ఇంద్రాణిని కోరుకున్న నహుషుడేమయ్యాడు? శల్యుడు ధర్మరాజుకు చెప్పిన కథ!
మహా భారతంలోని కొన్ని సంఘటనలు, మనకు విస్మయాన్ని కలిగిస్తాయి. కురుక్షేత్ర సమరంలో దుర్యోధనుడి పక్షాన నిలబడిన వారిలో అధిక శాతం మంది, ధర్మ పరాయణులే. అధర్మం పక్షాన నిలబడి యుద్ధం చేసి, తమ వారి చేతిలోనే హతమయ్యారు. భీష్ముడూ, ద్రోణుడు కూడా కౌరవుల పక్షాన నిలబడి పాండవులతో యుద్ధం చేసినా, వారు నిజానికి పాండవ పక్షపాతులే. అయినప్పటికీ, యుద్ధంలో తమ వారు అనే ప్రేమను ప్రక్కన పెట్టి, క్షత్రియ ధర్మం కొరకు, తమ నాయకుడి తరుపున పాండవులతో యుద్ధం చేశారు. అటువంటి వారిలో శల్యుడు కూడా ఒకడు. గొప్ప సారధిగా పేరుగడించిన శల్యుడు, కర్ణుడికి రధసారధిగా, కురుక్షేత్రంలో పాలుపంచుకున్నాడు. అతి బలవంతుడైన కర్ణుడిని మానసికంగా క్రుంగదీసి, అతని పరాజయంలో కీలక పాత్రను పోషించాడు శల్యుడు. పాండవులకు మేనమామ అయిన శల్యుడు, కౌరవుల పక్షాన ఎందుకు చేరాడు? కర్ణుడి మరణానికీ, శల్యుడికీ సంబంధం ఏంటి? అనేటటువంటి విషయాలు, ‘శల్య సారధ్యం!’ అనే మన గత వీడియోలో తెలియజేశాను. దాని లింక్ క్రింద పొందుపరిచాను.
[ శల్య సారధ్యం!: https://youtu.be/dcA8F2bMWxo ]
మరి ఈ రోజుటి మన వీడియోలో, కౌరవులకు మాట ఇచ్చి తిరిగి పాండవుల వద్దకు వచ్చిన శల్యుడు, ధర్మరాజులోని బాధను పొగొట్టడానికి, ఇంద్రుడి అజ్ఞాతవాసం గురించి వివరించిన సంఘటన.., ఇంద్రుడు అజ్ఞాతవాసం ఎందుకు చేయవలసి వచ్చింది? ఇంద్ర పదవిలో కూర్చున్న రాజు చేసిన దురాగతం ఏంటి? అతని వల్ల శచీ దేవి ఎందుకు మనస్తాపం చెందింది - అనేటటువంటి ఉత్సుకతను రేకెత్తించే విషయాల గురించి తెలుసుకుందాము..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/7Fdzs25Mh0Y ]
ధర్మరాజును కలసిన శల్యుడు, అతడిని పరి పరి విధాలా శ్లాఘించి, "గతంలో మీకు జరిగిన అవమానం, అడవులలో మీరు పడిన కష్టాలూ మరవడం, ఎవరి తరం? నువ్వే కాదు, ఇంతకు పూర్వం ఇంద్రుడు కూడా అజ్ఞాతవాసం అనుభవించాడు. శచీ దేవి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. విధి రాతను తప్పించడం, పరమ శివునకు కూడా సాధ్యం కాదు కదా?" అని పలికాడు. శల్యుని మాటలు విన్న ధర్మరాజు, "మహానుభావా! ఇంద్రుడు, శచీదేవి ఎందుకు కష్టాల పాలయ్యారు? కొంచెం వివరించండి" అని అడిగాడు. అప్పుడు శల్యుడు, ఇంద్రుడు అజ్ఞాతవాసం చేయడానికి గల కారణాన్నీ, ఆ సంఘటననూ వివరించాడు. దేవతలలో త్వష్ట అనే వాడున్నాడు. అతడు ఉత్తముడు. అతడు తన తపోశక్తితో మూడు తలలున్న ఒక వ్యక్తిని సృష్టించాడు. అతని పేరు విశ్వరూపుడు. అతడు ఇంద్ర పదవిని కోరి ఘోరతపస్సు చేస్తుండగా, అది తెలుసుకున్న ఇంద్రుడు, అతడి తపస్సును భగ్నం చేయటానికి, అప్సరసలను పంపాడు. విశ్వరూపుడు అప్సరసల తళుకుబెళుకులకు లొంగక పోవడంతో, ఇంద్రుడు విశ్వరూపుని చంపి, ఆ విషయాన్ని కొంతకాలం రహస్యంగా దాచాడు.
తరువాత అందరికీ ఆ విషయం తెలిసి, ఇంద్రుని చర్యను నిరసించారు. అతడు బ్రహ్మహత్యా పాతకం చేశాడని ఖండించారు. తనకు అంటిన బ్రహ్మహత్యా పాతకం పోగొట్టుకోవడానికి ఒక యాగం చేసి, తనకంటిన పాపాన్ని సముద్రానికీ, స్త్రీలకూ, వృక్షాలకూ పంచి పెట్టి, బ్రహ్మహత్యా దోషాన్ని కడిగి వేశాడు. ఇది తెలిసిన త్వష్ట కోపించి, నిష్కారణంగా నిరపరాధి అయిన విశ్వరూపుని చంపినందుకు, ఇంద్రుణ్ణి చంపడానికి ఒక శక్తిని సృష్టించి, అతడికి వృత్తుడు అని నామకరణం చేశాడు. అధిక బల సంపన్నుడైన వృత్తుడు, ఇంద్రుడిని జయించి, అతనిని మ్రింగి కడుపు బరువెక్కడంతో, నిద్రకుపక్రమించి, గట్టిగా ఆవులించాడు. అప్పుడు ఇంద్రుడు తన శరీరాన్ని చిన్నదిగా చేసి, బయటకు వచ్చాడు. ఇంద్రుడు తిరిగి వృత్తాసురునితో యుద్ధానికి దిగాడు. వృత్తుని ధాటికి తట్టుకోలేక, దేవతలు మంధర పర్వత శిఖరానికి చేరి, వృత్తుడిని చంపే ఉపాయంకోసం ఆలోచించారు. అందరూ మహా విష్ణువు వద్దకు వెళ్ళి, వృత్తుని చంపే ఉపాయం చెప్పమని అర్ధించారు. "మీరు వెళ్ళి ఇంద్రునికీ, వృత్తునికీ సంధి చేయండి. నేను తగిన సమయం చూసి, ఇంద్రుని వజ్రాయుధంలో ప్రవేశించి, అతడు అంతమయ్యేలా చేస్తాను" అని అభయమిచ్చాడు శ్రీహరి. ఋషులంతా వృత్తుని వద్దకు వెళ్ళి, "ఇంద్రుడు అజేయుడు. నీవా, అధిక బలశాలివి. మీరు ఒకరిని ఒకరు జయించడం, ఎన్నటికీ సాధ్యం కాదు. కనుక ఇంద్రునితో మైత్రి చేసుకో" అని నచ్చచెప్పారు.
వృత్తుడు అందుకు అంగీకరిస్తూ, బదులుగా ఒక వరం ప్రసాదించమని కోరుకున్నాడు. "నేను తడిసిన దానితో కానీ, ఎండిన దానితో కానీ, రాత్రి కానీ, పగలు కానీ సంహరించబడకూడదు. అందుకు ఒప్పుకుంటే, ఇంద్రునితో సంధి చేసుకుంటాను" అని షరతు విధించాడు. అలా వృత్తుడు మైత్రి చేసుకున్నా, ఇంద్రుడు మాత్రం అతనిని సంహరించే మార్గం అన్వేషిస్తూ ఉన్నాడు. ఒక రోజు అసుర సంధ్యలో, సముద్రతీరంలో విహరిస్తున్న వృత్తుని చూసి, అతడిని సంహరించడానికి అది తగిన సమయమని గ్రహించిన ఇంద్రుడు, విష్ణువును ప్రార్ధించి, తన వజ్రాయుధాన్ని సముద్ర జలాల నురుగులో ముంచాడు. విష్ణువు ఆ నురుగులో ప్రవేశించాడు. ఆ నురుగు సహాయంతో వృత్తుని సంహరించాడు. ఈ విషయం తెలిసిన భూతాలు, బ్రహ్మ హత్య చేసినందుకు నిందించాయి. బ్రహ్మహత్యా పాతకం వెంట తరమగా, ఇంద్రుడు పదవీచ్యుతుడై, నిషధాచలంలో తలదాచుకున్నాడు.
దేవతలంతా ఇంద్రపదవి కోసం తగిన వాడికై అన్వేషిస్తూ, భూలోకంలో నూరు అశ్వమేధయాగాలు చేసిన నహుషుడనే మహారాజును, ఆ పదవిలో కుర్చోమని అర్ధించారు. నహుషుడు మాత్రం, అందుకు అంగీకరించలేదు. ఇంద్ర పదవిని అధిష్టించేంత సామర్ధ్యం తనకు లేదన్నాడు. యముడూ, అగ్నీ, వరూణాది దేవతలు, తమ శక్తిని అతనికి పంచారు. నహుషుడు వాటితో అధిక బల సంపన్నుడయ్యాడు. నహుషుడు ఇంద్ర పదవిని అధిష్టించి, ధర్మ పరుడై, సమస్త లోకాలనూ పాలించసాగాడు. కిన్నెరలూ, కింపురుషులూ, యక్షులూ, సిద్ధులూ, విద్యాధరులూ, గంధర్వులూ, గరుడులూ, సమస్త దేవతల నుండీ తేజో భాగములు స్వీకరించి, అత్యంత తేజోమయుడయ్యాడు. మునులంతా నహుషుని సేవిస్తున్నారు. తుంబుర నారదులు గానంతో వినోదం అందిస్తున్నారు. రంభా, మేనకా, తిలోత్తమా, ఊర్వశీ మొదలైన అప్సరసలు, నాట్యంతో రంజింపచేస్తున్నారు. ఇన్ని భోగాలు ఒక్క సారిగా సంక్రమించగానే, నహుషునిలో గర్వం తొంగిచూసింది. ఆ సమయంలో నహుషుడు ఇంద్రుని భార్య శచీదేవిని చూసి, ఆమె అందానికి ముగ్ధుడై, ఆమెను మోహించాడు.
అతడు దేవతలను పిలిచి, "నేను స్వర్గాధి పతిని. అందరూ నన్ను చూడటానికి వచ్చారు. కానీ శచీ దేవి మాత్రం నా వద్దకు రాలేదు. వెంటనే ఆ సుందరాంగి శచీదేవిని ఇక్కడకు పిలిపించండి" అని ఆజ్ఞాపించాడు. అది విన్న శచీదేవి భయపడి, దేవ గురువు బృహస్పతిని శరణు వేడింది. జరిగినదంతా విన్న బృహస్పతి, "అమ్మా! శచీదేవీ.. ఊరడిల్లుము. నీ భర్త తిరిగి రాగలడు. నేను నిన్ను కాపాడతాను" అని సంతోషకర మాటను తెలియజేశాడు. ఇది తెలిసిన నహుషుడు, "నేను కోరిన వనితకు బృహస్పతి రక్షణ కల్పిస్తాడా?" అని ఆగ్రహించగా దేవతలు, "దేవేంద్ర పదవిలో ఉన్న మీరు, పర స్త్రీలను కోరుట తగదు" అని నచ్చ చెప్పారు. అందుకు నహుషుడు నవ్వి, "ఇంద్రుడు గౌతముని భార్యను కామించినప్పుడు, ఈ బుద్ధులు మీరెందుకు చెప్ప లేదు? మీరు వెంటనే శచీదేవిని నా వద్దకు తీసుకు రండి" అని ఆజ్ఞ ఇచ్చాడు. దేవతలూ, మునులూ బృహస్పతి వద్దకు పోయి, "గురుదేవా! ఇంద్రపదవిలో ఉన్న నహుషుడు, శచీదేవిని కోరడానికి అర్హుడు. కనుక శచీదేవిని అతని వద్దకు పంపి, అతని కోపం పోగొట్టండి" అని ప్రార్ధించారు. బృహస్పతి నవ్వి, "నహుషుడు శచీదేవిని కోరడమా? అందుకు మీరు అంగీకరించడమా? ఇది లోక హితమా? ఇంతటి మహా కార్యాన్ని ఆచరించవలసినదే కానీ, శరణు వేడిన వారిని విడుచుట ధర్మం కాదు. కనుక నేను ఆమెను పంపను" అన్నాడు.
అందుకు మునులు, "అయితే తగిన కర్తవ్యం ఆలోచించండి" అని అర్ధించారు. దానికి బృహస్పతి, "శచీదేవిని నహుషుని వద్దకు వెళ్ళి, కొంత సమయం అడుగమని చెబుదాం. ఆ తరువాత జరగ వలసినది ఆలోచిద్దాం" అని సాలోచనగా చెప్పాడు. దాంతో బృహస్పతి ఆదేశానుసారం, శచీదేవి నహుషుని వద్దకు వెళ్ళింది. "నేను ఇంద్ర పత్నిని. ఇంద్రుడు ఉన్నాడో లేడో తెలియలేదు. నా మనస్సు శంకిస్తోంది. ఏ విషయం తెలియకుండా తొందర పడకూడదు. నాకు కొంత సమయం కావాలి" అంది. నహుషుడు అందుకు అంగీకరించాడు. మునులు రహస్యంగా విష్ణుమూర్తిని కలుసుకుని, ఇంద్రుని పాపం పోగొట్టమని వేడుకున్నారు. అందుకు విష్ణుమూర్తి, "ఇంద్రునిచేత అశ్వమేధయాగం చేయించండి. అతని పాపం పోతుంది" అని సలహా ఇచ్చాడు. మునులు శ్రీ హరి మాట ప్రకారంగా, ఇంద్రుని చేత అశ్వమేధయాగం చేయించారు. ఇంద్రునికి పాప పరిహారం కాగానే, అమరావతికి వెళ్ళాడు. అక్కడ నహుషుడు అమిత తేజోమయుడై ఉండటం చూసి భయపడి, ఎవ్వరికీ చెప్పకుండా వెను తిరిగి వెళ్ళి పోయాడు.
ఇంద్రుని జాడ తెలియని శచీదేవి కలత పడి, ఉపశ్రుతి అనే దేవతను ఆరాధించి, ఆమెను సాక్షాత్కరింప చేసుకుంది. అప్పుడా దేవత, "అమ్మా శచీదేవి! నేను నీ పాతివ్రత్యానికి మెచ్చి వచ్చాను. నీవు నా వెంట వచ్చిన ఎడల, నీ భర్తను చూడగలవు" అని ఉపశ్రుతి, శచీదేవిని హిమాలయాలకు ఉత్తర దిక్కున ఉన్న మంజుమంతము అనే పర్వతము వద్దకు తీసుకు వెళ్ళింది. అక్కడి సరోవరంలో ఉన్న ఒక తామరపుష్ప కాడలోకి ప్రవేశించారు వారు. అక్కడ సూక్ష్మరూపంలో ఉన్న ఇంద్రుడిని శచీదేవికి చూపించి, ఉపశ్రుతి అదృశ్యమైంది. శచీ దేవిని చూసి ఇంద్రుడు ఆశ్చర్యపడి, "నేను ఇక్కడ ఉన్నది నీకెలా తెలుసు?" అని శచీదేవిని అడిగాడు. శచీదేవి జరిగినదంతా చెప్పి, తనను కాపాడమని వేడుకుంది. దానికి ఇంద్రుడు, "దేవీ! నహుషుడు ఇప్పుడు నా కంటే బలవంతుడు. దేవతలూ, ఋషులూ, అతనికి తమ శక్తులను ప్రసాదించారు. కనుక అతను అజేయుడు.
శత్రువు శక్తి సంపన్నుడై ఉన్నప్పుడు, వేచి ఉండటం రాజనీతి. అతనికి నీ మీద మోహం కలిగింది. మనం దానిని అనుకూలంగా మార్చుకోవాలి. నీవు అతనితో సఖ్యం నటించి, నిన్ను పొందాలంటే సప్తఋషి వాహనంపై రమ్మని చెప్పు. దాంతో అతని పుణ్యం క్షీణించి, పతనం కాక తప్పదు. ఆ పై, నేను అతనిని జయించడం సులువు" అని నహుషుడిని జయించడానికి, తన పన్నాగాన్ని వివరించాడు. అందుకు అంగీకారం తెలిపి, శచీదేవి తిరిగి అమరావతికి వచ్చింది. నహుషుడు మరలా శచీదేవి వద్దకు వచ్చి, తన కోరిక తీర్చమని అడిగాడు. అప్పుడు శచీదేవి తన భర్త ఇంద్రుడు చెప్పిన విధంగా, సప్తఋషి వాహనం మీద వస్తే వరిస్తానని చెప్పింది. మోహావేశంలో ఉన్న నహుషుడు, ఉచితానుచితాలు మరచి, మునులను వాహనంగా చేసుకుని తిరగసాగాడు.
వెంటనే శచీదేవి బృహస్పతి వద్దకు పోయి, తన భర్తనూ, తననూ రక్షించమని వేడుకుంది. అప్పుడు బృహస్పతి అగ్ని దేవుణ్ణి పిలిచి, ఇంద్రుడు ఎక్కడ ఉన్నాడో వెతకమని చెప్పాడు. అగ్ని ఒక స్త్రీ రూపం ధరించి, మనోవేగంతో అంతా వెతికి చూశాడు. అష్ట దిక్కులూ, భూమీ, అంతరిక్షం, కొండలూ, అడవులూ, ఎక్కడ వెతికినా ఇంద్రుని జాడ తెలియ లేదు. తిరిగి వచ్చిన అగ్ని, "దేవగురూ! నాకు సాధ్యమైనంతా వెతికాను. ఇంద్రుడు ఎక్కడా కనిపించలేదు. సృష్టి క్రమంలో, నీటి నుండి అగ్నీ, బ్రాహ్మణుల నుండి క్షత్రియులూ, రాళ్ళ నుండి లోహములూ పుట్టాయి. ఆ విధంగా పుట్టిన వాటికి, తమ ప్రతాపం ఎక్కడ చెల్లినా, తమ జన్మ స్థానంలో చెల్లదు. అలా నాకు జలప్రవేశం నిషిద్ధం కనుక, అక్కడ నేను వెతకలేను" అని అన్నాడు. అందుకు బృహస్పతి, "అగ్నిదేవా! నీకు సకల చరాచరములలో ప్రవేశం కలదు. నీవు చేరజాలని ప్రదేశం లేదు. నీకు నేను నీటిలో ప్రవేశించే అర్హతను కలిగిస్తాను. అక్కడ కూడా ఇంద్రుని కొరకు వెతుకు" అని అన్నాడు. ఆ తరువాత అగ్ని జలరాశులలో కూడా వెతికి, తామర తూడులో ఉన్న ఇంద్రుడిని కనుగొన్నాడు. వెంటనే బృహస్పతి ఇంద్రుని వద్దకు వెళ్ళాడు. అతనితో, "ఇంద్రా! నీ తప్పు ఏమీ లేదు. వృత్తాసురుని వధ ఎలా పాపం ఔతుంది. నీ తప్పు లేకనే, నువ్వు పదవిని త్యజించావు. మార్గాంతరం లేక నహుషునికి పదవిని కట్ట పెడితే, అతడు దేవతలిచ్చిన శక్తితో, బలగర్వితుడై ప్రవర్తిస్తున్నాడు. తనను మోయడానికి ముని పల్లకిని ఉపయోగించి, తన శక్తిని క్షీణింప చేసుకున్నాడు. కనుక ఇది అతనిని జయించడానికి తగిన సమయం.
నీవు వచ్చిన సమయంలో, నహుషుడు బలవంతుడు. కానీ ఇప్పుడు, అతడు శక్తి హీనుడు. అశ్వమేధ యాగం చేసి పాపాన్ని పోగొట్టుకున్న నీవు, ఇప్పుడు ఇంద్ర పదవికి అర్హుడవు కనుక, నీవు వచ్చి నహుషుని జయించి, నీ పదవిని తిరిగి స్వీకరించు" అని అన్నాడు. ఇంద్రుని వద్దకు వచ్చిన అష్టదిక్పాలకులు కూడా, నహుషుని జయించే ఉపాయం గురించి ఆలోచిస్తున్న సమయంలో, అగస్త్యుడు అక్కడకు వచ్చి, "ఇంద్రా, నహుషుడు పదవీ భ్రష్టుడు అయ్యాడు. ఇక నీవు నీ సింహాసనాన్ని అధిష్టించవచ్చు" అని పలికాడు. ఇంద్రుడు అగస్త్యునకు నమస్కరించి, నహుషుడు ఎలా పదవీచ్యుతుడైనాడో చెప్పమని అడిగాడు. అప్పుడు అగస్త్యుడు, "మునులంతా అతని వాహనం మోస్తూ బాధపడుతున్న సమయంలో, ఒకనాడు నహుషుడు బ్రాహ్మణులతో ఇష్టాగోష్టి జరుపుతుండగా, ఋషులు ఇలా అడిగారు, "గో సంప్రోక్షణమందు బ్రాహ్మణములయిన మంత్రములు చెప్పబడినవి. అవి నీకు ప్రమాణ భూతములా?" అని అడిగారు. అందుకు నహుషుడు గర్వంతో, ‘అవి నాకు ప్రమాణమలు కావు’ అని అన్నాడు.
నేను అతనికి అడ్డు చెపుతూ, "ఋషులచే అభినందితమైన మంత్రములను నిందించుట, అజ్ఞానము" అని అన్నాను. అందుకు నహుషుడు కోపించి, నా తలపై తన్నాడు. దాంతో అతని పుణ్యమూ, తేజమూ కోల్పోయాడు. అప్పుడు నేను, "నహుషా! మునులను వాహనంగా చేసుకుని, వారిని అవమానించావు. వారు గౌరవించు మంత్రములు ప్రమాణములు కాదని, నిరసించావు. నన్ను అవమానించావు. కనుక నీవు పదవీ భ్రష్టుడవై, ఇంద్రలోకం నుండి పతనమై, భూలోకమున, సర్ప రూపమున అనేక సంవత్సరములు నివసించెదవు కాక" అని శపించాను. నహుషుడు నన్ను పరి పరి విధాలా ప్రార్ధించగా, అతడికి శాపవిమోచనం చెప్పాను. ధర్మపరుడూ, సత్పురుషుడైన యుధిష్టరుని చూసిన తరువాత, అతని పాపములు పరిహారమై, పుణ్యలోక ప్రాప్తి కాగలదని, పరిహారం చెప్పాను" అని అన్నాడు. ఈ సంగతి తెలుసుకున్న ఇంద్రుడు, అగస్త్యుని పూజించాడు. అమరావతి అంతా అక్కడికి వచ్చి, ఇంద్రుడిని అభినందించింది. ఇంద్రుడు అమరావతికి పోయి, ఇంద్ర పదవిని అధిష్టించి, శచీదేవితో సుఖంగా ఉన్నాడు.
ఈ సంఘటనను వివరించిన శల్యుడు, "ధర్మరాజా! ఇంద్రుని వంటి వారే తమ అధికారానికి భంగం జరిగినప్పుడు, అజ్ఞాతవాసం అనుభవించారు. కనుక మీరు మీ దురవస్థకు దుఃఖించవలసిన పని లేదు. దుర్యోధనుడు కూడా, నహుషుని వలె నశించక తప్పదు" అని ధైర్యోక్తులు పలికి, మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా, తప్పకచేస్తానని ప్రమాణం చేసి, తన సేనలతో హస్థినకు తిరిగి బయలు దేరాడు.
ధర్మో రక్షతి రక్షితః!
No comments: