'మృత్యువు' – మరు జన్మ అనేది దేనిపై ఆధారపడి ఉంటుంది?
'భగవద్గీత' అష్టమోధ్యాయం - అక్షర బ్రహ్మ యోగం (01 – 06 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 7 నుండి 12 వరకూ ఉన్న అధ్యాయాలను, భక్తి షట్కము అంటారు. దీనిలో ఎనిమిదవ అధ్యాయం, అక్షర బ్రహ్మ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, అక్షర బ్రహ్మ యోగములోని 01 నుండి 06 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..
[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/l6WxwSP8Ayc ]
ఈ అధ్యాయంలో, భౌతిక జగత్తులోని రకరకాల లోకాల గురించీ, సృష్టి క్రమంలో ఈ లోకాలూ, మరియూ వాటిలో అసంఖ్యాకమైన జీవ రాశులు ఎలా వచ్చాయో, మరలా ప్రళయ కాలంలో ఎలా తిరిగి లయం అవుతాయో, శ్రీ కృష్ణుడు విశదీకరించబోతున్నాడు..
00:50 - అర్జున ఉవాచ ।
కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ ।
అధిభూతం చ కిం ప్రోక్తమధిదైవం కిముచ్యతే ।। 1 ।।
01:10 - అధియజ్ఞః కథం కోఽత్ర దేహేఽస్మిన్మధుసూదన ।
ప్రయాణకాలే చ కథం జ్ఞేయోఽసి నియతాత్మభిః ।। 2 ।।
అర్జునుడు ఇలా పలికాడు: ఓ పరమేశ్వరా, బ్రహ్మం లేక పరమ సత్యము అనగా ఏమిటి? అధ్యాత్మము లేక ఆత్మ అనగా ఏమిటి? మరియు కర్మ అనగా ఏమిటి? దేనిని అధిభూతము అంటారు? మరియు ఎవరిని అధిదైవమని అంటారు? శరీరంలో అధియజ్ఞ అంటే ఎవరు, మరియు ఆయనే అధియజ్ఞము ఎట్లా అయినాడు? ఓ కృష్ణా, దృఢ సంకల్పముతో ఉన్నవారికి, మరణ సమయంలో నీవు తెలియడం ఎలా సాధ్యము?
జ్ఞాన విజ్ఞాన యోగంలోని ఆఖరి శ్లోకంలో, శ్రీ కృష్ణుడు, బ్రహ్మం, అధిభూత, అధియాత్మ, అధిదైవ, మరియు అధియజ్ఞ అన్న పదాలను పరిచయం చేశాడు. అర్జునుడికి వీటి గురించి ఇంకా తెలుసుకోవాలని, కుతూహలంగా ఉంది. అందుకే, ఈ రెండు శ్లోకాలలో ఏడు ప్రశ్నలను సంధించాడు. వీటిలో ఆరు ప్రశ్నలు, శ్రీ కృష్ణుడు పలికిన పదాల గురించే. ఏడవ ప్రశ్న, మరణ సమయం గురించి. అర్జునుడు, మరణ సమయంలో భగవంతుడిని ఎలా గుర్తుంచుకుని స్మరించాలో, తెలుసుకోగోరుతున్నాడు.
02:28 - శ్రీ భగవానువాచ ।
అక్షరం బ్రహ్మ పరమం స్వభావోఽధ్యాత్మముచ్యతే ।
భూతభావోద్భవకరో విసర్గః కర్మసంజ్ఞితః ।। 3 ।।
శ్రీ కృష్ణ భగవానుడు ఇలా పలికాడు: సర్వోన్నతమైన, నాశనములేని తత్త్వమునే బ్రహ్మము అంటారు; వ్యక్తి యొక్క ఆత్మ తత్త్వమునే, అధ్యాత్మ అంటారు. ప్రాణుల భౌతిక తత్త్వమునకూ, మరియు వాటి అభివృద్ధికీ సంబంధించిన పనులనే, కర్మ లేదా ఫలాపేక్షతో ఉన్న చర్యలంటారు.
సర్వోత్కృష్ట తత్వమునే, బ్రహ్మము అంటారు. వేదాలలో భగవంతుడిని ఎన్నో పేర్లతో పిలుస్తారు. వాటిలో బ్రహ్మము ఒకటి. అది, స్థల, కాల, మరియు కారణ, కార్య చక్రానికి అతీతమైనది. ఇవి భౌతిక జగత్తు యొక్క గుణములు. కానీ, ‘బ్రహ్మము’ భౌతిక జగత్తుకి అతీతమైనది. అది విశ్వంలో జరిగే పరిణామాల చేత ప్రభావితం కాదు, మరియు అనశ్వరమైనది. కాబట్టి, అది అక్షరం అని వివరించబడినది. బృహదారణ్యక ఉపనిషత్తులో, బ్రహ్మము అనేది, ఈ విధంగా నిర్వచించబడింది. పండితులు, ‘బ్రహ్మము అంటే అక్షరము’ అంటే, నాశనము లేనిదని చెబుతారు. అది 'పరం' అంటే, సర్వోత్కృష్టమైనదని కూడా, పరిగణించబడుతుంది. ఏ విధంగాననగా, దానికి మాయ, మరియు జీవాత్మల కన్నా ఉన్నతమైన గుణములు కలవు. భగవత్ మార్గమే 'అధ్యాత్మ', మరియు ఆత్మస్వరూపత్వము కూడా, అధ్యాత్మ అనబడుతుంది. కానీ ఇక్కడ ఆ పదం, వ్యక్తి యొక్క ఆత్మ తత్త్వం కోసమే ఉపయోగించబడింది. దీనిలోనే ఆత్మ, మనస్సు, మరియు బుద్ధి, సమ్మిళితమై ఉన్నాయి. కర్మ అంటే, ఆత్మచే చేయబడిన పనులు. ఇవి ప్రతి జీవి యొక్క, ప్రతి జన్మ యందున్న ప్రత్యేకమైన జీవన పరిస్థితులను నిర్దేశిస్తాయి. ఈ కర్మలే, జీవాత్మను సంసార చక్రంలో త్రిప్పుతుంటాయి.
04:32 - అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతమ్ ।
అధియజ్ఞోఽహమేవాత్ర దేహే దేహభృతాం వర ।। 4 ।।
నిరంతరం మారుతునే ఉండే ఈ భౌతిక సృష్టినే, అధిభూత అంటారు. సృష్టిలో దేవతల అధిపతిగా ఉండే భగవంతుని విశ్వ రూపమునే, అధిదైవము అంటారు. సర్వ భూతముల హృదయములలో నివసించే నేను, ‘అధియజ్ఞము’ అంటే, సమస్త యజ్ఞములకూ ప్రభువు, అని పిలువబడతాను.
భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశమనే ఈ పంచ భూతముల సంయోగంతో ఏర్పడిన, ఈ చిత్రవిచిత్ర రంగు రంగుల విశ్వమునే, అధిభూత అంటారు. సమస్త భౌతిక సృష్టినీ తనలోనే కలిగిఉన్న పరమేశ్వరుని యొక్క విశ్వ రూపమైన విరాట్ పురుషుడినే, అధిదైవము అంటారు. ఎందుకంటే, ఆయన దేవతలకు, అంటే విశ్వములో వేరు వేరు విభాగాలను నిర్వహించే వారికి, అధిపతి. సర్వోత్కృష్ట దివ్య మంగళ స్వరూపుడైన శ్రీ కృష్ణుడు, పరమాత్మ రూపంలో, సర్వ ప్రాణుల హృదయంలో నివసించే వాడూ, అధియజ్ఞమని చెప్పబడతాడు. అన్ని యజ్ఞములూ, ఆయన ప్రీతి కొరకే చేయబడాలి. ఈ విధంగా, ఆయనే సమస్త యజ్ఞములకూ అధ్యక్షుడు, మరియు అన్ని కార్యములకూ ఫలములను ప్రసాదించే వాడు.
05:54 - అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరమ్ ।
యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః ।। 5 ।।
మరణ సమయంలో నన్ను స్మరిస్తూ, దేహాన్ని విడిచిపెట్టిన వాడు, నన్నే చేరుకుంటాడు. ఈ విషయంలో ఎలాంటి సందేహానికీ తావు లేదు.
ఒక వ్యక్తి యొక్క వచ్చే జన్మ, ఆ వ్యక్తి మరణ సమయంలో, అతని యొక్క అంతఃకరణ స్థితిని బట్టీ, మరియు వ్యక్తికి దేనిపై మనస్సు ఉందన్న దాని మీద ఆధారపడి ఉంటుందని, పేర్కొంటాడు. కాబట్టి, మరణ సమయంలో ఎవరైనా, భగవంతుని అలౌకిక నామాలూ, గుణములూ, రూపములూ, లీలలూ, మరియు ధామములపై నిమగ్నమై ఉంటే, భగవత్ ప్రాప్తి లక్ష్యం పొందుతాడు. మృత్యు సమయంలో, వ్యక్తి అంతర్గత దృక్పథం, భగవంతుని యందే నిమగ్నమై ఉంటే, అతను భగవంతుడినే పొందుతాడు, మరియు స్వభావములో భగవంతుని లాగానే అవుతాడు.
06:53 - యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరమ్ ।
తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః ।। 6 ।।
ఓ కుంతీ పుత్రుడా, మరణ కాలంలో, శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో, దేనినైతే గుర్తుచేసుకుంటాడో, ఎప్పుడూ అదే ధ్యాసలో ఉండటం వలన, అతను ఆ స్థితినే పొందుతాడు.
మృత్యు సమయంలో, సహజంగానే మన మనస్సు, జీవితం మొత్తం అలవాటుగా తయారు చేసుకున్న ఆలోచనల ప్రవాహంలోనే పరుగు పెడుతుంది. మన ప్రయాణ ప్రణాళిక సిద్ధం చేసుకోవటానికి సమయం, మన సామాను సర్దుకున్న తరువాత కాదు. ముందు జాగ్రత్తతో, సరియైన ప్రణాళిక ఏర్పాటు అవసరం. మరణ సమయంలో ఏదైతే మన ఆలోచనలలో ప్రధానంగా ఉంటుందో, అదే మన తదుపరి జన్మను నిర్ణయిస్తుంది. వ్యక్తి యొక్క రోజువారీ అలవాట్లు, మరియు సాంగత్యముల ప్రకారం, తను బ్రతికున్నంత కాలం, దేని గురించి తలంచాడో, ధ్యానం చేసాడో, సహజంగానే, దానిమీదే వ్యక్తి యొక్క చివరి తలంపులు ఆధారపడి ఉంటాయి. పురాణాలలో భరత మహారాజు వృత్తాంతం, ఈ విషయంలో చెప్పబడింది. ఆయన ఒక రాజు. కానీ, భగవత్ ప్రాప్తి సాధన కోసం, అడవిలో తపస్విలా జీవిస్తూ, తన రాజ్యాన్ని త్యజించాడు. ఒక రోజు గర్భంతో ఉన్న ఒక జింక, ఒక పులి గాండ్రింపు విని, నీటిలోకి దూకటం చూశాడు. ఆ భయానికి, గర్భంతో ఉన్న జింక, ఒక జింక-పిల్లని ప్రసవించింది. ఆ జింక పిల్ల నీటిలో తెలియాడటం చూసి, భరతుడు జాలి పడి, దానిని రక్షించాడు. అతను దానిని తన కుటీరముకు తీసుకువెళ్ళి, పెంచటం మొదలుపెట్టాడు. అపారమైన వాత్సల్యంతో, దాని యొక్క ఉల్లాసమైన ఆటపాటలను చూస్తూ ఉండేవాడు. దాని కోసం గడ్డి తెచ్చేవాడు, దానిని వెచ్చగా ఉంచటం కోసం, దానిని ఆలింగనము చేసుకునేవాడు. క్రమక్రమంగా ఆయన మనస్సు భగవంతుని నుండి దూరంగా వచ్చి, ఆ జింకపై నిమగ్నమయింది. ఈ అనుబంధం ఎంత గాఢంగా అయ్యిందంటే, రోజంతా ఆ జింక గురించే ఆలోచించేవాడు. ఇక ఆయన మరణించే సమయంలో, ఆ జింక ఏమైపోతుందో అని చింతిస్తూ, దానిని ప్రేమతో పిలిచాడు. దాంతో, భరత మహారాజు తదుపరి జన్మలో, ఒక జింకగా పుట్టాడు. కానీ, ఆయన ఏంతో ఆధ్యాత్మిక సాధన చేసి ఉండటం వలన, ఆయన చేసిన తప్పు యొక్క అవగాహన ఉంది కాబట్టి, జింకగా ఉన్నా సరే, ఆయన, అడవిలో సాధు జనుల ఆశ్రమాల దగ్గరే నివసిస్తూ ఉండేవాడు. చివరికి, ఆయన తన జింక దేహాన్ని విడిచి పెట్టిన తరువాత, ఆయనకి తిరిగి మానవ జన్మ లభించింది. ఈ సారి, ఆయన ఒక గొప్ప ఋషి, జడ భరతుడయ్యాడు. తన సాధన పూర్తి చేస్తూ, భగవత్ ప్రాప్తి సాధించాడు. స్కంద పురాణం ప్రకారం, మృత్యు సమయంలో భగవంతుడిని గుర్తుంచుకోవటం, చాలా కష్టం. మరణం చాలా బాధాపూరితమైన అనుభవం, ఆ సమయంలో మనస్సు, వ్యక్తి యొక్క అంతర్లీనంగా ఉన్న స్వభావం వైపే మొగ్గు చూపుతుంది. మనస్సు భగవంతుని గురించి స్మరించాలంటే, వ్యక్తి యొక్క ఆంతర స్వభావం, అయన యందే లీనమై ఉండాలి. ఆంతర స్వభావం అంటే, మనోబుద్ధుల లోపల నివసించి ఉండే స్మృతి. ఏదైనా ఒకదానిని నిరంతరం ధ్యానిస్తూ ఉంటేనే, అది ఆంతర స్వభావంగా వ్యక్తమవుతుంది. కాబట్టి, భగవత్ స్మృతిలోనే ఉండే ఆంతర స్వభావాన్ని పెంపొందించుకోవటానికి, భగవంతుడు మన జీవతంలో ప్రతి క్షణం గుర్తుంచుకోబడాలి, జ్ఞప్తికితెచ్చుకోబడాలి, మరియు ధ్యానించబడాలి.
10:36 - ఇక మన తదుపరి వీడియోలో, మన మనస్సు, బుద్ధి, భగవంతుడికి శరణాగతి చేసి, సమర్పించనట్లయితే, మనం ఏం పొందగలమో శ్రీ కృష్ణుడి వివరణను తెలుసుకుందాము..
కృష్ణం వందే జగద్గురుం!
No comments: