Wednesday, 29 June 2022

ప్రళయము – నాలుగు రకాలు! భగవద్గీత Bhagavad Geeta

 

ప్రళయము – నాలుగు రకాలు! అలౌకికమైన మరియు సనాతనమైన అవ్యక్త అస్థిత్వం అంటే?

'భగవద్గీత' అష్టమోధ్యాయం - అక్షర బ్రహ్మ యోగం (18 – 22 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 7 నుండి 12 వరకూ ఉన్న అధ్యాయాలను భక్తి షట్కము అంటారు. దీనిలో ఎనిమిదవ అధ్యాయం, అక్షర బ్రహ్మ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, అక్షర బ్రహ్మ యోగములోని 18 నుండి 22 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/P5npOaGsEJ0 ]

ఆయన యందే స్థితమై ఉన్న సర్వ ప్రాణులూ, సర్వ వ్యాప్తుడైన భగవంతుడిని ఏ విధంగా తెలుసుకోవాలో, శ్రీ కృష్ణుడిలా వివరిస్తున్నాడు..

00:50 - అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః ప్రభవంత్యహరాగమే ।
రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్తసంజ్ఞకే ।। 18 ।।

బ్రహ్మ యొక్క పగలు ప్రారంభంకాగానే, సమస్త ప్రాణులూ అవ్యక్త మూలం నుండి ఉద్భవిస్తాయి, మరియు ఆయన రాత్రి మొదలైనంతనే, అన్ని జీవాత్మలూ, తమ అవ్యక్త రూపంలోకి లీనమైపోతాయి.

మహాద్భుతమైన విశ్వ క్రీడలో వివిధ లోకాలూ, వాటి యొక్క గ్రహ వ్యవస్థలూ, మళ్లీ మళ్లీ, సృష్టీ, స్థితీ, ప్రళయ చక్రానికి గురవుతూనే ఉంటాయి. బ్రహ్మ యొక్క ఒక పగలు అయిపోయేటప్పటికి, అంటే, ఒక కల్పము యొక్క (432,00,00,000) నాలుగు వందల ముప్ఫై రెండు కోట్ల సంవత్సరములలో, మహర్లోకం వరకూ ఉన్న అన్ని గ్రహ వ్యవస్థలూ నాశనం చెందుతాయి. దీనినే, నైమిత్తిక ప్రళయం, అంటే, పాక్షిక లయము అంటారు. ఎలాగైతే ఒక పిల్లవాడు పగలు ఆడుకునేటప్పుడు బొమ్మలతో నిర్మాణాలు చేసి, పడుకునేటప్పుడు వాటిని మళ్లీ తీసేస్తాడో, అదే విధంగా, బ్రహ్మ లేచినప్పుడు, ఈ విశ్వ-గ్రహాల వ్యవస్థనీ, వాటి యందు జీవ రాశులనూ సృష్టించి, పడుకునే ముందు వాటన్నింటినీ లయం చేస్తాడు. బ్రహ్మ యొక్క 100 సంవత్సరముల జీవన కాలం ముగిసే సమయానికి, సమస్త విశ్వమూ లయం చేయబడుతుంది. ఈ సమయంలో, మొత్తం భౌతిక సృష్టి లయం చేయబడుతుంది. పంచ-మహాభూతములు, పంచ-తన్మాత్రలలో విలీనమవుతాయి. పంచ తన్మాత్రలు, అహంకారములో విలీనమవుతాయి. అహంకారము, మహత్తు యందు విలీనమవుతుంది.. మహత్తు, ప్రకృతిలోనికి విలీనమవుతుంది. ప్రకృతి అనేది, భౌతిక శక్తి, మాయ యొక్క సూక్ష్మ రూపము. మాయ - దాని యొక్క ఆదిమమైన రూపంలో, మహా విష్ణువు యొక్క శరీరంలో కూర్చుంటుంది. దీనినే, ప్రాకృతిక ప్రళయం, లేదా మహా ప్రళయం అంటారు. తిరిగి మహా విష్ణువు సృష్టి చేయటానికి ఎప్పుడైతే సంకల్పిస్తాడో, ఆయన ప్రకృతి రూపంలో ఉన్న భౌతిక శక్తి వైపు తన చూపును ప్రసరిస్తాడు. కేవలం ఆయన దృష్టి సారించినంతనే, అది ఆవిష్కరించటం మొదలవుతుంది. ప్రకృతి నుండి మహత్తు వస్తుంది, మహత్తు నుండి అహంకారము వస్తుంది, అహంకారము నుండి పంచ-తన్మాత్రలు సృష్టించబడతాయి, పంచ-తన్మాత్రల నుండి పంచ-మహాభూతాలు సృష్టించబడతాయి. ఈ ప్రకారంగా, అనంతమైన బ్రహ్మాండాలు సృష్టించబడతాయి.

03:18 - భూతగ్రామః స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే ।
రాత్ర్యాగమేఽవశః పార్థ ప్రభవత్యహరాగమే ।। 19 ।।

బ్రహ్మ యొక్క పగలు మొదలవగానే, సమస్త జీవ రాశులూ పదే పదే పుట్టడం ప్రారంభమవుతుంది, మరియు బ్రహ్మ రాత్రి ప్రారంభమవగానే, అవి తిరిగి లయమైపోతాయి. మరల మరుసటి బ్రహ్మ పగలు మొదలవగానే, అవన్నీ అప్రయత్న పూర్వకంగానే వ్యక్తమవుతాయి.

వేదములు నాలుగు రకాల ప్రళయములను పేర్కొన్నాయి.

నిత్య ప్రళయం: ప్రతి రోజూ మనం గాఢ నిద్రలోనికి జారిపోయినప్పుడు, మనలోని స్పృహ లయమైపోవటాన్ని, నిత్య ప్రళయం అంటారు.

నైమిత్తిక ప్రళయం: బ్రహ్మ యొక్క పగలు అయిపోయే సమయంలో, మహర్లోకం వరకూ ఉన్న అన్ని లోకాలూ లయమై పోయే ప్రక్రియని, నైమిత్తిక ప్రళయం అంటారు. ఆ సమయానికి ఆయా లోకాల్లో నివసిస్తున్న ఆత్మలన్నీ, అవ్యక్తమైపోతాయి. అవి విష్ణుమూర్తి దేహంలో అచేతనావస్థలో ఉంటాయి. తిరిగి బ్రహ్మ ఈ లోకాలను సృష్టించినప్పుడు, వీటికి తమ తమ పూర్వ జన్మ కర్మల ప్రకారంగా, పుట్టుక లభిస్తుంది.

మహా ప్రళయం: ఇది బ్రహ్మ యొక్క జీవన కాలం ముగిసినప్పుడు జరిగే సమస్త విశ్వం యొక్క లయం. ఈ సమయంలో, విశ్వంలోని అన్ని ఆత్మలూ, మహా విష్ణువు యొక్క దేహంలో అచేతనావస్థ లోనికి వెళ్తాయి. వాటి యొక్క స్థూలశరీరాలూ, మరియూ సూక్ష్మ శరీరాలూ లయమైపొతాయి కానీ, కారణ శరీరాలు ఉండిపోతాయి. తదుపరి సృష్టి క్రమం జరిగినప్పుడు, వాటికి మళ్లీ తమ తమ కారణ శరీరాల్లో దాచి ఉన్న సంస్కారాలూ, మరియూ కర్మలను బట్టి, వాటికి జన్మ ఇవ్వ బడుతుంది.

ఆత్యంతిక ప్రళయం: ఆత్మ చివరికి భగవంతుడిని చేరుకున్నప్పుడు, అది జనన-మరణ చక్రం నుండి శాశ్వతంగా విడుదల చేయబడుతుంది. ఆత్యంతిక ప్రళయం అంటే, జీవుడిని సనాతనముగా కట్టివేసిన మాయా బంధనములు వీడిపోవటం.

05:19 - పరస్తస్మాత్తు భావోఽన్యోఽవ్యక్తోఽవ్యక్తాత్ సనాతనః ।
యః స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి ।। 20 ।।

ఈ యొక్క వ్యక్తమయిన, మరియు అవ్యక్తమయిన సృష్టి కంటే, అలౌకికమైన, మరియూ సనాతనమైన అవ్యక్త అస్థిత్వం కలదు. మిగతా అన్నీ నశించిపోయినా, ఆ లోకము మాత్రము నిత్యము, నశించదు.

భౌతిక లోకాల యొక్క నిజ స్వరూపము, మరియు వాటి యొక్క తాత్కాలిక స్వభావము వెల్లడించిన తరువాత, శ్రీ కృష్ణుడు తదుపరి ఇక ఆధ్యాత్మిక కోణ పరిధి గురించి, మాట్లాడుతున్నాడు. అది భౌతిక శక్తి కన్నా అతీతమైనది, మరియూ భగవంతుని దివ్య యోగమాయా శక్తిచే సృష్టించబడినది. మిగతా అన్ని భౌతిక లోకాలూ నాశనమై పోయినా, అది మాత్రం వినాశము చెందదు. భగవంతుని సమస్త సృష్టిలో, దివ్య ఆధ్యాత్మిక ధామము 3/4వ(ముప్పావు) వంతు, భౌతిక లోకములు 1/4వ(పావు) వంతు సృష్టించబడి ఉంది.

06:19 - అవ్యక్తోఽక్షర ఇత్యుక్తస్తమాహుః పరమాం గతిమ్ ।
యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ ।। 21 ।।

ఆ యొక్క అవ్యక్తమైన విస్తారమే, సర్వోన్నత లక్ష్యము. దానిని చేరిన తరువాత, వ్యక్తి ఈ లౌకికమైన మర్త్య లోకానికి తిరిగిరాడు. అది నా యొక్క పరంధామము.

ఆధ్యాత్మిక లోకంలోని దివ్య ఆకాశాన్నే, పరవ్యోమము అంటారు. భగవంతుని భిన్న స్వరూపముల యొక్క శాశ్వతమైన దివ్య ధామములు, అక్కడ ఉంటాయి. ఉదాహరణకి : శ్రీ కృష్ణుని ధామమైన గోలోకమూ, శ్రీ రామచంద్రుని ధామమైన సాకేత లోకమూ, నారాయణుని ధామమైన వైకుంఠ లోకమూ, సదాశివుని లోకమైన శివ లోకమూ, దుర్గా మాత ధామమైన దేవీ లోకము మొదలగునవి. ఈ లోకాల్లో, సర్వేశ్వరుడు తన దివ్య మంగళ స్వరూపముతో, తన నిత్య పరివారముతో, నిత్యమూ నివసిస్తుంటాడు. ఈ యొక్క భగవంతుని స్వరూపాలన్నీ, ఒకదానికి ఒకటి అభేధములే, ఇవి అన్నీ ఒకే భగవంతుని వేరువేరు రూపములు మాత్రమే. ఏ రూపాన్ని ఆరాధిస్తే భగవత్ ప్రాప్తిని పొందుతామో, ఆ భగవత్ స్వరూపము యొక్క ధామానికి చేరుకుంటాము. దివ్య శరీరము తీసుకున్న తరువాత, ఆత్మ,భగవంతుని దివ్య కార్యకలాపాలలో, దివ్య లీలలలో, ఇక శాశ్వతంగా పాలు పంచు కుంటుంది.

07:43 - పురుషః స పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా ।
యస్యాంతఃస్థాని భూతాని యేన సర్వమిదం తతమ్ ।। 22 ।।

సర్వోత్కృష్ట పరమ పురుషుడే, అన్నింటికన్నా సర్వోన్నతుడు. ఆయన సర్వ వ్యాప్తుడూ, మరియూ సర్వ ప్రాణులూ ఆయన యందే స్థితమై ఉన్నా, ఆయన కేవలం భక్తి చేత మాత్రమే తెలుసుకోబడతాడు.

ఆధ్యాత్మిక అంతరిక్షంలో, తన దివ్య ధామములో నివసించే భగవంతుడే, మన హృదయములో కూడా స్థితుడై ఉన్నాడు. ఆయన భౌతిక ప్రపంచంలో ప్రతి పరమాణువులో కూడా నిండి నిబిడీకృతమై ఉన్నాడు. భగవంతుడు అంతటా సమానంగా ఉన్నాడు. ఆయన అంతటా, నూటికి నూరు శాతం ఉన్నాడు. కానీ, ఆ యొక్క సర్వ-వ్యాప్త భగవానుని అస్థిత్వం, మనకు ఎటువంటి ఉపయోగకారిగా ఉండదు. ఎందుకంటే, దాని యొక్క అనుభూతిని మనం రుచి చూడలేము. సర్వ వ్యాపి భగవంతుని గురించి, శాండిల్య ముని ఈ విధంగా పేర్కోన్నాడు.. “ఆవు శరీరంలోనే పాలు ఉంటాయి.. కానీ, నీరసంగా, అనారోగ్యంతో ఉన్న ఆవుకు, అవి ఏమీ ఉపయోగ పడవు. అదే పాలను ఆవు నుండి పితికి, పెరుగుగా మార్చి, ఆ పెరుగును మిరియాల పొడితో కొద్దిగా కలిపి దానికే తినిపిస్తే, అది ఆవును నయం చేస్తుంది.” అదే విధంగా, సర్వ-వ్యాపి భగవంతుని ఉనికికి, మన భక్తిని రంజిల్లచేసే అన్యోన్యత ఉండదు. మొదట మనం ఆయన దివ్య మంగళ స్వరూపాన్ని ఆరాధించి, మన హృదయములో అంతఃకరణ శుద్ధిని పెంపొందించుకోవాలి. అప్పుడు మనం భగవత్ కృపని ఆకర్షించగలం. ఆయన కృపచే, మన మనో, ఇంద్రియబుద్ధుల యందు, తన యొక్క యోగ మాయా శక్తిని ప్రవేశ పెడతాడు. అప్పుడు మన ఇంద్రియములు దివ్యమైనవి అవుతాయి. మనం భగవంతుడిని సగుణ సాకారంగా కానీ, లేదా సర్వ-వ్యాప్త తత్వంలో కానీ, ఆయన దివ్యత్వాన్ని అర్థం చేసుకో గలం. ఈ విధంగా శ్రీ కృష్ణుడు, తాను భక్తి ద్వారా మాత్రమే తెలుసుకోబడతానని పేర్కొంటున్నాడు.

09:46 - ఇక మన తదుపరి వీడియోలో, ఆత్మ ఈ లోకం నుండి వెళ్ళిపోవడానికి గల రెండు మార్గాల గురించి, శ్రీ కృష్ణుడు వివరించ బోతున్నాడు..

కృష్ణం వందే జగద్గురుం!

No comments: