‘ధర్మరాజు చేసిన అశ్వమేధయాగం ధర్మబద్ధం కాద’ని, ముంగిస వివరించిన యముడి కథ!
కురుక్షేత్ర సంగ్రామం అనంతరం వ్యాసుడు చెప్పిన విధంగా, ధర్మరాజు అశ్వమేధయాగం చేశాడు. మరుత్తు దాచిన నిధితో ధర్మరాజు, యాగాన్ని చాలా గొప్పగా నిర్వహించాడు. భూలోకములో ధర్మరాజు చేసిన ఆ యాగమును, దివి నుండి దేవతలు సహితం ఆసక్తితో తిలకించారు. అంత ఘనంగా జరిగిన ఆ యాగం అధర్మమా? ఆ యాగానికి వచ్చిన ముంగిస చెప్పిన ఉపమానం ఏంటి? అసలు అంత జ్ఞానం కలిగిన ఆ ముంగిస గత జన్మ వృత్తాంతం ఏంటి - వంటి ఆసక్తికర విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..
యాగం కోసం ధర్మరాజు పొందిన ‘మరుత్తు నిధి’ గురించి తెలుసుకోవాలంటే, క్రింద డిస్క్రిప్షన్ లో లింక్ ను పొందుపరిచిన మన గత వీడియోను చూడండి..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/Xd16JFVr_Z0 ]
ధర్మరాజు జరిపిన యాగం సంపూర్ణమయ్యాక, ఎవరి బహుమతులను వారు తీసుకుని, అక్కడి నుండి వెళ్ళిపోయారు. వ్యాసుడు, కృష్ణుడి వంటి మరి కొంతమంది మహానీయులు ఉండగా, అక్కడకు వచ్చిన ఒక ముంగిస, ఈ యాగం ధర్మబద్ధం కాదని, ఒక బ్రాహ్మణుడి కథను వివరించింది..
ధర్మక్షేత్రమని పిలువబడుతున్న ఈ కురుక్షేత్రములో, ఒక బ్రాహ్మణుడుండే వాడు. అతడు మానం, అభిమానం, కామములను జయించిన వాడూ, అతి సౌమ్యుడు. అతడు తన భార్యా, కుమారుడూ, కోడలితో, గృహస్థ జీవనము సాగించేవాడు. అతడు ఊంఛవృత్తిని సాగిస్తూ, పొలములో రాలిపడిన గింజలను ఏరుకుని, తృప్తిగా జీవనం సాగించేవాడు. అలా ఉండగా ఒకనాడు, తీవ్రమైన అనావృష్టి వచ్చి, ఆహారం లభించడం చాలా కష్టతరమయ్యింది. ఒక రోజు వారు నలుగురూ పొలానికి వెళ్ళి, గింజలు ఏరుకుని వచ్చి, వాటితో పేలపిండి చేసి, దేవతారాధనా, సంధ్యా వందనములు నిర్వహించి, పేలపిండిని నలుగురూ, సమానంగా పంచుకున్నారు. వారు ఆ పేలపిండిని తినడానికి సిద్ధమవుతున్న తరుణములో, వారి వద్దకు ఒక బాటసారి అతిథిగా వచ్చాడు. వారు నలుగురూ ఆ అతిథికి ఎదురు వెళ్ళి, సాదరంగా ఆహ్వానించి, కుటీరము లోనికి తీసుకుని వెళ్ళి అతిథి మర్యాదలు చేశారు. అప్పుడా బ్రాహ్మణుడు, "మహానుభావా! ఈ పేలపిండి అన్యార్జితము కాదు. ధర్మముగా సంపాదించింది కనుక, మీరు దీనిని స్వీకరించి, మీ ఆకలిని తీర్చుకోండి" అని అన్నాడు. ఆ పేలపిండిని తిన్న తరువాత కూడా, అతడి ఆకలి తీరలేదు.
అప్పుడా బ్రాహ్మణుడి భార్య ముందుకు వచ్చి, "నాధా! నా వంతు పేలపిండిని కూడా అతిథికి ఇచ్చి, అతడి ఆకలిని తీర్చండి" అని అన్నది. అప్పుడా బ్రాహ్మణుడు, "నోరులేని పక్షులు కూడా, తమ భార్యలకు ఆహారమును సమకూరుస్తాయి. అలాంటప్పుడు, నేను నీ అహారమును ఎలా తీసుకొనగలను?" అని అన్నాడు. ఆ మాటలకు అతడి భార్య, "నాధా! భార్యకు భర్తయే దైవం, చుట్టం, స్నేహితుడు, తల్లి, తండ్రి, గురువు, అన్నీ. కనుక, భర్త కర్తవ్యము నెరవేర్చడం, భార్య ధర్మము కదా! మీరు మీ భాగము పేలపిండిని ఇచ్చారు కనుక, తరువాత ఇవ్వవలసిన బాధ్యత నాది. అదీగాక, మీరు తినకుండా నేను మాత్రము ఎలా తినగలను? కనుక పేలపిండిని అతిథికి ఇవ్వడములో, సంకోచించవలసిన అవసరము లేదు" అని అన్నది. బ్రాహ్మణుడు ఇక తప్పదనుకుని, పేలపిండిని అతిథికి సమర్పించాడు. ఆ పేలపిండి కూడా అతిథి ఆకలిని తీర్చలేదు. అతడు ఇంకా విచారముగా ఉన్నాడు. బ్రాహ్మణుడు అతిథిని సంతోషపెట్ట లేకపోయినందుకు, చింతించసాగాడు.
తండ్రి బాధను చూసిన తనయుడు, "తండ్రీ! మీరలా చింతించవద్దు.. నా వంతు వచ్చిన పేలపిండిని అతిథికి ఇచ్చి, అతడిని తృప్తిపరచండి" అని అన్నాడు. అందుకా బ్రాహ్మణుడు, "కుమారా! ఎంతైనా పెద్ద వాళ్ళకంటే, చిన్న వాళ్ళకు ఆకలి ఎక్కువ. నీ నోటి వద్దనుండి ఆహారమును నేనెలా తీసుకొనగలను?" అని అన్నాడు. ఆ మాటలకు కుమారుడు, "తండ్రీ! కుమారుడంటే, తండ్రికి ప్రతిరూపము కదా! మీ దుఃఖము తీర్చడము కుమారుడిగా నా కర్తవ్యము కాదా? కనుక సంకోచము వదలి, ఈ పేలపిండిని అతిథికి ఇవ్వండి" అని అన్నాడు. కుమారుడి మాటలకు తృప్తిచెందిన బ్రాహ్మణుడు, కుమారుడి వంతు పేలపిండిని కూడా, అతిథికి ఇచ్చాడు. అంతటితోనూ, అతిథి ఆకలి తీరలేదు. అది చూసి బ్రాహ్మణుడు చింతించసాగాడు. అది చూసిన కోడలు, తన వంతు పేలపిండిని మామగారి ముందుంచి, "మామగారూ! ఈ పేల పిండిని కూడా పెట్టి, అతిథి ఆకలిని తీర్చండి" అని అన్నది. అది విని బ్రాహ్మణుడు, "అమ్మా! నీవు కోడలివి... మా దరిద్రములో భాగము పంచుకున్నావు. సరి అయిన ఆహారము లేక, సుకుమారమైన నీ శరీరము శుష్కించి పోయింది. దొరకక దొరకక, ఈ రోజు పేలపిండి దొరికింది. ఇది కూడా ఇచ్చి, నీవు ఆకలితో ఎలా ఉండగలవు? నీవు ఆకలితో అలమటిస్తూ ఉంటే, నేను చూస్తూ ఎలా ఉండగలను?" అని బాధపడ్డాడు. అందుకు కోడలు, "మామగారూ! మీరు నాకు గురువులు. ఈ దేహములో ప్రాణం ఉన్నంత వరకూ, గురువుకు శుశ్రూష చేయడము, శిష్యుల కర్తవ్యము. కనుక ఈ పేలపిండిని అతిథికి సమర్పించి, మీకు సేవ చేసుకునే భాగ్యమును నాకు ప్రసాదించండి." అని బదులిచ్చింది.
ఆ మాటలకు సంతోషించిన బ్రాహ్మణుడు, ఆ పేలపిండిని అతిథికి ఇచ్చాడు. అతిథి ఆ పేలపిండిని తిని, "ఆహా, ఇప్పుడు నా ఆకలి తీరినది" అని అన్నాడు. అది విని నలుగురూ సంతోషించారు. అప్పుడా అతిథి బ్రాహ్మణుడితో, "మిత్రమా! నేను యమధర్మరాజును.. మిమ్ములను పరీక్షించడానికే, మీ ఇంటికి అతిధిగా వచ్చాను. నీ యొక్క, మీ కుటుంబము యొక్క ధర్మనిరతినీ, సద్గుణ సంపత్తినీ చూసి ఆనందించాను. పెద్దల ఎడల భక్తీ, అతిథుల పట్ల వినయం, చేసే పనిమీద శ్రద్ధా, నీకు అధికంగా ఉన్నాయి. నీవు చేసిన దానాని, దేవతలు పై నుండి చూసి ప్రశంసిస్తున్నారు చూడు" అని అన్నాడు. ఆ సమయంలో దేవేంద్రుడు వారి మీద పూలవానను కురిపించాడు. అప్పుడు యమధర్మరాజు, "బ్రాహ్మణోత్తమా! దేవలోకములో సప్తఋషులు, నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. నీవూ, నీ భార్యా, కుమారుడూ, కోడలితో స్వర్గానికి రా" అని పలికి, "మహాభాగా! ఆకలి అన్నింటి కంటే చెడ్డది. ఆకలి బుద్ధినీ, వివేకమునూ మట్టు పెడుతుంది. ఆశ దయాగుణమును నాశనం చేస్తుంది. నీవూ, నీ భార్యా, కుమారుడూ, కోడలూ, ఆశను జయించారు. అతిథి పూజ చేసి, దివ్యత్వమును సాధించారు. నీ దానగుణమునకు మెచ్చిన బ్రహ్మ, తమ లోకానికి మిమ్ము ఆహ్వానించారు. బ్రాహ్మణోత్తమా! తనకున్న సంపదలో దాన ధర్మాలు చెయ్యడం, గొప్ప విషయము కాదు. ధర్మముగా సంపాదించినది కొంచమైనా, తమకంటూ ఏమీ మిగుల్చుకోకుండా, యోగ్యుడైన వాడికి దానం చెయ్యడం, ఉత్తమోత్తమం." అని పలికి, యమధర్మరాజు తన దివ్యమైన రూపమును వారికి చూపించాడు.
ఇంతలో ఆకాశము నుండి, ఒక దివ్య విమానము కనపడింది. అది చూసి వారు ఆశ్చర్య పోయారు. బ్రాహ్మణుడూ, ఆయన భార్యా, కుమారుడూ, కోడలూ, యముడికి సాష్టాంగప్రణామములర్పించారు. "బ్రాహ్మణోత్తమా! అదిగో.. బ్రహ్మదేవుడు పంపిన దివ్య విమానము. మీరంతా ఆ దివ్య విమానమునెక్కి, బ్రహ్మలోకమునకు వెళ్ళండి." అని యమధర్మరాజు వారిని, సాగనంపాడు. అని ఈ కథను చెప్పి, ఇదంతా నేను పక్కనే ఉన్న కలుగులో నుండి చూశాను. నేను వెంటనే, బ్రాహ్మణుడు, యమధర్మరాజు కాళ్ళు కడిగిన నీటిలో అటూ ఇటూ పొర్లినప్పుడు, నా శరీరానికి ఒక వైపు మాత్రమే, ఆ నీరు అంటుకుంది. ఆ నీటి ప్రభావంతో, నా శరీరము సువర్ణమయమయ్యింది. ఆ రోజు నుండి, నేను ఎక్కడ యజ్ఞ యాగములు జరుగుతున్నా, అక్కడకు వెళుతుంటాను. ఎందుకంటే, నా శరీరము రెండవ వైపు కూడా సువర్ణమయమవుతుందని నా ఆశ. కానీ ఇంతవరకూ అలా జరగలేదు. ధర్మరాజు లోకోత్తరమైన యాగము చేస్తున్నాడని విని, ఇక్కడకు వచ్చాను. కానీ, ఇక్కడున్న నీటిలో ఎంత పొర్లినా, నా మిగిలిన శరీరము సువర్ణము కాలేదు. ఎందుకంటే, కేవలం పొలములో రాలిన గింజలు ఏరుకుని తినే బ్రాహ్మణుడే అయినా, తాను చేసిన దానమునకు, ధర్మరాజు చేసే ఈ అశ్వమేధయాగం సాటిరాదని, తెలుసుకున్నాను. అని చెప్పి, ముంగిస అక్కడినుండి వెళ్ళిపోయింది.
సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడి సమక్షంలో, ధర్మానికి మారుపేరైన ధర్మరాజు చేసిన యాగం, అధర్మబద్ధమైనదని నిరూపించిన ఈ కథను విన్న జనమేజయుడు, వైశంపాయనుడితో, ‘మహర్షీ! మనుష్యభాషలో మాట్లాడిన ఆ ముంగిస వృత్తాంతం తెలుసుకోవాలనుకుంటున్నాను. దయచేసి ఆ ముంగిస పూర్వజన్మ గురించి వివరించగలరు’ అని అడిగాడు. అప్పుడు వైశంపాయనుడు.. "ఒకసారి పితృకార్యము చేయ సంకల్పించి, ఒక కొత్తకుండలో, తమ ఇంటిలో ఉన్న హోమధేనువు పాలను పితికి, ఒక ప్రదేశములో పదిలంగా పెట్టాడు జమదగ్ని. అప్పుడతడిలోని క్రోధ దేవత సాకారముగా వచ్చి, పొరపాటున చేసినట్లు, ఆ పాలకుండను పడగొట్టింది. పాలన్నీ నేలపాలయ్యాయి. అది చూసిన జమదగ్ని కోపించ లేదు. అప్పుడు క్రోధ దేవత, "జమదగ్నీ! సాధారణంగా భృగు వంశస్థులు, మహాకోపిష్టులు కదా! అది నిజము కాదని నీవు నిరూపించావు. నేను ఓడిపోయాను. నీ పట్ల అపరాధము చేసినందుకు, నన్ను క్షమించు" అని అన్నది. అప్పుడు జమదగ్ని, "అదేమిటి? నీవేమి తప్పు చేశావు? ఒక వేళ నీవు తప్పు చేశావని భావిస్తే, దానిని నీ మనస్సు నుండి తీసి వెయ్యి.
అయినా, నీవు మా పితృదేవతలకు చేయు శ్రాద్ధకర్మలకు విఘ్నము కలిగించావు. అందువలన, పితృదేవతలు నిన్ను శపించగలరు. కనుక నీవు ఇక్కడి నుండి వెళ్ళిపో" అని అన్నాడు. జమదగ్ని మాట మన్నించి, క్రోధదేవత అక్కడి నుండి వెళ్ళిపోయింది. తరువాత జమదగ్ని ఆహ్వానము మీద అక్కడకు వచ్చిన పితృదేవతలు, జరిగిన విషయము తెలుసుకున్నారు. వారు జరిగిన దానికి కోపించి, "నీవు చేయబోవు శ్రాద్ధకర్మకు విఘ్నము కలిగించిన క్రోధదేవతను శపించక విడిచి, క్షమించరాని శాంతము వహించావు. అందువలన నీవు ముంగిసవై పుట్టు" అని శపించారు. అప్పుడు జమదగ్ని, "పితృదేవతలారా! బ్రాహ్మణులకు కోపము తగదంటారు కదా! అందుకని క్రోధదేవతను శపించలేదు. నా అపరాధమును మన్నించి, నాకు శాపవిమిక్తి కలిగే మార్గమును సూచించండి" అని వేడుకున్నాడు. పితృదేవతలు శాంతించి, "కుమారా! మహా పండితులున్న సభలో, ఒక మహా ధర్మమును అధర్మముగా నిరూపించి, శాపవిముక్తుడవై, మోక్షపథమును పొందుము" అని సెలవిచ్చారు.
జనమేజయ మహారాజా! ధర్మరాజు సభలో మాట్లాడిన ముంగిస, గతజన్మలో జమదగ్ని. శాపవశాత్తూ ముంగిసగా జన్మించి, ధర్మరాజు చేసిన అశ్వమేధయాగాన్ని అధర్మమని నిరూపించి, శాపవిముక్తిని పొందింది." అని వైశంపాయనుడు వివరించాడు.
ధర్మో రక్షతి రక్షితః!
No comments: