శబరిమల అయ్యప్ప స్వామి గురించి నమ్మలేని నిజాలు!
‘స్వామియే శరణమయప్ప’ అంటూ మండలం రోజులపాటు నిష్టగా స్వామి మాల ధరించి, హరిహరసుతుడికై ఆర్తిగా భజనలు చేస్తారు అయ్యప్ప భక్తులు. ఆ మణికంఠుడిపై ఉన్న అపారమైన భక్తికి నిదర్శనంగా, ప్రతి సంవత్సరం కోట్లాది మంది ఎంతో నిష్టతో కూడుకున్న అయ్యప్ప మాలను ధరించి, మండలం రోజుల పాటు తూచా తప్పకుండా నియమ నిబంధనలు పాటించడం, మండలం పూర్తయ్యాక శబరిమలకు వెళ్లి దీక్ష విరమించడం వంటివి చూస్తూ ఉంటాము. మరీ ముఖ్యంగా కార్తిక మాసం వచ్చిందంటే ఎక్కడ చూసినా అయ్యప్ప మాల ధరించిన స్వాములు మన చుట్టూ ఎంతో మంది మనకు కనిపిస్తుంటారు. స్వాములు చేసే భజనలలోనూ, ప్రవచించే గాధలను వింటుంటే, అసలు అయ్యప్ప స్వామి ఎవరు? ఆయన ఎప్పుడు? ఎలా జన్మించారు? ఎక్కడ వెలిశారు - వంటి సందేహాలు కొంతమందికి కలుగుతుంటాయి. ఇప్పుడున్న ఆలయం ఎవరు? ఎప్పుడు కట్టారు? ఆ క్షేత్ర విశేషాలేమిటి? అసలు అయ్యప్ప స్వాములు శనికి ప్రీతిపాత్రమైన నలుపు రంగు వస్త్రాలు ధరించడానికి కారణం ఏమిటి వంటి విషయాలు మనలో చాలా మందికి తెలియదు. ఈ ఆలయంలోని మూలవిరాట్టుకు సంబంధించి మనం గతంలో చేసిన వీడియో లింక్ ను చూడని వారి కోసం పొందు పరుస్తున్నాను. ఇక క్షేత్ర విశేషాలు తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/Cn6pqpQdUTw ]
క్షీరసాగరమధనానంతరం, దేవతలకూ రాక్షసులకూ అమృతం పంచేందుకు శ్రీ మహావిష్ణువు మోహినిగా అవతరించిన విషయం తెలిసిందే. ఆ తరువాత మోహినిని చూసి గరళ కంఠుడు ఆకర్షింపబడడం, వారి కలయిక వలన శివకేశవుల తేజస్సుతో, ధనుర్మాసం 30వ రోజు శనివారం, పంచమి తిథి, ఉత్తరా నక్షత్రం వృశ్చిక లగ్నంలో అయ్యప్ప జన్మించాడు. ఆ తరువాత తండ్రియైన జగత్పిత ఆజ్ఞమేరకు పంపా సరోవర తీర ప్రాంతంలో, కంఠంలో మణిమాలతో శిశురూపంలో అవతరించాడు స్వామి.
ఆ సమయంలో దైవ ప్రేరణవలన వేట నిమిత్తం అటుగా వచ్చిన పందళ దేశాధీశుడూ, గొప్ప శివభక్తుడూ అయిన రాజశేఖరుడు, సంతానం లేక అల్లాడిపోతున్న తనను కరుణించి ఈశ్వరుడే ఆ శిశువును ప్రసాదించాడని తలచి, ఆనందంతో ఆ బిడ్డను అంతఃపురానికి తీసుకువెళ్ళాడు. మణికంఠుని సాత్విక గుణాలవల్ల కొందరు 'అయ్యా అని, మరికొందరు 'అప్పా అని, ఇంకొందరు రెండు పేర్లూ కలిపి 'అయ్యప్ప' అని పిలిచేవారు. తగిన వయసు రాగానే మహారాజు అయ్యప్పకు రాజ్య పట్టాభిషేకం జరపాలని అనుకున్నాడు. కానీ తండ్రి ఇచ్చిన రాజ్యాన్ని వద్దని, తనకు ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని కోరాడు మణికంఠుడు. అందుకు నియమం ఏమిటంటే, తానొక బాణం వదులుతాననీ, ఆ బాణం ఎక్కడ పడుతుందో అక్కడ తనకు ఆలయం నిర్మించాలనీ చెప్పాడు. అలా కట్టిన ఆలయమే శబరిమల ఆలయం. శబరిమల ఆలయ నిర్మాణంలో పరశురాముడు కీలక పాత్ర పోషించారు. అక్కడ అయ్యప్ప స్థిర నివాసం ఏర్పరచుకుని, భక్తుల పూజలందుకుంటున్నాడని చరిత్ర విదితం.
అధికారిక సమాచారం ప్రకారం మొదటిలో శబరిమలకు వెళ్ళడానికి ఎరుమేలి అని పిలువబడే ఒకే ఒక్క మార్గం ఉండేది. మాస పూజలకూ, ప్రత్యేక పూజలకూ, ఆలయ సిబ్బందీ, తాంత్రి, మేల్ శాంతి వంటి వారెవరైనా ఈ మార్గంలోనే వెళ్ళి వచ్చేవారు. పూర్తిగా అడవి ప్రాంతం కావడం చేత ఆలయానికి ఎప్పుడు, ఎవరు వెళ్లాలన్నా బృందాలుగా మాత్రమే వెళ్లేవారు. అందుకే భక్తులు కూడా జట్లుగా వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది.
[ శబరిమల అయ్యప్ప! దైవ స్థాపిత విగ్రహం ఏమయ్యింది?: https://youtu.be/Z1osWZdk17g ]
సుమారు 200 సంవత్సరాల క్రితం, అంటే, 1819 లో, 70 మంది శబరిమల యాత్ర చేశారనీ, ఆ సంవత్సరం అన్ని ఖర్చులూ పోను, ఆలయానికి వచ్చిన ఆదాయం ఏడురూపాయలనీ, పందళరాజ వంశీయుల రికార్డులలో ప్రస్తావించబడి ఉంది. 1907వ సంవత్సరం వరకూ శబరిమల అయ్యప్ప ఆలయ పైకప్పు కేవలం ఎండుగడ్డి, ఆకులతో కప్పబడివుండేది. అక్కడే స్వామి శిలా విగ్రహానికి పూజలు జరిగేవి. కొన్ని దశాబ్దాల క్రితం దేవాలయం అగ్ని ప్రమాదానికి గురి కావడంతో మరల ఆలయాన్ని పునర్నిర్మించినట్లు తెలుస్తోంది.
ఈ సారి శిలా విగ్రహానికి బదులు, అయ్యప్ప విగ్రహాన్ని పంచలోహాలతో తయారు చేయించి ప్రతిష్టించారు. పంచ లోహ విగ్రహం ప్రతిష్ఠించాకే శబరిమల వైభవం పెరిగిందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. ఈ దేవాలయం 1935 వరకు ట్రావెన్‌కోర్ మహారాజా సంస్థానంవారి ఆధీనంలో ఉండేది. 1935లో ఆలయ బాధ్యతలు ట్రావెన్‌కోర్ దెవస్థానం బోర్డువారికి అప్పగించబడ్డాయి. ఆ తరువాత భక్తుల సంఖ్య గణనీయంగా పెరగడంతో, జ్యోతి దర్శనానికే కాకుండా, మండల పూజలకు కూడా శబరిమల ఆలయం తెరవడం మొదలుపెట్టారు.
పంబా ప్రాజెక్టు నిర్మాణ సమయంలో చాలక్కాయ మార్గం, వడిపెరియార్ మార్గం ఏర్పడిన తరువాత, శబరిమలకు వచ్చే భక్తుల తాకిడి బాగా పెరిగింది. 1945వ సంవత్సరం నుండి భక్తుల సంఖ్య ఇంకా పెరగడంతో, విషు, పంకుని ఉత్తారం, ఓణం వంటి పండుగ దినాలలో కూడా ఆలయాన్ని తెరవడం ప్రారంభించారు. శబరిమలకు వచ్చే భక్తులు పెరగడాన్ని చూసి కొందరికి కన్ను కుట్టి, 1950లో, దెవలయాన్నీ, విగ్రహాన్నీ ధ్వంసం చేశారు. అలా పరశురామ నిర్మితమైన దేవాలయం మూడుసార్లు అగ్నికి ఆహుతి అయ్యింది. భక్తుల విరాళాలతో దేవస్థానం బోర్డు వారు ఇప్పుడున్న ఆలయాన్ని పునర్నిర్మించి, ఇప్పుడు మనకు కనిపించే స్వామివారి పంచలోహ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ విగ్రహాన్ని చెంగనూరు వాస్తవ్యులైన శ్రీ అయ్యప్పన్, శ్రీనీలకంఠన్ అనే శిల్పులు తయారు చేసినట్లు తెలుస్తోంది.
దేవస్థానం ముఖ్యతాంత్రి అయిన శ్రీకాంతారు శంకర తాంత్రి, 1951, జూన్ 7వ తేదీన వేదపండితుల మంత్రాలూ, భక్తుల శరణుఘోషల మధ్య ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి వరకు కేరళీ కేళి విగ్రహంగా కీర్తించబడిన అయ్యప్ప, అక్కడి నుంచి భారత కేళి విగ్రహంగా కీర్తించబడుతూ, ఈ నాడు భూతళ కేళి విగ్రహంగా ప్రపంచమంతటా పూజింప బడుతున్నాడు.
[ శబరిమల కొండలపై నెలకొన్న ఆశ్చర్యకర నిజాలు - మకరజ్యోతి రహస్యాలు!: https://youtu.be/307e0iCsUdE ]
ఈ విషయంలో శబరిమల తపస్వి శ్రీ విమోచనానంద స్వామి కృషి ఎంతో మెచ్చుకోదగ్గది. 1950లో శబరిమలలోని అయ్యప్ప ఆలయం అగ్నికి ఆహుతి అయినప్పుడు, శ్రీ విమోచనానంద స్వామి హిమాలయాలలో సంచరిస్తూ, బదరీనాథ్ లో ఉన్నప్పుడు ఈ వార్త విన్నారు. శబరిమల ఆలయాన్ని ధ్వంసం చేశారు కాబట్టి, భారతదేశమంతటా అయ్యప్ప ఆలయాలు నిర్మించి, అతిత్వరలో ప్రపంచమంతటా సామిని కీర్తించేటట్లు చేస్తానని శపథం చేశారాయన. ఆ మహానుభావుడు కాశీ, హరిద్వార్, పూనా, ముంబయి, కరుపత్తూరు, శ్రీరంగపట్టణం మొదలైన ప్రాంతాలలో అయ్యప్ప ఆలయాలు నిర్మింపచేయడానికి దోహదపడ్డారు. ఆయన కోరిక నెరవేరి, దేశమంతటా ఎన్నో అయ్యప్ప ఆలయాలు నిర్మితమవ్వడమే కాకుండా, దేశ విదేశాలనుంచి భక్తులు శబరిమలకు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు.
ఇదిలా ఉండగా, 1980కి వచ్చేసరికి, శబరిమలకు వచ్చే భక్తుల సంఖ్య మరింతగా పెరిగిపోవడంతో, దేవస్థానం బోర్డువారు శ్రద్ధ తీసుకుని, పంబపై వంతెన, పంబ నుండి విద్యుద్దీపాలూ, మంచి నీటి కొళాయిలూ, స్వాముల విశ్రాంతి కోసం పెద్ద పెద్ద షెడ్లూ నిర్మించినట్లు, ఆలయ రికార్డ్స్ పేర్కొంటున్నాయి.
ఇక శబరిమల పేరు చెప్పగానే అందరకీ గుర్తుకు వచ్చేది, పదునెట్టాంబడిగా పిలువబడే 18 బంగారు మెట్లు. అయ్యప్ప స్వామి సన్నిధానంలోని పదునెట్టాంబడిని స్వయంగా పరశురాముడే నిర్మించారు. ఆ రాతి మెట్లపైనే 1984 వరకు భక్తులు ఎక్కేవారు. ఈ మెట్లను తాకడం వల్ల తమ పాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. స్వాములు వెళ్ళే పడిని బట్టి, ఆ మెట్టుపై కొబ్బరికాయ కొట్టి మెట్లెక్కే ఆచారం ఉండేది. అందువల్ల మెట్లు కొంత మేర అరిగిపోయాయి. పైగా అలా మెట్లపై కొబ్బరికాయలు కొట్టడం వలన ఆ ముక్కలు కాళ్ళకు గుచ్చుకుని భక్తులు ఇబ్బంది పడే వారు. దానితో 1985 లో భక్తుల విరాళాలతో ఆ 18 మెట్లకూ పంచలోహ కవచాన్ని మంత్ర సహితంగా కప్పివేశారు. దీనివలన 18 మెట్లు ఎక్కడం స్వాములకు సులభరతమైంది. దీనికి ముందు భక్తుల రద్దీ పెరగడం వలన తొక్కిసలాటలు లేకుండా ఉండటానికి వీలుగా, 1982లో ప్లై ఓవరు బ్రిడ్జి కట్టి, దానిపై నుండి 18 మెట్లు ఎక్కిన తర్వాత, క్యులో వెళ్ళడానికి ఏర్పాట్లు చేసారు.
1985 నుండి అక్కడ స్థిర నిర్మాణాలెన్నో చేయడంవలన, శబరిమల స్వరూపం పూర్తిగా మారిపోయింది. బెంగళూరుకు చెందిన భక్తుడొకరు శబరిమల ఆలయంపైన బంగారు రేకులతో తాపడం చేయడానికి పూనుకుని, 2000వ సంవత్సరంలో పూర్తిచేయడంతో శబరిమల స్వర్ణదేవాలయంగా మారింది. శబరిమల ఆలయంలో వంశ పారంపర్య ముఖ్య పూజారిని తాంత్రి లేక తంత్రి అని పిలుస్తారు. పరశురాముడు వీరిని పూజ కొరకు ఆంధ్రా కృష్ణాజిల్లా నుండి తీసుకెళ్ళారని చెబుతారు. ప్రస్తుతం శ్రీరాజీవ్ తాంత్రి ఆధ్వర్యంలో, శబరిమల దేవాలయంలో పూజలు జరుపబడుతున్నాయి. శబరిమల దేవాలయంలో పూజలు జరిపించడానికి, మేల్ శాంతిగా పిలువబడే పూజారిని, ప్రతి సంవత్సరం లాటరీ ద్వారా ఎన్నుకుంటారు. దేవస్థానంవారికి వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన తరువాత, వాటిలో పదింటిని ఎంపిక చేసి, ఆ పేర్లను చీటీలపై రాసి ఒక డబ్బాలో ఉంచుతారు. దానిని అయ్యప్ప విగ్రహం ముందుంచి, ఒక చిన్నపిల్లవాని చేత లాటరీ తీయిస్తారు. అందులో ఎవరి పేరు వస్తే, వారు ఆ సంవత్సరానికి శబరిమలలో మేల్ శాంతిగా వ్యవహరిస్తారు.
ఇక స్వామి వారి ఆభరణాలను పందళలో భద్రపరచి ఉంచుతారు. ప్రతీయేటా జనవరి 14వ తారీఖు నాటికి, అంటే, మకరసంక్రాంతి రోజున పందళం నుండి శబరిమలకు మూడు పెట్టెలలో, 84 కిలోమీటర్ల ఆడవి మార్గంలో నడుచుకుంటూ మోసుకు వస్తారు. ఈ ఆభరణాలు తేవడానికి పందళంలోని భాస్కరన్ పిళ్లై వారి కుటుంబం బాధ్యత వహిస్తుంది. వీరు మొత్తం 11 మంది. వారంతా 65 రోజులు దీక్షలో ఉండి, తిరువాభరణాలను శబరిమలకు తీసుకు వస్తారు.
వీరు జనవరి 12 మధ్యాహ్నం పందళంనుండి బయలుదేరి, మధ్యలో రెండు రాత్రిళ్ళు విశ్రాంతి తీసుకుని, 14వ తేదీ సాయంత్రం 6 గంటలకు శబరిమల సన్నిధానం చేరతారు. ఆభరణాల వెంట పందళరాజ వంశస్తులలో పెద్దవాడు కత్తి పట్తుకుని నీలిమల వరకు వచ్చి, అక్కడ విశ్రమిస్తాడు. తిరు ఆభరణాలు స్వామివారికి అలంకరించి, కర్పూరహారతి గుళ్ళో ఇవ్వగానే, తూర్పుదిక్కు పొన్నాంబళమేడు నుండి భక్తులకు జ్యోతి దర్శనం అవుతుంది. ఇరుముడి లేకుండా తాంత్రీ, పందళరాజు, తిరు ఆభరణాలు మోసేవారూ పదునెనిమిది మెట్లెక్కుతారు. మరల జనవరి 20వ తారీఖు నాడు, పందళరాజు వెంటరాగా, తిరు ఆభరణాల మూడు పెట్టెలను తిరిగి పందళం తీసుకు వెళ్ళి భద్రపరుస్తారు. ప్రతి ఏటా స్వామివారి ఆభరణాలు తరలిస్తున్న సమయంలో వాటికి రక్షణగా ఆకాశంలో ఒక గరుడ పక్షి తిరుగుతుండడం స్వామి వారి లీలగా భక్తులు భావిస్తారు.
ఇక అయ్యప్ప మాలధారణ చేసిన 41 రోజులపాటు నల్లటి వస్త్రాలు ధరించడానికి కారణం విషయానికి వస్తే, నవగ్రహాల ప్రభావం మానవలోకంలో దుష్ప్రభావం చూపించకుండా, శని, రాహు, కేతు మొదలైన గ్రహాల వల్ల ఆపదలు రాకుండా సదా కాపాడే మహిమాన్వితమైన దైవం అయ్యప్ప స్వామి! అయ్యప్ప భక్తులపై తన ప్రభావం చూపించనని, 'శని' భగవానుడు అయ్యప్పకు వాగ్దానం చేశాడు. అందుకే శనికి ప్రీతిపాత్రమైన నల్లని దుస్తులను తన దీక్షాకాలంలో ధరించాలని అయ్యప్ప మానవులకు నియమం పెట్టాడు. దీక్ష సమయంలో ఒక్కసారి నల్లని దుస్తులను ధరించిన వారికి, జీవితాంతం శని ప్రభావం వుండదని 'అయ్యప్ప' స్వాముల నమ్మకం.
ॐ 🚩 స్వామియే శరణమయ్యప్ప 🙏

No comments: