Monday 11 July 2022

హనుమంతుడు చెప్పిన యుగ ధర్మాలు! Yuga Dharma

  

హనుమంతుడు భీముడికి చెప్పిన యుగ ధర్మాలు!

సౌగంధికా పుష్పాల కోసం బయలుదేరిన భీముడికి ఏం జరిగింది?

ఒకరోజు ద్రౌపదీ, భీముడూ గంధమాధన పర్వత చరియలలో విహరిస్తున్నారు. వారి ముందు సహస్రదళ పద్మం, గాలిలో ఎగురుతూ వచ్చి పడింది. దానిని చూసి ద్రౌపది ముచ్చట పడింది. అలాంటి పద్మాలు మరికొన్ని కావాలని, భీముడిని కోరింది. ద్రౌపది కోరిన సౌగంధికా పుష్పాలను తెచ్చేందుకు, భీముడు బయలుదేరాడు. అలా వెళుతున్న భీముడికి, కళకళలాడుతున్న కదళీవన ప్రవేశంలో, ఒక కొలను కనిపించింది. అందులోని నీరు ఇంద్రనీల మాణిక్యరాశిలా, మనోహరమై ప్రకాశించింది. భీమసేనుడు ఆ కొలనులో తనివితీరా జలకాలాడి, తామరపూవులను నగలలా ధరించి, వేలకొలది యోజనాల వరకు విస్తరించిన కదళీవనంలోకి ప్రవేశించాడు. ఉప్పొంగిన ఆనందంతో వీరశంఖం పూరించాడు. అప్పుడక్కడ జరిగిన అద్భుత సంఘటన గురించీ, వాయుపుత్రుడు సోదరుడికి ఎరుక పరచిన యుగ ధర్మాల గురించీ ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

నేను ఈ మధ్య కామెంట్స్ కి respond కాలేక పోయినా, ప్రతి కామెంట్ నీ follow అవుతూనే ఉన్నాను. నా response కోసం వేచి ఉండకుండా, మంచి కామెంట్స్ తో నన్ను ప్రోత్సహిస్తూనే ఉన్న ప్రతి ఒక్కరికీ, పేరు పేరునా నా మనఃపూర్వక కృతజ్ఞతలు..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/5Qbjiqk3f9I ]

భీముడు పూరించిన ఆ ధ్వని గగనతలం అంతటా ప్రతిధ్వనించి, దిగ్దిగంతాలకు వ్యాపించింది. ఆ ధ్వని విన్నంతనే, అక్కడి పచ్చిక పానుపుపై పవళించిన హనుమంతుడు దిగ్గున లేచి, ‘ఈ గంభీర ఘోషను ఆలకించినంతనే, నాకు ఆనందం కలుగుతున్నది. సందేహం లేదు. ఇది భీమసేనుని శంఖ స్వనమే! నా సహోదరుని విజయనాదమే! ఈ తోట దాటితే, ఆతనికి ప్రమాదం పొంచి ఉన్నది. హెచ్చరించాలి’ అని అనుకున్నాడు. అనుకున్నంతనే, పెద్ద పెద్ద చెట్లను కూల్చివేసి, భీమసేనుని దారికి అడ్డంగా అమర్చాడు. వాటిపై, దారికడ్డంగా మేనువాల్చాడు. వాలాన్ని అంతెత్తున నిలిపి ఉంచి, కనుదోయి ముకుళించి, నిద్రను నటించసాగాడు. పెద్ద పెద్దగా కేకలు పెడుతూ, అంతలో అక్కడికి రానే వచ్చాడు భీముడు. దారికడ్డంగా పవళించిన కోతిని చూసి, సన్నగా నవ్వుకున్నాడు. ఆ సమయంలో కనురెప్పలెత్తిన హనుమంతుడిని చూసి, ‘ఆహా! ఆ కళ్ళలో ఏమా తేజస్సు? విశాల వక్షస్థలమే కాదు.. సునిశిత దంతాలూ, వాడి నఖాలూ, బలమైన చేతులూ, అంత పొడవున తోక... బాగున్నాడీ మర్కటాధిపతి’ అనుకున్నాడు భీముడు. అలా చూస్తూ నిలుచున్న కొద్ది క్షణాల తర్వాత, దారి నుంచి అడ్డం తప్పుకోమన్నట్టుగా, పెద్ద పెట్టున నవ్వాడు.

నిద్రా భంగమైనట్టుగా, హనుమంతుడు మేలుకొని, ఆవులించి, క్రీగంట భీముని చూస్తూ, ‘ఎవరయ్యా నువ్వు? ముసలితనంతో, అలసి సొలసి నిద్రపోతున్న నాలాంటి వాడికి నిద్రాభంగం కలిగించడం న్యాయంగా ఉందా? ఏంటా అరుపులు? నాలాంటి పేద జంతువులను భయపెట్టడం ధర్మమా?’ అని అడిగి, ‘మామూలు మనుషులు ఇక్కడికి రాలేరు. నువ్వొచ్చావంటే, అసాధారణ వ్యక్తివి. అందులో అనుమానం లేదు. అయినా, ఎందుకొచ్చావిక్కడికి? ఇక్కణ్ణుంచి ఇక ఒక్కడుగైనా ముందుకు కదలలేవు. ఆకాశమార్గాన తప్పితే, నువ్విక మీదట పయనించలేవు’ భీముడికి ఎదురు నిలిచాడు హనుమంతుడు. ‘పెద్దవాణ్ణి చెబుతున్నాను విను! ఇక్కడి కందమూలాలూ, ఆ పళ్ళూ తిని, హాయిగా కాసేపు విశ్రాంతి తీసుకో! తర్వాత వచ్చిన దారిన వెళ్ళిపో! నీకే మంచిది. లేకపోతే, లేనిపోని ప్రమాదాల్లో ఇరుక్కుంటావు’ అంటూ, సున్నితంగా హెచ్చరించాడు హనుమంతుడు. ఈ మాటలన్నీ విన్న భీముడు, మళ్ళీ గట్టిగా నవ్వాడు. ‘కపికులేశ్వరా! నేనెవరకున్నావు? వాయుదేవుని వర ప్రభావంతో, కుంతీ, పాండు నరేశ్వరులకు ఉదయించిన కుమారుణ్ణి. నా పేరు భీమసేనుడు. ఒకానొక పని మీద వెళ్తున్నాను. నన్ను అడ్డగించకు. అలాగే, దారి నుంచి తప్పుకో’ అన్నాడు భీముడు. దాంతో హనుమంతుడు, ‘కాలు కదపలేని ముసలివాణ్ణి. తప్పుకో అంటే, తప్పుకోలేను. నువ్వే తప్పించు! నా తోకను అటు నెట్టి, నీ దారిన నువ్వు పో! నాకెలాంటి అభ్యంతరం లేదు’ అని పలికాడు.

కోతి మాటలు పట్టించుకోకూడదనుకున్నా, ముసలి కోతి కదా! అని ఆలోచించి, ‘సరే’నన్నట్టుగా, ఎడమచేత్తో హనుమంతుని వాలాన్ని కదలించే ప్రయత్నం చేశాడు భీముడు. అది ఉన్న చోటు నుంచి కదలక పోవడంతో, రెండు చేతుల్తో పట్టుకుని, తన బలాన్ని ప్రయోగించాడు. అయినా ఫలితం లేకపోయింది. పైగా ముచ్చెమటలు పట్టాయి. మళ్ళీ ప్రయత్నించి క్రింద పడ్డాడు భీముడు. పరువు పోయిందనుకుని, చెమర్చిన కళ్ళతో హనుమంతుని ముందు మోకరిల్లి, ‘మహానుభావా! నా గర్వం సాంతం అణగిపోయింది. నీవు కోతివి కాదు. ఆ రూపంలో ఉన్న సిద్ధుడివో, గంధర్వుడివో అయి ఉంటావు. దయచేసి నా అజ్ఞానాన్ని మన్నించి, నీ నిజ స్వరూపం చూపించు’ అని ప్రార్థించాడు. భీముని అభ్యర్థనకు మిక్కిలి సంతోషించి, ‘భీమసేనా! నేనెవరనుకున్నావు? కేసరి, వాయుభట్టారకుల తనయుణ్ణి. హనుమంతుణ్ణి! నీ సహోదరుణ్ణి’ అని అన్నాడు, ముసలి కోతి రూపంలో ఉన్న హనుమంతుడు. వెంటనే పట్టరాని ఆనందంతో భీముడు, హనుమంతునికి సాష్టాంగ నమస్కారాలాచరించి, ‘నీ సందర్శనంతో నా జన్మ ధన్యమయింది. నేను అదృష్టవంతుణ్ణి’ అని పరవశుడయ్యాడు. ‘ప్లవంగపతీ! పూర్వకాలంలో నీవు సముద్రాన్నే లంఘించావు. అప్పుడు నీ దివ్యాకృతి చూసిన కనులు ఎంతో ధన్యమయ్యాయి. ఆ అదృష్టానికి నన్ను కూడా నోచుకోనీ! ఒక్కసారి నీ అద్భుతాకార సాక్షాత్కార సంపత్తిని నాకు కలిగించు’ అని పరి పరి విధాలా వేడుకున్నాడు భీముడు.

ఆ మాటకి హనుమంతుడు సన్నగా నవ్వుతూ, ‘అసాధ్యం భీమసేనా! ఇప్పుడు ఆ అపూర్వ స్వరూపం తిలకించడం, నీవల్లకాదు. కృత, త్రేతా, ద్వాపర, కలియుగాలకనుకూలంగా, ప్రాణుల పరిమాణాలూ, స్వరూపాలూ, స్వభావాలూ ఉంటాయి. ప్రస్తుత యుగానుకూలంగా నేనున్నాను. కావాలనే, ఈ యుగధర్మాన్ని పాటిస్తున్నాను. కనుక నీ కోరిక నెరవేరదు’ అని భీమునితో చెప్పాడు. భీముడికి హనుమంతుడి నిజ స్వరూపాన్ని చూడాలనే తపన మరింత రెట్టింపయ్యింది. ‘అనిలకుమారా, అంత మాట అనకు. నీ నిజస్వరూపం చూడాలని, నిలువరించుకోలేని ఉత్కంఠతో ఉన్నాను. కరుణించి నా కోరిక నెరవేర్చు’ అంటూ బ్రతిమలాడుతూ, హనుమంతుని పాదాలపై ప్రణమిల్లాడు. అప్పుడు భీమునిపైగల అభిమానంతో, హనుమంతుడు తన నిజస్వరూపాన్ని ప్రదర్శించాడు. మేరు పర్వతంలా మెరిసి పోయింది, హనుమంతుని దేహం. ఆకాశాన్ని చుంబిస్తోంది. వాలం దిగంతాలను అతిక్రమించింది. హనుమంతుని దివ్య దర్శనాన్ని చూసినంతనే, గజగజా వణికిపోయాడు భీముడు. భయపడ్డాడు. భయంతో కళ్ళు మూసుకున్నాడు. కొంతసేపటికి కళ్ళు తెరచి, చేతులు ముకుళించి, వినయంగా, ‘మహాస్వరూపా! అత్యద్భుతం నీ నిజ స్వరూపం! భూనభోంతరాలు నిండిపోతున్న నీ శరీరాన్ని చూసి, భయపడుతున్నాను. చూడలేక పోతున్నాను. చాలు మహాదేవా, చాలు! శీఘ్రమే ఈ రూపాన్ని ఉపసంహరించి, ప్రకృత మూర్తితో నన్ను కటాక్షించండి’ అని వేడుకున్నాడు భీముడు. అప్పుడు హనుమంతుడు ప్రస్తుత స్వరూపం స్వీకరించి, ‘భీమసేనా! శత్రువులను నేను ఎదుర్కొన్నప్పుడు, నువ్విప్పుడు చూసిన నా రూపు, మరి రెండితంతలవుతుంది. ప్రస్తుతం ఈ యుగ ధర్మాన్ని అనుసరించి, నేనిలా ఉన్నాను’ అని తన దర్శనం గురించి వివరించాడు. అప్పుడు భీముడు, "పవన సుతుడా! ఆయా యుగాలలోని ఆచారాల గురించి, మరింత వివరంగా చెప్పండి" అని అడిగాడు.

అంతట హనుమంతుడు, "భీమసేనా! కృతయుగంలో అన్నీ కృతములే కానీ, చెయ్యవలసినది ఏమీ లేదు. అందుకే, ధర్మం నాలుగు పాదాలతో నడచింది. అప్పుడు శ్రీమన్నారాయణుడు, శుక్ల వర్ణంతో ప్రజలను కాపాడాడు. సనాతన ధర్మం వర్ధిల్లింది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు, వేదాలు తమకు విధించిన విధులను నిర్వర్తించారు. వారు కోరకుండానే, తగిన ఫలితాలు కలిగాయి. కనుక వారు పుణ్యలోకాలను పొందారు. ఆ యుగంలో జనులకు అసూయా, ద్వేషం, గర్వం, మద మాత్సర్యం, కోపం, భయం, సంతాపం, ప్రజా క్షయం, అవయవ క్షయం లాంటివి లేవు.

తరువాత త్రేతాయుగం ఆరంభమైంది. ధర్మం మూడు పాదాలతో నడిచింది. ఆ రోజుల్లో ప్రజలు సత్య సంధులూ, యజ్ఞ యాగాదులు చేసే వారూ, తపస్సులు చేసే వారూ, దానాలు చేసేవారు. అప్పుడు విష్ణువు రక్తవర్ణంతో, ప్రజలను రక్షించాడు.

ద్వాపర యుగం వచ్చింది. ధర్మం రెండు పాదాలతో నడచింది. వేదములూ, శాస్త్రములూ విధించిన ధర్మమూ, కామమూ అనుసరించబడ్డాయి. కానీ, ద్వాపర యుగంలో ప్రజలు, మాట మీద నిలవరు. సత్యమూ, శమమూ హీనమౌతుంది. ప్రజలు కామ్యార్ధంతో మాత్రమే, యజ్ఞాలు చేస్తారు. ఈ యుగంలో విష్ణువు, కృష్ణ వర్ణంతో ప్రజా రక్షణ చేస్తాడు.

తరువాత వచ్చునది కలియుగం. ఆ యుగంలో ధర్మం, ఒకే పాదంతో నడుస్తుంది. విష్ణువు పసుపు పచ్చని వర్ణంతో, లోకులను రక్షిస్తాడు. కలియుగంలో జనులు తమో గుణంతో ప్రవర్తిస్తారు. జనులు కామమూ, క్రోధమూ మొదలైన వాటికి వశులై, అధర్మ వర్తనులై ప్రవర్తిస్తారు. కలియుగంలో, తపస్సూ, ధర్మమూ, దానము లాంటి పుణ్యకార్యాలు, స్వల్పంగా మాత్రమే ఆచరించబడతాయి. కానీ వాటికి ఫలితం, విశేషంగా ఉంటుంది.” అని యుగ ధర్మాలను వివరించాడు హనుమంతుడు.

అనంతరం, ‘నీవు వేయి రేకుల తామర పూల కోసం, సౌగంధికా సరోవరానికి చేరుకోవాలనుకుంటున్నావు. అయితే, నువ్వక్కడ ఎలాంటి దుస్సాహసానికీ ఒడిగట్ట కూడదు. అది అమరేశ్వరులు క్రీడించే కొలను. దానిని అసంఖ్యాక యక్ష, రాక్షస యోధులు సంరక్షిస్తున్నారు. వారి దగ్గర నీ బలపరాక్రమాలు పని చెయ్యవు. అందుకని నువ్వు, మంత్ర తంత్ర హోమాదులతో వారిని ఆరాధించి, మనోరథాన్ని సిద్ధింప చేసుకో’ అని తనకు పువ్వులను పొందే మార్గాన్ని ఉపదేశించి, భీముడిని గాఢంగా కౌగిలించుకున్నాడు. తర్వాత సౌగంధికా సరోవరానికి దారిని తెలియజేసి, అదృశ్యమయ్యాడు. హనుమంతుని దృఢాలింగనంతో, భీమసేనుని మార్గాయాసం నశించింది. శరీర శక్తి, పూర్వం కంటే అధికమయింది. మహోత్సాహాన్ని సంతరించుకుని, సౌగంధికా పుష్పాల కోసం బయలుదేరాడు భీముడు.

ధర్మో రక్షతి రక్షితః

No comments: