనీతీ నేర్చుకున్నాడు. విద్య పూర్తయిన పిమ్మట, శుకుడు తన తండ్రి అయిన వ్యాసుడి ఆశ్రమానికి తిరిగి వెళ్లాడు. మునిబాలకులతో బాటు నివసిస్తున్న శుకుని పిలిచి, జనకుని వద్దకు వెళ్ళి మోక్షమార్గం తెలుసుకుని రమ్మని పంపించాడు, వ్యాసుడు. శుకుడు తిన్నగా మిథిలానగరం చేరి, తన రాకను జనకునకు తెలియజేయమని, ద్వారపాలకులకు చెప్పాడు. శుకుడి రాక తెలియగానే, జనక మహారాజు సపరివారంగా ఎదురేగి, లోపలికి ఆహ్వానించాడు. కాంచన సింహాసనంపై ఆసీనుణ్ణి చేసి, వివిధ రకాల పూలతో అతనిని పూజించాడు. అతిథి సత్కారాలు పూర్తయిన తరువాత, శుకుని రాకకు కారణం తెలుపమనగా.. 'జనక మహారాజా, మా తండ్రి గారి ఆదేశానుసారం, మీ వద్ద మోక్షమార్గం తెలుసుకోవాలని వచ్చాను’ అని చెప్పాడు. దాంతో సంతోషించిన జనకుడు, శుకునకు అనేక విషయాలూ, ధర్మ సూక్ష్మాలూ తెలియజేశాడు. అంత శుకుడు పరమశాంతుడై, జనకుని వద్ద సెలవు తీసికుని, నేరుగా తండ్రి వద్దకు వెళ్లాడు. అప్పుడు శుకునకు వ్యాసమహర్షి, సృష్టి రహస్యాలను తెలియజేశాడు.

అమిత జ్ఞానాన్ని సముపార్జించిన శుకుడు, అవధూతయై, ఒకచోట నిలకడగా ఉండక, భూభాగమంతా సంచరించసాగాడు. అలా తిరుగుతున్న సమయంలోనే, పరీక్షిత్తు మహారాజుని కలవటం జరిగింది. కలి ప్రభావంతో, తక్షకుడి వలన వారం రోజుల్లో మరణించేలా శాపాన్ని పొందిన అతడికి భాగవత కథలను వినిపించి, మోక్ష మార్గాన్ని చూపించాడు. శుకుడు సంచారం పూర్తిచేసుకుని, తిరిగి తండ్రి గారి ఆశ్రమానికి చేరి, ఆయన వద్దనే, సుమంత, మొదలైన వ్యాస శిష్యులతో కలిసి, వేదాధ్యయనం చేస్తుండేవాడు. ఎప్పుడూ దైవ చింతనలో మునిగిపోయి ఉండే శుకుడికి, ఒంటి మీద బట్టలు ఉన్నాయా లేదా అనే స్పృహ కూడా, ఉండేది కాదు. అంతలా ప్రతి క్షణం, తపస్సులో మునిగి ఉండేవాడు. అతను నడిచి వెళ్తున్నప్పుడు, పక్కన ఏం జరిగినా అతనికి తెలిసేది కాదు. ఒక రోజు శుకుడు ఆకాశ మార్గం నుండి వెళ్తుండగా, ఒక కొలనులో అప్సరసలు జలకాలాడుతున్నారు. అటుగా వెళ్తున్న శుకుడిని, ఆ అప్సరసలు చూసీ చూడనట్టు, పట్టించుకోకుండా వారి క్రీడల్లో మునిగి ఉన్నారు. అయితే, అదే సమయంలో వ్యాసుడు కూడా అటుగా రావడంతో, అప్సరసలందరూ గబగబా బట్టలు కట్టుకుని, సిగ్గుపడ్డారు.

ఇది గమనించిన వ్యాసుడు, శుకుడిని పట్టించుకోకపోవడానికి కారణమేంటని అడిగాడు. అందుకు అప్సరసలు, 'శుకుడు ఎంత జ్ఞాని అయినా, అతని మనస్సు అప్పుడే పుట్టిన పసిపిల్లవాడి మనస్సులాగా, స్వచ్ఛమైనదని' తెలియజేశారు. అది విన్న వ్యాసుడికి, తన కొడుకు మీద ప్రేమ రెట్టింపయ్యింది. తాను సక్తత గలవాడనీ, తన కుమారుడు ఆసక్తత గలవాడనీ అర్థం చేసుకున్న వ్యాసుడు, శుకుడి మహోన్నతకు సంతోషపడ్డాడు. మరొకసారి, రంభ శుకుని అందానికి ముగ్ధురాలై, తనను సంతోషపెట్టమని కోరగా, ఆమెను సున్నితంగా తిరస్కరించాడు శుకుడు. ఒక రోజు నారద మాహామునిని దర్శించుకున్న శుకుడు, ఈ లోకంలో పుట్టినందుకు ఏమి చేస్తే మంచిదని అడుగగా.. అందుకు సమాధానంగా నారదుడు, యోగ సిద్ధిని పొందటం మంచిదని చెప్పాడు. అది విన్న శుకుడు వెంటనే తన తండ్రి దగ్గరా, నారదుడి దగ్గరా సెలవు తీసుకుని, కైలాస పర్వతం మీదకు వెళ్లి తపస్సు చేసి, యోగసిద్ధిని పొందాడు. కొంతకాలం తరువాత నారదుడు శుకుడిని చూడటానికి వెళితే, అతనికి ఆత్మయోగం గురించి చెప్పి, ఆకాశంలోకి ఎగిరిపోయాడు శుకుడు. అలా వెళ్ళిపోతూ, అక్కడున్న పక్షులతో, తన కోసం తన తండ్రి వచ్చి, ‘శుకా’ అని పిలిస్తే 'ఓయ్' అని పలకమని చెప్పి, వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళ తరువాత ఎంతకీ కనిపించని కొడుకును వెతుక్కుంటూ, కైలాస పర్వత ప్రాంతంలో తిరుగుతూ, ‘శుకా’ అని పిలిచిన వ్యాసుడికి, ‘ఓయ్’ అని వినిపించింది.

జరిగిన విషయాన్ని గ్రహించిన వ్యాసుడు, కొడుకు కోసం తపిస్తుంటే, శివుడు అతనిని ఓదార్చి, నువ్వు కోరుకున్నట్టే, నీకు ఎంతో ఉత్తమమైన కొడుకు పుట్టాడు. సృష్టి రహస్యం తెలిసిన నువ్వు ఇలా బాధపడటం మంచిదికాదని చెప్పి, అతనిని తిరిగి ఆశ్రమానికి పంపించాడు. అయితే, పరమశివుడి వర ప్రసాదంగా జన్మించిన శుకుడు, చిలుక రూపంలో ఉండడానికి కారణం, అతని గత జన్మ అని, కొన్ని పురాణాలు తెలియజేస్తున్నాయి. ఒకనాడు కైలాసంలో పార్వతీ దేవి శివుడితో, 'స్వామీ, ఈ సృష్టి యొక్క రహస్యం ఏంటి? జనన మరణాలు ఏ విధంగా సాగుతాయి? అసలు సృష్టి ఏ విధంగా జరుగుతుంది?' వంటి ప్రశ్నలడిగింది. అప్పుడు ఈశ్వరుడు పార్వతీ దేవిని తీసుకుని, ఏకాంత ప్రదేశమైన అమరనాథ గుహకు చేరుకున్నాడు. వాహనమైన నందీ, ఆభరణమైన వాసుకి, అలంకారమైన సోముడితో పాటు, అక్కడున్న పక్షులను సైతం బయటకు పంపించివేసి, పార్వతీ మాతకు సృష్టి రహస్యాన్ని బోధించాడు. అయితే, ఆ సమయంలో గుడ్డు పగిలి బయటకు వచ్చిన ఒక చిన్న చిలుక, ఈ విషయాలు విన్నది. ఈ విషయం పసిగట్టిన శివుడు ఆగ్రహించి, వెంటనే మరణం సంభవించునట్లు శపించాడు. కానీ, మరుసటి జన్మలో బ్రహ్మర్షిగా జన్మించేటట్లు, వరం ప్రసాదించాడు. అందుకే, వ్యాసుడి ద్వారా జన్మించిన శుకుడు, చిలుక పోలికలు కలిగి ఉన్నాడనీ, అదే అతని జన్మ రహస్యమనీ, కొన్ని పురాణాలలో వివరించబడి ఉంది.

సర్వేజనాః సుఖినోభవంతు!

No comments: