Monday, 17 October 2022

ఉద్ధవ గీతలో ఏం ఉంది? Uddhava Gita

 

‘ఉద్ధవ గీత’లో ఏం ఉంది! జూదంలో ఓడిపోకుండా పాండవులను శ్రీ కృష్ణుడు ఎందుకు కాపాడలేదు?

ఉద్ధవుడు శ్రీకృష్ణుని ప్రియ మిత్రుడు. రూపు రేఖలూ, వేష ధారణ కూడా కృష్ణుని వలే ఉంటాయి. నిర్మలమైన భక్తి అంటే ఏమిటో తెలుసుకోవాలంటే, ఉద్ధవుని గురించి తెలుసుకుంటే గానీ అర్ధం కాదు. ఉద్ధవుడు చిన్ననాటి నుంచే శ్రీ కృష్ణుడికి ఎన్నో సేవలు చేశాడు. ఆయనే కృష్ణుడికి రథసారధి కూడా. కానీ, తను చేసే సేవలకు ఎప్పుడూ ఏ ప్రతిఫలమూ ఆశించలేదు. భక్తిలో పరాకాష్టకు చేరినవారు, భగవంతుడిని తమలోనే దర్శించుకుంటారు. శ్రీ కృష్ణుడు తన అవతార పరిసమాప్తికి ముందు, ఉద్ధవుడితోనే మాట్లాడాడు. కృష్ణ భగవానుడు కురుక్షేత్రంలో అర్జునుడికి ధర్మాన్ని బోధించాడు. అది భగవద్గీతగా, ముఖ్య పారాయణ గ్రంధంగా ప్రజ్వరిల్లుతోంది. అలాగే, శ్రీ కృష్ణుడు చివరిగా ఉద్ధవుడితో మాట్లాడిన మాటలు, ‘ఉద్ధవ గీత’గా ఖ్యాతి గడించింది. అసలు ఉద్ధవ గీతలో ఏముంది? ఉద్ధవుడు శ్రీ కృష్ణుడిని అడిగిన ప్రశ్నలేంటి? కర్మ గురించి వాసుదేవుడు వివరించిన సందేశం ఏంటి -  వంటి ఆసక్తికర విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/buXxa_0VE5w ]

ఉద్ధవ గీత అనేది, శ్రీకృష్ణుడు ఉద్ధవునికి చేసిన ఉపదేశం అనే దానికన్నా, ఆచరించవలసిన ఆదేశం అనడం సమంజసం. ఈ ‘ఉద్ధవ గీత’ అనేది, శ్రీ భాగవతంలోని ఏకాదశ స్కంధంలోని, ఆరవ అధ్యాయం, నలుబదవ శ్లోకం నుండి ప్రారంభమై, ఇరువది తొమ్మిదవ అధ్యాయంతో ముగుస్తుంది. ఈ మొత్తం "ఉద్ధవ గీత"లో, వెయ్యికి పైగా శ్లోకాలున్నాయి. ఉద్ధవుడు యదుకుల శ్రేష్ఠుడు, మహాజ్ఞాని. శ్రీకృష్ణ, ఉద్ధవుల సంవాదమే, ఉద్ధవగీతగా జగత్ ప్రసిద్ధిగాంచింది. శ్రీ కృష్ణుడు చివరిసారిగా చేసిన బోధ ఇదే. ఒక విధంగా చెప్పాలంటే, ‘ఉద్ధవ గీత’, భగవంతుడైన శ్రీ కృష్ణ పరమాత్మ మనకిచ్చే వీడ్కోలు సందేశం అని చెప్పవచ్చు. పరమాత్మలోని దివ్య సుగుణాలన్నీ, ఈ ‘సృష్టి’లోనే ఉన్నాయి. వాటిని గ్రహించి, ఆచరించగలగడమే మహాయోగం. భూమి నుంచి క్షమాగుణాన్నీ.., వాయువు నుంచి పరోపకారాన్నీ, ప్రాణస్థితి నిలకడనూ.., ఆకాశం నుంచి పరమాత్మ సర్వవ్యాపి అనీ.., జలం నుంచి నిర్మలత్వాన్నీ, పావనత్వాన్నీ.., అగ్ని నుంచి దహించే శక్తినీ గ్రహించి, తన దేహం పాంచ భౌతాత్మకమనీ, పంచభూతాల గుణాలను కలిగి ఉండాలనీ తెలుసుకోవాలి జీవుడు. మనిషి కర్మాచరణే ధర్మంగా భావించాలి. దేనిమీద కూడా విపరీతమైన వ్యామోహం ఉండకూడదని చెబుతుంది, ఉద్ధవ గీత.

శ్రీ కృష్ణుడు ఉద్ధవుడితో, ఏదైనా వరం కోరుకో అని చెప్పగా అందుకు ఉద్ధవుడు, ‘దేవా! నీ లీలలను అర్ధం చేసుకోవటం మా తరం కాదు. నాకు ఏ వరమూ వద్దు కానీ, నిన్ను ఓక ప్రశ్న అడుగుదామనుకుంటున్నాను. అడుగవచ్చునా?’ అని, వినయంగా ఇలా అడిగాడు.. ‘కృష్ణా! నీవు మా అందరికీ జీవించటానికి ఇచ్చిన సందేశము ఒకటి, నీవు జీవించిన విధానము మరొకటి. మహాభారత యుద్ధములో, నీవు పోషించిన పాత్ర, తీసుకున్న నిర్ణయములు, చేపట్టిన పనులు నాకేమీ అర్ధం కాలేదు. దయచేసి నా సందేహములను తీర్చి, నన్ను అనుగ్రహించండి.’ అని కోరుకున్నాడు. దానికి కృష్ణుడు, ‘ఉద్ధవా! ఆనాడు యుద్ధభూమిలో అర్జునుడికి గీతను బోధించాను. ఈ నాడు నీకు ఉద్ధవ గీతను బోధించటానికి ఈ అవకాశాన్ని కలిపిస్తున్నాను. నన్ను ఏమి అడగాలనుకుంటున్నావో తప్పకుండా అడుగు.’ అని ఉద్ధవుడిని ప్రోత్సహించాడు. ఇక ఉద్ధవుడు తన ప్రశ్నలను అడగటం మొదలు పెట్టాడు.

‘కృష్ణా, పాండవులు నీ ప్రాణ స్నేహితులు కదా! నిన్ను గుడ్డిగా నమ్మారు కూడా. నువ్వు భూత, భవిష్యత్, వర్తమానములు తెలిసినవాడవు. అటువంటప్పుడు వారిని జూదము ఎందుకు ఆడనిచ్చావు? మంచి మిత్రుడు అలాంటి వ్యసనములను ఎక్కడైనా ప్రోత్సహిస్తాడా? పోనీ ఆడనిచ్చావే అనుకో, కనీసం వారిని గెలిపించి, కౌరవులకు బుద్ధి చెప్పి ఉండకూడదా? అది కూడా చెయ్యలేదు. ధర్మజుడు ఆస్తినంతా పోగొట్టుకుని, వీధినపడ్డాడు. ఆఖరికి తన తమ్ముళ్లను కూడా ఓడిపోయాడు. అప్పుడైనా నీవు అడ్డుపడి, వాళ్ళను కాపాడి ఉండవచ్చును కదా? కౌరవులు దుర్బుద్ధితో, పరమ సాధ్వి అయిన ద్రౌపదిని, జూదంలో మోసం చేసి గెలిచారు. కనీసం అప్పుడైనా నువ్వు నీ మహిమతో, పాండవులను గెలిపించలేదు. ఎప్పుడో ఆవిడ గౌరవానికి భంగం కలిగినప్పుడు, ఆమెను ఆఖరి క్షణంలో అనుగ్రహించావు. సమయానికి ఆదుకున్న ఆపద్భాందవుడవని, గొప్ప పేరుపొందావు. కానీ, ముందే నీవు కలుగచేసుకుని ఉంటే, ఆమెకు నిండు సభలో జరిగిన అవమానం తప్పేది కదా. సమయానికి ఆదుకునేవాడే మంచి మిత్రుడనిపించుకుంటాడు. మరి, నీవు చేసినదేమిటి కృష్ణా?’ అని ఉద్ధవుడు ఎంతో బాధతో, కృష్ణుడిని తన ఆంతర్యమేమిటో తెలుపమని ప్రార్ధించాడు. నిజానికి ఈ సందేహములు, మహాభారత యుద్ధం గురించి తెలిసిన వారందరికీ కలుగుతాయి. కనుక కృష్ణుడు ఎంతో ప్రేమతో, ఉద్ధవుడి ద్వారా మనందరికీ ఉద్ధవ గీతను బోధించాడు. ‘ఉద్ధవా! ప్రకృతి ధర్మం ప్రకారం, అన్ని విధాలా జాగ్గ్రత్త పడి, తగిన చర్యలను తీసుకునే వాడే, గెలుపుకు అర్హుడు. దుర్యోధనుడికి జూదములో ప్రావీణ్యము లేకపోయినా, ఆస్తిపరుడు. కనుక తన అర్హత ప్రకారం, ఆస్తిని పణంగా పెట్టాడు. ఎంతో తెలివిగా తన మామ చేత పందెమును వేయించాడు.

ధర్మరాజు మాత్రం, పందెములను నా చేత వేయించాలని అనుకోలేదు. నా సహాయమునూ కోరలేదు. ఒకవేళ శకునితో నేను జూదమాడి ఉంటే, ఎవరు గెలిచేవారు? నేను కోరిన పందెమును శకుని వేయగలిగేవాడా? లేక అతను చెప్పిన పందెము నాకు పడేది కాదా? నీవే ఆలోచించుము..? సరే, ఇదిలా ఉంచు. ధర్మరాజు అజ్ఞానంలో మరొక క్షమించరాని నేరం చేశాడు. అదేమిటంటే, ‘నేను చేసుకున్న కర్మ వలన ఈ ఆటలో ఇరుక్కున్నాను. కృష్ణుడికి ఈ సంగతి తెలియకూడదు. ఇటువైపు ఎట్టి పరిస్థితిలో కూడా, కృష్ణుడు రాకూడదు అని ప్రార్ధించాడు. దాంతో ఏమీ చేయలేక, చేతులు కట్టుకుని, తన పిలుపుకోసం ఎదురు చూస్తూ నిలబడిపోయాను. ధర్మజుడు సరే.. భీముడూ, అర్జునుడూ, నకుల సహదేవులు కూడా, ఓడినప్పుడు వారి కర్మ అనుకున్నారే కానీ, ఏ మాత్రము నా సహాయము కోరలేదు. అలాగే ద్రౌపది కూడా. దుశ్శాసనుడు తనను సభలోకి ఈడ్చినప్పుడు కూడా నన్ను స్మరించకుండా, నిండు సభలో అందరితో తనకు న్యాయం చెయ్యమని వాదించింది. తన బుద్ధి కుశలతలనే నమ్ముకుంది. చివరికి తన ప్రయత్నములన్నీ విఫలమయ్యాక, గొంతెత్తి నన్ను పిలిచింది. సంపూర్ణ శరణాగతితో నన్ను శరణు వేడింది. అప్పుడు వెంటనే ప్రత్యక్షమయ్యి నేను ద్రౌపదిని రక్షించలేదా?’ అని కృష్ణుడు ఉద్ధవుడిని తిరిగి ప్రశ్నించాడు.

కృష్ణుడి సమాధానములకు ఉద్ధవుడు భక్తితో చలించి, ‘కృష్ణా! అలాగైతే, మాలాంటి సామాన్యుల సంగతి ఏమిటి? మేము చేసే కర్మలలో కూడా, నీవు కోరితే కల్పించుకుని సహాయం చేస్తావా? అవసరమైతే మమల్ని చేడు కర్మలు చేయకుండా కాపాడుతావా? అని చక్కటి ప్రశ్న వేశాడు ఉద్ధవుడు. దానికి శ్రీ కృష్ణుడు చిన్నగా నవ్వుతూ, ‘ఉద్ధవా! మానవ జీవితం, వారు చేసుకున్న కర్మల ద్వారా సాగుతుంది. నేను వారి కర్మలను నిర్వర్తించను, వాటిలో కలుగ చేసుకోను. కేవలం ఒక సాక్షిలా గమనిస్తూ ఉంటాను. అదే భగవంతుని ధర్మము’ అని వివరించాడు. ఆ సమాధానానికి ఉద్ధవుడు ఆశ్చర్య చకితుడై, ‘అయితే కృష్ణా! మేము తప్పుదారి పట్టి, పాపములను మూట కట్టుకుంటుంటే, నువ్వలా దగ్గరుండి చూస్తూ ఉంటావా? మమ్మల్ని అడ్డుకోవా? ఇదెక్కడి ధర్మము కృష్ణ’ అని ప్రశ్నించాడు. దానికి కృష్ణుడు, ‘ఉద్ధవా! నీ మాటలను నీవే జాగ్రత్తగా గమనించు. నీకే అర్ధమవుతుంది. భగవంతుడు నీతోనే, నీలోనే ఉన్నాడనీ, నిన్ను దగ్గరుండి గమనిస్తున్నాడనీ గుర్తించినప్పుడు, నీవు తప్పులు ఎలా చేయగలుగుతావు చెప్పు? ఈ సత్యాన్ని మరచినప్పుడే, మానవుడు తప్పు దారి పడతాడు, అనర్ధాలను కొని తెచ్చుకుంటాడు. ధర్మరాజు, జూదము గురించి నాకు తెలియదనుకోవడమే తాను చేసిన మొదటి తప్పు. నేను అంతటా ఉన్నానని అతను గుర్తించి ఉంటే, ఆట పాండవులకు అనుగుణంగా సాగేది’ అని ఉద్ధవుడికి చక్కగా బోధించాడు శ్రీ కృష్ణుడు. వాసుదేవుడు బోధించిన మధురమైన గీతను విని, ఉద్ధవుడు ఎంతో ఆనందించి, తన సంశయములన్నిటినీ తీర్చినందుకు కృతజ్ఞతా భావంతో, కృష్ణుడికి నమస్కరించాడు. పూజలూ, ప్రార్థనలూ భగవంతుడి సహాయమును కొరటానికి చేసే కర్మలే. కానీ, సంపూర్ణ విశ్వాసము వీటికి తోడైతే, అంతటా ఆయనే కనిపిస్తాడని, సమస్త మానవళికీ తెలియజేసేదే ‘ఉద్ధవ గీత’.

కృష్ణం వందే జగద్గురుం!

Link: https://www.youtube.com/post/Ugkxmu0PlOYJc2H3O7EySIXJqt_kOxH60_Ha

Monday, 12 September 2022

చెత్త కుప్పలో వదిలివేయబడ్డ జీవకుడు వైద్య శిఖామణిగా ఎలా ఎదిగాడు? Ancient Indian Physician Jivaka - History

 


చెత్త కుప్పలో వదిలివేయబడ్డ జీవకుడు వైద్య శిఖామణిగా ఎలా ఎదిగాడు?

వైద్య శాస్త్రంలో ఎంతో కీర్తి గడించిన మహానీయుల ప్రస్తావన, మన పురాణాలలో స్పష్టంగా వివరించబడి ఉంది. మొక్కలూ, మూలికలతోనే అంతుచిక్కని వ్యాధులనుండీ, ప్రాణాపాయమైన వ్యాధులనుండీ, ఎన్నో ప్రాణాలను కాపాడిన వైద్యశిఖామణలున్నారు. వారిలో, అపర ధన్వంతరిగా పిలువబడే సుశ్రుతుడి గురించి, మన గత వీడియోలో తెలుసుకున్నాము. సుశ్రుతుడి గురించిన మన వీడియో చూడాలనుకుంటే, దాని లింక్ ను క్రింద డిస్క్రిప్షన్ లో పొందుపరిచాను. మన సనాతన ధర్మ గొప్పతనాన్నీ, మన సంస్కృతిలో ఉన్న ఔన్నత్యాన్నీ చాటి చెప్పే మహానీయుల గాధలను మీకు అందించాలని ప్రయత్నిస్తున్నాను. అందులో భాగంగానే, ఎన్నో వేల సంవత్సరాల క్రితమే, ప్రపంచానికి నాగరికత అంటే తెలియని సమయంలో, ఎన్నో అద్భుతాలు చేసిన మహర్షుల గురించీ, వైద్య ఆచార్యుల గురించీ వీడియోలు అందిస్తూ వస్తున్నాను. అటువంటి వారిలో, బుద్ధుని అంతరంగిక వైద్యుడిగా, మగధ రాజ్యానికీ, బింబిసారుడికీ ఆచార్య వైద్యుడిగా, మెదడుకు సంబంధించిన శస్త్ర చికిత్సలు చేయడంలో మేటి వైద్యునిగా, బౌద్ధ, జైన మత గ్రంథాలలో సైతం స్థానం సంపాదించుకున్న మేధావి, జీవకుడు. బుద్ధుడికీ, జీవకుడికీ పరిచయం ఎలా జరిగింది? అసలు జీవకుడి వృత్తాంతం ఏమిటి - అనే విషయాలతో పాటు, బుద్ధునికి ప్రధాన శిష్యుడిగా, అనుయాయుడిగా మారడానికి ఎటువంటి సంఘటనలు దోహదం చేశాయి - వంటి ఆసక్తికర విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/3AMFYlYPDVs ]

కొన్ని ఆధారాల ప్రకారం, జీవకుడు రాజగృహనగర వేశ్య కుమారుడు. ఆమె అతడికి జన్మనిచ్చి, చెత్తకుప్పలో వదిలి వెళ్ళిపోయింది. ఆ బాలుడిని మగధ రాజవంశీయుడైన అభయుడు తీసుకువచ్చి, జీవకుడిగా నామకరణం చేసి, అలనా పాలనా చూసుకున్నాడు. యుక్త వయస్సు వచ్చాక, విద్యాభ్యాసం కోసం తక్షశిలకు పంపించాడు, అభయుడు. ఏకసంథాగ్రాహి అయిన జీవకుడు, ఏడు సంవత్సరాలు వైద్య విద్యను అభ్యసించాడు. ఒకనాడు వైద్య గురువైన ఆత్రేయను కలిసి, "తన చదువు పూర్తయిందా?" అని అడిగాడు జీవకుడు. అందుకు గురువు ఒక గడ్డపారను చేతికిచ్చి, తక్షశిలకు ఎనిమిది మైళ్ళ కైవారంలో, వైద్యానికి పనికిరాని మొక్కలను తనకు తెచ్చివ్వమని చెప్పాడు. అలా గురువు గారి మాట ప్రకారం, కొన్నాళ్ల పాటు తక్షశిల చుట్టూ ఉన్న ప్రతీ మొక్కను పరిశీలించాడు. కానీ, అతనికి వైద్యానికి పనికి రాని మొక్కంటూ ఏదీ కనిపించకపోవడంతో, ఒట్టి చేతులతో తక్షశిలకు తిరిగి వచ్చాడు. సంగతి తెలుసుకున్న వైద్య గురువు ఆత్రేయ, జీవకుడి విద్య విజయవంతంగా పూర్తయిందని సంతోషించి, కొంత ధనం చేతబెట్టి, దీవించి పంపించాడు.

అలా జీవకుడు, ప్రకృతిలో పనికిరాని మొక్కంటూ ఏదీ లేదని తెలుసుకోవడమే కాక, ఎన్నో సందర్భాలలో నిరూపించాడు కూడా. అయితే, జీవకుడు విద్య పూర్తి చేసుకుని తిరిగి వచ్చే సమయంలో, అయోధ్యా నగరంలో, ఒక శ్రేష్టిగారి భార్య, శిరస్సుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతుండగా, జీవకుడు ఆమె వ్యాధిని నయం చేశాడు. దాంతో సంతోషించిన శ్రేష్టి, ఆనాటి సోమ్ము ప్రకారం, 12 వేల కహాపణాలనూ, ఇద్దరు నౌకర్లనూ, గుర్రపు బగ్గీనీ బహుకరించి పంపించాడు. ఆ ధనాన్ని తెచ్చి అభయుడికిచ్చి, అతని ఆశీర్వాదం తీసుకున్నాడు. ఆనాటి నుండీ మగధ రాజ్యానికి రాజ వైద్యునిగా, అనేక సేవలు అందించాడు. అప్పటిలోనే జీవకుడు, కపాలాన్ని ఛేదించి, మొదడులోని రెండు యెటిక పాములు, అంటే tape warmsని తీశాడని, బౌద్ధ గ్రంథంలో వివరించబడి ఉంది.

వేరు మూలికలతో కషాయం, లేపనాలూ, పిండికట్లూ, ఔషధగుణాలూగల నూనెలను వాడటం, శస్త్ర చికిత్సలోనూ, పలురకాల వైద్యవిధానాలను అవలంభించాడు. శస్త్రచికిత్సలు చేసేటప్పుడు, ముందుగా రక్తాన్ని గడ్డకట్టించి, ఆ తరువాత పదునైన కొమ్మును వాడి, చికిత్స చేసేవాడు. వైద్యంలో ఎన్నో మెరుగైన పద్ధతులను అనుసరించేవాడు. జీవకుడు వైద్యునిగా, చుట్టు ప్రక్కల అన్ని రాజ్యాలలో ఎంతో పేరుగడించాడు. ఒకనాడు బుద్ధుడికి ఆరోగ్యం పాడైయింది. విపరీతమైన దగ్గు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, నిద్రలేమి, నొప్పుల వంటి సమస్యలతో బాధపడుతుంటే, తన శిష్యుడైన ఆనందుడి సలహాతో, జీవకుడిని పిలిపించారు. జీవకుడు వస్తూనే, బుద్ధుడిని ఆనారోగ్యానికి సంబంధించిన ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాడు. “దగ్గు వచ్చేటపుడు నోట్లోంచి శ్లేష్మం పడుతుందా? అది విషపు వాసన వేస్తుందా? రోజులో ఎంతసేపు వస్తోంది? పొడిదగ్గు మాత్రమేనా? ఊపిరి తీసుకోవడంలో ఛాతీ నెప్పులున్నాయా?” వంటి అనేక ప్రశ్నలను అడిగాడు జీవకుడు. వాటన్నింటికీ బుద్ధుడు సమాధానాలు చెప్పాక, “మీకు ఉన్నది ఊపిరితిత్తులలో సమస్య. దానికి నేను మూడు మందులు పట్టుకొస్తాను. వాటిని నేరుగా నోట్లోంచి తీసుకోనక్కర్లేదు. మందును మూడు ఫలాల్లో పెట్టి ఇస్తాను. వాటిని మూడు గంటలకోసారి వాసన చూస్తూ ఉండండి. వారం రోజుల్లో ఆరోగ్యం కుదుట పడుతుంది.” అని చెప్పి వెళ్ళిపోయాడు.

ఆ మర్నాడు మందు తీసుకువచ్చి, దానిని ఎలా వాడాలో చెప్పి, తిరిగి వెళ్ళబోతుండగా, ఈ మందుకీ, వైద్యానికీ ఖర్చు ఏమైనా ఇవ్వాలా? అని ఆనందుడు అడిగాడు. అందుకు తల అడ్డం తిప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు జీవకుడు. ఆ తరువాత కొన్ని రోజులకు జీవకుడు, తన సేవకుడి ద్వారా ఒక రత్న కంబళిని బుద్ధుడికి పంపించాడు. ఆనందుడు ఆ కంబళిని చూసి, రాజుల దగ్గర మాత్రమే ఉండే ఇంత ఖరీదైన రత్న కంబళి, తన దగ్గరకు ఎలా వచ్చిందో తెలుసుకోవాలని విచారణ చేశాడు. జీవకుడు ఉజ్జయిని రాజైన చండప్రజ్యోతుడికి, కామెర్లు తగ్గించాడు. దాంతో అబ్బురపడి, రాజు ఓ రెండు రత్న కంబళీలు బహుమానంగా ఇచ్చాడు. అయితే, బుద్ధుడి బోధనలపట్ల ఆకర్షితుడైన జీవకుడు, ఒక కంబళీని ఆయనకు కానుకగా పంపించాడు. కానీ, బుద్ధుడు ఆ కంబళిని ముక్కలు ముక్కలుగా కత్తిరించి, ప్రతీ సన్యాసికీ ఓ ముక్కను ఇచ్చాడు. బుద్ధుడు చేసిన పని తెలుసుకున్న జీవకుడికి, బుద్ధుడి ధర్మమార్గంపై మరింత ఆసక్తి ఏర్పడి, ఆయన శిష్యుడిగా మారిపోయాడు.

మరోసారి, బుద్ధుడి కాలికి గాయంకావడంతో, జీవకుడు చికిత్స చేయడానికి వెళ్ళాడు. దెబ్బ బాగా లోతుగా తగలడంతో, కుట్లు వేసి కట్టు కట్టి, మూడు వారాల వరకూ విప్పకూడదని చెప్పి, ఈ దెబ్బ ఎలా తగిలిందని బుద్ధుడిని అడిగాడు. అందుకు ఆనందుడు చొరవ తీసుకుని, బుద్ధుడి మీద కోపం పెంచుకున్న దేవదత్తుడు, రాయిని విసిరాడు. దాని వల్లే ఈ గాయం అయిందని వివరించాడు. ఆ సంగతి విని కోపగించుకున్న జీవకుడు, “మిమ్మల్ని చిన్నప్పటినుండీ కష్టపెడుతూ, ప్రతీ పనికీ అడ్డుతగులుతూ, మీ మీద కోపంతో, ఈర్ష్యతో రగిలే మనుషులను, మీరెందుకు మీ సంఘంలో చేర్చుకుంటున్నారు?” అని ప్రశ్నించాడు. అందుకు చిరునవ్వుతో, “దొంగతనం చేస్తుంటే, ఓ దొంగకి దెబ్బ తగిలింది.. లేదా, కసాయి జంతువధ చేస్తుంటే, ప్రాణాంతకమైన దెబ్బ తగిలింది. వారు నీ దగ్గిరకి వైద్యం కోసం వచ్చారు. అప్పుడు నువ్వు వైద్యం చేస్తావా? లేక వాళ్లు చేసిన పనిని బట్టి, వైద్యం చేయాలా వద్దా అని ఆలోచిస్తావా?” అని తిరిగి ప్రశ్నించాడు. ఛెళ్ళున చెంపమీద కొట్టినట్టు మ్రాన్పడిపోయిన జీవకుడు, మాట తడబడుతూండగా, “రోగి ఎటువంటివాడు, ఏం చేస్తుంటే రోగం తగిలిందీ? అన్న విషయం వైద్యుడు ఎప్పుడూ గుర్తుపెట్టుకోరాదు.” అని సమాధానమిచ్చాడు. అప్పుడు బుద్ధుడు, “ఈ సన్యాసం ఇవ్వడం, సంఘంలో జేర్చుకునే విషయం కూడా అటువంటిదే” అని చిరునవ్వుతో చెప్పాడు.

వారి సంభాషణ ముగిసిన తరువాత, మరో మూడు వారాల్లో కట్టు విప్పడానికి వస్తానని చెప్పి, జీవకుడు వెళ్ళిపోయాడు. మూడు వారాలు తిరిగేసరికి, భగవానుడి కట్టువిప్పడానికి బయల్దేరుతుంటే, శ్రావస్తిలో ఒకరికి ప్రాణపాయంగా ఉంది. తప్పక మీరు రావాలని, రోగి బంధువు కోరడంతో, తప్పనిసరి పరిస్థితిలో అక్కడికి బయలుదేరాడు, జీవకుడు. అయితే, ప్రాణం మీదకి వచ్చిన మనిషికి నయంకావడానికి, చికిత్స చేశాడు. కానీ, ఆయన కుదుట పడడానికి మరో మూడు వారాల సమయం పడుతుంది. ఆ రోజు సాయంత్రం జీవకుడు, బుద్ధుడి కాలికి కట్టిన కట్టు విప్పడానికి, విహారంలో ఎవరూ లేరన్న విషయం గుర్తుకు వచ్చి, ఏమి చేయాలో తోచని పరిస్థితిలో కళ్ళుమూసుకున్నప్పుడు, మానసిక ప్రకంపనలు కలగడం తెలియవచ్చింది. మనస్సులో ఎవరో తనతో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నారని అర్థమయ్యింది. దాంతో కాసేపు మౌనంగా ధ్యానం చేయడం మొదలు పెట్టాడు, జీవకుడు. అయితే, తనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నది బుద్ధుడేమోననీ, కాలికట్టు ఎలా విప్పాలో చెప్పమని అడుగుతున్నాడేమోననీ భావించి, ఓ సారి ఆ కట్టుకట్టిన విధం, దాన్ని ఎలా విప్పాలో మనసులో విశదంగా, ఒక్కో మెట్టూ గుర్తు చేసుకున్నాడు. తరువాత, ఒక్కసారిగా మనసులో ప్రకంపనలు ఆగిపోయి, ప్రశాంతగా అనిపించింది.

తాను ఆ రోజు బుద్ధుడితో ప్రత్యక్షంగా మాట్లాడిన అనుభూతి కలిగింది. తరువాత మూడు వారాలకు శ్రావస్తి నుంచి వెనక్కొచ్చిన జీవకుడు, హుటాహుటిన వెళ్ళి బుద్ధుని కాలికేసి చూసి ఆశ్చర్యపోయాడు. కట్టు విప్పేసి ఉంది. గాయం మానిపోయి, దాని రూపు కూడా కనబడడంలేదు. నేను ధ్యానంలో మీకు చెప్పిన విధానాన్ని, మీరు నిజంగానే అవలంభించారా? అదెలా సాధ్యం అయింది? అని ప్రశ్నించాడు జీవకుడు. “ఆ రోజు నువ్వు ధ్యానంలో కుట్లు ఎలా విప్పాలో విశదంగా గుర్తుచేసుకున్నావు. దానిని గ్రహించిన నేను, నువ్వు చెప్పినట్టే చేసి, కుట్లు విప్పుకున్నాను. ఎప్పుడైతే ఇద్దరి మానసిక తరంగాలు ఏకం అవుతాయో, అప్పుడు ఆలోచనలు ఒకరికొకరికి తెలియడం, అంత కష్టం కాదు. మాట్లాడుకోవడానికి మనిషి ఎదురుగా ఉండాల్సిన పని లేదు. అందుకే భిక్షువులు ఎంత దూరంగా ఉన్నా, నేనెప్పుడూ వాళ్లతో ఉన్నట్టే.. భౌతికంగా, ఎదురెదురుగా ఉండాల్సిన అవసరం లేదు.” అని బుద్ధుడు ఉపదేశించాడు. అప్పుడు జీవకుడికి అర్థమయ్యింది, బుద్ధుడు కారణ జన్ముడని. నాటి నుండి, బుద్ధుడి ప్రధాన శిష్యునిగా, అనుయాయునిగా మారిపోయాడు, జీవకుడు. ఇంతటి వైద్య పరిజ్ఞానం కలిగిన జీవకుడి గురించి, మన దగ్గరున్న పాఠ్యపుస్తకాలలో గానీ, అందరికీ అందుబాటులో ఉండే గ్రంధాలలో గానీ సమాచారం లేకపోవడం, గమనార్హం.

మగధ సామ్రాజ్యాన్ని పాలించిన బింబిసారుడి కాలంలో రాజ వైద్యుడిగా ఉన్న జీవకుడు, ఎందరో రాజులకు ప్రాణం పొసి, ప్రాణదాతగా అందరి మన్ననలనూ పొందాడు. మగధ రాజ్యాన్ని, మగధ సామ్రాజ్యంగా మలచిన బింబిసారుడికి సంబంధించిన మరింత సమాచారం, మన గత వీడియోలో ఉంది. దాని లింక్ ను కూడా డిస్క్రిప్షన్ లో పొందుపరిచాను.

ధర్మో రక్షతి రక్షితః!

Wednesday, 31 August 2022

దివ్య జ్ఞానం! భగవద్గీత Bhagavad Geeta

  

దివ్య జ్ఞానం! ఆత్మ పూర్వ మరియు ప్రస్తుత కర్మబంధాల నుండి ఎప్పుడు విడుదల చేయబడుతుంది?

'భగవద్గీత' దశమోధ్యాయం - విభూతి యోగం (01 – 05 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 7 నుండి 12 వరకూ ఉన్న అధ్యాయాలను భక్తి షట్కము అంటారు. దీనిలో పదవ అధ్యాయం, విభూతి యోగము. ఈ రోజుటి మన వీడియోలో, విభూతి యోగములోని 01 నుండి 05 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/qIKOgBKXbEk ]

భగవంతుని యొక్క వైభవోపేతమైన, మరియు దేదీప్యమానమైన మహిమలను గుర్తుచేసుకుంటూ, ఆయనపై ధ్యానం చేయటానికి సహాయముగా, అర్జునుడికి ఈ అధ్యాయము, శ్రీ కృష్ణుడిచే చెప్పబడినది. అర్జునుడి భక్తిని మరింత ఇనుమడింపచేయాలని, తన అనంతమైన మహిమలను మరింత వివరిస్తున్నాడు, శ్రీ కృష్ణుడు. భగవంతుడి ఉపదేశం విన్న తరువాత అర్జునుడు, శ్రీ కృష్ణుని యొక్క సర్వోన్నత స్థాయిని గురించి, తాను సంపూర్ణముగా విశ్వసిస్తున్నానని ప్రకటిస్తున్నాడు, మరియు శ్రీ కృష్ణుడే సర్వోత్కృష్ట పరమేశ్వరుడని, చాటిచెబుతున్నాడు. వినటానికి అమృతములా ఉండే ఆయన యొక్క కీర్తి విశేషాలను మరింత చెప్పమని, భగవంతుడిని ప్రార్ధిస్తున్నాడు. సమస్త పదార్ధములకూ కృష్ణుడే ఆది, మధ్య, అంతమూ కావున, ఉన్నదంతా ఆయన యొక్క శక్తి స్వరూపమే అని, శ్రీ కృష్ణుడు తెలియచేస్తున్నాడు.

01:35 - శ్రీ భగవానువాచ ।
భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః ।
యత్తేఽహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా ।। 1 ।।

శ్రీ భగవానుడు ఇలా పలుకుతున్నాడు: ఓ గొప్ప బాహువులు కలవాడా, నా దివ్య ఉపదేశాన్ని మళ్లీ వినుము. నీవు నా ప్రియ సఖుడవు కావున, నీ హితము కోరి, నేను నీకు వాటిని తెలియపరుస్తాను.

తన మహిమలను వినటంలో అర్జునుడి గాఢమైన ఆసక్తిని చూసి, శ్రీ కృష్ణుడు సంతోషపడుతున్నాడు. ఇప్పుడతని ఆనందాన్ని మరింత పెంచటానికీ, మరియు ప్రేమయుక్త భక్తి పట్ల ఉత్సాహాన్ని ఇనుమడింపచేయటానికీ, తన యొక్క అధ్బుతమైన వైభవాలనూ, మరియు అనన్యమైన గుణములనూ ప్రకటిస్తానని, శ్రీ కృష్ణుడు చెబుతున్నాడు. ఇక్కడ ఆయన "ప్రీయమాణాయ" అన్న పదాలు వాడుతున్నాడు. కృష్ణుడు అర్జునుడిని ప్రియమైన సఖుడని పిలుస్తున్నాడు. అందుకే ఈ అత్యంత విశేషమైన జ్ఞానాన్ని, అర్జునుడికి తెలియపరుస్తున్నానని, చెబుతున్నాడు.

02:38 - న మే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః ।
అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః ।। 2 ।।

దేవతలకు గానీ, మహర్షులకు గానీ, నా మూల స్థానము తెలియదు. దేవతలకూ, మరియు మహర్షులకూ, మూల ఉత్పత్తి స్థానమును నేనే.

ఒక తండ్రికి తన కుమారుల పుట్టుక, మరియు జీవితం తెలుస్తుంది. ఎందుకంటే, ఆయన ప్రత్యక్షంగా దాన్ని చూస్తాడు. కానీ, తన తండ్రి యొక్క పుట్టుక, మరియు బాల్యము, ఆయన కొడుకులకు తెలియదు. ఎందుకంటే, అవి వారి పుట్టుక కంటే ముందే జరిగి పోయినవి. అదే విధంగా, దేవతలూ మరియు ఋషులూ, భగవంతుని మూల స్థానము యొక్క నిజ స్వరూపమును అర్థం చేసుకోలేరు. ఎందుకంటే, భగవంతుడు, వీరు జన్మించటం కంటే ముందునుండే ఉన్నాడు. “ఈ జగత్తులో ఎవరికి మాత్రం స్పష్టత ఉంది? ఎవరు చెప్పగలరు ఈ విశ్వం ఎక్కడ పుట్టిందో? ఎవరు చెప్పగలరు ఈ సృష్టి ఎక్కడి నుండి వచ్చిందో? దేవతలనేవారు, సృష్టి తరువాత వచ్చారు. కాబట్టి, ఈ విశ్వం ఎక్కడినుండి ఉద్భవించిందో ఎవరికి తెలుసు?” అని వేదములు తెలియజేస్తున్నాయి. “భగవంతుడు దేవతలకు అవగతం కాడు. ఎందుకంటే, ఆయన వారి కంటే ముందు నుండే ఉన్నాడు.” అని ఈశనోపనిషత్తు పేర్కొన్నది. అయినా, తన ప్రియమిత్రుని భక్తిని పెంపొందించటానికి, ఇటువంటి నిగూఢమైన జ్ఞానాన్ని, ఇప్పుడు శ్రీ కృష్ణుడు బోధిస్తున్నాడు.

04:10 - యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరమ్ ।
అసమ్మూఢః స మర్త్యేషు సర్వపాపైః ప్రముచ్యతే ।। 3 ।।

నేను జన్మరహితుడను, మరియు ఆది లేనివాడిననీ, మరియు సర్వ లోక మహేశ్వరుడననీ తెలుసుకున్న మనుష్యులు, మోహమునకు గురికారు. వారు సమస్త పాపముల నుండీ విముక్తి చేయబడతారు.

తనను ఎవ్వరూ తెలుసుకోలేరని చెప్పిన పిదప, ఇప్పుడు కొంతమందికి తాను తెలుసని అంటున్నాడు, శ్రీ కృష్ణుడు. ఎవరూ స్వంత ప్రయత్నం ద్వారా భగవంతుడిని తెలుసుకొనజాలరు. కానీ, భగవంతుడే ఎవరి మీదయినా కృప చేస్తే, ఆ అదృష్టవంతమైన జీవాత్మ, ఆయనను తెలుసుకోగలుగుతుంది. కాబట్టి, భగవంతుడిని తెలుసుకోగలిగిన వారంతా, ఆయన దివ్య కృప ద్వారానే దానిని సాధించగలిగారు. ఇంతకుముందు శ్రీ కృష్ణుడు, "నా యందే భక్తితో లగ్నమై ఉండే మనస్సుగలవారికి, నా దివ్య జ్ఞానాన్ని ప్రసాదిస్తాను; దానితో వారు సునాయాసముగా నన్ను పొందుతారు." అని వివరించాడు. ఆయనే సర్వోన్నత దేవాది దేవుడని తెలుసుకున్న వారు, ఇక భ్రమకు లోను కారు. ఇటువంటి భాగ్యశాలి అయిన జీవాత్మలు, తమ పూర్వ, మరియు ప్రస్తుత కర్మబంధాల నుండి విడుదల చేయబడతారు, మరియు ఆయన పట్ల ప్రేమ యుక్త భక్తిని పెంపొందించుకుంటారు. జీవాత్మలకూ, మరియు తనకూ ఉన్న భేదాన్ని చెప్పటం కోసం, శ్రీ కృష్ణుడు తానే సర్వ లోక మహేశ్వరుడనని ప్రకటిస్తున్నాడు. "భగవంతుడు సమస్త ఈశ్వరులకే ఈశ్వరుడు; ఆయనే సర్వ దేవతలకూ దేవుడు. అందరు ప్రియమైన వారికీ ప్రియమైనవాడు; ఆయనే ఈ జగత్తును ఏలేవాడు, మరియు భౌతిక ప్రకృతి శక్తికి అతీతమైనవాడని, శ్వేతాశ్వర ఉపనిషత్తు పేర్కొంటుంది.

06:01 - బుద్ధిః జ్ఞానమసమ్మోహః క్షమా సత్యం దమః శమః ।
సుఖం దుఃఖం భవోఽభావో భయం చాభయమేవ చ ।। 4 ।।

06:12 - అహింసా సమతా తుష్టిస్తపో దానం యశోఽయశః ।
భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః ।। 5 ।।

బుద్ధి కుశలతా, జ్ఞానమూ, ఆలోచనలో స్పష్టతా, దయా, నిజాయితీ, మనస్సు-ఇంద్రియ నిగ్రహణా, సుఖ-దుఃఖాలూ, జనన-మరణాలూ, భయము-ధైర్యమూ, అహింసా, సమత్వం, తృప్తీ, తపస్సూ, దానమూ, కీర్తి-అపకీర్తి మొదలగు, మనుష్యులలో ఉండే గుణములలోని వైవిధ్యములు వివిధములైనవి, నా నుండే జనించాయి.

మానవ జాతిలో ఉద్భవించే వివిధ భావాలూ, ఉద్వేగాలూ, చిత్తవృత్తులన్నీ తన నుండే వస్తాయని, భగవంతుడు ప్రకటిస్తున్నాడు.
బుద్ధి అంటే సరియైన దృక్పథంలో విషయ-వస్తువులను విశ్లేషించ గల సామర్ధ్యము.
జ్ఞానము అంటే ఏది ఆధ్యాత్మికము, ఏది భౌతిక ప్రాపంచికమో వేరు చేయగల సామర్ధ్యము.
అసమ్మోహము అంటే అయోమయము, భ్రమ లేకుండుట.
క్షమా అంటే మనకు హాని చేసిన వారిని క్షమించగలిగే సామర్ధ్యము.
సత్యము అంటే సకల జనుల సంక్షేమం కోసం, నిజాన్ని ధైర్యంగా ప్రకటించడం.
దమము అంటే ఇంద్రియములను వాటి వస్తువిషయముల నుండి నిగ్రహించడం.
శమము అంటే మనస్సును నియంత్రించి, నిగ్రహించడం.
సుఖము అంటే ఆనందము, ఉల్లాసముల యొక్క అనుభూతి.
దుఃఖము అంటే కష్టము మరియు వేదన యొక్క అనుభూతి.
భవః అంటే 'నేను ఉన్నాను' అనే భావము.
అభావః అంటే మరణము యొక్క అనుభవము.
భయ అంటే రాబోయే కష్టాల మీద భయము.
అభయ అంటే భయము నుండి విముక్తి.
అహింసా అంటే మనసా, వాచా, కర్మణా ఏ ప్రాణిని కూడా బాధ పెట్టక పోవటం.
సమతా అంటే అనుకూల లేదా ప్రతికూల పరిస్థితులలో కూడా ఒక్కలాగే ఉండటం.
తుష్టి అంటే కర్మ ఫలంగా ఏది లభించినా, దానితో తృప్తి చెందటం.
తప అంటే వేద విహితముగా, ఆధ్యాత్మిక ప్రయోజనం కోసం, స్వచ్ఛందంగా చేసే నిష్ఠలు.
దానము అంటే పాత్రత, లేక అర్హత కలిగిన వారికి ఇచ్చే దానము.
యశము అంటే, మంచి గుణముల చేత వచ్చే కీర్తి.
అయశము అంటే, చెడు గుణముల వలన వచ్చే అపకీర్తి.

వ్యక్తులలో ఈ గుణములు, తాను అనుమతించిన మేర వ్యక్తమవుతుంటాయని, శ్రీ కృష్ణుడు పేర్కొంటున్నాడు. కాబట్టి, ఆయనే సర్వ ప్రాణుల యొక్క మంచి, మరియు చెడు స్వభావముల మూలము. ఇది విద్యుత్కేంద్రము ద్వారా సరఫరా చేయబడిన విద్యుత్-శక్తి, వివిధ రకాల ఉపకరణాలచే ఉపయోగించబడటం వంటిది. ఒకే విద్యుత్ శక్తి, వేరు వేరు ఉపకరణాల ద్వారా ప్రసరించినప్పుడు, వేరువేరు ఫలితములను ఇస్తుంది. ఒక దానిలో శబ్దాన్నీ, మరొక దానిలో వెలుగునూ, వేరొక దానిలో వేడిమినీ పుట్టిస్తుంది. వేర్వేరు రకాలుగా వ్యక్తీకృతమయినా, వాటి మూలాధారము ఒక్కటే. అదే, విద్యుత్కేంద్రము నుండి ఇవ్వబడిన విద్యుత్ శక్తి. అదే విధంగా, మన పూర్వ, ప్రస్తుత జన్మల పురుషార్థాన్ని బట్టి, భగవంతునిచే ఇవ్వబడిన శక్తి, మనలో మంచిగానో, లేదా చెడుగానో వ్యక్తమవుతుంది.

09:33 - ఇక మన తదుపరి వీడియోలో, సమస్త జీవులూ ఏ విధంగా అవతరించాయో, శ్రీ కృష్ణుడి వివరణలో తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Monday, 29 August 2022

3500 ఏళ్ల నాటి భారతీయుడు ‘సుశ్రుతుడు’ ఎవరు? Sushruta: Father of Plastic Surgery

 

3500 ఏళ్ల నాటి భారతీయుడు ‘సుశ్రుతుడు’ ఎవరు?

మన భారతదేశ చరిత్ర, ఎంతో ప్రాచీనమైనదీ, ప్రభావవంతమైనది. ప్రపంచదేశాలు నాగరికత అనే మాటకు ఆమడ దూరంలో ఉన్న సమయంలోనే, మన దేశం అత్యున్నత సంస్కృతితో, ఎన్నో విషయాలలో ముందంజలో ఉంది. భారతదేశంలో వైద్యం అంటే, నాటువైద్యం, మూలికల వైద్యం అనే హేళన భావం, పాశ్చాత్తులతో పాటు, మన స్వదేశీయులలో కూడా పేరుకుపోయింది. కానీ, గడచిన తరానికి తెలియని చరిత్ర, నేడు సాక్షాలతో సహా మన ముందుకు వచ్చి, మనల్ని సగర్వంగా ప్రపంచదేశాలలో నిలబెట్టింది. శస్త్ర చికిత్స అంటే, ఇంగ్లీషు వైద్యం అని భ్రమపడే మనకు, సామాన్య శక పూర్వమే ఎన్నో శస్త్ర చికిత్సలను చేసి, వాటికి సంబంధించి ఎన్నో గ్రంథాలను రచించి, అపర ధన్వంతరిగా పేరుగడించిన మహానీయుడు ‘సుశ్రుతుడు’. ఈ రోజుటి మన వీడియోలో, పాశ్చ్యాత్తులు సైతం శస్త్రవైద్య శిఖామణిగా కీర్తించిన సుశ్రుతుడి గురించీ, ఆయన వైద్య శాస్త్రంలో గడించిన ఘన కీర్తిని గురించీ, మనం మరచినా, విదేశీయులు మరువని ఆయన గొప్పదనం గురించీ, తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/nPnhEq_aL9Y ]

శరీరే జర్ఝరీ భూతే వ్యాధిగ్రస్తే కళేబరే ।
ఔషథం జాహ్నవీ తోయం వైద్యోనారాయణోహరిః ।।

కృశించిపోయే లక్షణం గల వ్యాధిగ్రస్తమైన ఈ శరీరానికి నిజమైన ఔషధం గంగాజలమైతే, నారాయణుడే వైద్యుడు. శరీరం ధరించిన జీవుడు తనలోని జన్మాంతర పాప పంకిలాన్ని శుద్ధి చేసుకోవడం, ముఖ్య కర్తవ్యం. అందుకు పవిత్ర గంగాజల స్నానం, శ్రీహరి నామస్మరణ అనే ఈ రెండే సాధనాలు.

ఓం ధన్వంతరయే ఔషధచక్ర నారాయణాయ నమః ।।

ఆయుర్వేదానికి చెందిన శస్త్ర చికిత్సకుడిగా, అధ్యాపకుడిగా, అపర ధన్వంతరిగా పేరుగడించిన సుశ్రుతుడు, సామాన్య శక పూర్వం 6వ శతాబ్దంలో, వారణాసిలో జన్మించాడని కొన్ని గ్రంథాలు చెబుతుంటే,  9-10 వ శతాబ్దాలలో జీవించాడని, మరికొన్ని ఆధారాలు తెలియజేస్తున్నాయి. సుశ్రుతుడి జీవిత కాలంపై, భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తర భారత దేశంలోని, గంగానదీ తీరాన వెలసిన వారణాసి పట్టణంలో జన్మించిన సుశ్రుతుడు, విశ్వామిత్ర మహర్షి కుమారుడు, కాశీరాజైన ధన్వంతరి శిష్యుడు. ఆయన వద్ద నుండే, వైద్యశాస్త్రం అభ్యసించినట్టు చరిత్రకారులు పేర్కొన్నారు.

సుశ్రుతుడు ప్రకృతి ఆరాధకుడు. జంతు, వృక్ష ప్రపంచాల మీద సుదీర్ఘమైన దృష్టి సారించి, అనేక అమూల్య అంశాలను వెలువరించాడు. సంవత్సరంలోని భిన్న ఋతువులలో, ఆయా వాతావరణాలకు అనుగుణంగా నడుచుకుని, వ్యాధిరహితంగా, ఆరోగ్యంగా ఎలా మెలగాలో వివరించాడు. ఏఏ కాలాలలో ఏ కూరగాయలూ, పండ్లూ తినాలో కూడా వివరించాడు. తృణధాన్యాలూ, పప్పుదినుసుల వాడకం గూరించి సోదాహరణంగా, పలు ఆసక్తికర అంశాలను తెలిపాడు. సుశ్రుతుడు తన గ్రంథ రచన ప్రారంభించక పూర్వమే, ప్రకృతితో అనుసంధానమై, వివిధ ప్రయోగాలు చేశాడు. ఏ ఏ మొక్క మానవునికి ఎన్నివిధాలుగా ఉపయోగపడుతుందో, కూలంకషంగా అధ్యయనం చేశాడు. అంతేకాదు, ఆయన పూర్తిగా అధ్యయనం చేసిన తరువాతే, తన శిష్యులకు బోధించేవాడు. ప్రాక్టికల్స్ కూడా దగ్గరుండి చేయించేవాడు. శస్త్ర చికిత్సకు ప్రాధాన్యతనిస్తూనే, వైద్య చికిత్సలో వాడే మూలికలనూ, క్షార పదార్థాలనూ, లోహాలను కూడా వర్గీకరించి, వివరించేవాడు. దాదాపు 14 రకాల బ్యాండేజీలను, ఆయా గాయాల తీవ్రత, స్థాయిలను బట్టి, వాటిని తయారుచేసే విధానాన్ని కూడా, తన గ్రంథంలో వివరించాడు.

"శుశృత సంహిత" అనే ఆయుర్వేద గ్రంథం, ఆయుర్వేద వైద్యులకు లభించిన మొట్టమొదటి ప్రామాణిక గ్రంథం. దీనిని శుశృతుడు సంస్కృతంలో రచించాడు. ఈ "శుశృత సంహిత" లో మొత్తం, 184 అధ్యాయాలున్నాయి. దీనిలో మనిషి సాధారణంగా గురికాబడే వ్యాధులు, 1120 గా నిరూపింపబడింది. అలాగే, మానవ శరీర నిర్మాణం తీరుతెన్నుల గురించీ, ప్రతి అవయవ నిర్మాణం గురించీ, విపులంగా చెప్పబడింది. 700 పై బడిన ఔషధీ మొక్కల లక్షణ విశేషాలూ, ఏ వ్యాధికి ఏ మొక్క ఎలా ఔషధంగా ఉపయోగపడి, రోగాన్ని ఎలా తగ్గిస్తుందో, ఉదాహరణ పూర్వకంగా నిరూపించబడింది. 64 రకాల ఖనిజాల నుండి మందులను ఎలా తయారుచేసుకోవాలో, అందులో విపులీకరించబడింది. అంతేకాక, జంతు సంబంధమైన అవయవాల నుండి, 57 ఔషధాలను తయారుచేసే వైద్య విజ్ఞానం ఉంది. ఈ సుశ్రుత సంహితలో, సంపూర్ణ ఆయుర్వేద శస్త్రచికిత్సా విజ్ఞానం పొందుపరచబడి ఉంది.

ఈ గ్రంథంలో ప్రధానంగా, రెండు భాగాలున్నాయి. మొదటిది పూర్వ తంత్రం కాగా, రెండవది ఉత్తర తంత్రం. ఈ గ్రంథంలో, ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడిన "అష్టాంగ హృదయం" కూడా వివరింపబడింది. అంతేకాక, ఈ గ్రంథంలో, 101 శస్త్ర పరికరాల గురించి కూడా, సుశ్రుతుడు వివరించాడు. ఈ గ్రంథం, అరబిక్ లోనే కాక, లాటిన్, తదితర విదేశీ భాషలలోకి కూడా అనువాదమైంది. వ్యాధిగ్రస్తమైన శరీరాన్ని, మూడు రకాలుగా విభజించి, వ్యాధికి పూర్వం, వ్యాధి గ్రస్తుడు అయినప్పుడూ, వ్యాధి నయం అయిన తర్వాత, రోగి శరీర తత్వాన్ని అవగాహన చేసుకోవాలనీ, ముఖ్యంగా ఆయా రోగులూ, శరీరతత్వాలనూ తెలుసుకుని, వారి శారీరక, మానసిక బలాలనూ, ఓర్పునూ పరిశీలించి, వైద్యం చేయాలని సూచించాడు. గర్భ నిరోధంతో పాటు, గర్భ ధారణకు కూడా అనువైన ఔషధాలనూ, యవ్వనోత్సాహానికి తగిన మందులనూ, తన ‘ములికా వైద్య ప్రకరణం’లో పేర్కొన్నాడు. సుఖప్రసవం కోసం, కొన్ని క్లిష్ట పరిస్థితులలో, సిజేరియన్ ఆపరేషన్ లను కూడా చేసిన మొట్టమొదటి వైద్యుడు, సుశ్రుతుడు.

విరిగిన ఎముకలు అతికించడంలో, కంటి శుక్లాలను రూపుమాపడంలో, విశేష కృషి చేశాడు. ఆయుర్వేద వైద్యానికి శస్త్రచికిత్సను జోడించి, మానవులకు పరిపూర్ణ ఆరోగ్యాన్ని యివ్వడంలో, విపత్కర పరిస్థితుల్లో, తెగిన శరీరావయవాలను శస్త్రచికిత్స ద్వారా అతికించటంలో, అందెవేసిన చేయి సుశ్రుతుడిది. కొన్ని వేల సంవత్సరాల క్రితమే, శస్త్రచికిత్సకోసం 120 రకాల వైద్య పరికరాలను సుశ్రుతుడు ఉపయోగించేవాడు. ఈయన ఎన్నో వేల సంవత్సరాల క్రితం రూపొందించిన "సందంశ యంత్రాలు", నేడు మన ఆధునిక శస్త్రవైద్యులు ఉపయోగించే spring forceps, dissection and dressing forceps లకు తొలి నమూనాలుగా చెప్పవచ్చు. సంపూర్ణ ఆరోగ్యంతో జీవించడానికి, అందరికీ ప్రయోజనకరమైన అనువైన విధానాలతో, తేలికగా అర్థం చేసుకునే విధంగా, ఈ గ్రంథ రచన చేశాడు. ఈ రోజున కూడా, వైద్య సమాచారం నిమిత్తం, ఒక బంగారు నిధి తరహాలో ఈ గ్రంథం ఉపయోగపడుతుందనడంలో, ఎటువంటి సందేహం లేదు.
సుశ్రుతుడి వైద్యానికి సంబంధించిన ఒక కథ, ఆయన వైద్య విజ్ఞానానికి మచ్చుతునక. అత్యవసరమైన పనిమీద ఒక వ్యక్తి అడవిలో ప్రయాణిస్తుండగా, మార్గమధ్యంలో, అకస్మాత్తుగా ఒక ప్రమాదం జరిగి, అతని ముక్కు తెగిపడింది. రక్తం విపరీతంగా కారుతుండగా, తెగిన ముక్కు భాగాన్ని అరచేతిలో పట్టుకుని, సమీపంలోని ఒక ఋషి ఆశ్రమానికి చేరుకుని, తలుపు తట్టాడు. అది సుశ్రుతుడి ఆశ్రమం.

అర్థరాత్రివేళ సుశ్రుతుడు నిద్రనుంచి మేల్కొని తలుపు తీసి చూస్తే, ఆ యాత్రికుడు ముఖమంతా రక్తసిక్తమై, రొదిస్తూ కనిపించాడు. అతడి ముక్కు తెగి వుండడాన్ని సుశ్రుతుడు గమనించాడు. ముందుగా అతడికి ధైర్యం చెప్పి, లోపలికి తీసుకు వెళ్ళి, వైద్యం మొదలుపెట్టాడు. నీటితో అతడి గాయాన్ని కడిగి, మూలికా రసం అద్దాడు.  ఆ రోజుల్లో మనిషికి మత్తు కలిగించే మందులు లేవు. అందుకే అతనికి మత్తునిచ్చే నిమిత్తం, ఒక చిన్న గిన్నెడు సుర అంటే, మద్యాన్నిచ్చాడు. అతడు నెమ్మదిగా స్పృహ కోల్పో యిన తరువాత, అతి సూక్ష్మమైన కత్తులూ, సూదులతో చికిత్సను ప్రారంభించాడు. ఒక ఆకుతో అతని ముక్కును కొలిచి, అతి చిన్నదైన, పదునైన కత్తిని వేడిచేసి, దవడ భాగం నుంచి కొంత మాంసభాగాన్ని తీసుకున్నాడు. దానిని రెండు ముక్కలుగా చేసి, బహు జాగ్రత్తగా అతని ముక్కు పుటలలో అమర్చాడు. అలా ముక్కు ఆకారాన్ని సరిచేసి, బియ్యపు పిండిని అద్ది, చందనపు పట్టు వేశాడు. దానిమీద బూరుగు దూదిని పెట్టి, ఔషధ నూనెను పోసి, చక్కగా కట్టు కట్టాడు. వనమూలికల నుంచి సేకరించిన మిశ్రమ నూనె బాగా పనిచేసింది. రెండు రోజుల్లోనే, అతడు నెమ్మదిగా కోలుకున్నాడు. అతను ఆహార, విహారాల్లో ఏ విధంగా మసలుకోవాలో, ఏయే మందులు సేవించాలో, తగు జాగ్రత్తలను తెలియజేసి పంపించాడు.

ఆనాటి కాలంలోనే, ప్లాస్టిక్ సర్జరీలూ, సిజేరియన్ లూ, ఎటువంటి శస్త్ర చికిత్సనైనా సునాయాసంగా చేయడమే కాక, ఆ వైద్యాన్ని తరువాత తరాలకు కూడా గ్రంథం రూపంలో అందించిన మహానీయుడు, సుశ్రుతుడు. ఆయన రచించిన గ్రంథాలు కొన్ని ఆ కాలంలోనే, టిబెట్ ప్రాంతానికి తరలివెళ్ళాయి. ఆయన వైద్య సంప్రదాయానికి చెందిన శల్య చికిత్సకులు ఉండేవారనీ, వారు ఉపయోగించిన శస్త్ర పరికరాల చిత్రపటములే కాక, ఆయా పరికరాలలో కొన్ని, పురావస్తు పరిశోధకులకు లభించాయి. సామాన్య శక పూర్వం 8 వ శతాబ్దానికి చెందిన ఆయన గ్రంథం, "అమృత అష్టాంగ హృదయ గుహ్యోపదేశ తంత్రం", ఈ రోజున మన దేశంలో లభించదు. అయినప్పటికీ, ఆ గ్రంథ అనువాదం, టిబెట్ లో "గుష్టి" అంటే, ‘నాలుగు వైద్య శాస్త్ర తంత్రములు’ అనే పేరుతో లభిస్తున్నాయి. సుశ్రుతుడూ, చరకుడూ సృజించిన వైద్య విధానాలు, సామాన్య శక పూర్వ కాలంలోనే, అగ్నేయాసియా, ఉత్తర ఆసియా, మధ్య ప్రాచ్య దేశాలలో బాగా వాడుకలోవున్నాయని, రూఢి అయింది.

ఇటీవలి కాలంలో కూడా, నూతన మిలీనియం సందర్భంగా, 2000వ సంవత్సరంలో, బ్రిటన్ లోని వైద్య శాస్త్ర అంతర్జాతీయ సంస్థ, ఒక జాబితాను వెలువరించింది. అందులో ప్రపంచ ప్రసిద్ధి పొందిన శస్త్ర చికిత్స వైద్యుల ఫోటోలతో సహా, వారి వివరాలను పొందుపరిచారు. ఆ జాబితాలో తొలి చిత్రం, ఆచార్య శుశృతునిది కావడం, గమనార్హం. అంతేకాకుండా, ఆయనను ప్రపంచంలోనే మొట్టమొదటి శస్త్రవైద్య శిఖామణిగా పేర్కొనడం కూడా, గమనార్హం. అంతటి మహనీయుడిని మనం మరచిపోవడం, తగిన గుర్తింపునివ్వకపోవడం, మన చరిత్రకు మాయని మచ్చ మాత్రమే కాదు.. మన భారత దేశానికీ, మనకూ సిగ్గుచేటు కూడా. మన పూర్వీకుల అత్యున్నత మేధోశక్తినీ, వారి విజ్ఞానాన్నీ సగర్వంగా చాటి చెబుదాం.. మన సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం..

జై హింద్..

Wednesday, 10 August 2022

ఏది పూజ? వేర్వేరు అస్థిత్వాలను పూజించటం ద్వారా వచ్చే పరిణామాలూ గమ్యములూ ఏమిటి? Bhagavad Geeta

   

ఏది పూజ? వేర్వేరు అస్థిత్వాలను పూజించటం ద్వారా వచ్చే పరిణామాలూ గమ్యములూ ఏమిటి?

'భగవద్గీత' నవమోధ్యాయం – రాజవిద్యా రాజగుహ్య యోగం (24 – 29 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 7 నుండి 12 వరకూ ఉన్న అధ్యాయాలను భక్తి షట్కము అంటారు. దీనిలో తొమ్మిదవ అధ్యాయం, రాజవిద్యా రాజగుహ్య యోగము. ఈ రోజుటి మన వీడియోలో, రాజవిద్యా రాజగుహ్య యోగములోని 24 నుండి 29 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/EysiFJDCqPo ]

భగవంతుడిని ప్రేమతో ఆరాధించే భక్తుల గురించి, శ్రీ కృష్ణుడిలా వివరిస్తున్నాడు..

00:48 - అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ ।
న తు మామభిజానంతి తత్త్వేనాతశ్చ్యవంతి తే ।। 24 ।।

సమస్త యజ్ఞములకూ భోక్తనూ, ఏకైక స్వామినీ నేనే. కానీ, నా ఈ యొక్క పరమేశ్వర తత్త్వమును తెలుసుకొనని వారు, తిరిగి పుట్టవలసినదే.

శ్రీ కృష్ణుడు ఇప్పుడు దేవతల ఆరాధన చేయటంలో ఉన్న లోపాన్ని, ఇక్కడ వివరిస్తున్నాడు. పరమేశ్వరుడైన భగవంతుడిచ్చిన శక్తి వలన, వారికి భౌతిక వరాలను ఇచ్చే సామర్ధ్యం ఉంటుంది. కానీ, వారు తమ భక్తులను జనన-మరణ చక్రం నుండి విముక్తి చేయలేరు. వారు తమ దగ్గర ఉన్నవి మాత్రమే, వేరే వారికి ఇవ్వగలరు. దేవతలు కూడా సంసార చక్రము నుండి విముక్తి కానప్పుడు, వారు తమ భక్తులను ఎలా విముక్తి చేయ గలరు? అదే సమయంలో, ఏవరికైతే సరైన జ్ఞానం ఉందో, వారు తమ సంపూర్ణ భక్తిని భగవంతుని చరణారవిందాల యందే సమర్పిస్తారు, మరియు వారి భక్తి పరిపక్వత చెందినప్పుడు, వారు మర్త్యలోకాన్ని దాటి, దివ్య ధామానికి చేరుకుంటారు.

01:53 - యాంతి దేవవ్రతా దేవాన్ పితౄన్ యాంతి పితృవ్రతాః ।
భూతాని యాంతి భూతేజ్యా యాంతి మద్యాజినోఽపి మామ్ ।। 25 ।।

దేవతలను పూజించే వారు, దేవతల యందు జన్మిస్తారు, పితృదేవతలను ఆరాధించేవారు, పితృదేవతల దగ్గరకి వెళ్తారు. భూతప్రేతములను అర్చించువారు, అలాంటి వాటిలో పుడతారు, మరియు నా భక్తులు నన్నే చేరుకుంటారు.

ఎలాగైతే ఒక గొట్టం లోని నీరు, ఆ గొట్టం అనుసంధానం చేయబడిన ట్యాంక్ స్థాయి వరకే పైకి వస్తాయో, భక్తులు తాము దేనిని పూజిస్తారో, దాని స్థాయి వరకే ఉన్నతిని సాధించగలరు. ఈ శ్లోకంలో, వేరువేరు అస్థిత్వాలను పూజించటం ద్వారా వచ్చే పరిణామాలనూ, వివిధ రకములైన గమ్యములనూ తెలియచేస్తున్నాడు. అత్యున్నత ఆధ్యాత్మిక పురోగతిని సాధించటం కోసం, మనం ఆ పరమాత్మనే ఆరాధించాలని తెలుసుకోవటం కోసం, ఈ జ్ఞానాన్ని చెప్తున్నాడు. ఇంద్రుడూ, సూర్యుడూ, కుబేరుడూ, అగ్నీ వంటి వారిని ఆరాధించేవారు, స్వర్గాది లోకాలకు వెళతారు. ఆ తర్వాత వారి యొక్క పుణ్య ఫలములు తరిగిపోయిన తరువాత, వారు స్వర్గము నుండి పంపించి వేయబడతారు. పితృలు అంటే పూర్వీకులు. వారి పట్ల కృతజ్ఞతా భావన ఉండటం మంచిదే. కానీ, వారి సంక్షేమం కోసం అతి చింతన నష్టదాయకమైనది. పితృ దేవతలను పూజించేవారు, మరణించిన పిదప, తమ పూర్వీకుల లోకాలకు వెళతారు. తామస గుణ ప్రధానంగా ఉన్నవారు, భూతప్రేతములను పూజిస్తారు. ఈ వామ-మార్గ తాంత్రికులు, భూతప్రేతములను ఆవాహనచేస్తారు. ఇటువంటి పనులలో పాల్గొనే వారు, వారి తదుపరి జన్మలో, భూతప్రేతములలో జన్మిస్తారు. అయితే, సర్వోన్నత భక్తులు ఎవరంటే, తమ మనస్సులను పరమేశ్వరుడైన భగవంతుని యందే నిమగ్నం చేసినవారు. భగవంతుని ఆరాధనకై దృఢ సంకల్పము చేసి, మరియు ఆయన భక్తి యందే నిశ్చలబుద్ధితో ఉన్నటువంటి ధన్యులైన జీవులు, తదుపరి జన్మలో, ఆయన దివ్య ధామానికి చేరుకుంటారు.

03:58 - పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి ।
తదహం భక్త్యుపహృతమ్ అశ్నామి ప్రయతాత్మనః ।। 26 ।।

నాకు ఎవరైనా భక్తితో ఒక ఆకుగానీ, ఒక పువ్వు గానీ, ఒక పండు గానీ, లేదా నీరైనా సమర్పించినా, ఆ స్వచ్ఛమైన మనస్సుగల నా భక్తునిచే ప్రేమతో ఇవ్వబడిన దానిని, నేను సంతోషంగా స్వీకరిస్తాను.

దేవతల, మరియు పితృదేవతల ఆరాధనలో, వారిని ప్రసన్నం చేయటానికి నిష్ఠగా ఆచరించవలసిన ఎన్నో నియమాలు ఉన్నాయి. కానీ, భగవంతుడు తనకు ప్రేమ నిండిన హృదయంతో సమర్పించబడిన దేనినైనా స్వీకరిస్తాడు. మీ దగ్గర కేవలం ఒక పండు ఉంటే, అది సమర్పించండి. భగవంతుడు సంతోషిస్తాడు. ఒకవేళ పండు లేకపోతే ఒక పువ్వును సమర్పించండి. అది పుష్పించే కాలం కాకపొతే, భగవంతునికి కేవలం ఒక ఆకును సమర్పించండి. ప్రేమతో ఇచ్చినప్పుడు, అది కూడా సరిపోతుంది. ఒకవేళ ఆకులు కూడా దొరకకపోతే, అంతటా లభ్యమయ్యే నీటిని సమర్పించండి. కానీ, మనం దేనిని సమర్పించినా, భక్తితో, ప్రేమతో సమర్పించాలి. ఆరాధించే వారి భక్తి మాత్రమే, భగవంతుడిని ప్రసన్నం చేస్తుంది. ఆ సమర్పించబడిన వస్తువు యొక్క విలువ కాదు.  మహాభారత యుద్ధం ముందు, శ్రీ కృష్ణుడు, కౌరవులూ, పాండవుల మధ్య సంధి కుదిర్చే ప్రయంత్నంలో హస్తినాపురం వెళ్లినప్పుడు, దుర్యోధనుడు గర్వంతో, యాభై-ఆరు విభిన్న వంటకాలతో విందు ఏర్పాటు చేశాడు. కానీ, శ్రీ కృష్ణుడు ఈ ఆతిథ్యాన్ని తిరస్కరించి, ఒక సామాన్యమైన విదురని అనే మహిళ కుటీరానికి వెళ్ళాడు. ఆమె ఎప్పటినుండో తన ఇష్టదైవాన్ని సేవించుకునే అవకాశం కోసం ఎదురుచూస్తోంది. కృష్ణుడు ఇంటికి రావటంతో, విదురని చాలా సంతోషపడింది. ఆమె దగ్గర ఇవ్వటానికి కేవలం అరటి పండ్లే ఉన్నాయి. కానీ, ప్రేమభావనలో, ఆమె బుద్ధి ఎంతగా అయోమయం అయిపోయిందంటే, ఆమె పండు పడేసి, తొక్కలు ఆయనకు తినిపించిన సంగతి కూడా తెలియలేదు. అయినప్పటికీ, ఆమె భక్తిని చూసిన శ్రీ కృష్ణుడు, ప్రపంచంలో అదే అత్యంత రుచికరమైనదన్నట్టు, పరమానందంతో ఆ తొక్కలనే తిన్నాడు. భగవంతునికి సమర్పించబడిన వస్తువు యొక్క భౌతిక విలువ ఆయనకు అవసరం లేదు. అన్నింటికన్నా ఎక్కువగా, ఎంత ప్రేమగా ఇచ్చాము? అనేదే అయనకు ముఖ్యం.

06:25 - యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ ।
యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణమ్ ।। 27 ।।

ఓ కుంతీ పుత్రుడా, నీవు ఏ పని చేసినా, నీవు ఏది తిన్నా, నీవు యజ్ఞములో అగ్నికి ఏది సమర్పించినా, నీవు ఏది బహుమతిగా దానం ఇచ్చినా, మరియు ఏ నిష్ఠలను ఆచరించినా, వాటిని నాకు సమర్పించినట్టుగా చెయుము.

మనం ఎటువంటి సామాజిక భాధ్యతలను నిర్వహిస్తున్నా, ఏ శాఖాహార ఆహారాన్ని భుజిస్తున్నా, ఏ మత్తుపదార్ధ రహిత పానీయాలను త్రాగుతున్నా, ఏ వైదిక కర్మలను ఆచరిస్తున్నా, ఏ వ్రతాలూ, నిష్ఠలూ ఆచరిస్తున్నా, అవన్నీ కూడా, మానసికంగా పరమేశ్వరుడైన భగవంతునికే అర్పించాలి. తరచుగా జనులు భక్తిని దైనందిన జీవితం కంటే వేరుగా చూస్తారు, మరియు భక్తి అంటే పూజ చేసేటప్పుడూ, ఆలయాలకు వెళ్ళేటప్పుడు మాత్రమే కనబరుస్తుంటారు. నిజానికి భక్తి అంటే, మీరు చేసే ప్రతి పనినీ, భగవంతునికి అర్పితం చేయటమే, మరియు ఆయనను ఎప్పుడైనా మర్చిపోతే, తీవ్రమైన విరహ వ్యాకులత చెందటమే. పనులను ఆయనకు అంకితం చేసి, మరియు మానసికంగా వాటిని భగవంతునికే ఇచ్చి వేస్తే, దానినే అర్పణం అంటారు. భౌతికమైన ప్రాపంచిక పనులను ఇటువంటి దృక్పథం, దివ్యమైన భగవత్ సేవగా, సంపూర్ణముగా మార్చివేస్తుంది. శరీరంతో కానీ, మాటలతో కానీ, మనస్సుతో కానీ, ఇంద్రియములతో కానీ, లేదా బుద్ధితో కానీ, తన వ్యక్తిగత స్వభావం అనుగుణంగా చేసే వాటన్నింటినీ, శ్రీమన్నారాయణుడికే అర్పించాలి. భగవంతునికి సమర్పించడం అంటే, మనం పని చేస్తూ ఉన్నప్పుడే, ఇదంతా భగవంతుని ప్రీతి కోసమే చేస్తున్నామన్న అంతర్గత భావనతో చేయాలి.

08:16 - శుభాశుభఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనైః ।
సంన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి ।। 28 ।।

అన్ని పనులనూ నాకే అర్పితం చేయటం ద్వారా, నీవు శుభ-అశుభ ఫలితముల బంధనముల నుండి విముక్తి చేయబడతావు. సన్యాసముచే నీ మనస్సు నా యందే లగ్నమై, నీవు విముక్తి చేయబడతావు, మరియు నన్ను చేరుకుంటావు.

అగ్ని పొగచే కప్పివేసి ఉన్నట్టు, ప్రతి ఒక్క పని కూడా, లోపాలతో కూడి ఉంటుంది. మనం భూమిపై నడుస్తున్నప్పుడు, తెలియకుండానే ఎన్నో వేల అతిచిన్న ప్రాణులను చంపేస్తాము. మన వృత్తికి సంబంధించిన విధి నిర్వహణలో, ఎంత జాగ్రత్తగా ఉన్నా, వాతావరణానికి హాని చేయటమో, లేక వేరే వారి మనస్సును బాధపెట్టడమో జరుగుతుంది. కేవలం, ఒక కప్పు పెరుగు తిన్నా, వాటిలో నివసించే జీవరాశులను నాశనం చేసిన పాపం తగులుతుంది. కొన్ని మతాల్లో, ఈ యొక్క అసంకల్పిత హింసని తగ్గించటానికి, నోటికి ఒక గుడ్డ అడ్డం పెట్టుకుంటారు. ఇది కూడా మన శ్వాస వలన కలిగే జీవరాశుల వినాశనాన్ని, పూర్తిగా నిలువరించలేదు. మన స్వార్ధ ప్రయోజనం తీరటం కోసం మనం పనులు చేసినప్పుడు, తెలిసినా, తెలియకపోయినా, మన పాపాలకు మనం దోషులమే. కర్మ సిద్ధాంతం ప్రకారం, మనం వాటి యొక్క ఫలితములు అనుభవించవలసినదే. మంచి పనులు కూడా బంధన కారకమే.. ఎందుకంటే, అవి ఆత్మని స్వర్గ లోకాలకు వెళ్లి, అ ఫలములను భోగించేటట్టు చేస్తాయి. ఈ విధంగా, మంచి మరియు చెడు కర్మలు కూడా, ఈ జనన-మరణ చక్రంలో ఉండిపోయేటట్టే చేస్తాయి. కానీ, ఈ శ్లోకంలో శ్రీ కృష్ణుడు, సమస్త కర్మ ఫలితములనూ నశింపచేయటానికి, ఒక సరళమైన పరిష్కారం చూపిస్తున్నాడు. ఆయన 'సన్యాస యోగము' అన్న పదం వాడుతున్నాడు. అంటే, స్వార్థమును త్యజించమంటున్నాడు. ఆయన అనేదేమిటంటే, మనం ఎప్పుడైతే మన పనులను భగవత్ ప్రీతి కోసం సమర్పిస్తామో, మనం మంచీ మరియు చెడూ.. ఈ రెండింటి కర్మ ఫల సంకెళ్ల నుండి విముక్తి పొందుతాము.

10:25 - సమోఽహం సర్వభూతేషు న మే ద్వేష్యోఽస్తి న ప్రియః ।
యే భజంతి తు మాం భక్త్యామయి తే తేషు చాప్యహమ్ ।। 29 ।।

నేను సర్వ ప్రాణుల యందూ సమత్వ బుద్ధితో ఉంటాను. నేను ఎవరి పట్లా, పక్షపాతంతో కానీ, లేదా విరోధ భావంతో కానీ ఉండను. కానీ, ప్రేమతో నన్ను ఆరాధించే భక్తులు, నా యందే నివసిస్తారు, మరియు నేను వారి యందు నివసిస్తాను.

దేవుడనేవాడు ఉంటే, ఆయన సంపూర్ణ దోషరహిత న్యాయమూర్తిగా ఉంటాడని, మనందరమూ అంతర్లీనంగా నమ్ముతాము. వాన నీరు భూమిపై సమానంగా పడుతుంది. అయినా, వ్యవసాయ క్షేత్రాలలో పడే బిందువు, ధాన్యంగా మారుతుంది; ఎడారి ముళ్లపొదపై పడే బిందువు, ముల్లుగా మారుతుంది; మురుగు గుంటలో పడే బిందువు, మురుగు నీరు అవుతుంది; మరియు ఆల్చిప్పలో పడే బొట్టు, ముత్యంగా మారుతుంది. వానకి ఎలాంటి పక్షపాతం లేదు. అది నేలపై తన కృపని సమానంగానే చూపుతుంది. వాటి ఫలితాలలో ఈ యొక్క తేడాకి, వాన బిందువుల భాద్యత కాదు. వాటిని అందుకునే వాటి స్వభావాల్లో తేడాయే, కారణం. అదే విధంగా, భగవంతుడు ఇక్కడ అనేదేమిటంటే, ఆయన సమస్త ప్రాణుల యందూ సమానమైన కృపను చూపిస్తున్నాడు. అయినా, ఆయనను ప్రేమించని వారు, వారి మనస్సులకు సరియైన పాత్రత లేకపోవటంచేత, ఆయన కృప యొక్క ప్రయోజానాలను అందుకోలేకపోతున్నారు.

11:55 - ఇక మన తదుపరి వీడియోలో, మనస్సులు అపవిత్రంగా ఉన్న వారు ఏమి చేయవచ్చు.. అనేటటువంటి విషయాన్ని, శ్రీ కృష్ణుడు వివరించబోతున్నాడు..

కృష్ణం వందే జగద్గురుం!

Tuesday, 9 August 2022

చిట్టి కథ! Inspirational Story

   

చిట్టి కథ!

ఒక నాడు గంగలో స్నానమాచరిస్తున్న లక్షలాది మందిని చూసిన ఒక ఋషికి, ఒక సందేహం వచ్చింది..

వెంటనే గంగానదినే అడిగాడు.. 'అమ్మా! ఎందరో, ఎన్నో పాపాలు చేసి నదిలో మునకలేస్తున్నారు. వారి వారి పాపం వదిలేస్తున్నారు. మరి ఇందరి, ఇంత పాప భారం ఎలా మోస్తున్నావు తల్లీ?' అని..

అందుకా తల్లి, 'నాయనా ఆ పాప భారం నేనెక్కడ మోస్తున్నాను? అవన్నీ తీసుకెళ్ళి, ఎప్పటికప్పుడు సముద్రంలో కలిపి వేస్తున్నాను' అని బదులిచ్చింది..

అయ్యో, అన్ని పుణ్య నదులూ ఇంతేకదా..! పాపాలన్నీ సముద్రంలోనే కలిపేస్తే, ఆ సముద్రుడు ఎలా భరిస్తున్నాడో..! అని అనుకుని.. సముద్రుడినే అడిగాడు.. 'ఎలా మోస్తున్నావు తండ్రీ ఈ పాప భారాన్ని?' అని..

దానికి సముద్రుడు.. 'నేనెక్కడ భరిస్తున్నాను? ఆ పాపాలను వెను వెంటనే ఆవిరిగా మార్చి, పైన మేఘాల లోకి పంపిచేస్తున్నాను' అని బదులిచ్చాడు..

అరే! ఎంతో తేలికగా కదిలి పోయే మేఘాలకు ఎంత కష్టం వచ్చిందని అనుకుంటూ.. 'ఓ మేఘ మాలికల్లారా.. ఎలా భరిస్తున్నారు ఈ పాప భారాన్ని?' అని అడగగా అవి పకపకా నవ్వి.. 'మేమెక్కడ భరిస్తున్నాం? ఎప్పటి కప్పుడు వర్ష రూపేణా మీ మీదే కురిపించేస్తున్నాం' అని బదులిచ్చాయి..

ఓహో! ఆ పాపాలన్నీ మన మీద పడి, మనమే అనుభవిస్తున్నా మన్నమాట! అయితే, ఎట్టి పరిస్థితుల్లో కూడా, ఎవరూ కూడా, కర్మ ఫలితాలను వదిలించు కోలేమని గ్రహించాడు, అక్కడ స్నానమాచరిస్తున్న ఋషి..

ఇదం తీర్ధమిదం తీర్ధం భ్రమన్తి తామసా జనాః ।
ఆత్మతీర్ధం నజానన్తి కధం మోక్షః శృణు ప్రియే ।।

ఈ తీర్ధంలో స్నానమాచరించిన పుణ్యం కలుగును! ఆ తీర్ధంలో స్నానమాచరించిన మోక్షం కలుగును! అని... తీర్ధ స్నానమునకై పరుగు లిడెడి మానవులు "భ్రమకు లోబడిన వారు"! ఆత్మ జ్ఞాన తీర్ధంలో స్నాన మాచరించని వారికి మోక్ష మెటుల కలుగును?!? అని ఈ శ్లోకం అర్థం.

కర్మ కర్మణా నశ్యతి కర్మ ।।

అంటే.. కర్మ అనేది కర్మతోనే నశిస్తుంది..

సత్కర్మ భిశ్చ సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలం ।
అచ్యుత్కట పుణ్య పాపానం సత్యం ఫలాను భవమిహం ।।
ఈ చోటి కర్మ ఈ చోటే ఈ నాటి కర్మ మరునాడే । 
అనుభవంచి తీరాలంతే ఈ సృష్టి నియమం ఇదే ।।

ఏది పూజ? పరిణామాలూ గమ్యమేమిటి? https://youtu.be/EysiFJDCqPo

Monday, 1 August 2022

ప్రతి ఒక్కరూ నలోపాఖ్యానం తప్పనిసరిగా ఎందుకు వినాలి? Nalopakhyanam

   

ప్రతి ఒక్కరూ నలోపాఖ్యానం తప్పనిసరిగా ఎందుకు వినాలి!?

ఎవరు విన్నా, చదివినా, కలి దోషాన్ని హరింపజేసి, కష్టాలను కడతేర్చే నలోపాఖ్యానంలో, రసరమ్యమైన నల దమయంతుల ప్రేమ కథ గురించి మనం తెలుసుకున్నాం. గత రెండు భాగాలలో, నల దమయంతుల ప్రేమ చిగురించడం, దేవతలను ఒప్పించి పరిణయమాడడం, కలి ప్రవేశంతో నలుడు రాజ్యాన్నీ, సర్వస్వాన్నీ పొగొట్టుకుని అడవుల పాలవ్వడం, దమయంతి బాధను చూడలేక, ఆమెను అడవులలో వదిలి ఋతుపర్ణుని దగ్గర అశ్వకుడిగా, వంటవాడిగా చేరడం, దమయంతి అడవిలో దిక్కు లేకుండా తిరిగి, చివరకు తన పిన తల్లి అయిన ఛేది దేశపు రాజమాతను కలుసుకోవడం, తిరిగి ఆమె తన తండ్రి విదర్భరాజ్యాన్ని చేరుకోవడం వరకూ జరిగిన గాథను తెలుసుకున్నాము. చూడని వారి కోసం, ఆ భాగాల లింక్ లను క్రింద description లో పొందుపరిచాను. ఇక ఈ రోజుటి మన వీడియోలో, విదర్భ దేశాన్ని చేరుకున్న దమయంతి, వికృత రూపంలో ఉన్న తన భర్త ఆచూకీ ఎలా కనిపెట్టింది? దమయంతి మారు మనువుకు ఎందుకు సిద్ధపడింది - వంటి ఉత్సుకతను రేకెత్తించే నలోపాఖ్యానంలోని చివరి అంకాన్ని తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/HTBq-RHPlbI ]

తన తండ్రి చెంతకు చేరి, రాజ సౌధంలో తన పిల్లలతో ఉన్నా, దమయంతి భర్త వియోగంతో బాధ పడుతూనే ఉంది. తండ్రి వద్దకు వెళ్ళి, తన భర్తను వెతికించి తీసుకురావాలనీ, లేకపోతే తాను జీవించలేననీ చెప్పి, కన్నీరు మున్నీరయ్యింది. భీముడు వెంటనే మరికొంత మంది బ్రాహ్మణులను పిలిచి, నలుని వెతకమని ఆదేశించాడు. వారితో దమయంతి ఇలా చెప్పింది. ‘నా భర్త ఇప్పుడు రాజ్యభ్రష్టుడు కనుక, మారు వేషంలో ఉంటాడు. మీరు వెళ్ళిన రాజ సభలలో ఈ విధంగా ప్రకటించండి. నీవు సత్యసంధుడవే కానీ, నీ సతిని వంచించావు. ఆమె అర్ధ వస్త్రం తస్కరించి వెళ్ళావు. అలా చెయ్యడం ధర్మమా? అని ప్రకటించండి. ఆ మాటలకు ఎవరైనా రోషపడి బదులిస్తే, నా వద్దకు వచ్చి తెలియజేయండి’ అని అన్నది. అలా నలుని వెదకడానికి వెళ్ళిన వారిలో పర్ణాదుడు అనే విప్రుడు దమయంతితో, "అమ్మా! నేను ఋతుపర్ణుని రాజ్యంలో నీవు చెప్పినట్లే చెప్పాను. అక్కడ ఒక కురూపి వంటవాడూ, సారధి అయిన బాహుకుడనేవాడు నన్ను రహస్యంగా కలుసుకుని, 'అయ్యా! భర్త కష్టాలలో ఉన్నా సహించి, ఆదరించే భార్య ఇహలోకంలోనూ, పరలోకంలోనూ సుఖపడుతుంది' అని అన్నాడని, అక్కడ జరిగిన విషయాన్ని దమయంతికి తెలియజేశాడు, పర్ణాదుడు.

దమయంతి ఆలోచించగా, అతడు నలుడు కాకపోతే, అలా ఎందుకు బదులిస్తాడని అనుకుంది. తన అనుమానం దృఢ పరచుకోవడానికి తల్లి అనుమతితో, సుదేవడనే బ్రాహ్మణుని పిలిపించింది. ‘మీరు ఋతుపర్ణుని కలిసి.. భీముడు తన అల్లుని కొరకు వెతికించినా ఫలితం లేకపోవడంతో, తన కుమార్తెకు ద్వితీయ స్వయంవరం ప్రకటించాడు. భూమండలం లోని రాజులంతా వస్తున్నారు. మరునాడే స్వయంవరం కనుక, మీరు వెంటనే బయలుదేరండి.’ అని చెప్పి రమ్మని పంపింది దమయంతి. సుదేవడు, ఋతుపర్ణునితో దమయంతి చెప్పమన్నట్లే చెప్పాడు. దమయంతి బ్రాహ్మణుని ద్వారా పంపిన సందేశం విని, ఋతుపర్ణుడు స్వయంవరానికి వెళ్ళాలని అనుకున్నాడు. ఒక్క రోజులో విదర్భను చేరటం ఎలా? అని అనుకుని, సారధి అయిన బాహుకుని పిలిచి, "బాహుకా! దమయంతికి ద్వితీయ స్వయంవరం ప్రకటించారు. నాకు పాల్గోనాలని ఉంది. ఒక్క రోజులో మనం విదర్భకు వెళ్ళాలి. నీ అశ్వసామర్ధ్యం ప్రకటించు" అని అన్నాడు. సరే అని చెప్పి బాహుకుడు ప్రయాణానికి సిద్ధమైనా, తను మనస్సులోనే చాలా బాధపడ్డాడు. "నేను అడవిలో నిర్దాక్షిణ్యంగా వదిలి రాబట్టి కదా, దమయంతి రెండవ స్వయంవరం ప్రకటించింది. అవివేకులైన పురుషులు తాము ఏమి చేసినా, భార్య ప్రేమిస్తుందని అనుకుంటారు. కానీ అది నిజంకాదు. నా మీద కలిగిన కోపంతో, దమయంతి ఇలా చేసింది. అని దమయంతి గురించి తలుచుకుని దుఃఖించాడు.

తన భార్యనూ, తన పిల్లలనూ చూడాలనే తపనతో, వెంటనే రథానికి గుర్రాలను కట్టి, విదర్భకు ఋతుపర్ణుని తీసుకుని ప్రయాణం అయ్యాడు. ఋతుపర్ణునికి రథం పోయే వేగం చూస్తుంటే, అది సూర్యుని రథంలా, బాహుకుడు అనూరుడిలా అనిపించాడు. ఋతుపర్ణుని ప్రక్కనే ఉన్న వార్ష్ణేయుడికీ, అదే సందేహం కలిగింది. "భూలోకంలో నలునికి మాత్రమే ఇలాంటి నైపుణ్యం ఉంది.. కానీ ఈ కురూపి నలుడెలా ఔతాడు" అని మనస్సులో అనుకున్నాడు. ఇంతలో ఋతుపర్ణుని ఉత్తరీయం జారి క్రింద పడింది. "బాహుకా, రథం ఆపు. వార్ష్ణేయుడు దిగి ఉత్తరీయం తీసుకు వస్తాడు" అని అన్నాడు ఋతుపర్ణుడు. అందుకు బాహుకుడు, "మహారాజా! మనం ఆమడ దూరం వచ్చేశాం. అంతదూరం నడుచుకుంటూ వెళ్ళి ఎలా తీసుకు రాగలడు?" అని ప్రశ్నించాడు. అతని రథ సారథ్యానికి ఋతుపర్ణుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. తన పరిజ్ఞానాన్ని బాహుకునికి చూపించాలన్న ఆసక్తి కలిగింది. అంతలో రథం ఒక పెద్ద వృక్షాన్ని దాటింది. ఋతుపర్ణుడు బాహుకునితో, "బాహుకా, ఆ వృక్షంలో ఎన్ని కాయలూ, ఎన్ని పూలూ, ఎన్ని ఆకులూ ఉన్నాయో నేను చెప్పగలను" అని అన్నాడు. బాహుకుడు ఆశ్చర్యంతో, "చెప్పండి మహారాజా" అని అడిగాడు. ఋతుపర్ణుడు సమాధానం చెప్పగా, లెక్కించి చూస్తే కాని నమ్మలేనని, రథం ఆపి ఆ చెట్టుని పడగొట్టించి లెక్కించాడు బాహుకుడు. ఋతుపర్ణుడు చిప్పిన లెక్క కచ్చితంగా సరిపోయింది.

బాహుకుడు ఆశ్చర్యపడి, ఆ విద్యను తనకు ఉపదేశించమని అడిగాడు. అందుకు ఋతుపర్ణుడు అక్షవిద్య అనే సంఖ్యాశాస్త్రాన్ని బాహుకుడిని బోధించాడు. ఆ అక్షహృదయ విద్య మహిమవలన, బాహుకునిగా ఉన్న నలునిలో నుండి కలి వెలుపలికి వచ్చాడు. తనను క్షమించమని వేడుకున్నాడు. నలుడు ఆగ్రహించి శపించబోయాడు. అప్పుడు కలి నలునితో, "నలమహారాజా! నిన్ను ఆవహించి నీలో ఉన్న సమయంలో, కర్కోటకుడు నిన్ను కాటువేయడం వలన, అనుక్షణం కాలి పోయాను. ఇంతకంటే శిక్ష ఏముంది? నన్ను క్షమించి విడిచిపెట్టు" అని వేడుకున్నాడు.

అటుపిమ్మట బాహుకుడు ఋతుపర్ణునితో, "మహారాజా! మీరు నాకు నేర్పిన అక్ష హృదయ విద్యకు ప్రతిగా, నేను మీకు అశ్వహృదయ విద్యను నేర్పుతాను" అని అన్నాడు. అందుకు ఋతుపర్ణుడు, "ఇప్పుడు కాదు. తరువాత అడిగి నేర్చుకుంటాను. ముందు మనం సరైన సమయానికి విదర్భ దేశాన్ని చేరుకోవాలి" అని అన్నాడు. వెంటనే నలుడు రథాన్ని పరుగులు పెట్టించాడు. నలుని రథం విపరీతమైన ఘోషతో, విదర్భలోకి ప్రవేశించింది. ఆ ఘోష విన్న దమయంతి, అది నలుని రథం అని గుర్తు పట్టింది. కానీ రథంలో ఋతుపర్ణుని చూసి నిరాశ చెందింది. భీముడు ఎంతో ఆనందంతో ఋతుపర్ణుని ఆహ్వానించి, విడిది చూపించాడు. అక్కడకు వెళ్ళిన ఋతుపర్ణునికి, విదర్భలో స్వయంవరం జరుగుతున్న సందడి కనిపించలేదు. సారధిగా వచ్చిన బాహుకుడు రథాన్ని అశ్వశాలలో నిలిపి, సేదతీరాడు.

అతడిని చూసిన దమయంతి తన దాసిని, స్వయంవరానికి ఋతుపర్ణ మహారాజుతో వచ్చిన ఆ కురూపి గురించి వివరాలు తెలుసుకు రమ్మని పంపింది. అతనిని చూడగానే ఆమె మనస్సు పరవశించిపోయింది. తన భర్త నలుడే మారు రూపులో ఉన్నాడని, ఆమె అనుమానం. దమయంతి పంపిన దాసి నలుని వద్దకు వెళ్ళి, తన యోగ క్షేమాలు తెలుసుకుని, తన గురించి అడిగింది. అందుకు బాహుకుడి రూపంలో ఉన్న నలుడు, "మీ రాకుమారి స్వయంవరం ప్రకటించింది కదా.. దానికి నేను మా మహారాజును, ఒక్క రోజులో, నూరు ఆమడల దూరం ప్రయాణించి తీసుకు వచ్చానని చెప్పు" అని అన్నాడు. దాసీకి అనుమానం కలిగింది. ఇతను రథ సారథి అయితే, ఋతుపర్ణుడితో వచ్చిన వార్ష్ణేయుడు ఎవరు? అనే సందేహాంతో, అతని గురించి ప్రశ్నించింది. అప్పుడు బాహుకుడు, "అతడు వార్ష్ణేయుడు. ఇంతకు ముందు నలుని సారధి" అని అన్నాడు. అయితే అతనికి నలుని జాడ తెలిసి ఉంటుందా? అని ఆశ్చర్యంగా అడుగగా అందుకతడు, "తనరాజ్యాన్ని పోగొట్టుకునేముందు నలుడు, తన పిల్లలనిచ్చి, వార్ష్ణేయుని విదర్భకు పంపాడు. ఆ తరువాత వార్ష్ణేయుడు ఋతుపర్ణుని వద్ద సారధిగా చేరాడు. నలుని గురించి నలునికే తెలియాలి. లేదా అతని భార్యకు తెలియాలి. వేరొకరికి తెలిసే అవకాశం లేదు" అన్నాడు బాహుకుడు.

ఆ సమాధానం విన్న దాసీ, "అయ్యా! నలుడు తనను ప్రాణప్రదంగా చూసుకునే భార్యను నిర్దాక్షిణ్యంగా అడవిలో విడిచి వెళ్ళాడు. దమయంతి నలుడు విడిచి వెళ్ళిన సగంచీరను ధరించి, కాలం గడుపుతోంది. ఆమెను అలా విడిచి వెళ్ళడం ధర్మమా?" అని అడిగింది. ఆమె మాటలకు నలుని కంట నీరు పెల్లుబికింది. అది దాసీకి తెలియ కూడదని, మొహం తిప్పుకున్నాడు. దాసీ దమయంతి దగ్గరకు తిరిగి వెళ్ళి, జరిగినదంతా వివరించింది. ఆ మాటలతో దమయంతి ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చింది. నలుడు వంట చేయడంలో దిట్ట. ఇతను కూడా వంటవాడని చెప్పారు కనుక, వంట ఎలా చేస్తాడో పరీక్షించమని, మరల దాసీని పంపింది దమయంతి. ఆమె వెళ్ళి నలుని పనితీరును నిశితంగా పరిశీలించి, "అమ్మా! అతను సామాన్యుడు కాడు. అతడు ఏ పనయినా సునాయాసంగా చేస్తున్నాడు. అతడు గడ్డిని విదిలిస్తే, మంటలు వస్తున్నాయి. వంట పూర్తయ్యే వరకూ, అలా మండుతూనే ఉన్నాయి. వంటలు అద్భుతంగా ఉన్నాయి" అని దమయంతికి చెప్పింది.

ఆ మాటలు విన్న దమయంతి ఆనందంతో, నలుడు వండిన వంటలు తెప్పించి రుచి చూసి, "సందేహం లేదు, ఇవి నలుని వంటలే" అని గ్రహించి, దాసీతో తన పిల్లలను నలుని వద్దకు పంపింది. నలుడు వారిని చూసి చలించి, ఎత్తుకుని ముద్దాడాడు. తన గురించి నిజం బయటపడుతుందన్న అనుమానంతో, "అమ్మా! ఏమీ అనుకోవద్దు. వీరిని చూస్తే నా బిడ్డలు గుర్తుకు వచ్చారు. అందుకే అలా చేశాను. ఇక నువ్వు నా వద్దకు రావద్దు. ఎవరైనా చూస్తే ఏదైనా అనుకుంటారు. అయినా మేము విదేశాలనుండి వచ్చిన అతిథులం. మాతో నీకేం పని?" అని దాసీని కసురుకుని పంపించేశాడు. జరిగినది తెలసుకున్న దమయంతి సంతోషపడి తన తల్లి వద్దకు వెళ్ళి, "ఋతుపర్ణుని సారధిగా వచ్చిన కురూపి బాహుకుడే ‘నలుడు’. అమ్మా అతను ఇక్కడకు వస్తాడా? నేను అక్కడకు వెళ్ళాలా, నువ్వే నిర్ణయించు!" అని అడిగింది. భీమరాజు అనుమతితో ఆమె బాహుకుడిని దమయంతి వద్దకు రప్పించింది.

దమయంతి నలుని చూసి, "అయ్యా, నిస్సహాయంగా ఉన్న నన్ను, నా భర్త నలమహారాజు నట్టడవిలో నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్ళాడు. అలా సంతానవతినైన నన్ను విడిచి వెళ్ళడం ధర్మమా? అలా చేయడానికి నేనేమి అపకారం చేశాను? అగ్ని సాక్షిగా, నన్ను విడువనని ప్రమాణం చేసిన భర్త, అలా చేయవచ్చా?" అని దుఃఖించింది. అందుకు నలుడు కుమిలిపోతూ, "సాధ్వీ! ఆ సమయంలో నన్ను కలి ఆవహించి ఉన్నాడు. అందువలన నేను అలా చేశాను. జూదంలో సర్వం పోగోట్టుకుని బాధలు పడుతున్న నేను, నాతోపాటు బాధలు పడుతున్న నిన్ను చూసి సహించలేక, విడిచి వెళ్ళాను. అలా చేస్తే నువ్వైనా నీ తండ్రి ఇంటికి వెళ్ళి సుఖంగా ఉంటావని అలోచించాను. నీపై అనురాగంతో, మిమ్మల్ని చూడటానికే నేనిప్పుడిక్కడకు వచ్చాను. మరొక భర్తకోసం స్వయంవరం ప్రకటించడం, కులస్త్రీలకు తగునా? అలా ఎందుకు చేశావు? అందుకే కదా ఋతుపర్ణుడు వచ్చాడు. ఇది ధర్మమా?" అని దమయంతిని అడిగాడు. అందుకు దమయంతి, "నాధా, నేను మీకోసం గాలిస్తూ పంపిన విప్రులలో, అయోధ్యకు వెళ్ళిన విప్రుడు మిమ్ములను గుర్తించాడు. మిమ్ములను ఇక్కడికి రప్పించుటకే అలా చేశాను. మీరుకాక, ఇంకెవరు నూరు యోజనముల దూరం ఒక్క రోజులో ప్రయాణించగలరు? నాలో ఎటువంటి పాపపు తలంపూ లేదు." అని దమయంతి నలుని పాదాలకు నమస్కరించింది.

వెంటనే ఆకాశం నుండి వాయుదేవుడు, "నలచక్రవర్తీ! ఈమె పవిత్రురాలు, పతివ్రత. నేను, సూర్యుడు, చంద్రుడు, ఈమె సౌశీల్యం కాపాడుతున్నాము" అని పలికాడు. వెంటనే నలుడు ఆనందభరితుడై, కర్కోటకుని స్మరించాడు. వెను వెంటనే ఒక వస్త్రం వచ్చింది. అది ధరించగానే, నలునికి ఇంద్రతేజో సమానమైన, మనోహరమైన పూర్వ రూపం వచ్చింది. దమయంతిని పరిగ్రహించాడు. నలుడు విదర్భలో ఒక మాసం ఉండి, తన రాజధానికి వెళ్ళి, పుష్కరుని కలిశాడు. నలుడు పుష్కరునితో, "పుష్కరా! జూదమాడటం నీకు ప్రియం కదా. నేను నా భార్య దమయంతిని పణంగా పెడతాను. నీవు నీ సర్వస్వం పెట్టి నాతో ఆడతావా? లేదా నాతో యుద్ధం చెయ్యి. ఎవరు గెలిస్తే వారిదే రాజ్యం. నీకేది ఇష్టమో నిర్ణయించుకో" అని అన్నాడు. పుష్కరుడు జూద ప్రియుడు. పైగా ఒకసారి జూదమాడి గెలిచాడు కనుక, అతడు నలునితో "నేను జూదమే ఆడతాను" అని అన్నాడు. నలుడు పుష్కరునితో జూదమాడి, తన రాజ్యాన్ని తిరిగి గెలుచుకున్నాడు. పుష్కరునితో, "పుష్కరా, నేను ఇదివరకూ నీతో జూదమాడినపుడు, నన్ను కలి ఆవహించి ఉన్నాడు. కనుక ఓడి పోయాను. నీవు నా పిన తండ్రి కుమారుడివి కనుక, నిన్ను ఏమీ చేయకుండా వదిలివేస్తున్నాను.. వెళ్ళు" అని చెప్పి పంపాడు. నలుడు తన రాజ్యాన్ని తిరిగి దక్కించుకుని, తన ప్రియసతి దమయంతితో సంతోషంగా జీవితాన్ని సాగించాడు.

ఈ నలదమయంతుల కథను, అరణ్యవాసంలో ఉన్న ధర్మరాజుకు బృహదశ్వుడనే ముని వివరించాడు..

శ్లో: కర్కోటకస్య నాగస్య దమయంత్యాః నలస్య చ ।
ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలినాశనం ।।

ఈ నలచరిత్ర విన్నవారికి కలిదోషములు ఉండవనీ, నాగుడైన కర్కోటకునీ, దమయంతినీ, నలునీ, రాజర్షియైన ఋతుపర్ణునీ తలచిన వారిని కలి బాధింపడనీ, ఈ శ్లోకానికి అర్థం. ఈ నలోపాఖ్యానం విన్న వారికి కలి ప్రభావం తగ్గి, సుఖసంతోషాలు ప్రాప్తిస్తాయని, పురాణ విదితం.

సర్వేజనాః సుఖినోభవంతు!

Wednesday, 27 July 2022

నాస్తిక భావాలు! క్షణభంగురమైన భౌతిక శక్తి యొక్క ఆకర్షణలచే భ్రమకు లోనయితే ఏమవుతుంది? Bhagavad Geeta

   

నాస్తిక భావాలు! క్షణభంగురమైన భౌతిక శక్తి యొక్క ఆకర్షణలచే భ్రమకు లోనయితే ఏమవుతుంది?

'భగవద్గీత' నవమోధ్యాయం – రాజవిద్యా రాజగుహ్య యోగం (12 – 17 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 7 నుండి 12 వరకూ ఉన్న అధ్యాయాలను భక్తి షట్కము అంటారు. దీనిలో తొమ్మిదవ అధ్యాయం, రాజవిద్యా రాజగుహ్య యోగము. ఈ రోజుటి మన వీడియోలో, రాజవిద్యా రాజగుహ్య యోగములోని 12 నుండి 17 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/kyuLkjkLUWI ]

మనుషుల్లో నాస్తిక భావాలు ప్రబలడానికి కారణం ఏంటో, శ్రీ కృష్ణుడిలా చెబుతున్నాడు..

00:49 - మోఘాశా మోఘకర్మాణో మోఘజ్ఞానా విచేతసః ।
రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః ।। 12 ।।

భౌతిక మాయా శక్తిచే భ్రమకు లోనైనటువంటి జనులు, ఆసురీ మరియు నాస్తిక భావాలను పెంపొందించుకుంటారు. ఆ అయోమయ స్థితిలో, అభ్యుదయం / సంక్షేమం కోసం వారి ఆశలు వ్యర్థమవుతాయి. వారు ఫలాసక్తితో చేసే కర్మలు అన్నీ నిష్ఫలమే, మరియు వారి జ్ఞానము, అయోమయ స్థితిలో ఉంటుంది.

భగవంతుని సాకార రూపం గురించి, ఎన్నో రకాల నాస్తిక ప్రతిపాదనలు ప్రాచుర్యంలో ఉన్నాయి. భగవంతుడు మానవ రూపంలో దిగి రాలేడని, కొందరు విశ్వసిస్తారు. అందుకే, శ్రీ కృష్ణుడు దేవుడు కాదనీ, కేవలం ఒక యోగి మాత్రమే అనీ అంటారు. మరి కొందరు, శ్రీ కృష్ణుడు 'మాయా-విశిష్ట' బ్రహ్మ అంటారు.. అంటే, భౌతిక శక్తి సంపర్కం వలన వచ్చే ఒక తక్కువ స్థాయి దివ్య వ్యక్తిత్వము అని అర్థం. ఇంకొందరు, శ్రీ కృష్ణుడు, బృందావన గోపికలతో తిరిగిన ఒక సత్ప్రవర్తన లేని వ్యక్తిగా జమ కడతారు. శ్రీ కృష్ణుడు తెలిపిన ఈ శ్లోకం ప్రకారం, ఈ అన్ని సిద్ధాంతాలూ తప్పే, మరియు వీటిని నమ్మే వారి బుద్ధి, భౌతిక మాయా శక్తిచే భ్రమకు లోనయ్యి ఉంది. ఇటువంటి అవైదికమైన సిద్ధాంతాలను నమ్మేవారు, ఆసురీ స్వభావం కలిగినవారుగా పరిగణించ బడతారు. పరమేశ్వరుని సాకార స్వరూపంపై దైవీ భావన లేనందున, వారు ఆయన పట్ల భక్తిలో నిమగ్నమవ్వలేరు. అలాగే, నిరాకార బ్రహ్మం పట్ల భక్తి అత్యంత క్లిష్టమైనది కావటం వలన, అదికూడా చేయలేరు. ఆ ఫలితంగా శాశ్వతమైన సంక్షేమ మార్గాన్ని వారు కోల్పోతారు. క్షణభంగురమైన భౌతిక శక్తి యొక్క ఆకర్షణలచే భ్రమకు లోనయ్యి, వారి యొక్క శాశ్వత సంక్షేమం పట్ల ఆశలు నిష్ఫలమైపోతాయి.

02:47 - మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః ।
భజంత్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయమ్ ।। 13 ।।

ఓ పార్థ, నా యొక్క దివ్యమైన శక్తిని ఆశ్రయించిన మహాత్ములు, ‘నేనే’ సమస్త సృష్టికీ ఆది మూలమని తెలుసుకుంటారు. అనన్య చిత్తముతో, కేవలం నాయందే మనస్సు లగ్నం చేసి, వారు నా భక్తిలో నిమగ్నమౌతారు.

భౌతిక, ప్రాపంచిక జీవితం అనేది, మాయా మోహితులై నిద్ర పోయేవారు అనుభూతి చెందే ఒక దీర్ఘమైన కల. వీరితో పోల్చితే, తమ అజ్ఞానం నుండి మేల్కొని, భౌతిక దృక్పథాన్ని ఒక పీడ కల లాగా, ప్రక్కకి తోసి వేసిన వారే మహాత్ములు. భౌతిక శక్తి మాయ పట్టు వీడిపోయి, వారు ఇప్పుడిక దివ్య యోగమాయ శక్తి ఆశ్రయంలో ఉన్నట్టు అర్థం. ఇటువంటి జ్ఞానోదయమైన మహాత్ములు, భగవంతునితో తమకున్న నిత్య సంబంధము యొక్క ఆధ్యాత్మిక యదార్థాన్ని గుర్తించినవారు. ఎలాగైతే భగవంతునికి, నిరాకార తత్వము, మరియు సాకార రూపమనే రెండు రకాల అస్థిత్వమున్నదో, ఆయన యోగమాయ శక్తికి కూడా, రెండు అస్థిత్వములుంటాయి. అదొక నిరాకార శక్తి. కానీ, అది కూడా ఒక సాకార స్వరూపంలో, రాధా, సీతా, దుర్గా, లక్ష్మీ, కాళీ, పార్వతీ మొదలగు రూపాలలో వ్యక్తమవుతుంది. ఎలాగైతే కృష్ణుడూ, రాముడూ, శివుడూ, నారాయణుడూ మొదలైనవారంతా, ఒకే భగవంతునియొక్క అబేధ స్వరూపాలో, ఈ దివ్య శక్తి స్వరూపాలు కూడా, భగవంతుని దైవీ శక్తి యొక్క నిజరూపాలే. ఒకదాని నుండి ఒకటి, అబేధములే. మహాత్ములు భగవంతుని యొక్క దివ్య శక్తి యొక్క శరణు పొంది ఉంటారు. యోగమాయ కృపవలన, మనకు భగవంతుని యొక్క దివ్య ప్రేమా, జ్ఞానము, మరియు కృప లభిస్తుంది. భగవత్ కృప లభించిన మహాత్ములు, దివ్య ప్రేమ ప్రసాదించబడి ఉంటారు, మరియు అవిచ్ఛిన్నంగా, నిరంతరం భగవత్ భక్తిలోనే నిమగ్నమై ఉంటారు.

04:54 - సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః ।
నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే ।। 14 ।।

ఎల్లప్పుడూ నా దివ్య లీలలను గానం చేస్తూ, దృఢ సంకల్పముతో పరిశ్రమిస్తూ, వినయముతో నా ముందు ప్రణమిల్లుతూ, నిరంతరం వారు నన్ను ప్రేమ యుక్త భక్తితో ఆరాధిస్తుంటారు.

భక్తులు తమ భక్తి సాధన కోసం, దానిని పెంపొందించుకోవటం కోసం, కీర్తనల పట్ల ఎంతో ఆసక్తితో ఉంటారు. భగవంతుని కీర్తిని గానం చేయటమే కీర్తన. ఈ కీర్తన అనేది, భక్తిని సాధన చేయటానికి ఉన్న అత్యంత ప్రభావమైన పనిముట్టు. అది మూడు రకాల భక్తి విధానాలను కలిగి ఉంటుంది. శ్రవణం, కీర్తనం, మరియు స్మరణం. మన లక్ష్యం భగవంతునిపై మనస్సుని లగ్నం చేయటమే. అది కీర్తనం, మరియు శ్రవణంతో పాటుగా చేస్తే, ఇంకా సులువవుతుంది. మనస్సనేది, గాలి వలె చంచలమైనది, మరియు సహజంగానే ఒక ఆలోచన తరువాత, ఇంకో ఆలోచనకి తిరుగుతూనే ఉంటుంది. శ్రవణము, మరియు కీర్తనము, జ్ఞానేంద్రియాలను భగవత్ దృక్పథంలో నిమగ్నం చేస్తాయి. మనస్సును పదేపదే దాని తిరుగుడు నుండి వెనక్కు తీసుకురావటానికి, అవి సహాయం చేస్తాయి. కీర్తన ప్రక్రియ వలన, మరిన్ని ప్రయోజనాలున్నాయి. తరచుగా జనులు జపము, లేదా ధ్యానము ద్వారా, భక్తిని ఆచరిస్తుంటారు. కానీ, వారు జపములో నిమగ్నమయ్యే సదర్భంలో, నిద్రను ఆపుకోలేరు. అయినా, కీర్తన అనేది ఎంతో నిమగ్నమై చేసే పని కాబట్టి, అది సహజంగానే నిద్రను తరిమివేస్తుంది. అంతేకాక, కీర్తన అనేది ధ్యాసను మరల్చే అన్యమైన శబ్దాలను దరిచేరనివ్వదు. కీర్తన అనేది, భారతీయ యోగులలో అత్యంత ప్రజాదరణ పొందిన భక్తి మార్గము. సూరదాసూ, తులసీదాసూ, మీరాబాయి, గురు నానక్, కబీర్, తుకారం, ఏకనాథ్, నార్సి మెహతా, జయదేవుడూ, త్యాగరాజు మరియు ఇతరులవంటి ప్రఖ్యాతిగల భక్తి మహాత్ములందరూ గొప్ప కవులు. వారు ఎనెన్నో భక్తి గీతాలను రచించారు, మరియు వాటి ద్వారా, కీర్తనం, శ్రవణం మరియు స్మరణంలో నిమగ్నమైనారు. ఈ కలి యుగంలో, మోక్షానికి ఒక ఉపాయం ఉంది. భగవంతుని కీర్తిని గానం చేస్తూ, మనము భవ సాగరాన్ని దాటివేయవచ్చు.

07:23 - జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ।
ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతోముఖమ్ ।। 15 ।।

మరికొందరు, జ్ఞాన సముపార్జనా యజ్ఞములో నిమగ్నమై, నన్ను చాలా రకాలుగా ఆరాధిస్తారు. కొందరు నన్ను తమతో అబేధమైన ఏకత్వముగా చూస్తారు. మరికొందరు, నన్ను తమకంటే వేరుగా పరిగణిస్తారు. ఇంకా కొందరు, నా యొక్క విశ్వ రూపము యొక్క అనంతమైన ఆవిర్భావములలో ఆరాధిస్తారు.

సాధకులు, పరమ సత్యాన్ని చేరుకోవటానికి, భిన్నభిన్న పద్ధతులను అనుసరిస్తుంటారు. వారు ఆయన నిత్య అంశలుగా, సేవకులగా, భగవంతుని చరణారవిందముల వద్ద భక్తితో శరణాగతి చేస్తారు. జ్ఞాన యోగమును అనుసరించేవారు, తమను తాము బ్రహ్మమే అని పరిగణించుకుంటారు. వారు "సోహం (అది నేను), "శివోహం" (నేను శివుడను), మొదలైన సూత్రాలపై లోతుగా ధ్యానం చేస్తుంటారు. అద్వైత బ్రహ్మముగా, ఆ సర్వోత్కృష్ట అస్థిత్వము యొక్క ప్రాప్తి యే, వారి యొక్క నర్వోన్నత లక్ష్యం. దానికి శాశ్వతత్వమూ, జ్ఞానమూ మరియు ఆనందము వంటి గుణములున్నా, రూపములూ, గుణములూ, స్వభావములూ, మరియు లీలలూ ఉండవు. జ్ఞాన యోగులు కూడా, ఆయనను నిరాకార, సర్వవ్యాప్త తత్వంలో ఆరాధిస్తారు. వీరితో పాటుగా, పలు రకాల అష్టాంగ యోగులూ మొదలైనవారు ఉన్నారు. వారు తమను తాము భగవంతుని కంటే వేరుగా పరిగణించుకుంటారు. అదే ప్రకారంగా, ఆయనతో అనుసంధానం అవుతారు. ఇంకా కొందరు, ఈ కంటికి కన్పించే వ్యక్తమైన విశ్వాన్ని, భగవంతునిగా ఆరాధిస్తారు. వైదిక తత్వములో దీనిని, 'విశ్వ రూప ఉపాసన' అంటారు. ఈ జగత్తు భగవంతునిలో భాగమే కాబట్టి, దాని పట్ల దైవీ భావము తప్పేమీ కాదు. కానీ, అది అసంపూర్ణము. అటువంటి భక్తులకు, పరమేశ్వరుని యొక్క ఇతర విభూతుల పట్ల జ్ఞానం ఉండదు.

09:27 - అహం క్రతురహం యజ్ఞః స్వధాహమహమౌషధమ్ ।
మంత్రోఽహమహమేవాజ్యమ్ అహమగ్నిరహం హుతమ్ ।। 16 ।।

09:37 - పితాహమస్య జగతో మాతా ధాతా పితామహః ।
వేద్యం పవిత్రమోంకార ఋక్సామ యజురేవ చ ।। 17 ।।

నేనే వైదిక క్రతువునూ, నేనే యజ్ఞమునూ, మరియు పితృదేవతలకు సమర్పించే నైవేద్యమును. నేనే ఔషధము, నేనే వేద మంత్రమును, నేనే ఆజ్యము, నేనే అగ్నీ, నేనే సమర్పించే కార్యమును. ఈ జగత్తుకు నేనే తండ్రినీ, నేనే తల్లిని. సంరక్షకుడను నేనే; పితామహుడను నేనే; నేనే పవిత్రం చేసేవాడిని. జ్ఞానం యొక్క లక్ష్యమును నేనే, పవిత్ర శబ్దము ఓం కారమును నేనే, ఋగ్వేదమును, సామవేదమును మరియు యజుర్వేదమును నేనే.

ఈ శ్లోకాలలో, శ్రీ కృష్ణుడు తన యొక్క అనంతమైన వ్యక్తిత్వానికి గల వేరువేరు స్వరూపములను చెబుతున్నాడు. క్రతువు, యజ్ఞము, అంటే, వేదములలో చెప్పబడిన అగ్నిహోత్ర యజ్ఞము వంటివి. ఇది స్మృతులలో చెప్పబడిన ‘వైశ్వ’ దేవ యజ్ఞముల వంటివి. ఔషదము అంటే, వైద్య శాస్త్రంలో ఉపయోగించే మొక్కలలోని, వ్యాధిని నయం చేయగలిగే సామర్ధ్యము, అని అర్థం. సృష్టి అనేది భగవంతుని నుండి ఉద్భవిస్తుంది. అందుకే, ఆయన దాని తండ్రి. సృష్టికి ముందు ఆయన, అవ్యక్తమైన భౌతిక శక్తిని తన ఉదరము యందు ఉంచుకుంటాడు. కాబట్టి, ఆయన ఆ జగత్ సృష్టికి అమ్మ. ఆయనే ఈ విశ్వ సృష్టిని నిర్వహించేవాడూ, పోషించేవాడూ.. అందుకే ఆయన దాని సంరక్షకుడు. ఆయనే, సృష్టికర్త బ్రహ్మ దేవుని తండ్రి.. అందుకే ఆయన సమస్త విశ్వమునకూ పితామహుడు. వేదములు భగవంతుని నుండి ఉద్భవించాయి. రామాయణంలో ఒక శ్లోకం, దీనిని పునరుద్ఘటించింది. పరమాత్ముడే వేదం, వేదమే పరమాత్మ.

11:30 - ఇక మన తదుపరి వీడియోలో, భోగ వస్తు ప్రాప్తికై, వైదిక కర్మ కాండలను ఆచరించే వారిని గురించి తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Monday, 18 July 2022

హంస రాయబారము - నల దమయంతిల ప్రేమకథ! 1 Nala Damayanthi

  

హంస రాయబారము - నల దమయంతిల ప్రేమకథ! 1

మన పురాణ ఇతిహాసాలలో, అజరామరమైన ఎన్నో ప్రేమకథలున్నాయి. శివపార్వతులూ, లక్ష్మీ నారయణుల ప్రేమాయణ కావ్యాలు, మనకు సుపరిచితాలే. పంచమ వేదంగా భాసిల్లే మహాభారతంలో కూడా, ప్రేమకథలు కోకొల్లలుగా కనిపిస్తాయి. అటువంటి అద్భుత ప్రేమకథలలో ఒకటి, నలమహారాజుది. పాక శాస్త్రంలోనూ, అశ్వ విద్యలోనూ గొప్ప ప్రావీణ్యతను పొంది, ముల్లోకాలలో ఘనుడిగా పేరుగడించినవాడు, నలుడు. పరాక్రమవంతుడైన నలుడి ప్రేమాయణం, ఒక రసరమ్య కావ్యం. ఇంద్రుడూ, దిక్పాలకులూ, కలిపురుషుడి వంటి దేవతలను సైతం మోహానికి గురిచేయగల సౌందర్యరాశి దమయంతి, నలుడి ప్రేమలో ఎలా పడింది? ఆమె స్వయంవరానికి వచ్చిన దేవతలను కాదని, నలుడిని ఎలా వివాహమాడింది - అనేటటువంటి ఆశ్చర్యపరిచే ప్రేమ కథను ఈ రోజుటి వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/aZ0FtPkx4L0 ]

వీరసేనుడి కుమారుడైన నలుడు, తన పరాక్రమంతో నిషిధదేశాన్ని ప్రజారంజకంగా పాలించేవాడు. పొరుగు రాజ్యమైన విదర్భ దేశాన్ని, భీముడనే రాజు పాలించేవాడు. అయితే, భీముడికి చాలా కాలం సంతానం కలుగలేదు. దమనుడనే మునిచ్చిన వరము వలన, భీముడికి దమయంతి అనే కూతురూ, దముడూ, దమనుడూ, దాంతుడూ అనే కుమారులూ కలిగారు. దమయంతి అపర సౌందర్యరాశీ, గుణవంతురాలు. నిషిధ దేశాన్ని పాలించే నలుని గుణగణాలను గురించి విన్నది, దమయంతి. నలుడు కూడా దమయంతి గురించీ, ఆమె సౌందర్యం గురించీ విని ఉన్నాడు. ఆ క్రమంలో, ఇరువురి నడుమా ప్రేమ అంకురించింది.

ఒకరోజు నలుడు ఉద్యానవనంలో ఉండగా, హంసల గుంపు వచ్చి అక్కడ వాలింది. ఆ హంసలను చూసి ముచ్చట పడిన నలుడు, వాటిలో ఒక దానిని పట్టుకున్నాడు. మిగిలిన హంసలు తోటి హంసను విడిచి వెళ్ళలేక, ఆకాశంలో తిరుగుతూ ఉన్నాయి. నలుడు బంధించిన హంస, మానవభాషలో మాట్లాడింది. "ఓ మహారాజా! నీవు దమయంతిని ప్రేమిస్తున్నావు. నేను దమయంతి వద్దకు వెళ్ళి, నీ గురించీ, నీ అందచందాల గురించీ, గుణగణాల గురించీ చెప్పి, నీ మీద అనురాగం కలిగేలా చేస్తాను. దయచేసి నన్ను విడిచిపెట్టు." అని పలికింది. ఆ హంస మాటలకు నలుడు ఆనందపడి, దానిని విడిచి పెట్టాడు.

ఇచ్చిన మాట ప్రకారం ఆ హంస, విదర్భ దేశానికి ఎగిరిపోయింది. అంతఃపురం ముందు విహరిస్తున్న హంసను గమనించింది, దమయంతి. ముచ్చటగా ఉన్న ఆ హంసను చెలికత్తెల సాయంతో పట్టుకుందామె. అప్పుడా హంస దమయంతితో, "ఓ దమయంతీ! నేను నీ హృదయేశ్వరుడైన నలుని వద్ద నుండి వచ్చాను. నలుడు సౌందర్యవంతుడూ, సంపన్నుడూ, సద్గుణ వంతుడు. నీవు సౌందర్యంలో, గుణంలో అతనికి తగినదానివి. అతనికి భార్యవైతేనే, నీకు రాణింపు" అని పలికింది. అందుకు దమయంతి మురిసి పోయి, "ఓ హంసా! నలుని గురించి నాకు ఎలా చెప్పావో, అలాగే నలునికి నా గురించీ చెప్పు" అని, ఆ హంసను తిరిగి నలుడి దగ్గరకు పంపింది. నల దమయంతుల ప్రణయ విషయం, ఆమె చెలికత్తెల ద్వారా తెలుసుకున్న భీమ మహారాజు, కుమార్తెకు స్వయంవరం ప్రకటించాడు.

ఆహ్వానాన్నందుకున్న రాజులంతా, స్వయంవరానికి విచ్చేశారు. నలుడు కూడా స్వయంవరానికి బయలుదేరాడు. ఇంద్రుడు కూడా దమయంతి స్వయంవరం గురించి తెలుసుకుని, తన దిక్పాలకులతో సహా బయలుదేరాడు. మార్గమధ్యంలో ఇంద్రుడికి నలుడు కనిపించాడు. అప్పుడు ఇంద్రుడు, "నిషధ రాజా! నీవు నాకు దూతగా పని చేయాలి" అని అడిగాడు. అందుకు నలుడు సరేనని, ‘ఇంతకీ మీరెవరు? నేను మీకేమి చేయాలి?’ అని సందేహన్ని వెలిబుచ్చాడు. దాంతో ఇంద్రుడు, తను వచ్చిన పనిని వివరించాడు. "నేను ఇంద్రుడను. వీరు దిక్పాలకులు. నీవు పోయి విదర్భ దేశ యువరాణి దమయంతికి మా గురించి చెప్పి, ఆమె మమ్ములను వరించేలా చేయాలి" అని అన్నాడు. ఇంద్రుని మాటలకు నలుడు ఆవేదనతో, "అయ్యా! మీకిది ధర్మమా? నేను కూడా అదే పనిమీద పోతున్నాను కదా!" అని అడిగాడు.

ఇంద్రుడు నలుడి మాటను వినకుండా, "నీవు మాకు మాటిచ్చావు కనుక, ఈ కార్యం నెరవేర్చవలసిందే. ఇది దేవతాకార్యం.. మాట తప్పడం ధర్మం కాదు. మా మహిమచేత అంతఃపురానికి వెళ్ళడానికి నీకు ఎవరూ అడ్డు చెప్పరు" అని నలుడిని పంపించాడు. వేరే గత్యంతరం లేని నలుడు, దమయంతి అంతఃపురంలోకి ప్రవేశించి, ఆమె సౌందర్యాన్నిచూసి ముగ్ధుడైపోయాడు. అతను అలా నిలబడి ఉండగా, దమయంతీ, ఆమె చెలికత్తెలూ, నలుడుని చూసి ఆశ్చర్యపోయారు. దమయంతి నలుని చూసి, "మహాత్మా.. మీరెవరు? ఎక్కడి నుండి వచ్చారు? ఈ అంతఃపురంలో ఎవరికీ కనపడకుండా ఎలా ప్రవేశించారు?" అని ప్రశ్నించింది. ఆమె మనోహర సౌందర్యం తనకు కలిగించిన మైకం నుండి బయటపడి, దమయంతితో, "నా పేరు నలుడు. నేను దేవ దూతగా వచ్చాను. ఇంద్రుడిని మీరు వరించ వలసిందిగా కోరి, నన్ను రాయబారిగా పంపారు" అని పలికాడు. ఆ మాటలకు దమయంతి మనస్సు కష్టపడింది. "అయ్యా! నేను మానవకాంతను. నమస్కరించ వలసిన దేవతలను వరించడం ధర్మమా? నాడు హంస చెప్పినది మొదలు, మిమ్ములనే నా భర్తగా తలచుకుంటున్నాను. నా తండ్రి భీమరాజు, మిమ్ము ఇక్కడికి రప్పించడానికే స్వయంవరం ప్రకటించాడు. మీరే నా భర్త.. కనుక నన్ను స్వీకరించండి. లేకుంటే నా ప్రాణాలను తీసుకుంటాను కానీ, ఇతరులను వరించను" అని దమయంతి ప్రార్థించింది.

అందుకు నలుడు, తనకు కలిగిన ఆ దుస్థితికి దు:ఖిస్తూ, "దమయంతీ! దేవతలు ఐశ్వర్యవంతులూ, జరా మరణాలు లేని వారూ. వారిని కాదని, జరా మరణాలకు ఆలవాలమైన నన్ను కోరడం, న్యాయమా?" అని అన్నాడు. ఆ మాటలు విని దమయంతి దుఃఖించింది. "మీరు ఇంద్రుని రాయబారిగా వచ్చారు. కానీ, నేను మిమ్ములనే కోరుకుంటున్నాను. అందరి ముందూ, నేను దేవతలను ప్రార్ధించి, మిమ్మల్ని వివాహమాడతాను. అప్పుడు మీకు దేవతల మాట వినలేదన్న దోషం ఉండదు" అని తన ఆలోచనను చెప్పింది, దమయంతి. ఇక నలుడు తిరిగి ఇంద్రునికి వద్దకు వచ్చి, దమయంతి అభిప్రాయాన్ని తెలియజేశాడు. దమయంతి నిర్ణయాన్ని విన్న ఇంద్రుడూ, దిక్పాలకులూ, దమయంతికి నలుడిపై ఉన్న ప్రేమను తెలుసుకోవాలనుకుని, వారందరూ నలుడి రూపాన్ని ధరించి, స్వయంవరానికి వెళ్ళారు. స్వయంవర మండపంలో, ఒకేసారి ఆరుగురు నలులు కనిపించారు. వర మాలతో వచ్చిన దమయంతి ఆశ్చర్యపోయింది. తను మనస్సులో, "దేవతలారా! నేను నలుని భార్యగానే జీవించాలని ఆశపడుతున్నాను. కనుక నలుని గుర్తు పట్టడంలో నాకు సహకరించండి. మీ నిజరూపాలతో ప్రత్యక్షమవ్వండి" అని ప్రార్థించింది. దమయంతి ప్రార్థనను విన్న వారు, ఆమెను కరుణించి, తమ నిజరూపాలతో ప్రత్యక్షం అయ్యారు. అప్పుడు దమయంతి వారిని పలు విధాల స్తుతించి, వారందరి సమక్షంలో, నలుడిని వివాహమాడింది. ఇంద్రాది దేవతలు అనేక వరాలిచ్చి, వారిని అనుగ్రహించారు.

దమయంతి స్వయంవరాన్ని తిలకించి దేవలోకం వెళుతున్న దేవతలకు, కలి పురుషుడు కనిపించాడు. ఇంద్రుడు, కలి పురుషుణ్ణి చూసి పలుకరించి, "ఎక్కడికి పోతున్నావు?" అని కుశల ప్రశ్న వేశారు. కలి వారికి నమస్కారం చేసి, "భూలోకంలో జరుగుతున్న దమయంతి స్వయంవరానికి పోతున్నాను" అని తను వెళుతున్న కార్యాన్ని వివరించాడు. అ మాటలకు దేవతలు నవ్వి, "దమయంతి స్వయంవరం ముగిసింది. ఆమె తన ప్రియ సఖుడైన నిషిధ రాజు నలుడుని వివాహమాడింది. మేము కూడా ఆ స్వయంవరానికి వెళ్ళి, వారిని ఆశీర్వదించి, తిరుగు ప్రయాణమయ్యాము" అని జరిగిన సంఘటనను వివరించారు. దమయంతిపై మనస్సు పడి, తనను వివాహమాడడానికి వచ్చిన కలి, కోపంతో రగిలిపోయాడు. దమయంతిని తనకు కాకుండా చేసిన నలుడిని రాజ్యభ్రష్టుని చేసి, వారిరువురికీ వియోగం కల్పించడానికి పూనుకున్నాడు.

మరి కలి నలుడిపై తన ప్రభావాన్ని ఏ విధంగా చూపాడు? నల దమయంతిల ప్రేమకథ ఎటువంటి మలుపులు తిరిగింది - వంటి విషయాలను, మన తదుపరి వీడియోలో తెలుసుకుందాము..

ధర్మో రక్షతి రక్షితః!