Saturday, 2 April 2022

'ఉత్తమ చెట్టు' నీతి కథ! Beautiful Moral Story in Telugu

Written by

  

'ఉత్తమ చెట్టు' నీతి కథ!

మనిషి ఆలోచనా దృక్పథాన్ని మార్చే కొన్ని మంచి కథలను, మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఈ సకల చరాచర జగత్తులో, ప్రతి వారిలోనూ, ప్రతి జీవిలోనూ, భగవంతుడు ఎదో ఒక ప్రత్యేకతను నిక్షిప్తంజేశాడు. అందుకే, ఎదుటి వారి గుణాలను ఎప్పుడూ తక్కువగా ఎంచకూడదు. మానసిక ఆరోగ్యాన్ని ప్రేరేపించే ఈ కథను పూర్తిగా విని, మీ అభిప్రాయాలను comment చేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/ig7DqzemytM ]

పినాకినీ నదీ తీర ప్రాంతంలోని ఒక రైతు పొలంలో, ఒక మామిడి చెట్టూ, ఒక వేప చెట్టూ, పక్క పక్కనే మొలిచాయి. వాటిని గమనించిన పొలం యజమాని, మామిడి చెట్టుకు పాదు చేసి, మంచి ఎరువు వేసి, నీళ్లు పెట్టేవాడు. వేప చెట్టును గురించి, పెద్దగా పట్టించుకోలేదు.
తాను గొప్పది కాబట్టి, రైతు తన పట్ల శ్రద్ధ చూపుతున్నాడనే భావన, మామిడి చెట్టుకు కలిగింది. దానితో కాసింత అహంకారం కూడా పెరిగింది.

కాలక్రమంలో, రెండు చెట్లూ పెరిగి పెద్దవయ్యాయి. పూలు పూచి, కాయలు కాశాయి. మామిడి పండ్లు మధురంగా వుండగా, వేప పండ్లు చేదుగా వున్నాయి. ప్రతి ఒక్కరూ తన మధుర ఫలాలను ఇష్టపడి తింటూ వుండటంతో, మామిడి చెట్టుకు మరింత గర్వం పెరిగి, వేప చెట్టుతో మాట్లాడటం కూడా మానేసింది.

అది గమనించిన వేప, 'మామిడి గారూ! ఏమిటి ఇటీవల నాతో మునుపటిలా వుండటం లేదు?' అని అడిగింది.

అందుకు మామిడి, 'నాకూ నీకూ ఏంటి పోలిక? మధుర రసాలను ఇచ్ఛే వృక్షాన్ని నేను. నోట పెట్టుకోవడానికి పనికిరాని చేదు ఫలాలు నీవి. నా కంటే తక్కువ దానివి. నీతో నాకు స్నేహమేంటి?' అని గర్వంగా చెప్పింది.

అప్పుడు వేప, 'నీవి మధుర ఫలాలయినంత మాత్రాన, గొప్ప దానివని మురిసిపోకు. నా విత్తనాలకూ మంచి గిరాకీ వుందని ఏరుకు పోతూ వున్నారు తెలుసా! అయినా అహంకారితో స్నేహం అవసరం లేదులే!' అని అన్నది.

అలా మామిడి, వేప వాదులాడుకోవడం, వాటి పక్కన నిలువెత్తుగా పెరిగి వున్న కొబ్బరి చెట్టు విన్నది. రెంటి మధ్యా మాటలు దానికి చిర్రెత్తి పోయి, 'ఆపండి మీ వాదులాట. వినలేకపోతున్నాను' అని అన్నది.

దానికి మామిడి, 'అదేంటి కొబ్బరిగారూ.. అలా విసుక్కుంటారు? మా ఇద్దరిలో ఉత్తమ చెట్టు ఏదో తేల్చుకో లేక పోతుంటే..' అని అన్నది.
వెంటనే వేప, 'పోనీ మీరైనా చెప్పండి. మా ఇద్దరిలో ఎవరు గొప్పో! దాంతో ఈ గొడవ తీరిపోతుంది. ఎవరి మానాన వాళ్లు బతుకుతాం..' అని అన్నది.

అప్పుడు కొబ్బరి, 'పిచ్చి మొఖాల్లారా! ఒకరు గొప్పెంటి, మరొకరు తక్కువేంటి! మన చెట్లు దేనికవే గొప్పవి. ప్రతిదీ ఏదో ఒక ప్రత్యేకతను కలిగి వుంటుంది. మీ వాదులాట మానుకోండి' అని మందలించింది.

కానీ తమలో ఉత్తమ చెట్టు ఏదో తేల్చి చెప్పమని, నిలదీసింది మామిడి.

అందుకు కొబ్బరి, 'సరే! అంతగా అడుగుతున్నావు కాబట్టి, చెబుతున్నాను వినండి. చెప్పాక బాధ పడకూడదు' అని అన్నది.
అలాగే అని తలలూపాయి మామిడి, వేప.

'నా దృష్టిలో వేప ఉత్తమ చెట్టు' అని చెప్పింది కొబ్బరి.

'అదెలా చెప్పగలవు?' ప్రశ్నించింది మామిడి.

'మధురమైన మామిడి ఫలాలు తినటానికి, అందరూ ఇష్టపడతారు. తిన్నవారికి రుచినీ, తృప్తినీ ఇవ్వగలవు. మరి వేప పండ్లు, తినటానికి చేదుగా వుంటాయి. అయినా, వేప విత్తనాలు, ఔషధ గుణాలు కలిగి, ఎన్నో వ్యాధులను నయం చేయడానికి ఉపయోగపడతాయి. అందుకే, అలాంటి మంచి లక్షణాలు కలిగిన వేపను, ఉత్తమ చెట్టుగా నిర్ణయించాను. ఇక మీ ఇష్టం' అని చెప్పింది కొబ్బరి.

దానికి మామిడి, 'అదేం లేదు. నీకు నేనంటే అసూయ. అందుకే దానికి మద్దతుగా, అలా చెప్పావు. నీ తీర్పును నేను అంగీకరించను' అని అన్నది.

కాలం సాగిపోతూ వుంది.

మామిడికి అంతుపట్టని చీడ పీడలు సోకాయి. వేరులో, కుళ్ళు తెగులు పట్టింది. ఆకులూ, కాయలూ రాలి పోసాగాయి. కొమ్మలు కూడా అక్కడక్కడా ఎండు ముఖం పట్టాయి. మామిడికి పట్టిన తెగులు, రైతు గమనించాడు. వెంటనే వేప చెట్టు క్రింద రాలివున్న కాయలను బాగా దంచి పొడిచేసి, దానిని మామిడి చెట్టు మొదట్లో వేశాడు. దాంతో, మామిడి వేరుకు పట్టిన పురుగు నశించి, తిరిగి మామిడి ఆరోగ్యంగా తయారైంది.

అప్పుడు మామిడికి కనువిప్పు కలిగింది.

కొబ్బరి చెట్టు చెప్పినట్లు ‘తీపిని యివ్వటం గొప్ప కాదు. ఆరోగ్యాన్ని యివ్వటం గొప్ప..’ అన్న విషయాన్ని తెలుసుకుంది. వేపని ఉత్తమ చెట్టుగా అంగీకరించి, తిరిగి స్నేహాన్ని కొనసాగించింది.

సర్వేజనాః సుఖినోభవంతు!

No comments: