Monday 27 June 2022

‘బ్రాహ్మణత్వం’ గురించి అంపశయ్యపై ఉన్న భీష్ముడు చెప్పిన కథ! Brahminhood

  

‘బ్రాహ్మణత్వం’ గురించి అంపశయ్యపై ఉన్న భీష్ముడు చెప్పిన కథ!

అంపశయ్యపై ఉన్న భీష్మ పితామహుడు, రాజ్య పాలన ఏ విధంగా చేయాలి, ఒక రాజు ఎటువంటి నీతిని పాటించాలి, ఎటువంటి నిర్ణయాలు ప్రజలకు మేలు చేస్తాయి, అనేటటువంటి అనేక అంశాలను, ధర్మరాజుకు బోధించాడు. వాటిలో ఎన్నో అంశాలను కథల రూపంగా, చక్కగా, విపులంగా వివరించి చెప్పాడు భీష్ముడు. ధర్మనందనుడికి చెప్పిన అనేక కథలలో ఒకటి, మాతంగుడి చరిత్ర. విప్రకుమారుడు ఛండాలుడెలా అయ్యాడు? తిరిగి మాతంగుడు తన బ్రాహ్మణత్వాన్ని పొందాడా? బుుషీకుడి కుమారుడైన జమదగ్నికి, క్షత్రియ స్వభావం కలిగిన పరుశురాముడు పుట్టడానికి గల కారణమేంటి – వంటి అనేక ఆసక్తికర విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/huVcwGJyhBg ]

ధర్మరాజు భీష్ముడితో, "పితామహా! బ్రాహ్మణులు కాక, ఇతరులు తాము చేసే గుణకర్మల వలన బ్రాహ్మణత్వము పొందవచ్చునా!" అని తన సందేహాన్ని వెలిబుచ్చాడు. అందుకు భీష్ముడు సమాధానంగా, "ధర్మనందనా! బ్రాహ్మణత్వము పొందడం, చాలా దుర్లభం. ఎన్నో జన్మలెత్తిన తరువాత కానీ, బ్రాహ్మణ జన్మ లభించదు. ఈ విషయము గురించి, నీకొక ఇతిహాసము చెబుతాను విను. అని మాతంగుడి కథను చెప్పనారంభించాడు.

పూర్వం మాతంగుడనే విప్రకుమారుడుండే వాడు. అతడు తన తండ్రి ఆదేశానుసారము ఒక యజ్ఞానికి వెళుతుండగా, దారిలో అడ్డొచ్చిన ఒక గాడిదపిల్లను, కర్రతో కొట్టాడు. ఆ గాడిద పిల్ల ఏడుస్తూ, ప్రక్కనే పొద దగ్గర ఉన్న తన తల్లి వద్దకు వెళ్ళి, జరిగిన సంగతి చెప్పింది. ఆ గాడిద తన కూతురుతో, "అమ్మా! ఇతడు చండాలుడూ, క్రూరుడూ.. అందుకే నిన్ను అలా కొట్టాడు" అని చెప్పింది. గాడిద మాటలను అర్ధం చేసుకున్న విప్రకుమారుడు, "గాడిద ఊరికే అలా అనలేదు. గాడిద మాటల్లో ఏదో అంతరార్ధము దాగి ఉంది. లేకుంటే, అది నన్ను చండాలుడని ఎందుకు అంటుంది?" అని భావించి, ఆ గాడిద వద్దకు వెళ్ళి తన జన్మరహస్యము చెప్పమని అడిగాడు. అందుకు గాడిద, "విప్రకుమారా! నీ తల్లి కామంతో, ఒక క్షురకుని వలన నిన్ను కన్నది. కనుక నీవు బ్రాహ్మణుడివి కాదు" అని చెప్పింది.

ఆపై అతడికి యజ్ఞానికి వెళ్ళడానికి మనస్కరించక, ఇంటికి తిరిగి వెళ్ళి తండ్రితో "తండ్రీ! నేను బ్రాహ్మణ స్త్రీకీ, క్షురకుడికీ పుట్టాను కనుక, బ్రాహ్మణుడను కాను. ఆ గార్ధభం, ఏదో శాపవశాన అలా జన్మ ఎత్తి ఉంటుంది. లేకుంటే, ఈ నా జన్మరహస్యము ఎలా తెలుస్తుంది? తండ్రీ, నేను తపస్సు చేసి, బ్రాహ్మణత్వమును సంపాదిస్తాను" అని చెప్పి, మాతంగుడు తపస్సు చేయడానికి అడవులకు వెళ్ళాడు. అలా మాతంగుడు కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేసి, ఇంద్రుడిని ప్రసన్నము చేసుకున్నాడు. ఇంద్రుడు ప్రత్యక్షమై, "కుమారా! నీవు తపస్సు ఎందుకు చేస్తున్నావు? నీ కోరిక ఏమిటి?" అని అడిగాడు. అప్పుడు మాతంగుడు, "దేవా! నాకు బ్రాహ్మణత్వము ప్రసాదించండి" అని అడిగాడు. దానికి ఇంద్రుడు, "కుమారా! బ్రాహ్మణత్వము మహత్తరమైనది. ఇతరులకు అది లభ్యము కాదు కనుక, మరేదైనా వరము కోరుకో" అని అన్నాడు. అందుకు మాతంగుడు, "అయ్యా! నా కోరిక తీర్చడం మీకు కుదరదు కనుక, మీరు వెళ్ళండి. నా తపస్సును కొనసాగిస్తాను" అని అన్నాడు. దాంతో ఇంద్రుడు తిరిగి వెళ్ళగానే, మాతంగుడు తన తపస్సును కొనసాగించి, ఒంటి కాలి మీద మరొక నూరేళ్ళు తపస్సు చేసి, ఇంద్రుడిని మళ్ళీ ప్రత్యక్షం చేసుకున్నాడు.

అప్పుడు ఇంద్రుడు, "కుమారా! నీ పట్టు విడువక ఉన్నావు! శూద్రుడు ఇలాంటి తపస్సు చేస్తే, చస్తాడు.. జాగ్రత్త.. అని బెదిరించి - అసలు బ్రాహ్మణత్వము ఎలా సిద్ధిస్తుందో నీకు తెలుసా? ఇంతకంటే పది రెట్లు తపస్సు చేస్తే కానీ, ఒక చండాలుడు శూద్రుడు కాలేడు. దాని కంటే నూరు రెట్లు తపస్సు చేస్తే కానీ, శూద్రుడు వైశ్యుడు కాలేడు. దానికి వేయి రెట్లు తపస్సు చేసిన కానీ, వైశ్యుడు క్షత్రియుడు కాలేడు. దానిపై పది వేల రెట్లు తపస్సు చేసిన కానీ, క్షత్రియుడు దుర్మార్గుడైన బ్రాహ్మణుడు కాలేడు. దానికంటే లక్షరెట్లు తపస్సు చేస్తే కానీ, దుర్మార్గు డైన బ్రాహ్మణుడు, ఇంద్రియములనూ, మనస్సునూ జయించి, సత్యమూ, అహింసలనూ పాటించి, మాత్సర్యమును విడిచి పెట్టి, సద్బ్రాహ్మణుడు కాలేడు. అటువంటి సద్బ్రాహ్మణత్వము, ఒక వంద సంవత్సారాల తపస్సుకు వస్తుందా చెప్పు?" అన్నాడు. ఒక వేళ బ్రాహ్మణ జన్మ పొందినా, దానిని నిలబెట్టు కొనుట కష్టం.

ఒక్కొక్క జీవుడూ, అనేక జన్మల తర్వాత కానీ, బ్రాహ్మణ జన్మ ఎత్త లేడు. అలా ఎత్తినా, అతడు దానిని నిలబెట్టుకోలేడు. ధన వాంఛ, కామ వాంఛ, విషయాసక్తితో సదాచారములను వదలి, దుర్మార్గుడవుతాడు. తిరిగి బ్రాహ్మణ జన్మ రావడానికి, ఎన్నో ఏళ్ళు పడుతుంది. అటువంటి బ్రాహ్మణ జన్మ కొరకు నీవు తాపత్రయపడి, నీ వినాశనమును ఎందుకు కొని తెచ్చుకుంటావు? నీకిష్టమైన మరొక వరము కోరుకో ఇస్తాను.. తపస్సు చాలించు" అని అన్నాడు. దానికి ఎటువంటి సమాధానమూ చెప్పుకుండా నిలబడిన మాతంగుడి మొండి తనమును చూసి విసుగు చెంది, ఇంద్రుడు వెళ్ళి పోయాడు. మాతంగుడు తిరిగి తన తపస్సును కొనసాగించాడు. కాలి బొటనవేలి మీద నిలబడి, శరీరం శుష్కించి అస్థిపంజరం అయ్యేవరకూ తపస్సు చేశాడు. అతడి శరీరము శిధిలమై పడిపోతుండగా, ఇంద్రుడు పట్టుకున్నాడు. ఏమిటి నాయనా ఇది? పెద్ద పులిలా నిన్ను మ్రింగివేయగల బ్రాహ్మణత్వము నీకెందుకు? చక్కగా వేరు వరములు అడిగి, సుఖపడు" అని అన్నాడు. మాతంగుడందుకు అంగీకరించగానే ఇంద్రుడు, "నీవు చండదేవుడనే పేరుతో, అందమైన స్త్రీల పూజలందుకుని, వారి వలన నీ కోరికలు తీర్చుకుంటావు" అని వరాలు ప్రసాదించాడు.

ఈ మాతంగుడి కథ విన్న ధర్మరాజు, ‘పితామహా! ఇంద్రుడు చెప్పినట్లు, బ్రాహ్మణత్వము పొందడం దుర్లభమయినట్లయితే, క్షత్రియుడైన విశ్వామిత్రుడికి బ్రాహ్మణత్వము ఎలా సిద్ధించిందో వివరించండి’ అని అడిగాడు. దానికి భీష్ముడు, ‘ధర్మనందనా! జాహ్నవీ దేవికి తండ్రి అయిన జహ్నుడనే వాడి వంశములో, గాధి జన్మించాడు. గాధి కూతురు సత్యవతి. సత్యవతిని తనకిచ్చి వివాహము చేయమని ఋచీకుడడుగగా, దానికి అంగీకరించని గాధి, చెవి తెల్లగా ఉన్న వేయి గుర్రములను కట్నంగా ఇస్తే, సత్యవతిని ఋచీకుడి కిచ్చి వివాహము జరిపిస్తానని, షరతు విధించాడు. ఋచీకుడు రోషంతో, గుర్రములను వెతికి తెస్తానని చెప్పాడు. ఋచీకుడు వరుణుడి వద్దకు వెళ్ళి "నాకు తెల్లని చెవులు కలిగిన వేయిగుర్రాలను ఇవ్వు" అని అడిగగా వరుణుడు, "ఈ మాత్రానికి ఇంత దూరము రావాలా! నీవు కోరిన వెంటనే నీ ఎదుట నిలబడతాయి" అని చెప్పాడు. వెంటనే ఋచీకుడు గంగానది ఒడ్డుకు వెళ్ళి, పద్మాసనము వేసుకుని కూర్చుని, కళ్ళు మూసుకుని, "నాకు తెల్లని చెవులు కలిగిన వేయి గుర్రాలు కావాలి" అని కోరుకోగానే, అతడి ఎదుట తెల్లని చెవులు కలిగిన వేయిగుర్రాలు నిలబడ్డాయి. అప్పటి నుండీ ఆ ప్రదేశము, అశ్వతీర్ధముగా ప్రసిద్ధి చెందింది.

ఋచీకుడు ఆ గుర్రాలను గాధికిచ్చాడు. గాధి ఇక చేసేది లేక, సత్యవతిని ఋచీకుడికిచ్చి వివాహము చేశాడు. ఋచీకుడు కొన్ని సంవత్సరాలు సత్యవతితో కాపురము చేసిన పిదప సంతానం కావాలని కోరిక కలిగి, "సత్యవతీ! సంతానము కొరకు నేను యజ్ఞములో ఇచ్చే చరువు సంపాదిస్తాను" అని అన్నాడు. అప్పుడు సత్యవతి తల్లి, తనకూ సంతానం కావాలనీ, అందు కొరకు తనకు కూడా చరువు కావాలనీ కోరింది. ఋచీకుడు అందుకు అంగీకరించి, రెండు చరువులు సంపాదించి, వాటిని తన తపోశక్తితో నింపాడు. వాటిలో ఒక చరువులో ఉన్న యజ్ఞశేషాన్ని భుజించిన వారికి, ఉజ్వలంగా ప్రకాశించే బ్రాహ్మణుడు పుడతాడు, రెండవ చరువులోని యజ్ఞ శేషాన్ని భుజించిన వారికి, రాజస భావం కలిగిన పుత్రుడు పుడతాడు. ఋచీకుడు సత్యవతిని చూసి, "సత్యవతీ! ఒకటి క్షాత్ర శక్తి ప్రధానంగా ఉండే పుత్రుడిని ఇస్తుంది. నీవు దానిని నీ తల్లికి ఇవ్వు. రెండవది, సాత్వికత, బ్రాహ్మణత్వము ప్రధానుడైన పుత్రుడినిస్తుంది. దానిని నువ్వు స్వీకరించు. తరువాత ఋతు సమయంలో నీవు మేడి చెట్టునూ, నీ తల్లి రావి చెట్టునూ కౌగలించుకున్నట్లయితే, మీకు సంతానము కలుగుతుంది" అని చెప్పాడు. కానీ, విధివిలాసంగా, చరువును తీసుకునే సమయంలో చరువులూ, కౌగలించుకున్న వృక్షములూ తారుమారై, ఫలితంగా వారు ధరించిన గర్భాలు, తారుమారయ్యాయి.

ఇదంతా దివ్యదృష్టితో తెలుసుకున్న ఋచీకుడు సత్యవతితో, "సత్యవతీ! మీ చరువులూ, వృక్షములూ తారుమారయ్యాయి. ఫలితంగా, నీ గర్భంలో దుర్మార్గుడైన క్షత్రియుడు పెరుగుతున్నాడు.” అని చెప్పాడు. ఆ మాటకు తల్లడిల్లిన సత్యవతి, "సద్బ్రాహ్మణులూ, తపశ్శాలీ అయిన మీకు, దుర్మార్గుడైన క్షత్రియుడు కలిగిన, మీకు అపకీర్తి కదా! మీ మహిమ చేత ఈ అవాంతరము నివారించండి" అని వేడుకుంది. అందుకు ఋచీకుడు అంగీకరించి, ఆ ప్రభావమును ఒక జన్మకాలము పొడిగించి, ‘నీకు సద్బ్రాహ్మణుడూ, నీకుమారుడికి క్షత్రియాంశ కలిగిన కుమారుడూ జన్మిస్తాడు’ అని వరం ఇచ్చాడు. అలా సత్యవతికి జమదగ్ని జన్మించాడు. జమదగ్ని కుమారుడు పరశురాముడు, క్షత్రియాంశతో జన్మించి, క్షత్రియ కుల వినాశకుడయ్యాడు. సత్యవతి తల్లికి విశ్వామిత్రుడు జన్మించినా, అతడికి బ్రాహ్మణ ధర్మమునందు ఆసక్తి కలిగింది. ఎంతో కఠోర తపస్సు చేసి, బ్రహ్మర్షిగా మారాడు విశ్వామిత్రుడు. ఋచీకుడి కుమారుడిగా జన్మించి బ్రహ్మణత్వాన్ని పొందాల్సిన విశ్వామిత్రుడు, క్షత్రియుడిగా జన్మించి, బ్రహ్మణ ధర్మాన్ని ఆచరించి, బ్రహ్మర్షిగా, ముల్లోకాలలో పూజనీయుడయ్యాడు." అని భీష్ముడు ధర్మరాజుకు బ్రహ్మణత్వం గురించిన కథను చెప్పాడు.

శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే ।
శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః ।।

No comments: