Monday 17 October 2022

ఉద్ధవ గీతలో ఏం ఉంది? Uddhava Gita

 

‘ఉద్ధవ గీత’లో ఏం ఉంది! జూదంలో ఓడిపోకుండా పాండవులను శ్రీ కృష్ణుడు ఎందుకు కాపాడలేదు?

ఉద్ధవుడు శ్రీకృష్ణుని ప్రియ మిత్రుడు. రూపు రేఖలూ, వేష ధారణ కూడా కృష్ణుని వలే ఉంటాయి. నిర్మలమైన భక్తి అంటే ఏమిటో తెలుసుకోవాలంటే, ఉద్ధవుని గురించి తెలుసుకుంటే గానీ అర్ధం కాదు. ఉద్ధవుడు చిన్ననాటి నుంచే శ్రీ కృష్ణుడికి ఎన్నో సేవలు చేశాడు. ఆయనే కృష్ణుడికి రథసారధి కూడా. కానీ, తను చేసే సేవలకు ఎప్పుడూ ఏ ప్రతిఫలమూ ఆశించలేదు. భక్తిలో పరాకాష్టకు చేరినవారు, భగవంతుడిని తమలోనే దర్శించుకుంటారు. శ్రీ కృష్ణుడు తన అవతార పరిసమాప్తికి ముందు, ఉద్ధవుడితోనే మాట్లాడాడు. కృష్ణ భగవానుడు కురుక్షేత్రంలో అర్జునుడికి ధర్మాన్ని బోధించాడు. అది భగవద్గీతగా, ముఖ్య పారాయణ గ్రంధంగా ప్రజ్వరిల్లుతోంది. అలాగే, శ్రీ కృష్ణుడు చివరిగా ఉద్ధవుడితో మాట్లాడిన మాటలు, ‘ఉద్ధవ గీత’గా ఖ్యాతి గడించింది. అసలు ఉద్ధవ గీతలో ఏముంది? ఉద్ధవుడు శ్రీ కృష్ణుడిని అడిగిన ప్రశ్నలేంటి? కర్మ గురించి వాసుదేవుడు వివరించిన సందేశం ఏంటి -  వంటి ఆసక్తికర విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/buXxa_0VE5w ]

ఉద్ధవ గీత అనేది, శ్రీకృష్ణుడు ఉద్ధవునికి చేసిన ఉపదేశం అనే దానికన్నా, ఆచరించవలసిన ఆదేశం అనడం సమంజసం. ఈ ‘ఉద్ధవ గీత’ అనేది, శ్రీ భాగవతంలోని ఏకాదశ స్కంధంలోని, ఆరవ అధ్యాయం, నలుబదవ శ్లోకం నుండి ప్రారంభమై, ఇరువది తొమ్మిదవ అధ్యాయంతో ముగుస్తుంది. ఈ మొత్తం "ఉద్ధవ గీత"లో, వెయ్యికి పైగా శ్లోకాలున్నాయి. ఉద్ధవుడు యదుకుల శ్రేష్ఠుడు, మహాజ్ఞాని. శ్రీకృష్ణ, ఉద్ధవుల సంవాదమే, ఉద్ధవగీతగా జగత్ ప్రసిద్ధిగాంచింది. శ్రీ కృష్ణుడు చివరిసారిగా చేసిన బోధ ఇదే. ఒక విధంగా చెప్పాలంటే, ‘ఉద్ధవ గీత’, భగవంతుడైన శ్రీ కృష్ణ పరమాత్మ మనకిచ్చే వీడ్కోలు సందేశం అని చెప్పవచ్చు. పరమాత్మలోని దివ్య సుగుణాలన్నీ, ఈ ‘సృష్టి’లోనే ఉన్నాయి. వాటిని గ్రహించి, ఆచరించగలగడమే మహాయోగం. భూమి నుంచి క్షమాగుణాన్నీ.., వాయువు నుంచి పరోపకారాన్నీ, ప్రాణస్థితి నిలకడనూ.., ఆకాశం నుంచి పరమాత్మ సర్వవ్యాపి అనీ.., జలం నుంచి నిర్మలత్వాన్నీ, పావనత్వాన్నీ.., అగ్ని నుంచి దహించే శక్తినీ గ్రహించి, తన దేహం పాంచ భౌతాత్మకమనీ, పంచభూతాల గుణాలను కలిగి ఉండాలనీ తెలుసుకోవాలి జీవుడు. మనిషి కర్మాచరణే ధర్మంగా భావించాలి. దేనిమీద కూడా విపరీతమైన వ్యామోహం ఉండకూడదని చెబుతుంది, ఉద్ధవ గీత.

శ్రీ కృష్ణుడు ఉద్ధవుడితో, ఏదైనా వరం కోరుకో అని చెప్పగా అందుకు ఉద్ధవుడు, ‘దేవా! నీ లీలలను అర్ధం చేసుకోవటం మా తరం కాదు. నాకు ఏ వరమూ వద్దు కానీ, నిన్ను ఓక ప్రశ్న అడుగుదామనుకుంటున్నాను. అడుగవచ్చునా?’ అని, వినయంగా ఇలా అడిగాడు.. ‘కృష్ణా! నీవు మా అందరికీ జీవించటానికి ఇచ్చిన సందేశము ఒకటి, నీవు జీవించిన విధానము మరొకటి. మహాభారత యుద్ధములో, నీవు పోషించిన పాత్ర, తీసుకున్న నిర్ణయములు, చేపట్టిన పనులు నాకేమీ అర్ధం కాలేదు. దయచేసి నా సందేహములను తీర్చి, నన్ను అనుగ్రహించండి.’ అని కోరుకున్నాడు. దానికి కృష్ణుడు, ‘ఉద్ధవా! ఆనాడు యుద్ధభూమిలో అర్జునుడికి గీతను బోధించాను. ఈ నాడు నీకు ఉద్ధవ గీతను బోధించటానికి ఈ అవకాశాన్ని కలిపిస్తున్నాను. నన్ను ఏమి అడగాలనుకుంటున్నావో తప్పకుండా అడుగు.’ అని ఉద్ధవుడిని ప్రోత్సహించాడు. ఇక ఉద్ధవుడు తన ప్రశ్నలను అడగటం మొదలు పెట్టాడు.

‘కృష్ణా, పాండవులు నీ ప్రాణ స్నేహితులు కదా! నిన్ను గుడ్డిగా నమ్మారు కూడా. నువ్వు భూత, భవిష్యత్, వర్తమానములు తెలిసినవాడవు. అటువంటప్పుడు వారిని జూదము ఎందుకు ఆడనిచ్చావు? మంచి మిత్రుడు అలాంటి వ్యసనములను ఎక్కడైనా ప్రోత్సహిస్తాడా? పోనీ ఆడనిచ్చావే అనుకో, కనీసం వారిని గెలిపించి, కౌరవులకు బుద్ధి చెప్పి ఉండకూడదా? అది కూడా చెయ్యలేదు. ధర్మజుడు ఆస్తినంతా పోగొట్టుకుని, వీధినపడ్డాడు. ఆఖరికి తన తమ్ముళ్లను కూడా ఓడిపోయాడు. అప్పుడైనా నీవు అడ్డుపడి, వాళ్ళను కాపాడి ఉండవచ్చును కదా? కౌరవులు దుర్బుద్ధితో, పరమ సాధ్వి అయిన ద్రౌపదిని, జూదంలో మోసం చేసి గెలిచారు. కనీసం అప్పుడైనా నువ్వు నీ మహిమతో, పాండవులను గెలిపించలేదు. ఎప్పుడో ఆవిడ గౌరవానికి భంగం కలిగినప్పుడు, ఆమెను ఆఖరి క్షణంలో అనుగ్రహించావు. సమయానికి ఆదుకున్న ఆపద్భాందవుడవని, గొప్ప పేరుపొందావు. కానీ, ముందే నీవు కలుగచేసుకుని ఉంటే, ఆమెకు నిండు సభలో జరిగిన అవమానం తప్పేది కదా. సమయానికి ఆదుకునేవాడే మంచి మిత్రుడనిపించుకుంటాడు. మరి, నీవు చేసినదేమిటి కృష్ణా?’ అని ఉద్ధవుడు ఎంతో బాధతో, కృష్ణుడిని తన ఆంతర్యమేమిటో తెలుపమని ప్రార్ధించాడు. నిజానికి ఈ సందేహములు, మహాభారత యుద్ధం గురించి తెలిసిన వారందరికీ కలుగుతాయి. కనుక కృష్ణుడు ఎంతో ప్రేమతో, ఉద్ధవుడి ద్వారా మనందరికీ ఉద్ధవ గీతను బోధించాడు. ‘ఉద్ధవా! ప్రకృతి ధర్మం ప్రకారం, అన్ని విధాలా జాగ్గ్రత్త పడి, తగిన చర్యలను తీసుకునే వాడే, గెలుపుకు అర్హుడు. దుర్యోధనుడికి జూదములో ప్రావీణ్యము లేకపోయినా, ఆస్తిపరుడు. కనుక తన అర్హత ప్రకారం, ఆస్తిని పణంగా పెట్టాడు. ఎంతో తెలివిగా తన మామ చేత పందెమును వేయించాడు.

ధర్మరాజు మాత్రం, పందెములను నా చేత వేయించాలని అనుకోలేదు. నా సహాయమునూ కోరలేదు. ఒకవేళ శకునితో నేను జూదమాడి ఉంటే, ఎవరు గెలిచేవారు? నేను కోరిన పందెమును శకుని వేయగలిగేవాడా? లేక అతను చెప్పిన పందెము నాకు పడేది కాదా? నీవే ఆలోచించుము..? సరే, ఇదిలా ఉంచు. ధర్మరాజు అజ్ఞానంలో మరొక క్షమించరాని నేరం చేశాడు. అదేమిటంటే, ‘నేను చేసుకున్న కర్మ వలన ఈ ఆటలో ఇరుక్కున్నాను. కృష్ణుడికి ఈ సంగతి తెలియకూడదు. ఇటువైపు ఎట్టి పరిస్థితిలో కూడా, కృష్ణుడు రాకూడదు అని ప్రార్ధించాడు. దాంతో ఏమీ చేయలేక, చేతులు కట్టుకుని, తన పిలుపుకోసం ఎదురు చూస్తూ నిలబడిపోయాను. ధర్మజుడు సరే.. భీముడూ, అర్జునుడూ, నకుల సహదేవులు కూడా, ఓడినప్పుడు వారి కర్మ అనుకున్నారే కానీ, ఏ మాత్రము నా సహాయము కోరలేదు. అలాగే ద్రౌపది కూడా. దుశ్శాసనుడు తనను సభలోకి ఈడ్చినప్పుడు కూడా నన్ను స్మరించకుండా, నిండు సభలో అందరితో తనకు న్యాయం చెయ్యమని వాదించింది. తన బుద్ధి కుశలతలనే నమ్ముకుంది. చివరికి తన ప్రయత్నములన్నీ విఫలమయ్యాక, గొంతెత్తి నన్ను పిలిచింది. సంపూర్ణ శరణాగతితో నన్ను శరణు వేడింది. అప్పుడు వెంటనే ప్రత్యక్షమయ్యి నేను ద్రౌపదిని రక్షించలేదా?’ అని కృష్ణుడు ఉద్ధవుడిని తిరిగి ప్రశ్నించాడు.

కృష్ణుడి సమాధానములకు ఉద్ధవుడు భక్తితో చలించి, ‘కృష్ణా! అలాగైతే, మాలాంటి సామాన్యుల సంగతి ఏమిటి? మేము చేసే కర్మలలో కూడా, నీవు కోరితే కల్పించుకుని సహాయం చేస్తావా? అవసరమైతే మమల్ని చేడు కర్మలు చేయకుండా కాపాడుతావా? అని చక్కటి ప్రశ్న వేశాడు ఉద్ధవుడు. దానికి శ్రీ కృష్ణుడు చిన్నగా నవ్వుతూ, ‘ఉద్ధవా! మానవ జీవితం, వారు చేసుకున్న కర్మల ద్వారా సాగుతుంది. నేను వారి కర్మలను నిర్వర్తించను, వాటిలో కలుగ చేసుకోను. కేవలం ఒక సాక్షిలా గమనిస్తూ ఉంటాను. అదే భగవంతుని ధర్మము’ అని వివరించాడు. ఆ సమాధానానికి ఉద్ధవుడు ఆశ్చర్య చకితుడై, ‘అయితే కృష్ణా! మేము తప్పుదారి పట్టి, పాపములను మూట కట్టుకుంటుంటే, నువ్వలా దగ్గరుండి చూస్తూ ఉంటావా? మమ్మల్ని అడ్డుకోవా? ఇదెక్కడి ధర్మము కృష్ణ’ అని ప్రశ్నించాడు. దానికి కృష్ణుడు, ‘ఉద్ధవా! నీ మాటలను నీవే జాగ్రత్తగా గమనించు. నీకే అర్ధమవుతుంది. భగవంతుడు నీతోనే, నీలోనే ఉన్నాడనీ, నిన్ను దగ్గరుండి గమనిస్తున్నాడనీ గుర్తించినప్పుడు, నీవు తప్పులు ఎలా చేయగలుగుతావు చెప్పు? ఈ సత్యాన్ని మరచినప్పుడే, మానవుడు తప్పు దారి పడతాడు, అనర్ధాలను కొని తెచ్చుకుంటాడు. ధర్మరాజు, జూదము గురించి నాకు తెలియదనుకోవడమే తాను చేసిన మొదటి తప్పు. నేను అంతటా ఉన్నానని అతను గుర్తించి ఉంటే, ఆట పాండవులకు అనుగుణంగా సాగేది’ అని ఉద్ధవుడికి చక్కగా బోధించాడు శ్రీ కృష్ణుడు. వాసుదేవుడు బోధించిన మధురమైన గీతను విని, ఉద్ధవుడు ఎంతో ఆనందించి, తన సంశయములన్నిటినీ తీర్చినందుకు కృతజ్ఞతా భావంతో, కృష్ణుడికి నమస్కరించాడు. పూజలూ, ప్రార్థనలూ భగవంతుడి సహాయమును కొరటానికి చేసే కర్మలే. కానీ, సంపూర్ణ విశ్వాసము వీటికి తోడైతే, అంతటా ఆయనే కనిపిస్తాడని, సమస్త మానవళికీ తెలియజేసేదే ‘ఉద్ధవ గీత’.

కృష్ణం వందే జగద్గురుం!

Link: https://www.youtube.com/post/Ugkxmu0PlOYJc2H3O7EySIXJqt_kOxH60_Ha

No comments: