Wednesday, 18 May 2022

'అన్య దేవతలు' – వారు ఎవ్వరికీ మాయా బంధనమునుండి విముక్తిని ప్రసాదించలేరు.. Bhagavad Geeta

  

'అన్య దేవతలు' – వారు ఎవ్వరికీ మాయా బంధనమునుండి విముక్తిని ప్రసాదించలేరు..

'భగవద్గీత' సప్తమోధ్యాయం - జ్ఞాన విజ్ఞాన యోగం (16 – 20 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 7 నుండి 12 వరకూ ఉన్న అధ్యాయాలను, భక్తి షట్కము అంటారు. దీనిలో ఏడవ అధ్యాయం, జ్ఞాన విజ్ఞాన యోగము. ఈ రోజుటి మన వీడియోలో, జ్ఞాన విజ్ఞాన యోగములోని 16  నుండి 20 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/Nj0-LbmPlEo ]

భగవంతుడు స్వయంగా, ఎటువంటి వారిని తన స్వరూపంగా భావిస్తాడో, ఇలా వివరిస్తున్నాడు...

00:46 - చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోఽర్జున ।
ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ ।। 16 ।।

ఓ భరత వంశీయులలో శ్రేష్టుడా, నాలుగు రకాలైన ధర్మ-పరాయణులు, నా పట్ల భక్తితో నిమగ్నమవుతారు. ఆపదలో ఉన్నవారూ, జ్ఞాన సముపార్జన కోసం ప్రయత్నించేవారూ, ప్రాపంచిక వస్తువుల సంపాదన కోసం చూసేవారూ, మరియు జ్ఞానము నందు స్థితులై ఉన్న వారు.

తనకు శరణాగతి చేయని నాలుగు రకాల జనుల గురించి చెప్పిన శ్రీ కృష్ణుడు, ఇక ఇప్పుడు, తనను ఆశ్రయించే వారి వర్గీకరణ చేస్తున్నాడు.

1) ఆపదల్లో / దుఖాల్లో ఉన్నవారు - కొంతమంది ప్రజలు ప్రాపంచిక కష్టాలు ఎక్కువైపోయినప్పుడు, ఈ ప్రాపంచికత్వం వెంటపడి పరుగులు పెట్టటం వ్యర్థమనే నిశ్చయానికి వచ్చి, భగవంతుడినే ఆశ్రయించటం మేలని అనుకుంటారు. అదే ప్రకారంగా, ప్రాపంచిక ఆధారాలేవీ వారిని రక్షించలేకపోయినప్పుడు, వారు రక్షణ కోసం భగవంతుడిని ఆశ్రయిస్తారు. శ్రీ కృష్ణుడి కోసం ద్రౌపది చేసిన శరణాగతి, ఇటువంటి కోవకు చెందినదే. కౌరవ సభలో ద్రౌపది వివస్త్రను చేయబడుతున్నప్పుడు, ఆమె మొదట తన భర్తలు రక్షిస్తారనుకుంది. వారు ఎప్పుడైతే ఏమీ చేయలేక, నిస్సహాయులుగా ఉండిపోయారో, సభలో ఉన్న ద్రోణాచార్యుడూ, కృపాచార్యుడూ, భీష్ముడు, మరియు విదురుడి వంటి పుణ్యాత్ములైన పెద్దల మీద ఆశ పెట్టుకుంది. వారు కూడా రక్షించలేకపోయినప్పుడు, తన పళ్ళ మధ్యలో చీరను గట్టిగా పట్టుకుంది. చివరగా, దుశ్శాసనుడు ఆమె చీరను ఒక్కసారిగా లాగినప్పుడు, అది ఆమె పంటి పట్టు నుండి జారి పోయింది. ఆ సమయంలో, ఆమెకు ఇక ఇతరుల రక్షణ మీద నమ్మకం పోయింది. ఇక తన సొంత బలాన్ని కూడా నమ్ముకోలేదు. ఆమె సంపూర్ణముగా, శ్రీ కృష్ణుడికి శరణాగతి చేసింది. వెనువెంటనే ఆయన, సంపూర్ణ రక్షణను అందించాడు. ఆమె చీరను, ఇంకా ఇంకా పొడుగు పెంచటం ద్వారా, అడ్డుకున్నాడు. దుశ్శాసనుడు ఎంత లాగినా, ద్రౌపదిని వివస్త్రను చేయలేక పోయాడు.

2) జిజ్ఞాసువులు (జ్ఞాన సముపార్జన కోసం పయత్నం చేసే వారు) - కొంత మంది ఆధ్యాత్మికత, దేవుడి గురించి తెలుసుకోవాలనుకునే ఉత్సుకతతో, భగవంతుడిని ఆశ్రయిస్తారు. కొందరు ఆధ్యాత్మిక క్షేత్రంలో మోక్షము సాధించారని విని ఉండటం వలన, అదేంటో తెలుసుకోవాలని కుతూహలముతో ఉంటారు. కాబట్టి, వారి కుతూహలాన్ని తీర్చుకోవటం కోసం, వారు భగవంతుడిని ఆశ్రయిస్తారు.

3) ప్రాపంచిక సంపత్తిని కోరేవారు - కొంత మంది తమకు ఏమి కావాలో స్పష్టతతో ఉంటారు కానీ, భగవంతుడు మాత్రమే తమకు అవి ఇవ్వగలడని నమ్మకంతో ఉంటారు. అందుకే ఆయనను ఆశ్రయిస్తారు. ఉదాహరణకి, ధృవుడు తన తండ్రి ఉత్తానపాదుని కంటే ఉన్నతుడవ్వాలనే కోరికతో, తన భక్తిని ప్రారంభించాడు. కానీ, అతని భక్తి పరిపక్వమై, భగవంతుని దర్శనం అయిన తరువాత, అమూల్యమైన, దివ్య ప్రేమ వైఢూర్యాలున్నవాడి నుండి తాను కోరుకున్నది, ఒక ముక్కలైన గాజు వక్కల వంటిది అని తెలుసుకున్నాడు. తదుపరి, భగవంతుడిని తనకు పవిత్రమైన, నిస్వార్ధ భక్తిని ప్రసాదించమని కోరాడు.

4) జ్ఞానులు - చివరగా కొందరు జీవులు, తాము భగవంతుని అణు-అంశలమనీ, తమ సనాతనమైన, శాశ్వతమైన భగవంతుడిని ప్రేమించి, సేవించటమే, సార్థకమనే నిశ్చయానికి చేరుకుంటారు.

04:14 - తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే ।
ప్రియో హి జ్ఞానినోఽత్యర్థమహం స చ మమ ప్రియః ।। 17 ।।

వీరందరిలో కెల్లా, జ్ఞానంతో నన్ను పూజించే వారూ, నా పట్ల ధృడ సంకల్పముతో మరియు అనన్య భక్తితో ఉన్నవారినీ, అందరికంటే శ్రేష్ఠమైన వారిగా పరిగణిస్తాను. నేను వారికి ప్రియమైనవాడినీ, మరియు వారు నాకు ప్రియమైనవారు.

ఆపదలో, ప్రాపంచిక వస్తువుల కోసం, కుతూహలంతో, భగవంతుడిని ఆశ్రయించే వారికి, నిస్వార్ధ భక్తి లేనట్టే. నెమ్మదిగా, క్రమక్రమంగా, భక్తి ప్రక్రియలో వారి మనస్సు పవిత్రమై, వారికి భగవంతునితో తమకున్న నిత్య-శాశ్వత అనుబంధ జ్ఞానం, పెంపొందుతుంది. అప్పుడు వారి భక్తి అనన్యమైనదిగా, ఏక చిత్తముతో, నిరంతరం, భగవత్ పరంగా కొనసాగుతూనే ఉంటుంది. ఈ ప్రపంచం వారిది కాదనే జ్ఞానం పొందటం వలనా, ఇక్కడ సంతోషమనేది దొరకదని తెలియటం వలనా, వారు అనుకూల పరిస్థితుల కోసం తపించరు, ప్రతికూల పరిస్థితుల పట్ల శోకించరు. ఈ విధంగా, వారు నిస్వార్ధ భక్తిలో స్థితమై ఉంటారు. సంపూర్ణ ఆత్మ సమర్పణ, శరణాగతి దృక్పథంలో, దివ్య సఖుడి కోసం, ప్రేమాగ్నిలో తమని తాము సమర్పించుకుంటారు. కాబట్టి, అటువంటి జ్ఞానంలో స్థితులై ఉన్న భక్తులు, తనకు అత్యంత ప్రియమైన వారని, శ్రీ కృష్ణుడు అంటున్నాడు.

05:40 - ఉదారాః సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతమ్ ।
ఆస్థితః స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిమ్ ।। 18 ।।

నా యందు భక్తితో ఉన్నవారందరూ, నిజముగా ఉత్తములే. కానీ, జ్ఞానముతో, ధృడ నిశ్చయముతో ఉండి, బుద్ధి నా యందు ఐక్యమై, కేవలం నన్ను మాత్రమే వారి పరమ లక్ష్యంగా కలిగి ఉన్నవారు, స్వయంగా నా స్వరూపమే అని నేను పరిగణిస్తాను.

జ్ఞానంతో ఉన్న భక్తుడే ఉన్నతమైనవాడు. అయితే, మిగతా మూడు రకాల భక్తులు కూడా, ఆయనకి ప్రియమైన వారే. ఏ కారణంతో అయితేనేమి, భక్తిలో నిమగ్నమై ఉన్నవారందరూ, తనకు ప్రియమైన వారే అని చెప్తున్నాడు. అయినా, జ్ఞానంలో స్థితులై ఉన్న భక్తులు, భౌతిక వస్తు సంపద కారణాల కోసం, భగవంతుడిని పూజించరు. అందుకే, భక్తుల యొక్క ఈ యొక్క నిస్వార్థ, బేషరతుగా ఉన్న ప్రేమకి, భగవంతుడు బద్ధుడై పోతాడు. పరా భక్తి, లేదా దివ్య ప్రేమ అనేది, ప్రాపంచిక ప్రేమ కంటే, చాలా విభిన్నమైనది. దివ్య ప్రేమ అనేది, దివ్య సఖుని సంతోషం కోసం పరితపించే స్వభావంతో ఉంటుంది. ప్రాపంచిక ప్రేమ అనేది, సొంత-ప్రయోజనం కోసం, కోరికచే ప్రెరేపితమైనది. దివ్య ప్రేమ అనేది, ఇచ్చే స్వభావంతో, మరియు ఇష్టసఖుని సేవలో, త్యాగంతో నిండి ఉంటుంది. ప్రాపంచిక ప్రేమ అనేది, తీసుకునే దృక్పథంతో ఉంటుంది. దాని అంతిమ లక్ష్యం, ప్రేమించిన వారి నుండి ఏదో ఒకటి పొందటమే.

07:11 - బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే ।
వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః ।। 19 ।।

ఎన్నో జన్మల ఆధ్యాత్మిక సాధన తరువాత, జ్ఞాన సంపన్నుడు, ఉన్నదంతా నేనే అని తెలుసుకుని, నాకు శరణాగతి చేస్తాడు. అటువంటి మహాత్ముడు, నిజముగా చాలా అరుదు.

చాలా జన్మలలో జ్ఞానం పెంపొందించుకున్న తరువాత, జ్ఞాని యొక్క జ్ఞానము పరిపక్వ దశకు చేరిన పిదప, ఆవ్యక్తి భగవంతునికి శరణాగతి చేస్తాడు. వాస్తవానికి, యదార్ధమైన జ్ఞానం, సహజంగానే భక్తికి దారి తీస్తుంది. జ్ఞానం లేకుండా, విశ్వాసం ఉండలేదు. విశ్వాసం లేకుండా, ప్రేమ పెరుగదు. ఈ విధంగా, యదార్థమైన జ్ఞానం, సహజంగానే ప్రేమతో కూడి ఉంటుంది. మనకు బ్రహ్మం గురించి నిజమైన జ్ఞానం ఉందని అనుకుని, కానీ, ఆయన మీద ఎటువంటి ప్రేమా లేకపోతే, మన జ్ఞానం, ఉత్తగా, సిద్ధాంత పరంగానే ఉన్నట్టు. ఇక్కడ శ్రీ కృష్ణుడు వివరించేది ఏమిటంటే, ఎన్నో జన్మల జ్ఞాన సముపార్జన తరువాత, ఆ జ్ఞాని యొక్క జ్ఞానము, నిజమైన విజ్ఞానముగా పరిపక్వం చెందితే, అతను ఉన్నదంతా, ఆ భగవంతుడే అని తెలుసుకుని, పరమేశ్వరుడికి శరణాగతి చేస్తాడు. ఇటువంటి మహాత్ముడు చాలా అరుదు. దీనిని జ్ఞానులకూ, కర్మీలకూ, హఠ యోగులకూ, తపస్వులకూ చెప్పలేదు. దీనిని ఆయన భక్తులకు చెప్పాడు. సర్వమూ భగవంతుడే అని సంపూర్ణముగా తెలుసుకుని, ఆయనకు శరణాగతి చేసేటటువంటి మహోన్నతమైన ఆత్మ చాలా దుర్లభము.

08:49 - కామైస్తైస్తైర్హృతజ్ఞానాః ప్రపద్యంతేఽన్యదేవతాః ।
తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతాః స్వయా ।। 20 ।।

భౌతిక ప్రాపంచిక కోరికలతో జ్ఞానం కొట్టుకొని పోయినవారు, అన్య దేవతలకు శరణాగతి చేస్తారు. వారి స్వీయ స్వభావాన్ని అనుసరిస్తూ, అన్య దేవతలను ఆరాధిస్తారు. ఆయా దేవతలను ప్రసన్నం చేసుకోవటానికి, ఆయా కర్మ కాండలను ఆచరిస్తారు.

శ్రీ కృష్ణుడే సృష్టిలో సమస్త వస్తువులకూ ఆధారమయినప్పుడు, ఏ ఇతర అన్య దేవతలు కూడా, ఆయన కంటే స్వతంత్రులు కాజాలరు. మన లాంటి జీవాత్మలే అయినా, వారు ఉన్నతులు. వారి పూర్వ జన్మల పుణ్య కార్యముల ఫలితంగా, వారు భౌతిక జగత్తు యొక్క పరిపాలనలో ఉన్నతమైన స్థానం సంపాదించుకుంటారు. వారు ఎవ్వరికీ కూడా మాయ బంధనము నుండి, విముక్తిని ప్రసాదించలేరు. ఎందుకంటే, వారే ఇంకా విముక్తి పొందలేదు. కానీ, వారు తమ పరిధిలోని భౌతిక వస్తువులను ప్రసాదించగలరు. ఈ భౌతిక ప్రాపంచిక కోరికలచే ప్రేరితులై, జనులు దేవతలను పూజిస్తూ, వారి ఆరాధనకు చెప్పబడ్డ నియమాలను పాటిస్తుంటారు. ప్రాపంచిక కోరికలచే, జ్ఞానం కప్పబడిపోయిన ఇటువంటి ప్రజలు, దేవతలని ఆరాధిస్తారు.

10:07 - ఇక మన తదుపరి వీడియోలో, అక్షరమైన, సర్వోత్కృష్టమైన భగవంతుడి యొక్క సాకార రూపాన్ని తెలుసుకునే వారి గురించి తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

No comments: